ట్రాక్టర్‌లో వరిగడ్డి వేయడానికి తండ్రికి సహకారం అందిస్తున్న దృశ్యం వరిగడ్డి సేకరణలో మాధురి
కలిగిరి: మండలంలోని కృష్ణారెడ్డిపాలెం గ్రామానికి చెందిన రావుల దశరథరామిరెడ్డి, పద్మలకు ముగ్గురు కుమార్తెలు. మొదటి కుమార్తె సావిత్రి వివాహం చేసుకుని చెన్నైలో ఉంది. రెండో కుమార్తె సునీత వివాహం చేసుకుని నెల్లూరులో ఉంటున్నారు. చివరి కుమార్తె మాధురి మాత్రం 10వ తరగతితో చదువుకు స్వస్తి పలికింది. అప్పటినుంచి తండ్రికి తోడుగా వ్యవసాయ పనుల్లో సహకారం అందిస్తోంది. కుమార్తె మాధురి సహకారంతో దశరథరామిరెడ్డి సుమారు 10 ఎకరాల మాగాణి పొలంలో సంవత్సరానికి రెండుసార్లు వరి పంటను సాగుచేస్తున్నాడు. వరినారు పోసినప్పటి నుంచి గింజలు ఇంటి వచ్చే వరకు తండ్రితో రోజు మాధురి పొలానికి వెళుతుంది. గ్రామంలో మగవాళ్లకు ధీటుగా వ్యవసాయ పనులు చేస్తుంది. పొలం నుంచి ఇంటికి వచ్చినప్పటికి తర్వాత పశువుల పనిలో బిజీగా ఉంటుంది.
సేంద్రియ పద్ధతుల్లో పెరటి సాగు
ఇంట్లో ఉన్న ఖాళీ స్థలంలో మాధురి సేంద్రియ పద్ధతుల్లో ఆరటి, కూరగాయలు, పండ్ల మొక్కలు సాగుచేస్తోంది. మొక్కలకు పశువుల ఎరువులను మాత్రమే వాడుతుంది. ఇంటి చుట్టు పెంచుతున్న అరటి చెట్లు ప్రత్యేక ఆకర్షణ. కొడుకు ఉన్నా మాధురిలా పనుల్లో సహాకారం అందించేవాడు కాదేమే అని తండ్రి గర్వంగా అందరి వద్ద చెప్పుకుంటుంటాడు.
నాన్నకు సహకరించడంతో తృప్తి
ముగ్గురు కుమార్తెలను మా తల్లిదండ్రులు ఎంతో ప్రేమగా పెంచారు. మాకు ఏ లోటు లేకుండా చూస్తున్న తండ్రికి వ్యవసాయ పనుల్లో పూర్తి సహకారం అందించడం సంతృప్తిగా ఉంది. అవకాశం ఉన్న వాళ్లు సేంద్రియ పద్ధతుల్లో ఇళ్ల వద్ద కూరగాయాలు, పండ్ల మొక్కలు సాగు చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది.– మాధురి
Comments
Please login to add a commentAdd a comment