నిజమే మాట్లాడు.. | Kids Story On Funday 28th July 2019 | Sakshi
Sakshi News home page

నిజమే మాట్లాడు..

Published Sun, Jul 28 2019 8:52 AM | Last Updated on Sun, Jul 28 2019 8:52 AM

Kids Story On Funday 28th July 2019 - Sakshi

అది రంగాపురం. ఆ ఊళ్ళో ఓ దొంగ. అతను రోజూ దొంగతనం చేయడానికి వెళ్ళేముందు ఓ గుడికి వెళ్లేవాడు. ‘‘స్వామీ ఈరోజు నేననుకున్నది విజయవంతమయ్యేటట్లు చూడాలి’’ అని ప్రార్థించేవాడు.
అయితే ఆ గుళ్ళోనే ఓ సాధువు రోజూ ఆధ్యాత్మిక ప్రవచనాలు చేస్తుండేవారు.  ఆ సాధువు చెప్పే పిట్టకథలంటే దొంగకు చాలా ఇష్టం. సాధువు మాటలతో అతనికి జ్ఞానోదయమైంది. అతను సాధువును విడిగా కలిసి నమస్కరించి ‘‘గురువుగారూ, నాకొక మంత్రం చెప్పండి’’ అని అడిగాడు.
అప్పుడు సాధువు ‘‘సరే నాయనా, ఇంతకూ నువ్వెవరు’’ అని అడిగారు.
తానొక దొంగనని, చిన్నతనం నుంచే దొంగతనం చేస్తున్నానని, తనకు మరే వృత్తీ తెలీదని ఉన్నది ఉన్నట్లు చెప్తాడు దొంగ.
అతను ఏదీ దాచకుండా నిజం చెప్పడంతో సాధువు వేదంలో ఉన్న ఒకటి రెండు మంత్రాలను ప్రస్తావిస్తూ ఎప్పుడూ నిజమే చెప్పాలని, అప్పుడే నీకు మంచి జరుగుతుందంటాడు సాధువు.

అలాగేనని దొంగ  సాధువు చెప్పిన మంత్రోపదేశాన్ని భార్యతో చెప్తాడు.
మరుసటిరోజు రాత్రి అతను ఎప్పట్లాగే దొంగతనానికి బయలుదేరుతాడు. అయితే ఆరోజు నగరంలో మారువేషంలో తిరుగుతున్న రాజును కలిసి తానొక దొంగనంటాడు. అప్పుడు రాజు తానూ దొంగేనని, ఇద్దరం కలిసి దొంగతనం చేద్దామని చెప్తాడు. అందుకు దొంగ సరేనంటాడు.
ఇద్దరూ కలిసి రాజుగారి ఖజానాలోకి ప్రవేశిస్తారు. అక్కడ ఓ పెద్ద పెట్టె కనిపిస్తుంది. అందులో మూడు వజ్రాలుంటాయి. ముందు చెప్పినట్లే దొంగ వాటిలో ఒకటి తాను తీసుకుని మరొకటి మారువేషంలో ఉన్న రాజుకు ఇస్తాడు.  మూడో వజ్రాన్ని పెట్టెలోనే వదిలేస్తారు.
పైగా దొంగ అంటాడు... ఎంతకాలంగా ఈ ఖజానాలో ఈ వజ్రాన్ని కాపాడుతున్నాడో ఆ రాజు. కనుక అది అతనికే వదిలేద్దాం అని.
ఆ మాటకు రాజు లోలోపల సంతోషిస్తాడు.
మరుక్షణం అక్కడి నుంచి దొంగ తన ఇంటికి బయలుదేరుతాడు. మారువేషంలో ఉన్న రాజు అతనిని అనుసరిస్తాడు. అతను ఎక్కడ ఉన్నదీ తెలుసుకుంటాడు. మరుసటి రోజు సభ సమావేశమైంది.

సభలో  రాజు ఓ ముఖ్య ప్రకటన అంటూ ఖజానాలోని పెట్టెలో దొంగతనం జరిగినట్లు గూఢచారుల వల్ల తెలిసిందంటాడు. ప్రధాన మంత్రి అలాగా మహాప్రభూ, ఇదిగో ఇప్పుడే ఖజానాకు వెళ్ళి తనిఖీ చేసి దొంగతనంపై ఒక నివేదిక ఇస్తానంటాడు. ప్రధానమంత్రి ఖజానాకు వెళ్ళి అక్కడి పెట్టెలో ఉన్న మూడో వజ్రాన్ని చూడటంతోనే అతనిలో ఓ దుర్భుద్ధి పుడుతుంది. దాన్ని తీసుకుని బొడ్లో దోపుకుంటాడు. సభకు వచ్చి, రాజా, అవును నిజమే. ఖజానాలో ఉన్న ఓ పెట్టెలో ఉండవలసిన మూడు ఖరీదైన వజ్రాలు లేవు రాజా అంటాడు.
అప్పుడు రాజు అదేంటీ దొంగలు ఓ వజ్రాన్ని విడిచిపెట్టారన్నారే గూఢచారులు అంటాడు.

అలాగా అంటూ రాజు భటులను పిలిచి దొంగ ఎక్కడుంటున్నాడో చెప్పి వెంటనే తీసుకు రమ్మంటాడు. వెంటనే భటులు గుర్రం మీద వెళ్ళి దొంగను పట్టుకొచ్చి రాజు ముందు నిలబెట్టారు. నిన్న రాత్రి ఏం జరిగిందో నిజం చెప్పమని దొంగను రాజు అడుగుతాడు. దొంగ అలాగేనని, తాను మరొకరితో కలిసి దొంగిలించిన వజ్రాల విషయాన్ని చెప్తాడు.  ఒక వజ్రం మాత్రం రాజుగారి కోసం పెట్టెలోనే విడిచిపెట్టామంటాడు. అతను చెప్పిన మాటలన్నీ విన్న రాజు నిన్న రాత్రి నీతో తలిసి ఖజానాలోకొచ్చింది తానేనని చెప్తాడు.

దొంగ నిశ్చేష్టుడై తన దగ్గరున్న వజ్రాన్ని రాజుగారి ముందున్న బల్లపైన ఉంచుతాడు. అనంతరం రాజు తన దగ్గరున్న వజ్రాన్ని కూడా ఆ వజ్రం పక్కనే ఉంచుతాడు. ఆ తర్వాత రాజు ప్రధానమంత్రివైపు చూసి ఆయన దగ్గరున్న వజ్రాన్ని బయటపెట్టమంటాడు. అయితే ప్రధాన మంత్రి ‘‘మహాప్రభూ, నన్నే అనుమానిస్తున్నారా...నా మీద ఇంతటి అపవాదు వేశారేంటండీ.. చాలా బాధగా ఉంది’’ అంటూ అమాయకత్వం నటిస్తాడు. ‘‘రెండు వజ్రాలు తీసిన దొంగలు మూడో వజ్రాన్ని ఎందుకు విడిచిపెడతారు రాజా’’ అంటాడు అమాయకంగా..

‘‘ప్రధానమంత్రీ మరో ఐదు నిముషాల్లో మీరు ఆ వజ్రం తీసి ఇక్కడ ఉంచకపోతే మిమ్మల్ని అందరి ముందూ తనిఖీ చేసి, నీ బండారం బయటపెడతా’’ అని రాజు గద్దించాడు. ప్రధానమంత్రి ఇక లాభం లేదనుకుని ప్రభువులవారు మన్నించాలంటాడు. దురాశ వల్లే తాను పెట్టెలో ఉన్న వజ్రాన్ని తానే దొంగతనం చేశానని తప్పు ఒప్పుకుంటాడు. ఆ వెంటనే రాజు మరో ముఖ్యప్రకటన అంటూ ప్రధాన మంత్రిని కటకటాలపాలు చేసి, అందరూ దొంగ నిజాయతీని కొనియాడుతుంటే, అతనిని ప్రధానమంత్రిగా నియమిస్తున్నట్లు ప్రకటిస్తాడు.
- యామిజాల జగదీశ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement