అ‘త్త’మ్మ | Aunt Helps Handicapped Daughter in law | Sakshi
Sakshi News home page

అ‘త్త’మ్మ

Published Thu, Mar 8 2018 9:23 AM | Last Updated on Thu, Mar 8 2018 9:23 AM

Aunt Helps Handicapped Daughter in law - Sakshi

భార్యను తన బైక్‌లో కూర్చోబెడుతున్న భర్త ప్రదీప్‌, పుత్తూరు మున్సిపల్‌ కార్యాలయంలో పనిచేస్తున్న లియో

అమ్మతనం కోసం పరితపించిన దివ్యాంగురాలు ఒకరు. ఆమె కల నెరవేరిందని సంతోష పడే అత్త మరొకరు. వారిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. అత్త అనే పదానికే సరికొత్త అర్థాన్ని తీసుకొచ్చారు. గయ్యాళి పేరును తుడిచేసి.. అ‘త్త’మ్మ అని చాటిచెబుతున్నారు. వారే పుత్తూరుకు చెందిన కోడలు రాజాలియోనా.. అత్త శోభారాణి.     ఆ ఇద్దరూ మహిళా లోకానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.

సాక్షి, తిరుపతి: ‘నా పేరు పల్లం రాజాలియోనా. నేను పుట్టింది శ్రీకాళహస్తిలో. పోలియో కారణంగా రెండు కాళ్లూ చచ్చుబడ్డాయి. అమ్మ కృపావరమ్మ మెడికల్‌ ఫీల్డ్‌లో పనిచేస్తోంది. నాన్న రాజు సినిమా థియేటర్‌లో పనిచేస్తున్నాడు. అమ్మ వృత్తిరీత్యా ఇంటి వద్ద ఉండే అవకాశమే లేదు. కాళ్లు పనిచేయకపోయినా ఆత్మస్తైర్యాన్ని కోల్పోవద్దని చెప్పేది. ఆ సమయంలో అన్నీ నాయనమ్మ వైలెటమ్మే చూసుకునేది. నాకు కాళ్లు లేవని ప్రేమగా ఆదరించేది. ఎనిమిదో తరగతి వరకు శ్రీకాళహస్తిలోనే చదువుకున్నా. నాయనమ్మ ఆరోగ్యం క్షీణించింది. తప్పని పరిస్థితుల్లో నన్ను పుత్తూరులో ఉన్న అమ్మమ్మ పరంజోతమ్మ వద్దకు చేర్చారు. అప్పటి నుంచి అమ్మమ్మే నాకు అన్నీ. తొమ్మిది, పదో తరగతి పుత్తూరులోనే చదువుకున్నా.

వికలాంగురాలిని కావడంతో మైసూరులో జేఎస్‌ఎస్‌ మహా విద్యాపీఠంలో డిప్లొమో, కంప్యూటర్‌ సైన్స్‌ పూర్తిచేశాను. పుత్తూరులో ఉద్యోగం దొరక్క 2005లో చెన్నైకి వెళ్లా. వర్కింగ్‌ హాస్టల్లో ఉంటూ ఎస్‌బీఐ కాల్‌సెంటర్‌లో 2010 వరకు పని చేశా. ఆ సమయంలో ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన పెయింటర్‌ దీపక్‌కుమార్‌ ఆన్‌లైన్‌ ద్వారా పరిచమయ్యారు. అతనికి ఒక కాలు సరిగా పనిచేయదు. తల్లిదండ్రుల సమక్షంలో వివాహం జరిగింది. ఇద్దరం చెన్నైలోనే ఇల్లు అద్దెకు తీసుకుని ఉండేవాళ్లం. కొన్నాళ్లకు భర్తకు కూడా తనతో పాటే ఎస్‌బీఐ కాల్‌సెంటర్‌లో పనిదొరికింది. భర్త నన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నారు’.

ప్రాణాలు పోయినా బిడ్డ కావాలనుకున్నా..
నేను చాలా మొండిదాన్ని. చిన్నప్పటి నుంచి నాకు పట్టుదల ఎక్కువ. నాకు కాళ్లు పనిచేయకపోయినా ఇంట్లో ఎవ్వరూ నన్ను తక్కువ చేసి చూసేవారు కాదు. తన జీవితం ఇంతటితోనే అంతమైపోవాలా? అని ఆలోచించేదాన్ని. అమ్మా అనిపించుకోవాలనే కోరిక బలంగా ఉండేది. తనలా కాకుండా పుట్టే పిల్లలను మంచి చదువులు చదివించి ప్రయోజకుల్ని చేయాలని నిర్ణయించుకున్నా. వివాహం అయ్యాక డాక్టర్‌ని కలిశాం. గర్భం దాల్చితే తల్లి ప్రాణానికే ప్రమాదం అని హెచ్చరించారు. ప్రాణం పోయినా పర్వాలేదని పిల్లలు కావాలని నిర్ణయించుకున్నా. గర్భం దాల్చిన తర్వాత చెన్నైలో ఉండడం మంచిది కాదని పుత్తూరుకు వచ్చేశాం. పుత్తూరు మున్సిపాలిటీలో ఉద్యోగం కోసం ప్రయత్నించా. కాంట్రాక్టు పద్ధతిన ఉద్యోగం ఇస్తామని చెప్పారు. నాకు కాదు భర్త దీపక్‌కు ఇస్తామని చెప్పారు. తరువాత ఆయన ఉద్యోగం నాకు ఇప్పించాడు. ప్రస్తుతం పుత్తూరు మున్సిపాలిటీలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్నా. భర్త ఆటో నడుపుతున్నాడు.

పండంటి పాపకు జన్మనిచ్చా
పురిటినొప్పులతో తిరుపతిలో తిరుపతిలో ఆసుపత్రులన్నీ తిరిగినా డాక్టర్లు బిడ్డను బతికిస్తాము, తల్లి గురించి చెప్పలేమని చెప్పారు.  ప్రాణం పోయినా పర్వాలేదు బిడ్డకావాలని పట్టుబట్టా. భర్త ఒప్పుకోలేదు. తమిళనాడులోని వేలూరు సీఎంసీకి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు నా పరిస్థితిని చూసి తిట్టారు. ‘శరీరంలో ఎముకలు కూడా సరిగాలేవు. నీ ఆరోగ్యం ఏమిటి.. గర్భం దాల్చటం ఏంటమ్మా’ అన్నారు. దేవుడిచ్చిన వరం అమ్మతనం. నా ప్రాణం పోయినా పర్వాలేదు. బిడ్డ కావాలి సార్‌’ అని అన్నాను. డాక్టర్‌ నా మాటలు విని చలించిపోయారు. అతికష్టమ్మీద పండంటిపాప పుట్టింది. నా పరిస్థితి సీరియస్‌ అయ్యింది. రెండు రోజులు స్పృహలో లేను. నేను బతకనేమో అనుకున్నారంతా. డాక్టర్‌ దేవుడిలా నా ప్రాణాలు కాపాడారు. నేను కళ్లు తెరవడంతో డాక్టర్‌ కూడా సంతోషపడ్డారు.  అమ్మనయ్యాను అని తెలిసి సంబరపడ్డాను.

అత్తమ్మే అన్నీ
నా భర్త దీపక్‌ అమ్మ శోభారాణి. ప్రస్తుతం అన్నీ తానై చూసుకుంటోంది. చిన్న బిడ్డలా సపర్యలు చేస్తోంది. పాప ఆలనా, పాలనా అన్నీ తనే చూసుకుంటుంది. వంట చేయడం, పాపకు, నాకు స్నానం చేయించడం, బాత్‌రూముకి తీసుకెళ్లడం అన్నీ అత్తమ్మే. అత్తాకోడళ్లకు పడకుండా కొట్టుకుంటున్న సంఘటనలు ఉన్నాయి. అయితే మేము అందుకు విరుద్ధం. నాకు, నా బిడ్డకు అత్తమ్మే అమ్మ. నన్ను అత్తమ్మ చూసుకున్నట్లు మా అమ్మ కూడా చూసుకోలేదు. ఆమె నాకు అమ్మకంటే ఎక్కువ. ఆమెకు జీవితాంతం రుణపడి ఉంటాను. అదేవిధంగా భర్త కూడా. ఇంట్లో భర్త, అత్తమ్మ, ఆఫీసులో తోటి ఉద్యోగులు ఎంతో ఆప్యాయంగా చూసుకుంటారు. నేను వికలాంగురాలిని అనే ఆలోచనే రాకుండా చూసుకుంటున్నారు. మానవత్వం బతికే ఉందనటానికి నా చుట్టూ ఉన్న వాళ్లే నిదర్శనం అని పల్లం రాజాలియోనా స్పష్టం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement