హిల్లరీ క్లింటన్‌కు చిక్కులు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తలపడుతున్న డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. విదేశాంగ మంత్రిగా ఉన్నపుడు అధికార విధులకోసం ప్రైవేటు ఈ-మెయిల్‌ను ఎందుకు వాడారో చెప్పాలంటూ ఓ వాచ్‌డాగ్ సంధించిన ప్రశ్నలకు రాతపూర్వకంగా సమాధానం తెలపాలని హిల్లరీ క్లింటన్‌ను అమెరికా ఫెడరల్ జడ్జి ఆదేశించారు. హిల్లరీకి వ్యతిరేకంగా జ్యుడీషియల్ వాచ్ అనే గ్రూపు దాఖలు చేసిన ఓ దావా నేపథ్యంలో యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి ఎమ్మెట్ జి సులివాన్ ఈ ఆదేశాలను జారీ చేశారు.
ఈ వ్యవహారంలో హిల్లరీని అధికార ప్రమాణాల కింద, వ్యక్తిగతంగా ప్రశ్నించేందుకు అనుమతివ్వాలన్న జ్యుడీషియల్ వాచ్ వినతిని కోర్టు తోసిపుచ్చింది. అయితే ఇందుకు సంబంధించిన మిగిలిన పత్రాలన్నింటినీ సెప్టెంబర్ 30లోగా జ్యుడీషియల్ వాచ్‌కు అందజేయాలని విదేశాంగశాఖను ఆదేశించింది.
కాగా రాతపూర్వకంగా ప్రశ్నలను అక్టోబర్ 14లోగా హిల్లరీకి జ్యుడీషియల్ వాచ్ సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. దీనిపై సమాధానమిచ్చేందుకు హిల్లరీ క్లింటన్‌కు కోర్టు 30 రోజుల గడువిచ్చింది. కోర్టు ఆదేశాల పట్ల జ్యుడీషియల్ వాచ్ సంస్థ అధ్యక్షుడు టామ్ ఫిట్టొన్ హర్షం వెలిబుచ్చారు. చట్టానికి హిల్లరీ క్లింటన్ అతీతులు కాదని ఇది నిరూపించిందన్నారు.