Davinder
-
మద్యం..మగువ..వయాగ్రా..ఓ డీఎస్పీ!
శ్రీనగర్ : హిజ్బుల్ ముజహిదీన్ ఉగ్రవాదులతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై పోలీసుల రిమాండ్‌లో ఉన్న జమ్ము కశ్మీర్ డీఎస్పీ దవీందర్ సింగ్ లీలలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. దవీందర్ సింగ్‌ను అరెస్ట్ చేసిన క్రమంలో వారం పాటు ఉత్తర, దక్షిణ కశ్మీర్లో జరిగిన దాడుల్లో లభ్యమైన ఆధారాలు, రికార్డులు, సీజ్ చేసిన మెటీరియల్ ద్వారా సింగ్ నిర్వాకాలు దిగ్భ్రాంతిగొలిపేలా బయటపడ్డాయి. విచారణలో వెల్లడైన అంశాల ఆధారంగా డీఎస్పీ దవీందర్ సింగ్ ఎవరిమాటా వినే రకం కాదని, ఆయన ఏ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి పనిచేయకుండా ఇష్టానుసారం వ్యవహరించేవాడని తెలిసింది. సింగ్ ఫోన్ మెసేజ్‌లు, సాగించిన సంభాషణలను స్కాన్ చేసిన మీదట ఆయన భిన్నమైన లైఫ్‌స్టైల్‌ను కలిగి ఉన్నట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. నిత్యం మద్యం సేవించడంతో పాటు దాదాపు పన్నెండు మంది మహిళలతో ఆయనకు సంబంధాలున్నట్టు ఎన్ఐఏ వర్గాలు చెబుతున్నాయి. మహిళలతో ఎఫైర్లు నడపటంపై సింగ్ విచ్చలవిడిగా ఖర్చు చేస్తారని లైంగిక సంబంధాలకు బానిసగా మారిన ఆయన నిత్యం వయాగ్రాను వాడతారని ఓ ప్రైవేట్ టీవీ చానెల్‌తో ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి. అరెస్ట్ అయిన నాలుగు వారాల తర్వాత దవీందర్ సింగ్ పీలగా, వయసుమీరిన వ్యక్తిగా కనిపిస్తున్నాడని ఆ వర్గాలు తెలిపాయి. తన ఖరీదైన అలవాట్లను కొనసాగించేందుకు ఆయనకు డబ్బు అవసరం విపరీతంగా పెరిగిందని, తన లైఫ్‌స్టైల్‌ను మెయింటెయిన్ చేసేందుకు భారీ మొత్తాలు అవసరమయ్యాయని పేర్కొన్నాయి. ప్లేబాయ్ లైఫ్‌స్టైల్‌తో పాటు శ్రీనగర్ ఇంద్రానగర్‌లో తాను నిర్మించే విలాసవంతమైన భవంతికి నిధుల కొరత ఏర్పడిందని, బంగ్లాదేశ్‌లో వైద్యవిద్యను అభ్యసిస్తున్న ఇద్దరు కుమార్తెలకు ఫీజు చెల్లించాల్సి వచ్చిందని విశ్లేషించాయి. శ్రీనగర్‌లోని ప్రముఖ స్కూల్లో ఆయన కుమారుడు చదువుతున్నాడని, మిలిటెంట్లు, ఆయుధాలతో ఆయన రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడేవరకూ ఖర్చులను బాగానే నిర్వహించారని ఎన్ఐఏ వర్గాలు వెల్లడించాయి. నాలుగు దశాబ్ధాలుగా తాను చేసిన సేవలు ఈ ఆరోపణలతో నీరుగారిపోయాయని విచారణ సందర్భంగా సింగ్ వాపోయారని చెప్పాయి. తాను చేసిన పనులపై ఇప్పుడు ఆయనలో పశ్చాత్తాపం కనిపిస్తోందని, దర్యాప్తులో పలుమార్లు ఆయన కంటనీరు పెట్టుకున్నారని తెలిపాయి. హిజ్బుల్ కమాండర్ నవీద్ బాబు, అతడి ఇద్దరు అనుచరులకు సింగ్ సాయం చేశారని ఇంతకు మినహా దేశ వ్యతిరేక కార్యకలాపాలతో ఆయనకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో ఎన్ఐఏ ఇంకా ఏమీ గుర్తించలేదని ఆ వర్గాలు వెల్లడించాయి. చదవండి : ఉగ్రవాదులకు పోలీసు సాయం.. -
నన్ను మరో జైలుకు పంపండి
న్యూఢిల్లీ: హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఎస్పీ దవీందర్ సింగ్ తనను మరో జైలుకు మార్చాలంటూ.. జమ్మూలోని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) కోర్టును అభ్యర్థించారు. తను గతంలో అరెస్ట్ చేసిన పులువురు ఉగ్రవాదులు కోట్బాల్వాల్ జైలులో ఉన్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో వారితో తనకు ప్రాణహాని ఉందని కోర్టుకు విన్నవించుకున్నారు. తనను కోట్బాల్వాల్ జైలు నుంచి హీరానగర్ జైలుకు పంపించాలని ఎన్ఐఏ న్యాయస్థానాన్ని దవీందర్ అభ్యర్థించారు. కాగా దవీందర్ అభ్యర్థనకు కోర్టు అనుమతిస్తూ ఆ మేరకు ఆదేశాలు జారీ చేసింది. చదవండి: ఉగ్రవాద డీఎస్పీ దవీందర్ సింగ్! ఇక పదిరోజుల పాటు జమ్మూకశ్మీర్ పోలీసుల అదుపులో ఉన్న దవీందర్‌ను.. దర్యాప్తు చేసేందుకు ఎన్ఐఏ 15 రోజులపాటు తమ కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం దవీందర్‌ను రిమాండ్‌కి పంపించింది. కాగా డీఎస్పీ దవీందర్ సింగ్ కరుడుగట్టిన హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది నవీద్ బాబా, అతని అనుచరుడితో కలిసి కారులో ప్రయాణిస్తూ జనవరి 11న పోలీసులకు చిక్కిన విషయం విదితమే. హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులకు తన ఇంట్లో ఆశ్రయించి కల్పించినందుకు పోలీసులు దవీందర్ సింగ్‌ను ఆరెస్ట్ చేశారు. -
ఉగ్ర ఖాకీ!
చుట్టూ ఉన్న వాస్తవాలను గమనిస్తూ, తమ ఊహాశక్తికి పదనుపెట్టి, ఆ వాస్తవాలకు కాల్పనికత జోడిస్తారు సృజనాత్మక రచయితలు. కానీ ఒక్కోసారి వాస్తవం కాల్పనికతను మించిపోతుంది. ఎవరి ఊహలకూ అందనంత దిగ్భ్రాంతికరంగా వుంటుంది. జమ్మూ–కశ్మీర్‌లోని శ్రీనగర్ విమానాశ్రయ భద్రతా వ్యవహారాలు పర్యవేక్షిస్తూ, గత ఆగస్టు 15న రాష్ట్రపతి పురస్కారాన్ని కూడా పొందిన డీఎస్పీ దేవిందర్ సింగ్ కరుడుగట్టిన హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది నవీద్ బాబా, అతని అనుచరుడితో కలిసి కారులో ప్రయాణిస్తూ శుక్రవారం పోలీసులకు చిక్కిన ఉదంతం ఇటువంటిదే. నవీద్ బాబా ఇటీవలికాలంలో ఎందరో అమాయకుల ప్రాణాలు బలిగొన్నాడు. అలాంటివారికి అత్యంత కట్టుదిట్టమైన భద్రత గల ప్రాంతంలోని తన ఇంట్లో ఆశ్రయమివ్వడం ఊహకందదు. పంజాబ్‌లో మిలిటెన్సీ తీవ్రంగా వున్నప్పుడు కూడా ఉగ్రవాదులకు కొందరు పోలీసు అధికారులు సహకరించిన వైనం బట్టబయలైంది. కానీ ఆ ఉదంతాలకు లేని ప్రాముఖ్యత ఇప్పుడు దీనికి రావడానికి ముఖ్యమైన కారణం వుంది. 2001లో పార్లమెంటుపై జరిగిన ఉగ్రవాద దాడిలో అరెస్టయిన నిందితుల్లో ఒకడైన అఫ్జల్ గురు అప్పట్లో తన న్యాయవాది సుశీల్‌కుమార్‌కు రాసిన లేఖలో తొలిసారి దేవిందర్ పేరు ప్రసావించాడు. తనను ఈ రొంపిలోకి లాగింది ఆయనేనని ఆ లేఖలో అఫ్జల్ గురు నేరుగా చెప్పాడు. కానీ అప్పట్లో అతని మొర ఆలకించినవారు లేరు. చివరకు సర్వోన్నత న్యాయస్థానం సైతం అఫ్జల్ గురును దోషిగా నిర్ధారించి ఉరిశిక్ష విధించింది. 2005 ఆగస్టులో అతని ఉరిశిక్షను సుప్రీంకోర్టు ఖరారు చేయగా, 2013 ఫిబ్రవరి 9న అతన్ని ఉరితీశారు. పార్లమెంటుపై ఉగ్రవాద దాడి జరిగాక న్యాయ ప్రక్రియంతా ముగిసి ఉరిశిక్ష ఖరారు కావడానికి నాలుగేళ్ల సమయం పడితే, అతని క్షమాభిక్ష పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవడానికి మన రాజకీయ నాయకత్వానికి దాదాపు ఎనిమిదేళ్ల వ్యవధి కావలసివచ్చింది! దురదృష్టమేమంటే... ఏ దశలోనూ అతను ప్రస్తావించిన దేవిందర్పై వచ్చిన ఆరోపణల్లోని నిజానిజాలేమిటో ఎవరూ పట్టించు కోలేదు. అఫ్జల్ గురు అఫిడవిట్లో దేవిందర్ సింగ్ పేరు ప్రస్తావించినప్పుడు బాధ్యతగల ప్రభుత్వం లోతుగా ఎందుకు దర్యాప్తు చేయించలేదన్నది కీలకమైన ప్రశ్న. ఏ నేరంలోనైనా సంశయానికి తావులేని స్థాయిలో ప్రమేయం ఉన్నదని రుజువైనప్పుడే నిందితుడికి న్యాయస్థానాలు శిక్ష విధి స్తాయి. ఉరిశిక్ష విధించినప్పుడైతే ఈ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటాయి. అఫ్జల్ విషయంలో అది జరగలేదని నిర్ద్వంద్వంగా చెప్పలేం. ఎందుకంటే పార్లమెంటుపై ఉగ్రవాద దాడికి పాల్పడి, భద్రతా దళాల కాల్పుల్లో మరణించిన మహమ్మద్‌ను కశ్మీర్ నుంచి ఢిల్లీకి తీసుకొచ్చిందీ, అతను పాత కారు కొనుక్కోవడానికి సాయపడిందీ అఫ్జలే. అతనితోపాటు తాను కూడా ఆ కారులో ప్రయాణించి ఢిల్లీలోనే వేర్వేరు వ్యక్తులను కలిశామని కూడా అఫ్జల్ అంగీకరించాడు. ఆ పాత కారులోనే ఉగ్రవాదులు పార్లమెంటుకొచ్చి దాడి చేశారు. అందులో పాల్గొన్న అయిదుగురు ఉగ్ర వాదులూ మరణించగా, కారు నంబర్ ఆధారంగా దాన్ని కొన్నదెవరో పోలీసులు తెలుసు కోగలిగారు. పోలీసులు ప్రశ్నించినప్పుడు అదనంగా అఫ్జల్ ఇంకేమి చెప్పాడన్నది అలావుంచితే, ఉరిశిక్ష పడ్డాక అతను దేవిందర్ పేరును ప్రస్తావించి, ఆయన తనను చిత్రహింసలకు గురిచేశాడని, చివరకు మహమ్మద్‌ను పరిచయం చేసి, అతన్ని ఢిల్లీకి తీసుకెళ్లమన్నాడని అఫ్జల్ గురు ఆరోపిం చాడు. అతను మరో ముఖ్య విషయం చెప్పాడు. మహమ్మద్‌ను కశ్మీర్ వాసిగా దేవిందర్ పరిచయం చేసినా, అతని ముఖకవళికలు అలా అనిపించలేదని, అతనికి కశ్మీరీ భాష కూడా రాదని, కానీ విధిలేక ఆ అధికారి చెప్పినట్టల్లా చేశానని తెలిపాడు. అప్పట్లో కశ్మీర్ పోలీసులు ఈ ఆరోపణను కొట్టిపారేశారు. కేసు నుంచి తప్పించుకోవడానికి అఫ్జల్ నాటకమాడుతున్నాడని చెప్పారు. అఫ్జల్ నేర ప్రమేయంపై వారికి నమ్మకం ఏర్పడటాన్ని తప్పుబట్టనవసరం లేదు. కానీ ఒక నిందితుడు అంత వివరంగా దేవిందర్ గురించి చెబుతున్నప్పుడు కాస్తయినా సంశయం కలగొద్దా? ఇది అఫ్జల్ కోసం కాదు...తమలో ఒకడిగా వున్న అధికారిపై తీవ్ర ఆరోపణలు వచ్చినప్పుడు వాటి నిజానిజాలు నిర్ధారించడం అత్యవసరమని అనిపించలేదా? పోనీ ఇలా ఒక అధికారిపై ఆరోపణలు రావడం కశ్మీర్లో మొదటి సారి కావచ్చునేమోగానీ, ఈశాన్య రాష్ట్రాలు, పంజాబ్ వంటిచోట్ల అంత క్రితం బయటపడలేదా? సైన్యంలో పనిచేస్తూ గూఢచర్యానికి పాల్పడినవారిని పట్టుకున్న ఉదం తాలు లేవా? ఏ ఉద్దేశంతో అప్పట్లో దేవిందర్‌సింగ్ పాత్రపై దర్యాప్తు చేయలేదన్నది ఇప్పుడు తేల వలసివుంది. అలా దర్యాప్తు చేసివుంటే, ఎన్నో దిగ్భ్రాంతికర అంశాలు బయటపడేవి. వందల మంది ప్రాణాలు కాపాడటం, ఆస్తుల విధ్వంసాన్ని నివారించడం సాధ్యమయ్యేది. అఫ్జల్ ప్రస్తావించడానికి చాలా ముందే దేవిందర్‌సింగ్ వివాదాస్పద అధికారిగా ముద్ర పడ్డాడు. మిలిటెన్సీని సమర్థవంతంగా అదుపు చేసినందుకు ఆరేళ్ల వ్యవధిలో ఎస్ఐ నుంచి డీఎస్పీ దాకా ఎదిగాడు. కానీ తన పరిధిలో లాకప్ మరణాలు జరగడంతో మళ్లీ వెనక్కు పంపారు. అనంతరకాలంలో చాలా త్వరగానే కోల్పోయినదాన్ని సాధించుకున్నాడు. అఫ్జల్‌ను ప్రశ్నించడం, చిత్రహింసలు పెట్టడం వాస్తవమేనని అప్పట్లో ఒక ఇంటర్వ్యూలో దేవిందర్ అంగీకరించాడు. ఏ ఉగ్రవాద ఘటనైనా స్థానికంగా వుండేవారి తోడ్పాటులేనిదే సాధ్యం కాదు. ఇప్పుడు ఎటూ పార్లమెంటు దాడి కేసులో తిరిగి దర్యాప్తు జరుగుతుంది. ఇన్నేళ్లుగా దేవిందర్ సింగ్ ఎలాంటి ఘోరాలకు ఒడిగట్టాడో తేలుతుంది. కనీసం ఇకముందైనా నేరాల దర్యాప్తునకు, ముఖ్యంగా ఉగ్ర వాద నేరాల దర్యాప్తునకు అనుసరించాల్సిన శాస్త్రీయ విధానాలేమిటో, సూక్ష్మ స్థాయి అంశాలపై సైతం ఎంత తీక్షణమైన దృష్టి సారించాలో, ఎందుకు సారించాలో మన దర్యాప్తు విభాగాలు గ్రహిం చగలిగితే అది దేశ భద్రతకు ఎంతగానో మేలుచేస్తుంది. -
‘డోపీ’ దవిందర్ సింగ్...
న్యూఢిల్లీ: భారత అగ్రశ్రేణి జావెలిన్ త్రోయర్ దవిందర్ సింగ్ కంగ్ డోపింగ్ టెస్టులో పట్టుబడ్డాడు. గత నవంబర్‌లో అతని నుంచి అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ (ఏఐయూ) సేకరించిన రక్త, మూత్ర నమూనాలను పరిశీలించగా దవిందర్ నిషిద్ధ ఉత్ప్రేరకం తీసుకున్నట్లు తేలింది. దీంతో భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) వెంటనే అతన్ని పాటియాలలో జరిగిన ఇండియన్ గ్రాండ్‌ప్రి–1 పోటీల నుంచి తప్పించింది. తక్షణమే శిక్షణ కేంద్రం నుంచి నిష్క్రమించాలని ఆదేశించింది. ఇప్పటికైతే తాత్కాలిక నిషేధం విధించినప్పటికీ ‘బి’ శాంపిల్‌లోనూ దోషిగా తేలితే అతనిపై నాలుగేళ్ల నిషేధం పడనుంది. 29 ఏళ్ల దవిందర్ గతేడాది లండన్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఫైనల్ రౌండ్‌కు అర్హత సాధించి ఈ ఘనత వహించిన తొలి భారత అథ్లెట్‌గా గుర్తింపు పొందాడు. తాజాగా ఏఐయూ పరీక్షల్లో దొరికిన తొలి భారత డోపీగానూ నిలిచాడు. క్రీడారంగాన్ని కుదిపేసిన రష్యా వ్యవస్థీకృత డోపింగ్ ఉదంతంతో అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య ఏఐయూను ఏర్పాటు చేసింది. -
అమ్మను చంపింది.. నాన్నే !
ఫిర్యాదు చేసి, సాక్ష్యం చెప్పిన కుమారులు నేరస్తుడికి యూవజ్జీవ శిక్ష విధించిన కోర్టు నాలుగేళ్ల క్రితం పందికుంటలో జరిగిన ఘటన వరంగల్ లీగల్ : కళ్లెదురుగా.. కోర్టు బోనులో కన్నతండ్రి. మరో బోనులో అతడి కుమారులు. వారు ఇచ్చే వాంగ్మూలమే న్యాయమూర్తి తీర్పునకు కీలకం. తమ తల్లిని అతికిరాతకంగా చంపిన తండ్రిని ఆ కుమారులు క్షమించలేదు. అమ్మను నాన్నే చంపాడని చెప్పారు. దీంతో సాక్ష్యాధారాలన్ని పరిశీలించిన ఎనిమిదో అదనపు జిల్లా కోర్టు ఇన్చార్జ్ జడ్జి ఎన్.సాల్మన్‌రాజు ఆ నేరస్తుడికి యూవజ్జీవ శిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. ములుగు మండలం పందికుంట గ్రామానికి చెందిన జన్ను సూదయ్య, సరోజన దంపతులకు కుమారులు దేవేందర్(కూలీ), మహేందర్(విద్యార్థి) ఉన్నారు. సూదయ్య ఏటూరునాగారానికి చెందిన మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇదే విషయమై భార్య, పిల్లలు నిలదీయడంతో సరోజనకే ఇతరులతో వివాహేతర సంబంధాలు ఉన్నాయని వేధించసాగాడు. ఈ క్రమంలో ఆగస్టు 11, 2010న పెద్ద కుమారుడు కూలీకి వెళ్లగా, చిన్న కుమారుడు కాలేజీకి వెళ్లాడు. ఇంట్లో సూదయ్య, సరోజన దంపతులే ఉన్నారు. అదే రోజు మధ్యాహ్నం పొలం వద్దకు వెళదామని చెప్పి నమ్మించి సూదయ్య భార్యను వెంట తీసుకెళ్లాడు. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని విపరీతంగా కొట్టాడు. మెడ చుట్టూ కమిలిపోయి చెవువెంట రక్తం కారుతూ సృ్పహ లేకుండా సరోజన పడిపోయి ఉంది. చిన్నకుమారుడికి గ్రామస్తుల ద్వారా విషయం తెలియడంతో పొలం వద్ద గాయాలతో ఉన్న తల్లిని ఇంటికి తీసుకొస్తుండగా మార్గమధ్యలో చనిపోయింది. ఆమె చెవులకు ఉన్న బంగారు కమ్మలను(రూ.20వేల విలువ) తమ తండ్రి తీసుకెళ్లాడని నిర్ధారించుకున్న మహేందర్, దేవేందర్‌కు పోలీసులకు ఫిర్యాదు చేయగా హత్యా నేరం కింద కేసు నమోదు చేశారు. ఇద్దరు కుమారులతోపాటు 12 మంది సాక్షుల వాంగ్మూలాలను విచారించిన కోర్టు నేరస్తుడు ఉద్దేశపూర్వకంగా వేధింపులకు గురి చేసి, హత్య చేశాడని రుజువు కావడంతో సూదయ్యకు ఐపీసీ సెక్షన్ 302 హత్యా నేరం కింద యావజ్జీవ కారాగార శిక్ష, రూ.1000 జరిమానా, ఐపీసీ సెక్షన్ 498(ఏ), భార్యను వేధింపులకు గురిచేసిన నేరం కింద ఒక ఏడాది జైలు శిక్ష, రూ.500 జరిమానా విధిస్తూ జడ్జి సాల్మన్‌రాజు తీర్పు వెల్లడించారు. శిక్షలు ఏకకాలంలో అమలు చేయూలని, గతంలో జైలులో ఉన్న కాలాన్ని శిక్షా కాలం నుంచి మినహాయించాలని తీర్పులో పేర్కొన్నారు. కేసు విచారణను లైజన్ ఆఫీసర్ రఘుపతిరెడ్డి పర్యవేక్షించగా, కానిస్టేబుల్ లింగాల రాంబాబు సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. ప్రాసిక్యూషన్ తరఫున పీపీ పోతరాజు రవి వాదించారు.