బంగారు కల | Funday Children Story Bangaru Kala | Sakshi
Sakshi News home page

బంగారు కల

Published Sun, Jul 7 2019 10:30 AM | Last Updated on Sun, Jul 7 2019 10:30 AM

Funday Children Story Bangaru Kala - Sakshi

మగధపుర రాజ్యంలో ధర్మపురం ఒక చిన్న పల్లెటూరు. అక్కడ రాజమ్మ, రంగయ్య అనే దంపతులున్నారు. వారు చాలా పేదవారు. రెక్కాడితేకాని డొక్కాడని జీవితం. వారికి ఒక కూతురు ఉంది. ముద్దులు మూటగట్టినట్లు ఉన్న ఆ అమ్మాయికి  బంగారు అని పేరు పెట్టారు.
ఆ పల్లెలో కనకయ్య అనే పెద్దాయన ఉన్నాడు. ఆయన కొడుకులకు పొలం పనులను అప్పజెప్పి, విద్యాదానాన్ని మించిన దానం లేదని తన వద్దకు పచ్చే వారికి ఉచితంగా చదువుచెప్పేవాడు. ఆడపిల్లల చదువు గురించి ఎవ్వరూ పట్టించుకోని ఆ పల్లెలో ఆడపిల్లలందరూ పనులకు పోతూంటే బంగారు మాత్రం పట్టుబట్టి యుక్తవయస్సు వచ్చేవరకు ఆయన వద్ద చదువుకుంది. ఆడపిల్ల చదువుకొని ఏం ఉద్ధరించాలని అందరూ అన్నా కూడా ఆమె వెనుకడుగు వేయలేదు. ఆయన చదువుతో పాటు అనేక మంచిమంచి విషయాలు, కథలు చెప్పేవాడు. బంగారుకు పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు.

ఒకరోజు బంగారుకు బంగారంలాంటి కల వచ్చింది. ఆమె పట్టువస్త్రాలు ధరించి, ఒంటినిండా వజ్ర వైఢూర్యాలున్న బంగారు నగలు ధరించి ఉంది. ఒక అందమైన రాజకుమారుడు రెక్కలగుర్రంపై వచ్చాడు. ఆమె దగ్గరగా గాలిలో గుర్రాన్ని నిలిపి, పరిచయం చేసుకుని వివాహమాడుతానన్నాడు. ఠక్కున కళ్లు తెరిచి చూసింది. ఎవ్వరూలేరు.
ఆ కల అలా వరుసగా నాలుగు రోజులు రావటంతో ఆశ్చర్యంతో అమ్మ, నాన్నలకు చెప్పింది. ‘‘కలలు నిజమవుతాయా? పూరిగుడిసెలో ఉండే నిన్ను రాకుమారుడు పెళ్ళి చేసుకోవటమేంటి? పిచ్చిపిచ్చి ఆలోచనలేంటి?’’ అని మందలించారు. బంగారును ఆ కల వెంటాడుతూనే ఉంది.

బంగారు అమ్మమ్మ గౌరమ్మ, రాజధానిలో ఉంటోంది. పూలతో రకరకాల అలంకరణలు చేయడంలో ఆమెది అందెవేసిన చెయ్యి. తోటలో పూలతో రాజభవనాన్ని, రాజ దర్భార్‌ను అలంకరించటం, రాణికి పూలజడలు తయారు చేయటం చేసేది. అందుకు కూలి అందేది. వయస్సు పైబడటంతో ఆమెకు రోజురోజుకూ ఓపిక తగ్గిపోతోంది. తోడుగా వుంటుందని మనవరాలిని రమ్మని కబురంపింది. బంగారం అమ్మమ్మ దగ్గరకు వచ్చింది. ప్రతిరోజూ అమ్మమ్మతో కలిసి రాజభవనానికి వెళ్లేంది. పనిలో ఆమెకు బాగా సహాయపడేది.
మగధపురాన్ని పరిపాలించే జయవర్ధనుడు అనారోగ్యంతో మరణించటంతో, ఆయన కుమారుడు చక్రధరుడు రాజయ్యాడు. ఆయన సభ కవి పండితులతో కళకళలాడుతుండేది. 
ఒకరోజు ప్రభాకరుడనే పండితుడు రాజసభకు వచ్చాడు. తాను మూడు ప్రశ్నలడుగుతానని, మూడు ప్రశ్నలకూ ఒకే సమాధానం చెప్పాలని, సరైన సమాధానం చెప్పగల మేధావి ఈ రాజ్యంలో ఉన్నాడా? అంటూ సవాలు విసిరాడు. అడగమన్నాడురాజు.

ప్రభాకరుడు చిరునవ్వుతో సభ అంతటా కలియచూసి ...
‘‘ఈ భూమిమీద నిర్లక్ష్యానికి గురవుతున్న మహావృక్షం ఏది? కోరని కోర్కెలు కూడా తీర్చే కల్పవృక్షం ఏది?
గరళాన్ని మింగి అమృతాన్ని పంచే విశిష్టమైన ప్రాణి ఏది?’’అని ప్రశ్నించాడు.
ప్రభాకరుడి ప్రశ్నలు ఎంత ఆలోచించినా ఎవ్వరికీ అర్థంకాలేదు. పండితులందరూ తలలు పట్టుకుని కూర్చున్నారు. చాలాసేపటి తర్వాత ప్రభాకరుడు ‘‘మీకు సమాధానం తోచటానికి కొన్ని సూచనలిస్తాను. నేను ఈ ప్రశ్నలడగటానికి ముందుగా మీరాజ్యంలో తిరిగాను.
పాఠశాలల్లో గోరువంకలున్నాయి. చిలుకలులేవు. పూజించవలసిన పూలు నేలపై పడున్నాయి. తుమ్మెదలేమో పైపైన ఎగురుతున్నాయి.ఎక్కడ చూసినా పుష్పకవిమానాలు నేలపైకూలిపోయి ఉన్నాయి. వెలుగును పంచే జ్యోతులకు నూనె కరువైంది’’ అన్నాడు.

‘‘ఇవేమి సూచనలండీ... ప్రశ్నలకంటే కఠినంగా ఉన్నాయి’’ అనుకుంటూ దిక్కు తోచక మౌనంగా ఉండిపోయారు. ఎవ్వరూ సమాధానం చెప్పకుంటే రాజ్యం పరువు మంటగలిసిపోతుందని అందరూ బాధపడసాగారు. ఆ సమయంలో అమ్మమ్మతో బంగారు అక్కడే ఉంది.
అప్పుడు బంగారు రెండుక్షణాలు ఆలోచించి, ముందుకువచ్చి ‘మీ ప్రశ్నలకు సమాధానం ‘స్త్రీ’అంది.
ప్రభాకరుడు ఆ సమాధానం సరియైనదని చెప్పి నమస్కరించాడు.
అక్కడ ఎవ్వరికీ ఏమీ అర్థం కాలేదు. వివరించమన్నాడు రాజు.

బంగారు చిరునవ్వుతో ‘‘మహారాజా!పాఠశాలల్లో గోరింకలున్నాయి, చిలుకల్లేవంటే అబ్బాయిలున్నారు, అమ్మాయిల్లేరని అర్థం. పూజించవలసిన పూలు నేలపై పడున్నాయి. తుమ్మెదలు పైపైన ఎగురుతున్నాయంటే  గౌరవించవలసిన పూలవంటి స్త్రీలుఅణచివేతకు గురవుతున్నారు. తుమ్మెదల్లా పితృస్వామ్య వ్యవస్థలో పురుషులు అధికారం చలాయిస్తున్నారని అర్థం. ఎంతమంది సంతానమున్నా పుష్పక విమానంలా మోయగలదు స్త్రీ. ఆమె గౌరవించబడటం లేదని అర్థం. వెలుగును పంచే జ్యోతులకు నూనె కరువైందంటే స్త్రీలకు ఆదరణ కరువైందని భావం. ఈనూచనల ప్రకారం మూడుప్రశ్నలకూ సమాధానం స్త్రీ అని గుర్తించాను. వృక్షం నీడ, ఆహారం, గాలినిచ్చి తన సర్వస్వం ఇతరులకోసం ఎలా అర్పిస్తుందో అలా కుటుంబం కోసం తన జీవితాన్ని అర్పించే  స్త్రీ అనే మహావృక్షం నిరాదరణకు గురవుతోంది. అమ్మగా, అక్కగా, భార్యగా, కూతురిగా కోరని కోర్కెలు కూడా గుర్తించి తీర్చే కుటుంబ కల్పవృక్షం స్త్రీ.గరళంలాంటి కష్టాలను దిగమింగి కుటుంబం కోసం అమృతంలాంటి సుఖాలను పంచే ప్రాణి స్త్రీ . అలాంటి స్త్రీ మనరాజ్యంలో నిరాదరణకు, అసమానతకు గురవుతోందని చెప్పటం కోసం ఆయన ఈ ప్రశ్నలడిగారు’’ అని వివరించింది. 

రాజు బంగారు నేర్పుకు, తెలివితేటలకు, అందానికి ఆకర్షితుడయ్యాడు. ఆమె వివరాలు అడిగి తెలుసుకున్నాడు. ఆమెను వివాహం చేసుకుంటానని సభలో ప్రకటించాడు.
రాజు ప్రభాకరుడి ప్రతిభను ప్రశంసించి సత్కరించబోయాడు.
ప్రభాకరుడు రాజసన్మానాన్ని తిరస్కరిస్తూ ‘‘మహారాజా! ఈ సృష్టికి మూలం’ స్త్రీ’! స్త్రీ విద్యను ప్రోత్సహించండి. స్త్రీల కష్టాలను తొలగించే పథకాలను, వారిని ఆదరించి, గౌరవించే
శాసనాలను ప్రవేశపెట్టండి. అదే నాకు సత్కారం’’ అనిచెప్పి, మరో రాజ్యంవైపు
బయలుదేరాడు ప్రభాకరుడు.
వజ్రవైఢూర్యాలు పొదిగిన నగలతో బంగారు పెళ్లికూతురైంది. చక్రధరుడితో బంగారు వివాహం వైభవంగా జరిగింది. అందరి కలలూ నిజంకావుగాని, బంగారు కల నిజమైంది. కనకయ్య గురువు తనకు చెప్పిన చదువు, కథలు తన ఆలోచనా పరిధిని పెంచి, జ్ఞానాన్ని ఇవ్వటంవల్లే తాను సమాధానం చెప్పగలిగానని కుటుంబ సభ్యులతో చెప్పింది బంగారం. చదువు చాలా విలువైనదని ఆమె తల్లితండ్రులు, అమ్మమ్మ గ్రహించారు. బంగారం అదృష్టానికి సంతోషించారు.
- డి.కె.చదువులబాబు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement