ధైర్యంగా కొన'సాగు'తూ.. | women empowerment special story on agriculture womens | Sakshi
Sakshi News home page

ఆ ఇంటి..మహా‘లక్ష్మి’

Published Wed, Feb 14 2018 2:03 PM | Last Updated on Wed, Feb 14 2018 2:03 PM

women empowerment special story on agriculture womens - Sakshi

ముగ్గురు కూతుళ్లతో నీలమ్మ

ముంచుద్దో లాభమొస్తదో..చెప్పలేని ఎవుసాన్ని మహిళలు ధైర్యంగా చేస్తున్నారు. కుటుంబ భారం మోసేందుకు, తమపై ఆధారపడిన వారికి అండగా నిలిచేందుకు లాభాల ‘పంట’ పండిస్తున్నారు. శ్రమశక్తిని చాటుతూ..పురుషులకు ఏమీ తీసిపోకుండా..కష్టనష్టాలను ఓర్చుకుంటూ నిబ్బరంగాముందడుగేస్తూ శెభాష్‌అనిపించుకుంటున్నారు.  

ఖమ్మం, అశ్వారావుపేటరూరల్‌: మండలంలోని పాత నారంవారిగూడెం గ్రామానికి చెందిన పేరం లక్ష్మి వ్యవసాయం చేస్తూ, లాభాల పంటలు పండిస్తూ ఆ ఇంటికి అండగా మారింది. ఆ ఊళ్లో వారికి మహిళా రైతు అంటే ఠక్కున గుర్తుకొచ్చేది ఆమె పేరే. పెళ్‌లైన కొంతకాలం తర్వాత నుంచి వ్యవసాయంపై మక్కువతో వివిధ రకాల పంటలను సాగు చేస్తోంది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా మూడు దశాబ్దాలుగా వ్యవ‘సాయం’ చేస్తోంది. తెల్లవారుజామున ఇంటి పనులు పూర్తి చేసుకొని రాత్రి వరకు పొలం బాటలోనే ముందుకు సాగిపోతోంది. సొంత వ్యవసాయ భూముల్లో భర్త పేరం కృష్ణ పామాయిల్, వరి పంటలను సాగు చేస్తుంటే ఆమె మాత్రం భూములను కౌలుకు తీసుకొని మరీ అనేక రకాల పంటలను పండిస్తుండడం విశేషం.

వీరికి ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె ఉండగా..వీరందరికీ వివాహాలయ్యాయి. పెద్ద కొడుకు తల్లితోపాటు వ్యవసాయం చేస్తుండగా, రెండో అబ్బాయి హైదరాబాద్‌లో ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్నాడు. వీళ్లకు సొంతంగా పూర్వీకుల నుంచి 10 ఎకరాల సాగు భూమి వాటాగా రాగా, పామాయిల్‌ను సాగు చేస్తున్నారు. ఆమె ఇంటికే పరిమితం కాకుండా భర్త, కొడుకుతో పోటీపడి మరి సొంతంగా వ్యవసాయం చేస్తోంది. స్వగ్రామానికి సమీపంలో గల మొద్దులగూడెం గ్రామంలో 10 ఎకరాల్లో చెరకు పంట, మరో నాలుగు ఎకరాల్లో వాణిజ్య పంటైన మొక్కజొన్న పండిస్తోంది. మరో రెండెకరాల్లో చిక్కుడు, కాకర వంటి కూరగాయలను సాగు చేస్తోంది. ఇంటి వద్ద ఐదు పాడి గేదలను సాకుతూ..పాలను విక్రయిస్తోంది.  

ఖమ్మంరూరల్‌:  పంటలు కలిసిరాక..చేసిన అప్పులు తీర్చలేక గోళ్లపాడు శివారు ఊటవాగుతండాకు చెందిన రైతు తేజావత్‌ రాందాసు ఆత్మహత్య చేసుకుంటే..గుండెనిబ్బరంతో అతడి భార్య నీలమ్మ అదే వ్యవసాయాన్ని చేస్తూ ముగ్గరు బిడ్డలను చదివించుకుంటోంది. భర్త పోయాడనే బెంగ ఓ పక్క, చేసిన అప్పులెలా తీర్చాలోననే బాధ మరో పక్క వేధిస్తున్నా కళ్లముందు కనిపిస్తున్న ముగ్గురు ఆడపిల్లలను చదివించేందుకు కష్టాలను ఎదుర్కొంది. పెద్ద కూతురు శ్రావణి ఇంటర్‌ చదువుతోంది. రెండో కూతురు సంధ్య ఎనిమిది, మరో కూతురు స్వాతి ఆరో తరగతి చదువుతున్నారు. నీలమ్మకు ఉన్న ఎకరం భూమికి తోడు మరో ఆరెకరాలు కౌలుకు తీసుకొని సాగు చేస్తోంది. ఈమెకు కూడా కాలం కలిసి రావట్లే. అప్పులు పెరుగుతున్నాయి. కానీ..దశ తిరగకపోతుందా అనే ఆశతో, ధైర్యంతో వ్యవసాయం చేస్తోంది. పిల్లలు కూడా ఖాళీ సమయాల్లో తల్లికి చేదోడువాదోడుగా సహకరిస్తున్నారు. 

భర్తను మింగిన అప్పులు..
నీలమ్మ భర్త మిర్చి, మొక్కజొన్న పంటలను పండించేవాడు. సాగునీటి కోసం రెండు బోర్లు వేయించినా అందులో చుక్కనీరు రాలేదు. కానీ..రూ.లక్ష అప్పు మిగిలింది. కౌలుకు తీసుకొని సాగు చేసిన ఏడెకరాల్లో మిర్చితోట దిగుబడి రాక ముంచింది. ఇలా మొత్తం రూ.5లక్షల అప్పులు మిగిలాయి. ఎలా తీర్చాలో తెలియక మనోవేదనతో 2011 అక్టోబర్‌లో చేను వద్దనే నీలమ్మ భర్త రాందాసు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి కష్టాలను అధిగమిస్తూ..పిల్లలకు తానే పెద్ద దిక్కుగా మారింది.  

రోజంతా చేను పనే..
ఇంటి నుంచి చేనుకు పోయిందంటే..తిరిగి చీకటి పడుతుండగానే ఇంటికి చేరుతుంది ఈ లక్ష్మి. కూలీలు పొలానికి రాకముందే అక్కడికి చేరుకుని సిద్ధంగా ఉంటుంది. మొక్కజొన్న పంటకు తడి పెట్టడంతోపాటు, మడులు కట్టడం, కలుపు తీసే పనులు చేస్తుంది. చెరకు తోటల్లో చెరకు నరకడంతోపాటు, నాట్లు వేయడం, కలుపు నివారణ మందులు(పురుగుల మందు)సైతం స్ప్రేయింగ్‌ చేస్తుంది. ఇక కూరగాయాల తోటల్లో చిక్కుడు, కాకర కోతలు, వాటికి వివిధ రకాల మందులను పిచికారీ చేయడం వంటి పనులు కుడా ఆమె సొంతంగా చేస్తుంది. పెట్టుబడి ఖర్చులు పోను..నష్టాలు లేకుండా ఆదాయం పొందుతున్నట్లు ఆమె ఆనందంగా చెబుతోంది.  

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): భర్త మరణం ఆమెను కుంగదీసింది. ఏం చేయాలో తోచలే. కానీ..పిల్లల కోసం కొత్త పయనం మొదలెట్టింది. వ్యవసాయాన్ని ఎంచుకొని రాజీ పడకుండా ముందుకు సాగింది. రేగళ్ల గ్రామ పంచాయతీ పెద్దతండాకు చెందిన జాటోతు రాజీ భర్త అనారోగ్యంతో చనిపోగా..ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడిని రెండెకరాల్లో వ్యవసాయం చేసి పెంచింది. కలుపు తీయడం, పురుగులమందు కొట్టడం, సాగు పనులన్నీ చేసుకుంటూ పైసాపైసా కూడబెట్టుకొని నిలదొక్కుకుంది. పెద్ద బిడ్డ కవిత, రెండో కూతురు సునీతలకు వివాహం చేసింది. మూడో కూతురు హరిత ఆరో తరగతిలోనే చదువు ఆపేసి..అమ్మకు ఆసరాగా ఉంటోంది. కొడుకు మాదిరిగానే   సహకరిస్తోంది. రాజీ కుమారుడు వీరన్న రేగళ్లలోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. పెద్దయ్యాక అమ్మ కష్టాలను తీరుస్తానని చెబుతున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement