‘ఇంత ఉదయమే ఎక్కడికి బయలుదేరావు?’ అని చిట్టిబాతును అడిగింది బుజ్జి కొంగ. ‘మా అమ్మమ్మగారి ఇంటికి వెళ్తున్నాను’ చెప్పింది చిట్టి బాతు. ‘నేను కూడా వస్తాను. నన్నూ మీ అమ్మమ్మగారి ఇంటికి తీసుకువెళ్ళవా?’ అడిగింది బుజ్జి కొంగ. ‘నిన్ను మా అమ్మమ్మగారింటికి తీసుకెళ్లడానికి నాకేమీ అభ్యంతరం లేదు. కానీ మీ అమ్మను అడుగు. అమ్మ వెళ్ళమంటే నాతో రా!’ అంది చిట్టి బాతు.
‘మా అమ్మ ఏమీ అనదు’ చెప్పింది బుజ్జి కొంగ. అయినా చిట్టి బాతు ‘అమ్మ ఒప్పుకుంటేనే’ అని పట్టుబట్టింది. ‘అయితే ఉండు.. క్షణంలో వెళ్లి అమ్మను అడిగొస్తాను’ అంటూ కొలను పక్కనే ఉన్న చెట్టు పైకి ఎగిరింది. కాసేపటి తర్వాత వచ్చి ‘అమ్మ వెళ్ళమంది’ అంది బుజ్జి కొంగ. ‘అయితే పదా’ అంటూ బుజ్జి కొంగను తన అమ్మమ్మ గారింటికి తీసుకువెళ్లింది చిట్టి బాతు.
అమ్మమ్మ ఇద్దరినీ ఆప్యాయంగా ఆహ్వానించి చక్కటి విందును ఏర్పాటు చేసింది. చిట్టి బాతు, బుజ్జి కొంగ హాయిగా భోంచేసి.. చాలాసేపు ఆడుకున్నాయి. కబుర్లతో కాలక్షేపం చేశాయి. సమయమే తెలియలేదు.
ఇక్కడ.. బుజ్జి కొంగ తల్లి ఆహారం సేకరించి కొంచెం వేగంగానే గూటికి చేరింది. వచ్చేటప్పటికి బుజ్జి కొంగ కనపడలేదు. చెట్టు పైనున్న మిగిలిన కొంగలను అడిగింది తన బిడ్డ గురించి. ‘ఉదయం నుండి బుజ్జి కొంగను చూడలేద’ని చెప్పాయి అవి. తన బిడ్డ కోసం అంతటా వెదికింది. ఎక్కడా కనబడలేదు. చివరకు చిట్టి బాతు తల్లినీ వాకబు చేసింది తన బిడ్డ గురించి. అది కూడా తనకు తెలియదనే చెప్పింది.
దాంతో బుజ్జి కొంగ తల్లి ఏడుస్తూ తన గూటి కొమ్మపై కూర్చుంది. అంతలోకే చీకటి పడిపోయింది. చిట్టి బాతు అమ్మమ్మ ఇంట్లో ఉన్న బుజ్జి కొంగ గాభరా పడింది. ‘అమ్మో.. చీకటి పడిపోయింది.. త్వరగా మనిళ్లకు పోదాం పదా’అని చిట్టి బాతును తొందరపెట్టింది. ‘ఎందుకంత కంగారు? అమ్మకు చెప్పావ్ కదా.. నిదానంగా వెళ్దాంలే!’ అంది చిట్టి బాతు. ‘ఆ.. ఆ.. చెప్పానులే’ అనైతే అంది కానీ బయలుదేరే వరకు చిట్టి బాతును స్థిమితపడనివ్వలేదు. ఎట్టకేలకు రెండూ కలసి తిరుగుప్రయాణమయ్యాయి.
ఇక్కడ.. చెట్టు కొమ్మ పై ఏడుస్తూ కూర్చున్న బుజ్జి కొంగ తల్లి చుట్టూ ఇతర పక్షులన్నీ చేరి ఓదార్చసాగాయి. అంతలోకే దూరం నుంచి చిట్టి బాతు, బుజ్జి కొంగ రావడం కనిపించింది. ఆత్రంగా చెట్టు మీద నుంచి కిందకు వాలింది కొంగ. అక్కడే కొలను దగ్గర చిట్టి బాతు తల్లి కూడా పిల్లల కోసం ఎదురుచూస్తూ ఉంది. దాన్ని చూడగానే ‘చూడు.. నీ బిడ్డ మాటమాత్రమైనా చెప్పకుండా నా బిడ్డను ఎలా తీసుకెళ్లిపోయిందో? తప్పు కదా! నేనెంత కంగారుపడ్డాను?’ అంది కాస్త కోపంగా.. బుజ్జి కొంగ తల్లి.
ఆ మాటకు చిట్టి బాతు తల్లి చిన్నబుచ్చుకుంది. గబగబా పిల్లలకు ఎదురెళ్లి ‘బుజ్జి కొంగ వాళ్లమ్మకు చెప్పకుండా బుజ్జిని నీతో తీసుకెళ్లడం తప్పు కదూ? తనెంత గాభరా పడిందని.. బిడ్డ కనిపించక?’ అంటూ చిట్టి బాతును చీవాట్లేసింది వాళ్లమ్మ. ఆ మాటకు తెల్లబోయింది చిట్టి బాతు. ‘అదేంటీ వాళ్లమ్మకు చెప్పే వచ్చానందే నాతో! అమ్మమ్మ గారి దగ్గరికి నా కూడా వస్తానంటే మీ అమ్మకు చెప్పందే రావద్దు.. వెళ్లి చెప్పిరా అంటే నా ముందే చెట్టెక్కింది వాళ్లమ్మను అడగడానికి’ అని వాళ్లమ్మకు చెబుతూ వెంటనే బుజ్జి కొంగ వైపు తిరిగి ‘వెళ్లావ్ కదా.. అమ్మను అడగడానికి?’ అంది చిట్టి బాతు.
తల దించుకుంది బుజ్జి కొంగ అబద్ధం చెప్పినందుకు. అప్పటికే అక్కడకు వచ్చిన బుజ్జి కొంగ తల్లి.. ఆ మాటలన్నీ విన్నది. ‘అలా అబద్ధం ఎందుకు చెప్పావ్?’ అంటూ కోప్పడింది. తన తప్పు గ్రహించిన బుజ్జి కొంగ.. అమ్మను చుట్టేసుకుని ‘నీకు చెప్పే వెళదామని మన గూటి దగ్గరకు వచ్చాను. కానీ నువ్వు లేకపోవడంతో వెంటనే కిందకు దిగి.. అమ్మను అడిగే వచ్చాను అని అబద్ధం చెప్పి చిట్టి బాతుతో వెళ్లిపోయాను.
తప్పయిపోయింది అమ్మా.. ఇంకెప్పుడూ అబద్ధం చెప్పను’ అంటూ ఏడ్చేసింది. ‘చూడు.. నీ అబద్ధం వల్ల నేను కంగారుపడ్డమే కాదు.. చిట్టి బాతునూ ఎంత తప్పుగా అర్థం చేసుకున్నానో! ఇక నుంచి అనుమతి కోసమే కాదు.. ఏం జరిగినా నిజమే చెప్పాలి.. సరేనా!’ అంటూ బిడ్డను సముదాయించింది బుజ్జి కొంగ తల్లి. ‘బిడ్డ కనపడకపోయేసరికి గాభరా పడ్డాను.
ఆ గాభరాతోనే నిన్నూ రెండు మాటలన్నాను. తప్పు పట్టుకోకు’ అంటూ చిట్టి బాతునూ దగ్గరకు తీసుకుంది బుజ్జి కొంగ తల్లి. ‘హమ్మయ్య.. ఏమైతేనేం పిల్లలు జాగ్రత్తగా ఇంటికి చేరారు’ అనుకుంటూ వాళ్ల పిల్లలను తీసుకుని ఆ తల్లులు వాళ్ల వాళ్ల నివాసాలకు వెళ్లిపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment