వైఎస్సార్‌సీపీ నేత జోగి రమేష్ బస్సు ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు టికెట్ ఇస్తున్న లక్ష్మీకుమారి (ఫైల్)
రామవరప్పాడు (గన్నవరం) : ఖాకీ చొక్కాతో భుజాన క్యాష్ బ్యాగ్ తగిలించుకుని టికెట్.. టికెట్ అంటూ విధులు నిర్వహించే ఆర్టీసీ కండక్టర్ ఓ మేజర్ పంచాయతీకి సర్పంచ్ అయ్యింది. తాను ఒక మహిళనంటూ ఏనాడు ఆధైర్య పడకుండా 20 వేలకుపైగా జనాభా కలిగిన గ్రామాన్ని సమర్థంగా పాలిస్తోంది. తన పాలన దక్షతతో అటు గ్రామ ప్రజలను.. ఇటు సీనియర్ నాయకులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆమే నగర శివారులోని విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడు గ్రామ పంచాయతీ సర్పంచ్ పీకా లక్ష్మీకుమారి.
పేద దళిత కుటుంబం నుంచి వచ్చిన లక్ష్మీకుమారికి చిన్నతనం నుంచి స్వతంత్ర భావాలు ఎక్కువ. వీరిది పెద్ద కుటుంబమైనా ఆమె తల్లిదండ్రులు కష్టపడి లక్ష్మీకుమారిని చదివించారు. చదువులో ముందుండే ఆమె పాలిటెక్నిక్ కోర్సును పూర్తిచేసుకుంది. మెరిట్‌పై 1998లో విజయవాడలో సిటీ సర్వీసులకు ఆర్టీసీ కండక్టర్‌గా బాధ్యతలు చేపట్టింది. సుమారు 15 ఏళ్లు విధులు నిర్వహించిన లక్ష్మీకుమారిని వెతుక్కుంటూ 2013లో గ్రామ సర్పంచ్‌గా పోటీ చేసే అవకాశం వచ్చింది. అంతే వెనుతిరిగి చూసుకోకుండా పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలుపొందింది.
పోకిరీలకు ఆమె అంటే హడల్
లక్ష్మీకుమారి సర్పంచ్ కాకముందు కూడా తన కళ్లముందు తప్పు జరిగితే మిన్నకుండేది కాదు. ఆమె కండక్టర్‌గా పనిచేసే రోజుల్లో బస్సులో పోకిరీలు మహిళలను వేధించడం, విద్యార్థినుల పట్ల ఈవ్‌టీజింగ్‌లకు పాల్ప డడం గమనిస్తే అందరి ముందు తగిన బుద్ధి చెప్పిన ఘటనలు అనేకం ఉన్నాయి.
భర్త చనిపోయినా అధైర్యపడకుండా..
2013లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా గెలుపొందిన లక్ష్మీకుమారి సర్పంచ్ హోదాలో ప్రజాసేవకు అంకితమయ్యారు. తన అభిమాన నాయకుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని స్ఫూర్తిగా తీసుకుని గ్రామాభివృద్ధికి తనవంతుగా పాటుపడుతున్నారు. 2016లో ఆమె భర్త నాగమల్లి కోటేశ్వరరావు ఆటోనగర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. సన్నిహితులు, బంధువులు, పంచాయతీ పాలకవర్గ సభ్యులు మనోధైర్యం ఇవ్వడంతో తిరిగి గ్రామాభివృద్ధిపై దృష్టిసారించారు. ప్రధాన గ్రామంతో పాటు కాల్వ గట్టు ప్రాంతాల్లో పాలకవర్గ సభ్యుల సహకారంతో రూ.లక్షల వ్యయంతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అంతర్గత రహదారులు, డ్రైనేజీ, తాగునీటి సమస్యలను సాధ్యమైనంత వరకు పరిష్కరించారు. ఎన్నో ఏళ్ల నుంచి గ్రామస్తులు ఎదురుచూస్తున్న రైవస్ కాలువపై డబుల్ లైన్ వంతెన ఏర్పాటుకు శంకుస్థాపన కూడా అతితర్వలో ఈమె హయాంలో జరగనుండటం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment