Eenadu Yellow Media Fake News On YS Vivekananda Assassination Case - Sakshi
Sakshi News home page

ఏది నిజం?: పచ్చ పైత్యం ముదిరిపోయింది!

Published Fri, Feb 24 2023 4:07 AM | Last Updated on Fri, Feb 24 2023 11:00 AM

Eenadu Yellow Media Fake News On YS Viveka Assassination Case - Sakshi

చనిపోయిన మనిషి మృతదేహాన్ని అంత్యక్రియల కోసం శ్మశానానికి తీసుకువెళ్తూ... ఏమో బతుకుతాడేమోననే దింపుడు కళ్లెం ఆశతో మధ్యలో పాడెను ఓసారి కిందకు దించి మరీ చూస్తారు!!. రాష్ట్రంలో రాజకీయంగా టీడీపీ అంతిమయాత్ర కొనసాగుతున్న తరుణంలో... ఎల్లో మీడియాలో ఇదే దింపుడు కళ్లెం ఆశ మిణుకు మిణుకు మంటోంది. అందుకే ఆ పార్టీని బతికించేందుకు రోజుకో రీతిలో రాజకీయ కుట్రకు తెరతీస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వంపై,  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై నిత్యం విషం చిమ్ముతోంది. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ వార్తలు, కథనాల పేరిట అభూతకల్పనలు, అవాస్తవాలను ప్రతిరోజూ అచ్చేస్తూ... పాత్రికేయ విలవలకు పాతరవేస్తోంది. సీబీఐ న్యాయస్థానంలో దాఖలు చేసిన కౌంటర్‌ అఫిడవిట్‌ పేరిట ఈనాడు, దాని తోక మీడియా మరోసారి అదే పచ్చ పైత్యాన్ని ప్రదర్శించాయి.

అసలు ఆ అఫిడవిట్‌లో ఏముందనే దానితో పని లేకుండా.... చంద్రబాబు పోసిన ‘పచ్చ’ సిరాను తమ పెన్నుల్లో నింపేసుకుని విచ్చలవిడి రాతలకు దిగాయి. 2019లో టీడీపీ ఘోర పరాజయం పాలవ్వగానే చంద్రబాబు బీజేపీలోకి పంపిన తన కోవర్టుల ద్వారా ఈ కేసు దర్యాప్తును ప్రభావితం చేస్తున్నారన్నది బహిరంగ రహస్యం. అందుకే దర్యాప్తు దారితప్పిందన్నది సుస్పష్టం. తమకు అదే కావాలన్న రీతిలో అటు చంద్రబాబు ఇటు పచ్చ మీడియా వైఎస్సార్‌ కుటుంబంపై నిస్సిగ్గుగా బురద జల్లుతున్నాయి. 

సునీల్‌ యాదవ్‌పై విరుద్ధ వాదనలేల? 
ఈ కేసులో నిందితుడు సునీల్‌ యాదవ్‌ కదలికలు అత్యంత కీలకమని సీబీఐ చెబుతోంది. ప్రధానంగా వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజున సునీల్‌యాదవ్‌ ఎక్కడెక్కడ తిరిగారన్నది దర్యాప్తులో తాము కనుగొన్న అతి ముఖ్యమైన విషయంగా పేర్కొంది. మరి అంత ముఖ్యమైన అంశంపై సీబీఐ 2021లో న్యాయస్థానానికి చెప్పిన మాటకు... ఇప్పుడు సీబీఐ కోర్టుకు చెప్పిన మాటకు పొంతన లేదెందుకు? సునీల్‌ యాదవ్‌ను 2021, ఆగస్టులో సీబీఐ అరెస్టు చేసింది. 2021, డిసెంబర్‌లో చార్జ్‌షీట్‌ వేసింది.

అందులో వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజున... వివేకా ఇంటి పరిసరాల్లోనే సునీల్‌ యాదవ్‌ తిరిగినట్టు సీబీఐ పేర్కొంది. సునీల్‌ మొబైల్‌ ఫోన్‌ లొకేషన్‌ను గూగుల్‌ టేకౌట్‌ విధానం ద్వారా నిర్ధారించి ఈ విషయాన్ని కనుగొన్నట్టు తెలిపింది. కేసులో ఇదే అత్యంత కీలకమైన సాక్ష్యమని కూడా న్యాయస్థానానికి నివేదించింది. మరి సీబీఐ వద్ద అంత పక్కా సమాచారం ఉంటే దాని ఆధారంగా కేసు దర్యాప్తును ఎందుకు వేగవంతం చేయలేదు?. నేరుగా చర్యలు తీసుకోవచ్చు కదా? వెంటనే కేసు దర్యాప్తును కొలిక్కి తేవచ్చు కదా? కానీ అలా చేయలేదు. హత్య జరిగిన నాడు వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి ఇంట్లో సునీల్‌ యాదవ్‌ ఉన్నారని నాటి చార్జిషీట్లో చెప్పనే లేదు.  

ఇప్పుడు 14 నెలల తరువాత... హఠాత్తుగా సునీల్‌ యాదవ్‌ ఆ రోజు వైఎస్‌ భాస్కర్‌రెడ్డి నివాసంలో ఉన్నట్టు న్యాయస్థానానికి సీబీఐ చెప్పడం వెనుక మతలబేంటి? బోడిగుండుకు మోకాలికి ముడి పెట్టా­లని ఎందుకు ప్రయత్నిస్తోంది? సునీల్‌ యాదవ్‌ కదలికలను గుర్తించి ఉంటే 2021 నాటి చార్జ్‌షీట్లోనే ఎందుకు చెప్పలేదు...!? ఇప్పుడెందుకు కొత్తగా చెబుతున్నారు? న్యాయస్థానానికి రెండు వేర్వేరు సందర్భాల్లో రెండు వేర్వేరు వాదనలు వినిపించడమేంటి? ఇదంతా యాదృచ్ఛికం కాదని... ఓ స్కెచ్‌ ప్రకారమే జరుగుతోందని అర్థం కావటం లేదూ? 

వారు వివేకాకు సన్నిహితులు కాదా!? 
వివేకా హత్య కేసులో మోకాలికి– బోడి గుండుకు ముడిపెట్టేందుకు పచ్చ మీడియా యత్నిస్తోంది. వివేకానందరెడ్డి, వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి మధ్య విభేదాలున్నాయని ఈనాడు పతాక శీర్షికల్లో రాసింది. వారి మధ్య కడప ఎంపీ టికెట్‌ కోసం విభేదాలున్నాయని సీబీఐ అధికారులు చెబుతున్నట్లు కూడా పేర్కొంది. పోనీ ఆ మాటకే కట్టుబడి ఉన్నారా అంటే... అదీ లేదు. ఈ కేసులో అరెస్టయిన నిందితులు ఎర్ర గంగిరెడ్డి, సునీల్‌ యాదవ్, ఉమాశంకర్‌ రెడ్డి, దస్తగిరి వివేకానందరెడ్డికి సన్నిహితులని చెప్పేదీ ఈనాడే.

ఆ నలుగురే మళ్లీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి, వైఎస్‌ భాస్కర్‌రెడ్డిలతో కలసి వివేకా హత్యకు కుట్రపన్నారని రాసేదీ ఈనాడే. సీబీఐ అధికారులు కూడా ఇదే మాటలు వల్లె వేస్తున్నారు. ఇది కుట్ర కాదా రామోజీ?  ఎర్రగంగిరెడ్డి, సునీల్‌ యాదవ్, ఉమాశంకర్‌రెడ్డి, దస్తగిరిలు వైఎస్‌ వివేకానందరెడ్డికి ఎన్నో ఏళ్లుగా సన్నిహితులని సీబీఐ చెబుతోంది. అది నిజం కూడా. వివేకాకు సన్నిహితులు కనక వారికి సహజంగానే వివేకా కుటుంబీకులతో కూడా సన్నిహిత సంబంధాలుంటాయి.

అంటే వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డిలకు కూడా ఆ నలుగురు సన్నిహితులేనన్నది అందరికీ తెలిసిన విషయమే. నర్రెడ్డి శివప్రకాశ్‌ రెడ్డి హైదరాబాద్‌లో తన మనవరాలి పుట్టిన రోజు వేడుకలు నిర్వహిస్తూ పులివెందుల నుంచి ఒక్క ఎర్ర గంగిరెడ్డినే ఆహ్వానించారు.

అంటే వారంతా సన్నిహితులేనన్నది సుస్పష్టం. ఇక వైఎస్‌ వివేకానందరెడ్డిని ఎర్ర గంగిరెడ్డి, సునీల్‌ యాదవ్, ఉమాశంకర్‌రెడ్డి, దస్తగిరిలు హత్య చేశారని సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో కూడా పేర్కొంది.  

ఇక్కడ గమనించాల్సిందేంటంటే... ఎవరైనా చెబితే ఆ హత్య చేశారా? వ్యక్తిగత, ఆర్థిక విభేదాలతోనే హత్యకు పాల్పడ్డారా? అనేది. వివేకానందరెడ్డి రెండో వివాహం చేసుకోవడంతో ఆయన కుటుంబంలో తీవ్ర విభేదాలు తలెత్తాయన్నది రహస్యమేమీ కాదు.

తన రెండో భార్యకు ఆస్తిలో వాటా ఇవ్వాలని... ఆమెకు, తనకు పుట్టిన కొడుకును వారసుడిగా ప్రకటించాలని వైఎస్‌ వివేకా భావించారు. దీన్ని ఆయన కుటుంబం వ్యతిరేకించింది. ఆయన భార్య హైదరాబాద్‌లో ఉన్న కుమార్తె సునీత వద్దకు వెళ్లిపోయారు.

ఇదంతా పులివెందులలో ప్రతి ఒక్కరికీ తెలుసు. ఈ వ్యవహారంలోనే వివేకా రెండో భార్యను సునీత, నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, శివప్రకాశ్‌ రెడ్డి బెదిరించారన్నది కూడా కాదనలేని నిజం.

ఈ నేపథ్యంలో వైఎస్‌ వివేకానందరెడ్డిని సునీల్‌ యాదవ్, దస్తగిరి, ఉమాశంకర్‌రెడ్డి హత్య చేస్తే...అందుకు ఎర్రగంగిరెడ్డి దగ్గరుండి సహకరిస్తే... దాని వెనుక నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, శివ ప్రకాశ్‌ రెడ్డిల ప్రమేయం ఉండే అవకాశాలూ ఉంటాయి కదా? పైగా వివేకా మరణించిన విషయం మొదటగా ఆయన కుమార్తె సునీత, భార్య సౌభాగ్యమ్మ, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివ ప్రకాశ్‌ రెడ్డిలకే తెలిసింది.

ఉదయాన్నే జమ్మలమడుగులో ఎన్నికల ప్రచారానికి బయలుదేరిన వైఎస్‌ అవినాశ్‌ రెడ్డికి... నర్రెడ్డి శివప్రకాశ్‌ రెడ్డి ఫోన్‌ చేసి చెబితేనే ఈ మృతి విషయం తెలిసింది. ఆ ఫోన్‌కాల్‌తోనే ఆయన వెనక్కి తిరిగి పులివెందుల వచ్చారు.  

ఫోన్లో మెసేజీలు డిలీట్‌ చేయలేదా? 
పైపెచ్చు వివేకా రాసిన లేఖను, ఆయన సెల్‌ఫోన్‌ను తామొచ్చే వరకూ ఎవరికీ ఇవ్వొద్దని పీఏ కృష్ణారెడ్డికి సునీత, నర్రెడ్డి రాజశేఖరరెడ్డి చెప్పారు. వారు వచ్చిన తరువాత, ఆ ఫోన్లోని కొన్ని మెసేజీలను డిలీట్‌ చేశాకే దాన్ని పోలీసులకు ఇచ్చారు. ఈ పరిణామాలన్నీ వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది శివ ప్రకాశ్‌ రెడ్డిల పాత్రపైనా సందేహాలను లేవనెత్తుతున్నాయి కదా? మరి వాళ్లనెందుకు సీబీఐ విచారించటం లేదు? ఆ దిశగా దర్యాప్తు ఎందుకు చేయటం లేదు? అంతేకాదు వైఎస్‌ వివేకా హత్య జరిగినప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉంది.

అప్పుడు వేసిన సిట్‌ దర్యాప్తు నివేదికగానీ...అనంతరం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ నివేదికనుగానీ సీబీఐ ఏమాత్రం పట్టించుకోలేదు. వాటిని పక్కన పడేసి సీబీఐలో కిందిస్థాయి అధికారులు కొందరు... దర్యాప్తును కావాలనుకున్న దిశగా నడిపిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. పోనీ టీడీపీ, ఈనాడు ఆరోపిస్తున్నట్టుగా వైఎస్‌ వివేకా, వైఎస్‌ అవినాశ్‌ మధ్య విభేదాలు ఉండటమే నిజమైతే... వివేకా సన్నిహితులైన ఎర్ర గంగిరెడ్డి, సునీల్‌ యాదవ్, ఉమాశంకర్‌రెడ్డి, దస్తగిరిలు సహజంగానే అవినాశ్‌కు దూరంగా ఉంటారు.

తమకు ఆప్తుడైన వివేకా అంటే సరిపడని అవినాశ్‌ రెడ్డితో వారెందుకు సన్నిహితంగా ఉంటారు?  మరి ఆ నలుగురే హత్య చేశారు అనుకుంటే దాంతో అవినాశ్‌కి గానీ ఆయన కుటుంబ సభ్యులకుగానీ ఎటువంటి సంబంధం ఉండదు కదా?. ఈ చిన్న లాజిక్‌ను సీబీఐ, టీడీపీ, పచ్చ మీడియా ఎందుకు మిస్‌ అవుతున్నాయి? కేవలం ముఖ్యమంత్రి కుటుంబంపై బురదజల్లేందుకేనని అర్థం కావటం లేదా? 

సాక్షులు చెప్పని మాటలు కూడా... 
సీబీఐ దర్యాప్తు తీరులో విస్మయం కలిగించే అంశమేంటంటే... ఈ కేసులో సాక్షులు చెప్పని విషయాలనూ వారి వాంగ్మూలాలుగా నమోదు చేయడం!!. బహుశా గతంలో ఎప్పుడూ పోలీసుల విచారణలో గానీ, సీబీఐ దర్యాప్తులో గానీ ఇలాంటి ఆరోపణలు రాలేదు. కానీ వివేకా హత్య కేసులో ఎంతోమంది సాక్షులు తాము చెప్పని మాటలను సీబీఐ అధికారులు ఏకపక్షంగా నమోదు చేసేసి... మీడియాకు లీకులిచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.

తాజాగా సీబీఐ అధికారులు పేర్కొన్న శశికళ అనే మహిళ వాంగ్మూలం కూడా అదే రీతిలో ఉంది. వివేకా గుండెపోటుతో మరణించినట్లుగా ఎంపీ అవినాశ్‌ రెడ్డి తనతో చెప్పారని శశికళ వాంగ్మూలమిచ్చినట్లుగా సీబీఐ పేర్కొంది. కానీ ఈ విషయాన్ని శశికళ ఖండించారు. అవినాశ్‌ రెడ్డి తనతో ఏమీ చెప్పనే లేదని... తాను అసలు అవినాశ్‌తో ఈ విషయంపై మాట్లడనే లేదని ఆమె స్పష్టం చేశారు.

అదే మాటను ఆమె గతంలో సిట్‌ విచారణలోనూ, ప్రస్తుత సీబీఐ దర్యాప్తులోనూ చెప్పారు. కానీ తాను చెప్పని మాటలను చెప్పినట్టుగా సీబీఐ అధికారులు ఎందుకు వాంగ్మూలంగా రాసుకున్నారో తెలియడం లేదని శశికళ వాపోయారు. ఈ విషయాన్ని తనతో కనీసం నిర్ధారించుకోకుండా ఈనాడు, ఇతర మీడియా ఏకపక్షంగా రాసేసినట్లు ఆమె తెలియజేశారు. రామోజీరావు నీతిమాలిన పాత్రికేయంపై ఆమె మండిపడ్డారు.

గతంలోనూ పలువురి విషయంలో ఇలాంటివి జరగటం ఇక్కడ గమనార్హం. వైఎస్సార్‌ కుటుంబ సభ్యుడు వైఎస్‌ అభిషేక్‌ రెడ్డి, పులివెందుల మున్సిపల్‌ చైర్మన్‌ వెల్లపు వర ప్రసాద్, రఘునాథ రెడ్డి, అనంతపురం జిల్లాకు చెందిన గంగాధర్‌రెడ్డిలతోపాటు 71 ఏళ్ల ప్రభావతమ్మ అనే మహిళ కూడా ఇలాగే చెప్పారు.తాము చెప్పని విషయాలను చెప్పినట్టుగా సీబీఐ అధికారులు వాంగ్మూలం నమోదు చేశారని వారు తెలియజేశారు. దీనిపై అధికారికంగా ఫిర్యాదు కూడా చేశారు.

ఎందుకిలా జరుగుతోంది? ఈ తరహా సీబీఐ వాంగ్మూలాలు ఎల్లో మీడియాకు మాత్రమే ఎలా చేరుతున్నాయి? దీనివెనక ఉన్న అదృశ్య శక్తులేంటి? అన్నివేళ్లూ చూపిస్తున్నది చంద్రబాబు వైపే!!. వైఎస్‌ జగన్‌ను రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేక ఇలా దొడ్డిదారి పోరాటానికి బాబు దిగారన్నది తేలిగ్గానే అర్థమవుతుంది. 2019 ఎన్నికల్లో ఓడిపోయాక బీజేపీలోకి పంపిన కోవర్టులు చంద్రబాబుకు ఈ వ్యవహారంలో సహకరిస్తున్నారన్నది రహస్యమేమీ కాదు. 

ఫ్లెక్సీలో ఫొటో ఉంటే ప్రభావితం చేయడమా..!? 
సీబీఐ పేరు చెబుతూ ‘ఈనాడు’ రాసిన మరో దుర్మార్గపు రాత ఇది. ఈ కేసులో అరెస్టయిన దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి కుమారుడు తన ఆసుపత్రి ప్రారంభోత్సవం సందర్భంగా వేయించిన ఫ్లెక్సీలో ఎంపీ అవినాశ్‌ రెడ్డి ఫొటో పెట్టారట. తద్వారా తన వెనుక ఎంతమంది పరపతి గలవారున్నారో అని కేసును,  సాక్షులను ప్రభావితం చేసేందుకు యత్నించారట!!. అదీ ఈనాడు వెళ్లగక్కిన పైత్యం. ఫ్లెక్సీలో ఓ నాయకుడి ఫొటో పెడితే అది సాక్షులను ప్రభావితం చేయడం అవుతుందా? గతంలో బ్యానర్లు, వాల్‌ పోస్టర్లు ఉండేవి. కొన్నేళ్లుగా ఫ్లెక్సీలు వచ్చాయి.

చిన్న సెలూన్‌ ప్రారంభోత్సవం నుంచి షాపింగ్‌ మాల్స్‌ వరకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం సాధారణమైపోయింది. ఆ సందర్భంగా తమ ప్రాంత ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నేతల ఫొటోలు ఆ ఫ్లెక్సీల్లో వేయటం సహజం. దీన్ని కూడా తప్పుబడతారా? చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు రాష్ట్రమంతటా ఆయన ఫొటోలు ఎందరో ఫ్లెక్సీల్లో వేశారు... ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్నాసరే ఆయన ఫొటోలు ఆ పార్టీ నేతలు ఫ్లెక్సీల్లో వేస్తున్నారు.

అంత మాత్రాన వారంతా చంద్రబాబు ఫొటో చూపించి అందర్నీ బెదిరిస్తున్నట్టు భావించాలా? మరి ఫ్లెక్సీల్లో  చంద్రబాబు ఫొటోలుంటే లేని అభ్యంతరం... ఎంపీ అవినాశ్‌ రెడ్డి ఉంటే మాత్రం బెదిరించడం.. సాక్షులను ప్రభావితం చేయడం ఎలా అవుతుంది రామోజీ గారూ?.  

అవినాశ్‌కు టికెట్టు ఖరారు చేశాక కూడా...
సీబీఐ కౌంటర్‌ అఫిడవిట్‌ అంటూ ఈనాడు, దాని తోకమీడియా వండిన కథనాలన్నీ అవాస్తవాలే. అసలు కడప ఎంపీ టికెట్‌పై విభేదాలు రేగే అవకాశం ఎక్కడుంది? అవినాశ్‌ రెడ్డి అప్పటికే కడప ఎంపీ. ఆయనకే టికెట్‌ ఇస్తు­న్నట్లు పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి అప్పటికే ధ్రువీకరించారు. జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్‌చార్జిగా ఉన్న వైఎస్‌ వివేకానందరెడ్డి... ఎంపీగా అవినాశ్‌ను గెలిపించడానికి ప్రచారం కూడా మొదలు పెట్టారు.

ముందురోజు రాత్రి జమ్మలమడుగులో ప్రచారం చేసి ఇంటికి వచ్చాక... ఆ రోజు అర్ధరాత్రి ఆయన హత్యకు గురయ్యారు. ఎంపీగా అవినాశ్‌ విజయం కోసం తన తండ్రి ప్రచారం చేస్తున్నారని వైఎస్‌ వివేకా హత్య తరువాత ఆయన కుమార్తె సునీత మీడియాతో కూడా చెప్పా­రు. మరి ఎంపీ టికెట్‌పై వివేకా, అవినాశ్‌ మధ్య విభేదాలున్నా­యని పచ్చ మీడియా పదే పదే రాస్తుండటం రాజకీయ కుట్ర కాక మరేమిటి?  

ఇక వివేకా హత్యకు  రూ.40కోట్లు సుపారీ ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నారనే మరో నిరాధార ఆరోపణ కూడా పదే పదే చేస్తున్నారు. అందుకోసం రూ.5 కోట్లు అడ్వాన్స్‌ ఇచ్చారని...అందులో తనకు రూ.కోటి కూడా ఇచ్చారని దస్తగిరి అప్రూవర్‌గా మారుతూ ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నట్టు సీబీఐ తెలిపింది.

మరి హత్య చేయడానికి 10 రోజులు ముందే చేతిలో కోటి రూపాయలున్న దస్తగిరి.. ఆ తరవాత రూ.5వేలు, రూ.10వేల అప్పు కోసం పులివెందులలో అందరి చుట్టూ ఎందుకు తిరిగాడు? సునీల్‌ యాదవ్‌ తనకివ్వాల్సిన రూ.3 లక్షలు ఇప్పించాలంటూ... ఆ మేరకు దస్తావేజులు చూపిస్తూ మరీ దస్తగిరి ప్రాథేయపడటం నిజం కాదా...! ఆ దస్తావేజులను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు కదా!. అంటే దస్తగిరికి రూ.కోటి ఇచ్చారన్నది అబద్ధమని స్పష్టమవుతోంది కదా? దీన్నిబట్టి దస్తగిరి అప్రూవర్‌గా మారుతూ ఇచ్చిన వాంగ్మూలంలోని విషయాలన్నీ కల్పితాలే తప్ప వాస్తవాలు కాదని తెలియటం లేదా? హత్య వెనుక ఎంపీ అవినాశ్‌ రెడ్డి, భాస్కర్‌రెడ్డి ఉన్నారని గంగిరెడ్డి తనకు చెప్పినట్లుగా దస్తగిరి వెల్లడించిన విషయం అవాస్తవం కాదా?  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement