కొత్తరేమల్లె గ్రామస్తులు పొలం పనులతోపాటు, కొత్తగా వచ్చిన ఫ్యాక్టరీలలో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఒకప్పుడు ఆ గ్రామం చుట్టూ మామిడి తోటలుండేవి. ఆ మామిడి చెట్ల మీద ఆటలాడుకుంటూ, పండ్లు తింటూ కోతులు జీవనం సాగించేవి. గ్రామానికి దూరంగా తిరిగే కోతులు ఈమధ్య కాలంలో ఇళ్ళల్లోకి ప్రవేశించడం మొదలెట్టాయి.
కోతుల ఆగడాలు తట్టుకోలేక ఊరి పెద్దలు పంచాయితీ ప్రెసిడెంట్‌ను కలిశారు. ‘‘అయ్యా..! ఊళ్ళో కోతుల బెడద తట్టుకోలేకపోతున్నాం. అవి ఇంటి దగ్గరుండే చెట్లపైనే మకాం వేసి ఇళ్ళల్లో వండుకునే అన్నం, కూరల్ని లాగేస్తున్నాయి. ఇంట్లో ఆడవాళ్ళు బయట స్వేచ్ఛగా తిరగడానికి భయపడుతున్నారయ్యా. నాలా కూలి పనులకెళ్ళే వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉందయ్యా. చేతి సంచిలో అన్నం బాక్సులు పెట్టుకుని పొలం పనులకు వెళ్ళేటప్పుడు వారి వెనకే కోతులు వస్తూ ఆ సంచుల్ని లాక్కుంటున్నాయి. అన్నం నేలపాలైపోతుందయ్యా! వాటినుంచి మమ్మల్ని రక్షించండయ్యా’’ అంటూ మొరపెట్టుకున్నారు.
కొత్తరేమల్లె గ్రామం నుండే కాకుండా చుట్టుపక్కల నాలుగు గ్రామాల నుండీ ఇవే ఫిర్యాదులు అందడంతో వాటి నుంచి గ్రామస్తులకు ఉపశమనం కలిగించాలని పై అధికారులతో మాట్లాడి కోతులను పట్టే వాళ్ళను, వాటిని అడవులలో వదలడానికి తీసుకెళ్ళే ఒక పెద్ద వాహనాన్ని గ్రామానికి పిలిపించారు అధికారులు.
వారం రోజులపాటు ఆపసోపాలు పడి, కోతుల్ని పట్టుకుని అడవిలో వదిలి వచ్చారు. జనాలందరూ జై కొట్టారు. కొన్నాళ్ళు ఎప్పటిలానే స్వేచ్ఛగా తిరిగారు.
ఒక నెల రోజులు కూడా గడవకుండానే మళ్ళీ కోతులు గ్రామంలోకి ప్రవేశించాయి. మళ్ళీ తీసుకెళ్ళి అడవిలో వదిలిపెట్టారు. మరలా నెల రోజుల తర్వాత అవి తిరిగొచ్చేశాయి. ఎన్నిసార్లు పంపిస్తున్నా కోతులు మరలా తిరిగొచ్చేయ్యడంతో విషయం కలెక్టర్ దృష్టికి వెళ్ళింది.
కొత్తరేమల్లె గ్రామాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించాలని అధికారులను ఆదేశించి, కలెక్టర్ ఆ గ్రామానికి విచ్చేశారు.
గ్రామస్తులతో చర్చించి, రెండు గంటలు ఊరంతా కారులో తిరిగి చూశాక ఒక విషయం ఆయనకు అర్థమైంది. అడవుల విస్తీరం తగ్గిపోవడంతో కోతులు తల దాచుకోవడానికి చోటు దొరక్క, ఆహారం కరువై ఇలా గ్రామాల్లోకి వచ్చేస్తున్నాయని, పంటలను నాశనం చేస్తున్నాయని నిర్ధారణ కొచ్చారు కలెక్టర్‌గారు.
రచ్చబండ దగ్గరకొచ్చి ప్రజలను ఉద్దేశించి ‘‘ఒకప్పుడు మీ గ్రామం చుట్టూ పచ్చని పొలాలు ఉండేవి. గ్రామానికి ఆనుకుని ఉన్న చెరువు ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆ రెండు ఫ్యాక్టరీల కారణంగా కలుషితమయ్యింది. చెరువునే ఆధారం చేసుకుని పండే భూములు పండట్లేదు. దాంతో కొంతమంది పంటలు వేయడం లేదు. వర్షాలు సరిగ్గా కురవడం లేదని వర్షాధార పంటలు వేయడం మానేశారు. ఇక మిగిలిన ఒకే ఒక అవకాశం ఫ్యాక్టరీలలో పని చేయడం. మున్ముందు ఇక్కడ మరిన్ని ఫ్యాక్టరీలు రాబోతున్నాయని తెలిసి, వారికి ఈ భూములు అమ్ముకోవచ్చని మామిడి తోటలను కూడా నరికేశారు. ఇక కోతులు ఉండడానికి చోటెక్కడ ఉంటుంది చెప్పండి? అందుకే అవి ఇలా ఇళ్ళల్లోకి చొరబడుతున్నాయి. ఆహారాన్ని దొంగిలిస్తున్నాయి. మీరెన్నిసార్లు తీసుకెళ్ళి అడవిలో వదిలేసొచ్చినా ఆహారం కోసం అవి మరలా మరలా తిరిగొస్తూనే ఉంటాయ్’’ అంటూ కలెక్టర్ చెబుతున్నారు.
అంతలో గ్రామపెద్ద కల్పించుకుని ‘‘అలాగయితే ఎలాగయ్యా! మీరే ఏదన్నా చేయాలి’’ అంటూ రెండు చేతులు పైకెత్తాడు. వెంటనే ఇంకొంతమంది గ్రామ ప్రజలూ అతనికి తోడయ్యారు.
కలెక్టర్ గారు వాళ్ళందరినీ చూస్తూ ‘‘దీనికి మీ అందరి సహకారం ఉంటే నేనో ఉపాయం చెప్తాను’’ అన్నారు.
‘‘మళ్ళా మళ్ళా అవి రాకుండా ఉంటాయంటే మీరేం చెప్తే అది చేస్తాం సార్’’ ముక్తకంఠంతో పలికారు ప్రజలు.
‘‘కోతులకు ఆహారశాల ఏర్పాటు చేద్దాం’’ అన్నారు కలెక్టర్.
జనమంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు.
‘‘కోతుల ఆహారశాల అంటే వాటికి మనం వండి పెట్టడం కాదు. ఇంగ్లీష్‌ల్లో దీన్ని మంకీ ఫుడ్ కోర్ట్స్ అంటారు. ఖాళీగా ఉన్న స్థలాలలో పండ్ల మొక్కలైన జామ, సీతాఫలం, ఉసిరి, నేరేడు మొదలైనవి నాటాలి. మీరందరూ కలిసి మీ వంతుగా వాటికి నీళ్ళు పోసి పెంచాలి. ఇలా చేయడం వలన చెట్ల సంఖ్య పెరుగుతుంది. మొక్కలు పెరిగి వాటికి కాసిన కాయల్ని కోతులు తింటూ ఇక్కడే ఉండిపోతాయ్. వాటికి ఈ ఆహారశాలలో ఆహారం దొరుకుతున్నప్పుడు ఇళ్ళల్లోకి రావు. ఏమంటారు.?’’ అంటూ అందరి అంగీకారాన్ని కోరారు.
అడవులశాతం తగ్గిపోవడం కారణంగా ఇన్ని ఇబ్బందులు తలెత్తుతాయని గ్రహించిన గ్రామస్తులు వెంటనే అంగీకారం తెలిపారు. తాను రూపకల్పన చేసిన ఈ వినూత్న కార్యక్రామాన్ని జనాల్లో స్థిరంగా నిలబడిపోవాలని పనులను వెంటనే ప్రారంభించమని అధికారులను ఆదేశించారు కలెక్టర్. గ్రామస్తుల సహకారంతో కొన్నాళ్ళలోనే మొక్కలు చెట్లుగా మారి ఫలాలను అందించాయి. కోతుల బెడద పూర్తిగా తగ్గిపోయింది. కోతులకు ఆహారశాల ఏర్పాటు చేసి గ్రామ సమస్యను తీర్చినందుకు కలెక్టర్‌ను అభినందించారు గ్రామస్తులు.
- దొండపాటి కృష్ణ
Comments
Please login to add a commentAdd a comment