ఆ ఇద్దరు ఎవరు? | Who are the two people ? | Sakshi
Sakshi News home page

ఆ ఇద్దరు ఎవరు?

Published Tue, Apr 17 2018 12:22 AM | Last Updated on Tue, Aug 21 2018 6:02 PM

Who are the two people ? - Sakshi

నిప్పు ఉంటేనే నీడలుంటాయి... నిజానికి నిప్పు మండుతుంటేనే నీడలు కూడా ఎగసి పడుతుంటాయి. ఈ కథలో ఆ నిప్పుకు కారణమే రెండు నీడలు. ఆ నీడలు ఏమిటి? నిప్పు ఎందుకు పెట్టాయి?

చనిపోయే ముందు ఇచ్చే వాంగ్మూలం ఏ కేసులో అయినా కీలకమైనది.ఆ అక్కాచెల్లెళ్లు రోజూ సాయంత్రం పూట గార్డెన్‌కు వస్తారు వాకింగ్‌కు. అక్క పేరు అశ్విని. చెల్లి పేరు ఉష. అక్కకు వయసు 27 ఉంటాయి. చెల్లెలికి 22. ఇద్దరూ çకబుర్లు చెప్పుకుంటూ నడుస్తూ ఉంటారు.కాని చాలాసార్లు అక్క పూర్తిగా నడవదు. సిమెంటు బెంచీ మీద కూలబడుతూ ఉంటుంది.‘రా.. అక్కా... నడూ’ అని పిలుస్తుంటుంది చెల్లెలు.అక్క సమాధానం చెప్పదు. ఏదో చిరాగ్గా అయిపోతుంది.‘ఎంత నడిచినా ఏం ప్రయోజనం నువ్వెళ్లు’ అంటుంది.‘నడవాలక్కా... నడిస్తేనే తగ్గుతావ్‌ నువ్వు’ చెల్లెలు బతిమాలుతుంది.అక్క మళ్లీ లేచి నిలబడుతుంది.వాకింగ్‌ చేస్తున్న ఒక ముసలావిడ రోజూ చెల్లెలితో ఒకే మాట అంటుంటుంది– ‘ఏయ్‌ పిల్లా.. నా కొడుకును చేసుకోవే. మంచి అందగాడు’....చెల్లెలికి ఆమెను చూస్తే భయం. అక్క వైపు భయం భయంగా చూస్తుంది.‘అదీ... అక్క పెళ్లయ్యాక’ నసుగుతుంది. ఆమె అక్కను ఎగాదిగా చూసి ‘మీ అక్క పెళ్లా... ఎప్పటికి జరిగేను’ అని వెళ్లిపోతుంది.అక్క కళ్లల్లో ఆ క్షణంలో నీళ్లు చిమ్ముతాయి. చెల్లెలు ఊరడింపుగా అంటుంది–‘అక్కా... అలా బాధ పడకు. ఏదో ఒక అబ్బాయికి నువ్వు నచ్చుతావు. అలాంటివాడు వస్తాడు.

అసలు నువ్వు  పట్టించుకోవుగాని వాకింగ్‌లో నిన్ను గమనించేవాళ్లు ఎంతమంది ఉంటారో తెలుసా?’‘నీ ముఖం నన్నెవరు చూస్తారే?’‘అయ్యో... నీకేం తక్కువక్కా... సూపర్‌గా ఉంటావు’చెల్లెలు నవ్వించే ప్రయత్నం చేసింది.అక్క ఆ నవ్వులో నవ్వు కలుపుతూ నిస్పృహగా నవ్వింది.2017  డిసెంబర్‌ నెల 6:30. విజయనగరం వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫోన్‌ అదే పనిగా రింగ్‌ అవుతోంది. ఎస్‌.ఐ ఫోన్‌ ఎత్తాడు.‘సార్‌... గార్డెన్‌లో అమ్మాయి చావుబ తుకుల్లో ఉంది. ఎవరో తగులబెట్టారు’.. వాచ్‌మెన్‌ వగరుస్తూ చెబుతున్నాడు.వెంటనే పోలీసులు హడావిడిగా సంఘటనా స్థలానికి బయల్దేరారు. పోలీసు జీప్‌తో పాటు 108 వెహికల్‌ కూడా క్షణం తేడాతో వచ్చి ఆగాయి. చుట్టూ జనం. మంటల్లో కాలి, కొనఊపిరితో పడి ఉన్న యువతి. ఒకమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి గుండెలు బాదుకుంది.‘అక్కా.. అక్కా’ క్షణం కూడా ఆలస్యం చేయకుండా బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు.బర్నింగ్‌ వార్డ్‌లో ఎక్కువ సేపు కూర్చోవడం కష్టంగా ఉంటుంది. అదో రకమైన కమురు వాసన నిండి ఉంటుంది. చావుబతుకుల్లో ఉన్న వారి హాహాకారులు వినడం చాలా కష్టం. జిల్లా ఎస్పీ, మెజిస్ట్రేట్‌ స్టేట్‌మెంట్‌ రికార్డు చేయడానికి ముక్కులకు కర్చీఫ్‌ కట్టుకుని కూర్చున్నారు.‘దాహం.. దాహం’ అందా అమ్మాయి.‘నీళ్లు తర్వాత ఇస్తారు... ముందు ఏం జరిగిందో చెప్పమ్మా’అతి కష్టం మీద చెప్పడం మొదలుపెట్టింది.‘నా పేరు అశ్విని. సాయం త్రం ఐదు గంటల సమయంలో ఊరి చివరన ఉన్న గార్డెన్‌కి రోజులాగే వాకింగ్‌కి వెళ్లాను. చెల్లెలు పనిఉండి రాలేదు. సాయంత్రం ఆరున్నర వరకు అక్కడే ఉన్నాను. అకస్మాత్తుగా ఇద్దరు వ్యక్తులు నా ముందుకొచ్చారు. వాళ్లను చూసి భయపడ్డాను. పారిపోవడానికి ప్రయత్నించాను. కానీ, వారిద్దరిలో ఒకరు నన్ను పట్టుకున్నారు. వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ నా మీద పోసి, నిప్పంటించి పరారయ్యారు...’ చెబుతూనే అపస్మారక స్థితిలోకి వెళ్లింది అశ్వని. 

పోలీస్‌ యంత్రాంగం ఆలోచనలో పడిపోయింది.సంఘటనా స్ధలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఎటువంటి ఆధారాలు  దొరకలేదు.అశ్వని రాత్రి 12 గంటలకు చనిపోయింది.పోలీసులకు తెల్లవార్లూ నిద్రల్లేవు. ఆమె బతికి ఉంటే ఇంకొన్ని వివరాలు తెలిసేవి. ఇప్పుడు ఆమె ఇచ్చిన వాంగ్మూలమే ముఖ్యమైన క్లూగా మిగిలింది. చనిపోయే వ్యక్తి ఇచ్చే వాంగ్మూలం చాలా ముఖ్యమైనది. దాని ఆధారంగా చూస్తే ఆమె మీద దాడి చేసిన వారు ఎవరు? అశ్వని తల్లీ, తండ్రి, చెల్లెలు ఉషతో మాట్లాడారు పోలీసులు.‘రోజులాగే గార్డెన్‌కి వాకింగ్‌కని వెళ్లింది సార్‌. ఇలా ఎలా జరిగిందో తెలియడం లేదు’ అంది దుఃఖాన్ని దిగమింగుకుంటూ తల్లి.

గార్డెన్‌ పరిసర ప్రాంతాలను మరోసారి క్షుణ్ణంగా పరిశీలించారు పోలీసులు. వాకబు చేస్తే ఇద్దరు యువకులు ఆ సమయంలో గార్డెన్‌ నుంచి బయటకు వెళ్లారని స్థానికులు చెప్పారు. ఆ ప్రాంతంలో సీసీ కెమెరా లేకపోవడంతో వాళ్లెవరో గుర్తించలేకపోయారు. కాని ఒక రిటైర్డ్‌ టీచర్‌ మంచి ఇన్ఫర్మేషన్‌ ఇచ్చాడు.‘సార్‌... వాళ్లు నాకు తెలుసు. ఇక్కడకు దగ్గరలోనే ఉంటారు’ అని చెప్పాడు.పోలీసులు నిమిషం ఆలస్యం చేయలేదు. రవి, శ్రీకాంత్‌ అనే ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.‘సార్‌.. మాకేమీ తెలియదు. డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాం. బోరు కొడుతుందని రోజూ సాయంత్రం వాకింగ్‌కి వస్తూ ఉంటాం’ అన్నారు వాళ్లు.వయసులో ఉన్న కుర్రవాళ్లు. వీళ్లు చేస్తే అత్యాచార యత్నం చేయాలి. హత్య ఎందుకు చేశారు. వాళ్లను గట్టిగా మళ్లీ విచారించారు.‘ఎన్నిసార్లు విచారించినా అదే సమాధానం చెప్తున్నారంటే వీళ్లు ట్రైన్డ్‌ నేరస్తుల్లా ఉన్నారు’ అనుకున్నారు పోలీసులు. వాళ్ల నోరు విప్పించే ఆధారాల కోసం మళ్లీ అన్వేషణ సాగించారు.

