
కామారెడ్డిలో బీడీ కార్మికుల సమస్యలపై నిర్వహించిన ధర్నాలో మాట్లాడుతున్న అనసూయ(ఫైల్)
సాక్షి, కామారెడ్డి: బీడీలు చుట్టిన చేతులు పిడికిలి బిగించాయి. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాలపై పోరాటమే ఆమె జీవితంలో భాగమైంది. పోలీసు కేసులు, అరెస్టులకు వెరవకుండా తన జీవితాన్ని మహిళా, కార్మిక పోరాటాలకే అంకితం చేసింది. పాతికేళ్లుగా ఆమె కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాడుతోంది. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రానికి చెందిన అనసూయ 1991లో శ్రామిక శక్తి బీడీ వర్కర్స్ యూనియన్‌లో చేరింది. అప్పటి నుంచి నేటిదాకా ఉద్యమాలకే అంకితమైంది. మహిళలపై హింసకు వ్యతిరేకంగా ఆమె ఎన్నో పోరాటాలకు నాయకత్వం వహించింది. చింతకుంటలో మహిళలపై అత్యాచారం, శివాయిపల్లిలో మహిళపై సామూహిక అత్యాచారం తదితర సంఘటనలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో అనసూయ చురుకుగా పాల్గొంది.
అంతేగాక బీడీ కార్మికుల సమస్యలపై నిరంతర పోరాటాలు చేస్తూ వస్తోంది. కార్మిక, మహిళా ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్న అనసూయ జనశక్తి నక్సల్ నేత లక్ష్మీరాజం ఉరఫ్ గొడ్డలి రామన్నను వివాహం చేసుకుంది. ఆమెకు ఒక కూతురు వెన్నెల. అనసూయ భర్త రామన్న 2000 సంవత్సరంలో మర్రిపల్లి ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడు. భర్త మరణంతో తోడును కోల్పోయిన అనసూయ కూతురి బాధ్యతను మోస్తూనే తాను ఎంచుకున్న మహిళా, బీడీ కార్మిక ఉద్యమాలను వదిలిపెట్టకుండా ఉద్యమాలకు అంకితమైంది. ప్రస్తుతం అనసూయ కూతురు బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సు చదువుతోంది. కాగా మహిళా, కార్మిక ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్న అనసూయపై అప్పట్లో పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. ఓ సారి వరంగల్ జైలులో పది రోజులు, నిజామాబాద్ జైల్‌లో పన్నెండు రోజులు ఉండాల్సి వచ్చింది.\
అలుపెరుగని పోరు..
మహిళలు, బీడీ కార్మికుల సమస్యలపై అనసూయ అలుపెరుగని పోరాటం చేస్తోంది. పాట, మాటతో మహిళల్ని చైతన్యం చేస్తున్న అనసూయ అలుపెరుగకుండా ఉద్యమాల్లో పాల్గొంటోంది. మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా మహిళల్ని పోగుచేసి ఉద్యమాలు నిర్వహిస్తోంది. తెలంగాణ ఐక్యవేదిక ద్వారా రాష్ట్ర సాధనోద్యమంలోనూ అనసూయ చురుకుగా పాల్గొంది. అలాగే గోదావరి జలాల సాధన కోసం జరిగిన పాదయాత్రలు, ఆందోళన కార్యకమ్రాల్లో ఆమె పాల్గొన్నారు. అరుణోదయ విమలక్కతో కలిసి బహుజన బతుకమ్మ వేడుకల్లోనూ పాల్గొని తన వాణిని వినిపించేది. కాగా మహిళలపై జరిగిన అత్యాచారాలు, అఘాయిత్యాలపై జరిగిన పోరాటాల ఫలితంగా అరెస్టులు, శిక్షలు పడ్డాయి.
బతికున్నన్ని రోజులూ ప్రజలతోనే..
బతికున్నన్ని రోజులు మహిళలు, కార్మికుల సమస్యలపై పోరాటం చేస్తా. ప్రజలతోనే నా జీవితం కొనసాగుతోంది. మహిళలపై ఇప్పటికీ ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి. వాటిని ఎదిరించేందుకు మహిళల్ని చైతన్యం చేస్తూనే ఉంటా. పోరాడితే పోయేదేమి లేదు. సమస్య ఎదురైనపుడు ధైర్యంగా ఎదుర్కోవాలి. ముఖ్యంగా మహిళలకు ఇంటా, బయట అనేకరకాలుగా వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. వాటిని అధిగమించేందుకు సంఘటితం కావాలి. –అనసూయ, మహిళా నాయకురాలు
కామారెడ్డిలో బీడీ కార్మికుల సమస్యలపై నిర్వహించిన ధర్నాలో
మాట్లాడుతున్న అనసూయ(ఫైల్)
Comments
Please login to add a commentAdd a comment