ఫిర్యాదు చేసి, సాక్ష్యం చెప్పిన కుమారులు
నేరస్తుడికి యూవజ్జీవ శిక్ష విధించిన కోర్టు
నాలుగేళ్ల క్రితం పందికుంటలో జరిగిన ఘటన
వరంగల్ లీగల్ : కళ్లెదురుగా.. కోర్టు బోనులో కన్నతండ్రి. మరో బోనులో అతడి కుమారులు. వారు ఇచ్చే వాంగ్మూలమే న్యాయమూర్తి తీర్పునకు కీలకం. తమ తల్లిని అతికిరాతకంగా చంపిన తండ్రిని ఆ కుమారులు క్షమించలేదు. అమ్మను నాన్నే చంపాడని చెప్పారు. దీంతో సాక్ష్యాధారాలన్ని పరిశీలించిన ఎనిమిదో అదనపు జిల్లా కోర్టు ఇన్‌చార్జ్ జడ్జి ఎన్.సాల్మన్‌రాజు ఆ నేరస్తుడికి యూవజ్జీవ శిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. ములుగు మండలం పందికుంట గ్రామానికి చెందిన జన్ను సూదయ్య, సరోజన దంపతులకు కుమారులు దేవేందర్(కూలీ), మహేందర్(విద్యార్థి) ఉన్నారు. సూదయ్య ఏటూరునాగారానికి చెందిన మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇదే విషయమై భార్య, పిల్లలు నిలదీయడంతో సరోజనకే ఇతరులతో వివాహేతర సంబంధాలు ఉన్నాయని వేధించసాగాడు. ఈ క్రమంలో ఆగస్టు 11, 2010న పెద్ద కుమారుడు కూలీకి వెళ్లగా, చిన్న కుమారుడు కాలేజీకి వెళ్లాడు. ఇంట్లో సూదయ్య, సరోజన దంపతులే ఉన్నారు. అదే రోజు మధ్యాహ్నం పొలం వద్దకు వెళదామని చెప్పి నమ్మించి సూదయ్య భార్యను వెంట తీసుకెళ్లాడు. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని విపరీతంగా కొట్టాడు.
మెడ చుట్టూ కమిలిపోయి చెవువెంట రక్తం కారుతూ సృ్పహ లేకుండా సరోజన పడిపోయి ఉంది. చిన్నకుమారుడికి గ్రామస్తుల ద్వారా విషయం తెలియడంతో పొలం వద్ద గాయాలతో ఉన్న తల్లిని ఇంటికి తీసుకొస్తుండగా మార్గమధ్యలో చనిపోయింది. ఆమె చెవులకు ఉన్న బంగారు కమ్మలను(రూ.20వేల విలువ) తమ తండ్రి తీసుకెళ్లాడని నిర్ధారించుకున్న మహేందర్, దేవేందర్‌కు పోలీసులకు ఫిర్యాదు చేయగా హత్యా నేరం కింద కేసు నమోదు చేశారు. ఇద్దరు కుమారులతోపాటు 12 మంది సాక్షుల వాంగ్మూలాలను విచారించిన కోర్టు నేరస్తుడు ఉద్దేశపూర్వకంగా వేధింపులకు గురి చేసి, హత్య చేశాడని రుజువు కావడంతో సూదయ్యకు ఐపీసీ సెక్షన్ 302 హత్యా నేరం కింద యావజ్జీవ కారాగార శిక్ష, రూ.1000 జరిమానా, ఐపీసీ సెక్షన్ 498(ఏ), భార్యను వేధింపులకు గురిచేసిన నేరం కింద ఒక ఏడాది జైలు శిక్ష, రూ.500 జరిమానా విధిస్తూ జడ్జి సాల్మన్‌రాజు తీర్పు వెల్లడించారు. శిక్షలు ఏకకాలంలో అమలు చేయూలని, గతంలో జైలులో ఉన్న కాలాన్ని శిక్షా కాలం నుంచి మినహాయించాలని తీర్పులో పేర్కొన్నారు. కేసు విచారణను లైజన్ ఆఫీసర్ రఘుపతిరెడ్డి పర్యవేక్షించగా, కానిస్టేబుల్ లింగాల రాంబాబు సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. ప్రాసిక్యూషన్ తరఫున పీపీ పోతరాజు రవి వాదించారు.
అమ్మను చంపింది.. నాన్నే !
Published Sat, Dec 6 2014 3:17 AM | Last Updated on Sat, Sep 2 2017 5:41 PM
Advertisement
Advertisement