కడప జన్మభూమిగా.. శ్రీకాకుళం కర్మభూమిగా భావిస్తానని.. తెలుగు ఆడపడచుగా తెలుగు క్రీడాకారులకు తనవంతు సహకారం అందిస్తానని.. ప్రభుత్వం ప్రోత్సహిస్తే ప్రపంచస్థాయి పతకాలు సాధించి చూపుతానంటున్నారు పద్మశ్రీ కరణం మల్లేశ్వరి.. ఒలింపిక్ పోటీల్లో భారతదేశానికి వెయిట్‌లిఫ్టింగ్‌లో తొలి పతకం తీసుకువచ్చిన వెయిట్‌లిఫ్టర్ కరణం మల్లేశ్వరి కడప నగరానికి విచ్చేశారు.. ఈమెను సాక్షి పలుకరించగా పలు విషయాలు వెల్లడించారు.
కడప స్పోర్ట్స్:అమ్మాయిలకు ఆటలేంటి... అన్న వారే అదరహో.. అన్నారు.. సన్నగా ఉన్నావు బరువులెత్తే వెయిట్‌లిఫ్టింగ్‌కు పనికిరావు అన్న వారే.. భారతదేశపు.. పరువు నీవేనన్నారు.. తర్వాత కాలంలో.. ఎన్నో రికార్డులు బద్ధలయ్యాయి.. అర్జున, రాజీవ్ ఖేల్‌రత్న, పద్మశ్రీ వంటి మరెన్నో పురస్కారాలు ఈమెను వరించాయి.. తన మూలాలు ఇక్కడే ఉన్నాయని.. తెలుగు క్రీడాకారులకు తనవంతు సహకారం అందిస్తానని అంటోంది క్రీడా పద్మం కరణం మల్లేశ్వరి. గురువారం కడప నగరానికి విచ్చేసిన ఆమె సాక్షితో పలు విషయాలను పంచుకుంది.
సాక్షి :చరిత్రలో నిలిచేలా తొలి ఒలింపిక్ పతకం సాధించిన మహిళా క్రీడాకారిణిగా మీ స్పందన..?
మల్లేశ్వరి : క్రీడలు అంటే తక్కువగా తెలిసిన సమయంలో.. ఒలంపిక్స్ అంటే ఏందో సరిగా తెలియని సమయంలో ఎన్నో ఆటుపోట్ల మధ్య క్రీడాసాధన సాగింది. దేశానికి పతకం సాధించిన తొలి మహిళగా చరిత్రలో నిలిచిపోవడం సంతోషంగా గర్వంగా ఉంది. అయితే అప్పటితో పోల్చితే నేడు మౌలిక సదుపాయాలు పెరిగాయి.
సాక్షి :ప్రభుత్వం నుంచి లభించిన ప్రోత్సాహం..?
మల్లేశ్వరి :సిడ్నీ ఒలింపిక్స్‌లో కాంస్యపతకం సాధించడంతో ప్రభుత్వం రూ.35 లక్షలు నగదు ప్రోత్సాహం అందించారు. హైదరాబాద్‌లో స్థలం కేటాయించారు. అయితే తర్వాత నేను ఏథెన్స్ ఒలింపిక్స్‌పై దృష్టి సారించడంతో స్థలం తీసుకోలేకపోయాను. తర్వాత ప్రయత్నించినప్పటికీ స్థలం లభించలేదు. అప్పట్లో ప్రభుత్వం కనీసం ఉద్యోగం కూడా ఆఫర్ చేయలేదు.
సాక్షి :ఇప్పుడు ప్రభుత్వం ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన వారికి నగదు బహుమతి, గ్రూప్–1 కేడర్ ఉద్యోగాలు ఇస్తోంది కదా.. మీ స్పందన..?
మల్లేశ్వరి : క్రీడలను ప్రోత్సహించేందుకు నగదు బహుమతి, స్థలం, ఉద్యోగం ఇవ్వడం సంతోషకరమే. అయితే ఈ ప్రోత్సాహం అన్ని క్రీడల్లో రాణించే వారికి కూడా ఇవ్వడంతో పాటు అన్ని క్రీడలను సమానంగా చూస్తే బాగుంటుంది.
సాక్షి :ఆంధ్రా ఆడపడుచుగా తెలుగు రాష్ట్రాల్లో అకాడమీ ఏర్పాటు చేసి వెయిట్‌లిఫ్టింగ్‌ను అభివృద్ధి చేసే ఆలోచన ఉందా..?
మల్లేశ్వరి : రాయలసీమలో పుట్టి.. ఉత్తరాంధ్రలో పెరిగిన నాకు ఇక్కడి క్రీడాకారులకు ఎంతో చేయాలని ఉంది. ప్రభుత్వం తగినంత స్థలం కేటా యించి, మౌలిక సదుపాయాలు కల్పించి ప్రోత్సహిస్తే అకాడమీని ఏర్పాటు చేసి సేవలందిస్తా.
సాక్షి :రాజధాని అమరావతిలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేస్తామంటున్నారు కదా.. అక్కడ ఏమైనా అకాడమీ ఏర్పాటు చేసే ఆలోచన ఉందా..?
మల్లేశ్వరి : తొలి పతకం సాధించిన మహిళా వెయిట్ లిఫ్టర్‌ను నేను. అయితే ప్రభుత్వాలు ఈ విషయంలో మమ్మల్ని పరిగణలోకి తీసుకోవడం లేదు. ప్రభుత్వం స్పందించి మా సహకారం కోరితే తప్పకుండా అందిస్తాం. 20 సంవత్సరాల అనుభవాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నాం.
సాక్షి : భవిష్యత్తులో భారత్ నుంచి ఒలింపిక్ మెడల్స్ మరిన్ని ఆశించవచ్చా..?
మల్లేశ్వరి : 130 కోట్లు ఉన్న భారతదేశంలో మనకు లభిస్తున్న పతకాల సంఖ్య తక్కువే. దీర్ఘకాలిక వ్యూహంతో పాటు చక్కటి ప్రోత్సాహం ఇస్తే అసాధ్యమేమీ కాదు. రానున్న కాలంలో మంచి ఫలితాలు, పతకాలు వస్తాయనుకుంటున్నా.
సాక్షి : ఒలింపిక్స్‌లో పతకాలు సాధించేందుకు ప్రభుత్వాలు ఇటీవల తీసుకున్న చర్యలు ఎటువంటి ఫలితాలు ఇస్తుందనుకుంటున్నారు..?
మల్లేశ్వరి :కేంద్ర క్రీడల మంత్రి ఒలింపిక్ మెడలిస్టు కావడం సంతోషం. ఇటీవల ఖేలోఇండియాతో పాటు పలు టాలెంట్‌హంట్ స్కీంలు చక్కగానే ఉన్నాయి. ఇందులో సైతం క్రీడల్లో రాణించిన వారినే సభ్యులుగా తీసుకుంటున్నారు. భవిష్యత్తులో మంచి ఫలితాలు వస్తాయని భావిస్తున్నా.
సాక్షి : క్రీడలు ముఖ్యమా.. చదువు ముఖ్యమా.. అన్న డైలమా చాలా మందిలో ఉంది.. దేనికి ప్రాధాన్యత ఇవ్వాలంటారు..?
మల్లేశ్వరి :ఖచ్చితంగా చదువుకు ప్రాధాన్యత ఉంది. 8 నుంచి 25 సంవత్సరాల దాకా చదువుకు, క్రీడల సాధనకు ఎంతో విలువైన సమయం. వారి శారీరక, మానసిక స్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి. క్రీడలతో పాటు చదువుకు కూడా ప్రాధాన్యత ఇస్తే కెరీర్ పరంగా ఉపయోగపడుతుంది.
సాక్షి : క్రీడల అభివృద్ధికి మీరిచ్చే సూచన..?
మల్లేశ్వరి :ప్రభుత్వం క్రీడలను అభివృద్ధి చేసే క్రమంలో రాష్ట్రం నుంచి అంతర్జాతీయ స్థాయిలో రాణించిన, పతకాలు సాధించిన వారి సలహాలు తీసుకుంటే బాగుంటుంది. రాజధానిలో నిర్మిస్తున్న క్రీడానగరంలో ఏర్పాటు చేసే అంశాలపై కూడా చర్చిస్తే ఉపయోగకరంగా ఉంటుంది.
సాక్షి :మీ పిల్లలు మీ వారసులుగా క్రీడల్లోకి తీసుకువస్తున్నారా..?
మల్లేశ్వరి : మాకు ఇద్దరు పిల్లలు. పెద్ద కుమారుడు (10వ తరగతి) రైఫిల్‌షూటింగ్‌లోను, చిన్నబాబు (6వ తరగతి) ఫిట్‌నెస్ సాధించేందుకు జిమ్నాస్టిక్స్ సాధన చేస్తున్నారు. వారికి ఇష్టమైన రంగంలో రాణించేలా స్వేచ్చనిచ్చాం.
సాక్షి : క్రీడాకారులకు మీరిచ్చే సందేశం..?
మల్లేశ్వరి : మనదేశంలో యువశక్తి చాలా ఉంది. లక్ష్యాన్ని నిర్ధేశించుకుని దానిని సాధించేందుకు కష్టపడాలి. క్రమశిక్షణ, అంకితభావం, పట్టుదల, ఏకాగ్రతో సాధన చేస్తే ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి. ముఖ్యంగా మహిళా క్రీడాకారిణులు తాము అబలం.. కాదు.. ఆదిశక్తి అంశమన్న విషయం గుర్తుంచుకోవాలి. దేశానికి పతకం తీసుకువచ్చిన వారిలో అమ్మాయిలే అగ్రస్థానంలో ఉన్నారన్న విషయం గుర్తుంచుకోవాలి.
సాక్షి :మీ అకాడమీ నుంచి ఒలింపిక్స్‌లో పతకాలు ఆశించవచ్చా..?
మల్లేశ్వరి :హర్యానాలో నిర్వహిస్తున్న అకాడమీ నుంచి రానున్న కాలంలో మంచి ఫలితాలు వస్తాయనుకుంటున్నా. రానున్న 2024, 2028 ఒలంపిక్స్‌లో పతకాలే ధ్యేయంగా శిక్షణ ఇస్తున్నాం.
సాక్షి :కడపతో మీకున్న అనుబంధం..?
మల్లేశ్వరి :కడప జిల్లా నందలూరు మండలం ఎర్రిపాపయపల్లె మా అమ్మగారి ఊరు. కాబట్టి కడప జిల్లాను నా జన్మభూమిగా భావిస్తా. నాన్నది చిత్తూరు జిల్లా. శ్రీకాకుళం నేను పెరిగిన ప్రాంతం కాబట్టి అది నా కర్మభూమిగా భావిస్తా.
సాక్షి : మళ్లీ వెయిట్‌లిఫ్టింగ్‌లో ఒలింపిక్ మెడల్ మనదేశం నుంచి ఆశించవచ్చా..?
మల్లేశ్వరి :వాస్తవానికి లైట్ వెయిట్ కేటగిరీలో వెయిట్ లిఫ్టింగ్ క్రీడలో ఒలింపిక్ పతకం సాధించడం కాస్త కష్టపడితే సాధ్యమే. ఖచ్చితంగా పతకం వచ్చే విభాగంలో వెయిట్‌లిఫ్టింగ్ ఒకటి.
Comments
Please login to add a commentAdd a comment