
అతనిపట్ల సునీతమ్మకు ఎందుకంత ఆరాటం?
ఎర్రగంగిరెడ్డి నోరు విప్పితే అసలు నిజాలు వెలుగులోకి
వివేకా హత్యలో నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డిది కీలకపాత్ర
సీబీఐకి చెప్పినా పట్టించుకోలేదు
రిమాండ్‌లో ఉన్న సునీల్‌యాదవ్ బంధువు భరత్‌యాదవ్ వెల్లడి
పులివెందుల: మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి చెప్పేవన్ని పూర్తి అవాస్తవాలని.. హత్య కేసులో రిమాండ్‌లో ఉన్న సునీల్‌యాదవ్ సమీప బంధువు భరత్‌యాదవ్ స్పష్టంచేశారు. ఆదివారం వైఎస్సార్ జిల్లా పులివెందులలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దస్తగిరి తనకు ప్రాణహాని ఉందని చెబుతూ రౌడీయిజం, గూండాయిజం, సెటిల్‌మెంట్లు ఎలా చేస్తున్నాడని ప్రశ్నించారు. అతను చేసిన దుర్మార్గపు పనిని గొప్పగా చెప్పుకుంటూ సమాజంలో రౌడీయిజంతో హల్‌చల్ చేస్తున్నాడన్నారు. ఉన్నతమైన వ్యక్తులను టార్గెట్ చేస్తూ అబద్ధపు మాటలతో సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాడని మండిపడ్డారు.
నిజాన్ని కప్పిపుచ్చి దస్తగిరితో వెనుక ఉండి ఎవరు మాట్లాడిస్తున్నారో అందరికీ తెలుసునన్నారు. గతంలో సునీల్‌యాదవ్, దస్తగిరిలు తమ ఆర్థిక లావాదేవీల విషయంలో తనను సంప్రదించేవారని.. అప్పట్లో ఐస్ బండి వ్యాపారం చేస్తూ అప్పులతో ఉన్న దస్తగిరి ఇప్పుడు విలాసవంతమైన జీవితం ఎలా గడుపుతున్నాడని భరత్‌యాదవ్ ప్రశ్నించారు. తనకు కూడా డబ్బులు బాకీ ఉన్న దస్తగిరి తననూ దూషించాడన్నారు. వివేకా రెండో భార్య అయిన షమీమ్‌కు ఆస్తి పోతుందనే ఈ హత్య జరిగి ఉండవచ్చని ఆయన అనుమానం వ్యక్తంచేశారు. ఈ హత్యలో వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి కీలకపాత్ర పోషించాడన్నారు. అతను వెనుక ఉండి ఎర్రగంగిరెడ్డి, ఉమాశంకర్‌రెడ్డి, సునీల్‌యాదవ్, దస్తగిరిల ద్వారా హత్య చేయించాడన్నారు.
ఎర్రగంగిరెడ్డి నోరువిప్పితే అసలు విషయాలు వెల్లడి..
ఈ హత్యలో ఎర్రగంగిరెడ్డి నోరు విప్పితే పూర్తి విషయాలు బయటపడతాయని భరత్‌యాదవ్ చెప్పారు. తనకు సునీల్‌యాదవ్ రూ.16 లక్షలు ఇవ్వాలని, అప్పట్లో తాను డబ్బుల విషయం అడిగితే రాజశేఖర్ సార్ ఇవ్వాలని, డబ్బులు వచ్చిన వెంటనే ఇస్తానని చెప్పేవాడన్నారు. అలాగే, డబ్బుల విషయమై ఒకసారి ఎర్రగంగిరెడ్డి కూడా నీకు రావాల్సిన డబ్బులు ఎక్కడికీ పోవు, త్వరలోనే వస్తాయని తనతో చెప్పేవాడన్నారు.
దస్తగిరి, దస్తగిరి భార్య ఎవరితో మాట్లాడుతున్నారో వారికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని భరత్‌యాదవ్ అభిప్రాయపడ్డారు. అసలు సునీతమ్మ తన తండ్రిని చంపిన దస్తగిరి కోసం ఎందుకు ఆరాటపడుతోందో ఆమెకే తెలియాలన్నారు. గతంలో తనను సీబీఐ ఎంక్వైరీకి పిలిచినప్పుడు అన్ని విషయాలు వారికి తెలిపానని, అయినా కూడా వారు తాను చెప్పిన అంశాలను పరిగణలోకి తీసుకోలేదన్నారు. ఎర్రగంగిరెడ్డి నోరువిప్పితే ఈ కేసులో నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి పాత్ర బయటపడుతుందని భరత్‌యాదవ్ స్పష్టంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment