Moral Stories for Kids: సాయంత్రం కుందేలు ద్వారా కోతిబావను పిలిపించి ‘కోతిగారు మీరు రేపు పండుగ సందర్బంగా కోయగూడెంలో జాతర జరగుతోంది. గుడి వద్ద నిప్పులపై భక్తులు నడచి మొక్కులు తీర్చుకుంటారు. తమరు కొబ్బరి చిప్పలు, అరటి పళ్ళు, వంకర వంకర జిలేబీల కొరకు గుడి పక్కకు వెళ్ళవద్దు. వెళ్ళి అనవసర సమస్యలు తెచ్చుకోవద్దు’ అని జాగ్రత్తలు చెప్పాడు సింహారాజు.
వినయంగా చేతులు కట్టుకున్న కోతిబావ ‘చిత్తం మహారాజా అలాగే’ అన్నాడు. తెల్లవారక మునుపే తప్పెట్ల మోతలు జోరుగా వినిపించసాగాయి అడవికి చేరువలో ఉన్న కోయగూడెం నుండి.
‘ఆహా.. గూడెంలోని గుడిలో పండుగ పూజ అంటే తనకూ పండుగే! కొబ్బరి చిప్పలకు, అరటి పళ్ళకు,జిలేబి, మిఠయీలకు కొదవే ఉండదు అనుకుంటూ కోయగుడేనికి బయలుదేరాడు కోతిబావ.
వెళ్ళే దారిలో కుక్కలు తరమసాగాయి. ఎక్కడా చెట్టు కనిపించకపోవడంతో, చెరువు గట్టున ఉన్న చాకిరేవు బానలోని నీళ్ళు, బట్టల మధ్య దాగాడు కోతి బావ. ఎత్తుగా ఉన్న చాకిరేవు బానపైకి ఎక్కలేని కుక్కలు అక్కడే తిష్టవేశాయి. ఉతికిన బట్టలు ఆరవేసి వచ్చిన రంగయ్య.. మసక వెలుతురులో బానలో చేయిపెట్టి జత బట్టలు బయటకు తీశాడు.
బట్టలతోపాటు కోతిబావ తోకను కూడా కలిపి పట్టుకుని బట్టలు ఉతేకే బండపై రెండు బాదులు బాదాడు. ఆ దెబ్బలకు బాధతో కోతిబావ కిచకిచలాడాడు. రంగయ్య దాని తోక వదలడంతో పంచవర్ణాలూ కదిలాయి కోతిబావ కళ్ల ముందు. కుక్కలకు భయపడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. కొద్దిసేపు అక్కడే ఉన్న కుక్కలు గుడి వైపు వెళ్ళిపోయాయి.
గుడి వద్దకు చేరిన కోతిబావ కడుపు నిండుగా ప్రసాదం, అరటిపళ్ళు తిని చెట్టుపై హాయిగా నిద్రపోయాడు. సాయంత్రం తప్పెట మోతకు మెలకువ వచ్చింది. మొక్కున్న భక్తులు నడవడానికి గుడి ముందు నిప్పుల గుండం సిద్ధమై ఉంది. అదేంటో చూద్దామని .. కొబ్బరి చిప్ప తింటూన్న కోతిబావ చెట్టు దిగి నిప్పుల గుండం చేరువగా ఉన్న ఎత్తన కర్రపైకి వెళ్ళి కూర్చుని చూడసాగాడు. అక్కడ కిందున్న చెక్కబల్ల మీద కిరోసిన్ డబ్బాలో తన తోక మూడు వంతులు మునిగి ఉండటం కోతిబావ గమనించలేదు.
చిన్నపిల్ల తింటున్న మిఠాయి కోసం కిందికి దిగిన కోతిబావను కుక్కలు తరమసాగాయి. ఎటు పోదామన్నా జనం గుంపులు గుంపులుగా అడ్డురావడంతో వేరే దారి లేక నిప్పులగుండంపై నుండి పరుగుతీశాడు. కిరోసిన్‌లో తడిసి ఉన్న తోకకు మంట అంటుకుంది. భయంతో పదుగురు మగవాళ్ళ పంచలకు మండుతున్న తన తోక అంటించి చావుబతుకులతో పరుగుతీసి అడవికి చేరువలో ఉన్న చెరువులో దూకి మండుతున్న తనతోకను ఆర్పుకున్నాడు.
ఆ తర్వాత ముక్కుతూ,మూలుగుతూ అడవిలోకి నడిచాడు. అది చూసిన కుందేలు.. ‘నీ క్షేమం కోరి సింహరాజుగారు చెప్పిన జాగ్రత్తలను పెడచెవిన పెడ్తివి. ఆపదలకు ఎదురు వెళ్తివి. పెద్దల మాట చద్ది మూట అన్న విషయం తెలుసుకో. పెద్దలు ఎప్పడూ మన క్షేమమే కోరి హితవు చెపుతారు. ఇదిగో నువ్వు ఇలాంటి పనేదో చేసి వస్తావని ఊహించే ఆకు పసరు సిద్ధం చేశాను గాయాలకు రాసుకో’అన్నది కుందేలు. బుద్ధిగా తలఊపి చేతులు జోడించాడు కోతిబావ.
-డాక్టర్ నాగేశ్వరరావు బెల్లంకొండ
చదవండి👉🏾కథ: ‘నేను’... సుందర్‌ని చంపేశానన్నమాట! ఇంతకీ ఏం జరిగింది?
Comments
Please login to add a commentAdd a comment