ఈసారి రెండు మూడు బృందాలు రంగంలోకి దిగాయి. పగలూ రాత్రీ గార్డెన్‌ని జల్లెడపట్టాయి. దొరికిన ఆధారాలు ఇలా ఉన్నాయి.∙సంఘటన జరిగిన ప్రాంతంలో నేలంతా పచ్చగా ఉంది. ఒక్క మొక్క కూడా కాలలేదు. ఆమె శరీరం 80 శాతానికి పైగా కాలింది కనుక దుండగులతో పెనుగులాట జరిగి ఉంటే మొక్కలు కాలడమో గడ్డి డిస్ట్రబ్‌ కావడమో జరగాలి. అలాంటి దాఖలాలు లేవు.  ∙సంఘటన జరిగిన స్ధలం వద్ద రెగ్యులర్‌గా చాలా మంది వస్తుంటారు. దాడి జరిగి అరిచి ఉంటే ఎవరికో ఒకరికి వినిపించి ఉండాలి.∙ఎవరైనా పెట్రోల్‌ పోస్తే రెండువైపులా కాలిపోవాలి. కానీ ఇక్కడ ఒకవైపే కాలింది.∙అక్కడి తుప్పల్లో  ఓ పెట్రోల్‌ బాటిల్‌ దొరికింది. అక్కడ కొన్ని మొక్కలు కాలినట్టుగా ఉన్నాయి. విడిచిన జత చెప్పులు దొరికాయి. అవి ఆ అమ్మాయివే. పెనుగులాట జరిగి ఉంటే చెప్పులు విడిగా అలా విడిచి పెట్టినట్టుగా ఉండవు.ఈ క్లూస్‌తో పోలీసులు ఈసారి ఆ యువతి ఇంటి నుంచి గార్డెన్‌  వరకూ గల ఆరు సీసీ పుటేజ్‌లను పరిశీలించారు. 5 గంటల ప్రాంతంలో ఓ యువతి ఆ ప్రాంతం గుండా వెళ్లి,  పెట్రోల్‌ బంక్‌ వద్ద ఆగి, బాటిల్‌లో పెట్రోల్‌ పోయించుకున్నట్టు కనిపించింది. గార్డెన్‌లో దొరికిన బాటిల్, యువతి చేతిలో ఉన్న బాటిల్‌ మ్యాచ్‌ అయ్యాయి. బాటిల్‌పై ఉన్న వేలిముద్రలను సరిచూడగా అశ్వని వేలిముద్రలతో మ్యాచ్‌ అయ్యాయి. ఆ బాటిల్‌ ఇంట్లోదే అని తల్లి నిర్థారించింది.

అంటే?ఇది హత్య కాదు. ఆత్మహత్య అన్నమాట. సాధారణంగా మరణ వాంగ్మూలంలో ఎవరూ అబద్ధం చెప్పరు. ఈ అమ్మాయి చెప్పింది. ఎందుకు? పోలీసులు ఆమె సెల్‌ఫోన్‌ గమనించారు. షాక్‌ అయ్యారు. అందులో కేవలం రెండు నంబర్లే ఉన్నాయి. తల్లిదీ తండ్రిది. ఇలా రెండు నంబర్లు మాత్రమే పెట్టుకుందంటే స్నేహితులు ఎవరూ లేనంత ఒంటరిగా ఉందన్న మాట. తల్లిదండ్రులను పిలిపించారు.‘సార్‌! అశ్వని లావుగా ఉండేది. పెళ్లి సంబంధాలు కుదరడం లేదు. తను ఇంట్లో పెద్ద కూతురు. తన పెళ్లి అయితేనే చెల్లెలి పెళ్లి అవుతుంది. పెళ్లి అవడం లేదని కొన్నాళ్లుగా బాధపడుతోంది. ఎవరితోనూ పెద్దగా మాట్లాడదు. స్నేహితులు కూడా తనకెవరూ లేరు.  తనకిక పెళ్లికాదనే ఉద్దేశంతో ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్య చేసుకుందంటే మా కుటుంబానికి ఏ ఇబ్బందులు వస్తాయో అనుకుని ఉంటుంది. అందుకే  అలా అబద్ధం చెప్పి ఉంటుంది’ అని తండ్రి కన్నీళ్లతో అసలు సంగతి చెప్పారు.అశ్విని హంతకులు ఎవరో తెలిసింది. ఆత్మన్యూనత. డిప్రెషన్‌.కాని అప్రమత్తంగా లేకుంటే నిర్దోషులైన ఇద్దరు అమాయకులు ఆ వాంగ్మూలానికి బలయ్యేవారు.గౌరవం మరణాన్ని కూడా ఎంతలా శాసించిందీ! 
– గౌరీశంకర్, సాక్షి ప్రతినిధి, విజయనగరం.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement