ఓఎల్‌ఎఫ్ ఆసుపత్రిలో వైద్యసేవలందిస్తున్న సిస్టర్ లిల్లీపుష్ప
బద్వేలు: మానవ సేవ.. దేవుని సేవ... అని భావించింది వైద్యురాలు సిస్టర్ లిల్లీపుష్ప. తన కుటుంబంలోని అత్తమ్మ, పెద్దనాన్నలు బాటలో నడుస్తూ పేదలకు వైద్యసేవలందిస్తోంది. గ్రామీణ ప్రాంత పేదలకు ఉచితంగా వైద్యం అందజేస్తూ వారికి అండగా నిలబడుతున్నారు. ఆమె సేవలకు మెచ్చి రాష్ట్ర ప్రభుత్వం గతేడాది క్రిస్మస్ సందర్భంగా విశిష్ట సేవా పురస్కారాన్ని ప్రకటించగా సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అందుకున్నారు. తన సేవాభావంతో పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
సిస్టర్ లిల్లీపుష్ప స్వగ్రామం గుంటూరు జిల్లాలోని నడికుడి. ఆమె తల్లిదండ్రులు మర్రెడ్డి, రెజినా. ఆమె కుటుంబంలోని చాలా మంది క్రైస్త త మతాన్ని ఆచరిస్తూ ప్రజలకు సేవ చేసేవారు. అలానే తన అత్తమ్మ, పెద్దనాన్నలు కూడా పేదలకు సేవ చేసేవారు. వారిని ఆదర్శంగా తీసుకుని తాను కూడా క్రైస్తవ మతానికి అంకితమై సిస్టరుగా మారారు. ఈ దిశగానే పేదలకు విస్తృతంగా సేవలందించాలంటే డాక్టరు కావడమే మార్గమని భావించారు. ఈ కోరికతోనే చదువులో ముందుండేవారు. బెంగళూరులోని సెయింట్ జాన్ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదివారు. అదే కళాశాలలో ఎంఎస్ జనరల్ సర్జన్ కూడా చదివారు. అనంతరం నెల్లూరు సెయింట్ జోసెఫ్స్ ఆసుపత్రిలో 11 ఏళ్లు పని చేశారు. అక్కడ పని చేస్తూనే తన సిబ్బందితో కలిసి గ్రామాలలో వైద్య శిబిరాలు ఉచితంగా నిర్వహించేవారు. పాఠశాలలో విద్యార్థులకు ఉచిత పరీక్షలతో పా టు అవగాహన సదస్సులు కూడా చేపట్టేవారు. అనంతరం 2005లో పోరుమామిళ్లలోని ఓఎల్‌ఎఫ్ ఆసుపత్రిలో వైద్యురాలుగా పని చేస్తున్నారు.
వైద్య శిబిరాలు: ఓఎల్‌ఎఫ్ ఆసుపత్రిలో పని చేస్తూనే వారంలో రెండు రోజులు గ్రామాలలో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. పోరుమామిళ్ల పట్టణ చుట్టుపక్కల వందలాది గ్రామాలలో పేదలు ఉన్నారు. వీరందరికి సరైన వైద్యసేవలు అందడం లేదని సిస్టర్ లిల్లీపుష్ప భావించారు. వీరికి అండగా నిలవాలని భావించారు. ఈ నేపథ్యంలో గ్రామాలలోకి వైద్య పరికరాలు సైతం తీసుకెళ్లి పరీక్షలు నిర్వహిస్తున్నారు. చిన్న పాటి జబ్బులకు అక్కడే వైద్యం చేసి మందులు అందజేస్తున్నారు.
బి.మఠం మండలంతో పాటు నెల్లూరు జిల్లాలోని సీతారామాపురం మండలంలోని పల్లెలు, ప్రకాశం జిల్లాలోని మోటు వరకు ఉన్న గ్రామాలలో శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు వందలాది శిబిరాలతో పాటు వేలాదిమందికి ఉచితంగా వైద్యం అందించారు. ఈమె సేవలకు మెచ్చి పలు అవార్డులు వచ్చాయి. గతేడాది డిసెంబరులో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా రాష్ట్ర ప్రభుత్వ విశిష్ఠ సేవా పురస్కారం అందుకున్నారు.
పేదల సేవకే అంకితం
పేదలకు అండగా నిలిచేందుకే సిస్టర్‌గా మారా. ఇప్పటి వరకు గ్రామాలలో విస్తృత వైద్య సేవలందించా. పోరుమామిళ్లలోని పలు గ్రామాలలో పేదలు సరైన వైద్యం అందక ఇబ్బంది పడుతున్నారు. వారందరికీ అండగా నిలిచేందుకు శిబిరాలు నిర్వహిస్తున్నా. – డాక్టరు సిస్టర్ లిల్లీపుష్ప
Comments
Please login to add a commentAdd a comment