అక్కడ అసలేం జరిగింది? | NHRC Meets Disha Family And Accused Family Members For Statement | Sakshi
Sakshi News home page

అక్కడ అసలేం జరిగింది?

Published Mon, Dec 9 2019 1:17 AM | Last Updated on Mon, Dec 9 2019 9:50 AM

NHRC Meets Disha Family And Accused Family Members For Statement - Sakshi

పోలీస్‌ వాహనంలో అకాడమీలోకి వెళ్తున్న ఎన్‌కౌంటర్‌ మృతుల కుటుంబ సభ్యులు

సాక్షి, రాజేంద్రనగర్‌ : చటాన్‌పల్లి వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్సీ) ప్రతినిధుల బృందం దిశ కుటుంబ సభ్యులు, ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన నిందితుల కుటుంబ సభ్యుల వాంగ్మూలం తీసుకోవడంతో పాటు వివరాలు సేకరించింది. ‘తప్పు చేసిన మా బిడ్డలను శిక్షించమనే చెప్పాం. మా బిడ్డలను అన్యాయంగా కాల్చి చంపారు..’ అంటూ ఎన్‌కౌంటర్‌ మృతుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటు హత్యాచార ఘటన గురించి దిశ తండ్రితో పాటు సోదరిని ఎన్‌హెచ్‌ఆర్సీ సభ్యులు అడిగి తెలుసున్నారు.

ఆదివారం హిమాయత్‌సాగర్‌లోని రాజా బహదూర్‌ వెంకట్రామిరెడ్డి తెలంగాణ పోలీస్‌ అకాడమీలో వీరందరి నుంచి ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం స్టేట్‌మెంట్‌ రికార్డు చేసింది. సాయంత్రం 5.40 గంటల సమయం ప్రత్యేక వాహనంలో పోలీసులు దిశ తండ్రితో పాటు సోదరిని పోలీస్‌ అకాడమీకి తీసుకొచ్చారు. అంతకుముందు ఉదయం మూడు వాహనాల్లో ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన నిందితుల కుటుంబ సభ్యులను తీసుకొచ్చి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. 

ఎన్‌కౌంటర్‌ గురించి ఏమీ అడగలేదు : దిశ కుటుంబీకులు 


దిశ హత్యాచారం ఘటన రోజు వివరాలను మాత్రమే ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం అడిగి తెలుసుకుందని ఆమె తండ్రి, సోదరి వెల్లడించారు. విచారణ అనంతరం పోలీస్‌ అకాడమీ నుంచి బయటకు వచ్చిన వారిని మీడియా ప్రశ్నించగా.. కేవలం సంఘటన జరిగిన రోజు తమకు ఎలా తెలిసిందో వివరాలను అడిగి తెలుసుకున్నారని చెప్పారు. ఎన్‌కౌంటర్‌పై ఎలాంటి ప్రశ్నలు అడగలేదని స్పష్టం చేశారు. 

మాకు న్యాయం చేయండి.. 
మక్తల్‌ : ‘కోర్టు తీర్పు రాకముందే మా బిడ్డలను అన్యాయంగా ఎన్‌కౌంటర్‌ చేశారు. మాకు న్యాయం చేయండి’ అంటూ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన నలుగురి కుటుంబీకులు ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం ముందు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు గుట్టుచప్పుడు కాకుండా పోలీసు ప్రత్యేక బృందం మహ్మద్‌ పాషా తండ్రి ఆరిఫ్‌ హుస్సేన్, నవీన్‌ తల్లి లక్ష్మి, శివ తండ్రి రాజప్ప, చెన్నకేశవులు తండ్రి కుర్మన్నలను ప్రత్యేక వాహనంలో బందోబస్తు మధ్య హైదరాబాద్‌లోని ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం సభ్యుల వద్దకు తీసుకెళ్లారు. తిరిగి రాత్రి 8 గంటలకు వారి ఇళ్ల వద్ద వదిలేశారు.

అయితే నిందితుల తల్లిదండ్రులతో ఒకరి తర్వాత ఒకరితో ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం సభ్యులు 2 గంటల పాటు మాట్లాడిన ట్లు తెలుస్తోంది. మీ పిల్లల ప్రవర్తన ఎలా ఉండేది.. ఎందుకిలా ప్రవర్తించారు.. ఇంటి నుంచి ఎప్పుడెళ్లారు.. సంఘటనలో పోలీసులు వారిని ఎప్పుడు తీసుకెళ్లారు.. ఆ తర్వాతేం జరిగింది.. పోలీసుల ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన మీ బిడ్డలపై మీరు ఏమనుకుంటున్నారు..?’ అని ఎన్‌హెచ్‌ఆర్సీ  సభ్యులు ప్రశ్నించినట్లు తెలిసింది. 

అదే చివరి చూపైంది.. 
‘పోయిన శుక్రవారం ఉదయం 3.30 గంటలకు మా బిడ్డలను లారీ ఓనర్‌ శ్రీనివాస్‌రెడ్డితో వచ్చి పోలీసులు తీసుకెళ్లారు. ఎందుకు తీసుకెళ్తున్నారని మా బిడ్డలను అడిగితే ఓ అమ్మాయి బైక్‌ అడ్డు రావడంతో యాక్సిడెంట్‌లో చనిపోయిందని.. అందుకే తీసుకెళ్తున్నాం అని చెప్పారు. ఆ రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు ఓ ఆడపిల్లను పెట్రోల్‌ పోసి అంటించి చంపింది మీ పిల్లలనే అని పక్కన వారు వచ్చి చెబితేనే తెలిసింది. ఆ తర్వాత రోజు పోలీసులు షాద్‌నగర్‌కు పిలిపించి సంతకాలు పెట్టించుకున్నారు. అంతే అదే చివరిగా మా పిల్లలను చూడడం.. మాట్లాడటం.

ఆ తర్వాత టోల్‌గేట్‌ వద్ద వచ్చి విడిచిపెట్టిపోయారు. సరిగ్గా వారం తర్వాత శుక్రవారం రోజు ఉదయం 7 గంటలకు మా బిడ్డలను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారని తెలిసింది. తప్పు చేస్తే శిక్షించమనే చెప్పాం. కానీ ఇలా చేస్తారని అనుకోలేదు’ అని మృతుల తల్లిదండ్రులు ఎన్‌హెచ్‌ఆర్సీ సభ్యులకు చెప్పినట్లు తెలిసింది. చెన్నకేశవులు భార్య గర్భిణిగా ఉందని, ఆమెకు న్యాయం చేయాలంటూ చెన్నకేశవులు తండ్రి కుర్మన్న వారిని వేడుకున్నట్లు తెలుస్తోంది. 

మృతదేహాలను ఎప్పుడిస్తారు సారూ?  
తమ పిల్లల మృతదేహాలను ఎప్పుడిస్తారంటూ ఎన్‌హెచ్‌ఆర్సీ సభ్యులను తల్లిదండ్రులు అడిగినట్లు తెలుస్తోంది. ‘సోమవారం హైకోర్టు తీర్పు ఉంది.. ఆ తర్వాత మేము మీకు సమాచారమిస్తాం.. మీ పిల్లల మృతదేహాలు భద్రంగా ఉన్నాయి. ఎప్పుడిస్తామనేది సోమవారం తెలుస్తుంది’.. అని సముదాయించినట్లు సమాచారం.  

ఆ పోలీసులను విచారించినఎన్‌హెచ్‌ఆర్సీ బృందం.. 
మరో రెండ్రోజులు ఎన్‌హెచ్‌ఆర్సీ బృంద సభ్యులు హైదరాబాద్‌లోనే ఉండనున్నారు. ఇప్పటికే ఘటనపై నివేదిక ఇవ్వాలని సైబరాబాద్‌ పోలీసులను ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం ఆదేశించిన నేపథ్యంలో వారు ఫోరెన్సిక్, రెవెన్యూ రిపోర్టులతో కలిపి ఓ నివేదికను తయారుచేస్తున్నారు.

నవంబర్‌ 27 దిశ కిడ్నాప్, లైంగికదాడి, హత్య, దహనం నుంచి డిసెంబర్‌ 6న ఎన్‌కౌంటర్‌ వరకు జరిగిన అన్ని విషయాలపై పక్కాగా నివేదిక రూపొందిస్తున్నారు. సోమవారం సాయంత్రానికి ఎన్‌హెచ్‌ఆర్సీ బృందానికి నివేదిక ఇచ్చే పనిలో తలమునకలయ్యారు. ఆదివారం ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం ఎన్‌కౌంటర్‌లో గాయపడి గచ్చిబౌలిలోని కేర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పోలీసులను విచారించింది. ఇక నేడు లేదా రేపు మిగిలిన పోలీసులనూ విచారిస్తారని సమాచారం.  

గుంతల పూడ్చివేత.. 


ఎన్‌కౌంటర్‌ మృతుల అంత్యక్రియల కోసం జక్లేర్, గుడిగండ్ల గ్రామాల్లో తవ్విన గుంతల్లో ఆదివారం టెంకాయలు వేసి పూడ్చేశారు. మృతదేహాలు వచ్చిన తర్వాత వాటిలో ఉన్న మట్టిని తొలగించి అంత్యక్రియలు చేయనున్నట్లు గ్రామస్తులు తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement