
దవిందర్ సింగ్ కంగ్
న్యూఢిల్లీ: భారత అగ్రశ్రేణి జావెలిన్ త్రోయర్ దవిందర్ సింగ్ కంగ్ డోపింగ్ టెస్టులో పట్టుబడ్డాడు. గత నవంబర్‌లో అతని నుంచి అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ (ఏఐయూ) సేకరించిన రక్త, మూత్ర నమూనాలను పరిశీలించగా దవిందర్ నిషిద్ధ ఉత్ప్రేరకం తీసుకున్నట్లు తేలింది. దీంతో భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్‌ఐ) వెంటనే అతన్ని పాటియాలలో జరిగిన ఇండియన్ గ్రాండ్‌ప్రి–1 పోటీల నుంచి తప్పించింది. తక్షణమే శిక్షణ కేంద్రం నుంచి నిష్క్రమించాలని ఆదేశించింది.
ఇప్పటికైతే తాత్కాలిక నిషేధం విధించినప్పటికీ ‘బి’ శాంపిల్‌లోనూ దోషిగా తేలితే అతనిపై నాలుగేళ్ల నిషేధం పడనుంది. 29 ఏళ్ల దవిందర్ గతేడాది లండన్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఫైనల్ రౌండ్‌కు అర్హత సాధించి ఈ ఘనత వహించిన తొలి భారత అథ్లెట్‌గా గుర్తింపు పొందాడు. తాజాగా ఏఐయూ పరీక్షల్లో దొరికిన తొలి భారత డోపీగానూ నిలిచాడు. క్రీడారంగాన్ని కుదిపేసిన రష్యా వ్యవస్థీకృత డోపింగ్ ఉదంతంతో అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య ఏఐయూను ఏర్పాటు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment