ఆమె ఆశ్రయం గొప్పది | devi Orphanage home special story | Sakshi
Sakshi News home page

ఆమె ఆశ్రయం గొప్పది

Published Sat, Feb 17 2018 8:30 AM | Last Updated on Sat, Feb 17 2018 8:30 AM

devi Orphanage home special story  - Sakshi

అనంతపురం రూరల్‌ మండలం కాట్నేకాలువ గ్రామంలో ఓ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు దేవి.  కృష్ణమ్మ. లక్ష్మిరెడ్డిల దంపతులకు ముగ్గురు సంతానం. కాగా ఆమె రెండవ సంతానం. నిరుపేద కుటుంబం కావడంతో అప్పట్లో ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉండేది.  పూట గడవడమే కష్టంగా మారిన ఆ కాలంలో దేవిని పాఠశాలకు కూడా పంపించలేని పరిస్థితి ఆ తల్లిదండ్రులది. బుద్ధి వచ్చేంత వరకూ ఇంటి వద్ద పనులు చేసుకుంటూ.. ఓ వయస్సు వచ్చాక తల్లిదండ్రులకు తోడుగా వ్యవసాయ పనులకు వెళ్లేది. ఇల్లు్ల, పొలం పనులు తప్ప మరేవిషయం తెలీదు.

ఆ సంఘటనతో మలుపు
అనంతపురం సెంట్రల్‌: 1992లో మేనమామ అయిన కృష్ణారెడ్డితో దేవికి వివాహమైంది. తొలినాళ్లలో వ్యవసాయ పనులపైనే ఆధారపడి భార్యభర్తలు జీవించారు. ఒక రోజు నగరానికి వచ్చిన కృష్ణారెడ్డి జోరువానకు వనుకుతున్న వృద్ధులను చూసి చలించారు. వారికి సపర్యలు చేసి ఇంటికి వెళ్ళాడు. ఆలస్యంగా వెళ్లడంతో ఎందుకింత ఆలస్యమైందని దేవి అడిగింది. అప్పుడు కృష్ణారెడ్డి జరిగిన విషయాన్ని వివరించారు. వయస్సులో సత్తువ ఉన్నన్నాళ్లు కుటుంబాన్ని పోషించేందుకు కష్టపడిన వృద్ధులు జీవిత చరమాంకానికి వచ్చే సమయానికి రోడ్డు పాలు కావడం బాధాకరమని ఇద్దరూ చర్చించుకున్నారు. అదే వారిని సేవామార్గంలో పయనించడానికి నాంది పలికింది.  కొద్దిరోజుల పాటు సేవలందించినా తర్వాత ఏకంగా వృద్ధాశ్రమాన్నే నెలకొల్పి ప్రభుత్వాలు కూడా చేయలేని పనిని ఓ మహిళ చేసి నిరూపిస్తోంది. అనాథ తల్లిదండ్రులకు అమ్మలా మారి సేవచేస్తోంది. కడుపున పుట్టిన పిల్లలు కాదన్న వృద్ధులను అక్కున చేర్చుకొని వారి ఆలనపాలన చూసుకుంటున్నారు. దేవి సేవలను గుర్తించిన పలు సంస్థలు అవార్డులతో సత్కరించాయి.

ఒడిదుడుకులతో ప్రారంభం
దేవీ దంపతులకు స్వగ్రామంలో ఉండేందుకు చిన్న ఇల్లు్ల మాత్రమే ఉంది. ఎక్కడా ఒక్క సెంటు స్థలం కూడా లేదు. ఈ సమయంలో అనాథాశ్రమం నిర్మించాలని తలంచారు. ఏం చేయాలో తెలియక ఎవరైనా స్థలం ఇస్తారా అని ఆరా తీశారు. అయ్యావారిపల్లి వద్ద ఓ వ్యక్తి స్థలం ఇవ్వడానికి ముందుకు వచ్చారు. రూ. 20 వేలు ఖర్చు పెట్టి పనులు ప్రారంభించారు. అయితే అక్కడ కొంతమంది వ్యతిరేకించడంతో సదరు స్థలం యజమాని అనాథాశ్రమానికి ఇవ్వనని చెప్పేశారు. దీంతో స్వగ్రామంలోనే రక్తసంబంధీకులను ఒప్పించి వృథాగా ఉన్న స్థలంలో అనాథాశ్రమం ప్రారంభించారు. అయితే సదరు స్థలంలో పెద్ద పాడుబడ్డబావి ఉండటంతో దానిని పూడ్చటానికి డబ్బులు ఖర్చు అయ్యాయి. అనంతరం ఇళ్లు నిర్మించడానికి అప్పులయ్యాయి. వీటిని తీర్చడానికి పూర్వీకుల నుంచి వస్తున్న సొంతింటిని సైతం వదులుకోవాల్సి వచ్చింది. అనాథాశ్రమం నిర్మాణం కోసం ఇంటిని కూడా అమ్మకానికి పెట్టారు. ఆ వచ్చిన డబ్బుతో అప్పులు చెల్లించి.. మిగిలిన మొత్తంతో అనాథాశ్రమాన్ని నడపడం మొదలు పెట్టారు. తొలినాళ్లలో ఎవరూ సాయం అందించకపోవడంతో అష్టకష్టాలు పడ్డారు. ఆశ్రమానికి మంచి పేరు రావడంతో ఇప్పుడిప్పుడే సేవలో పాలు పంచుకోవడానికి   దాతలు ముందుకొస్తున్నారు. ప్రస్తుతం దాతల సహకారంతోనే అనాథాశ్రమాన్ని నడుపుతున్నారు.

ఎగతాళులూ ఎక్కువే
దేవితో పాటు ఆయన భర్త చేస్తున్న సేవా కార్యక్రమాన్ని చూసిన వారి బంధువులు ఎగతాళి చేశారు. మీకేమైనా పిచ్చి పట్టిందా? మీ తల్లిదండ్రులైతే పట్టించుకోవాలి. ఊరందరి గురించి మీకేం అవసరం అంటూ ఎగతాళి చేశారు. అయితే వారి వాదనలను దేవి సున్నితంగా తిప్పికొట్టారు. అవసరమైతే మీరంతా మా ఇంటికి రాకున్నా పర్వాలేదు అని ఎదురించారు. సేవలోనే పరమార్థం దాగి ఉందని తెలుసుకున్న ఆమె ఏకంగా వృద్ధాశ్రమాన్నే నెలకొల్పాలని నిర్ణయించుకున్నారు. మొక్కవోని దీక్షతో అనుకున్న సంకల్పాన్ని నెరవేర్చారు. తొలుత ఒకరిద్దరితో ఆరంభమైన అనాథాశ్రమంలో నేడు 35 మంది ఆశ్రయం పొందుతున్నారు. రోజూ వారికి స్నానాల దగ్గర నుంచి అని సపర్యలు దేవీనే చూసుకుంటున్నారు.

అన్నీతానై...
వృద్ధాశ్రమానికి వస్తున్న వారిలో ఎక్కువశాతం జీవితచరమాంకంలో ఉన్న వారే. మొత్తం 32 మందిలో సగం మంది మంచానికే పరిమితం అయ్యారు. అలాంటి వారికి స్నానం చేయించడం దగ్గర నుంచి స్నానాలు చేయించడం, అన్నం తినిపించడం కూడా చేయాల్సి వస్తోంది. ప్రతిరోజూ 32 మందికి మూడు పూటల భోజనం చేయడం కత్తిమీద సాములా మారింది. అయినప్పటికీ ఏమాత్రం బరువుగా భావించకుండా ప్రతి రోజూ వారికి అన్ని తానై సేవలందిస్తున్నారు. ఎక్కువ మంది రోగాల బారిన పడుతుండటం, మానసికంగా ఇబ్బందులు చెందుతుండటంతో ప్రభుత్వ మానసిక వైద్యులు డాక్టర్‌ ఎండ్లూరి ప్రభాకర్‌వద్ద చికిత్సనందిస్తున్నారు. ప్రతి వారం ఆయన ఆశ్రమానికి వెళ్లి వృద్ధులకు ఉచితంగా చికిత్సనందిస్తున్నారు.

ఊపిరి ఉన్నంత వరకూ సేవ చేస్తా
మలిసంధ్యలో ఏ తోడు లేని వారికి సేవ చేసే భాగ్యం నాకు కలిగింది. ఇది దేవుడిచ్చిన వరంగా భావిస్తాను. తొలుత నా భర్త చేస్తున్న సేవా కార్యక్రమంలో తాను తోడు అందించాలని భావించా. ఇప్పుడు 35 మందికి ఆశ్రయం కల్పిస్తున్నాను. ఏనాడు బరువుగా భావించలేదు. నా ఊపిరి ఉన్నంత వరకూ సేవా చేయాలని అనుకుంటున్నా. నాతో పాటు నాభర్త, నా ఇద్దరు కూమారులు కూడా వీరిని చూసుకోవడానికే ఉన్నాం.  – యర్రగుంట్ల దేవి,ఆశ్రయ అనాథాశ్రమం నిర్వాహకురాలు

సేవకు సత్కారం
వృద్ధులకు సేవలందిస్తూ అందరిచే శభాష్‌ అనిపించుకుంటున్న దేవీ సేవలకు గుర్తింపు లభించింది. ఆశ్రయ అనాథాశ్రమం గురించి తెలుసుకున్న పలు స్వచ్ఛంధ సంస్థలు ఆమెను సత్కరించాయి. ఇటీవల సాహితీగగన్‌మహల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో అనంత ఆణిముత్యాలు పురస్కారం అందజేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో తిరుపతిలో అవార్డు అందించారు. సహిత మహిళా సమాఖ్య, ఇన్నర్‌వీల్‌ సంస్థలు సంయుక్తంగా దేవీని సత్కరించాయి.

బయోడేటా
పేరు                 : యర్రగుంట్ల దేవి
స్వగ్రామం          : పాలచెర్ల, రాప్తాడు మండలం
తల్లిదండ్రులు      : కృష్ణమ్మ, లక్షీరెడ్డి
కుటుంబ నేపథ్యం: నిరుపేద కుటుంబంలో జన్మించారు
విద్యార్హత           : పేదరికంతో చదువుకోలేదు
వివాహ నేపథ్యం : 1992లో కాట్నే కాలువకు చెందిన  మేనమామ కృష్ణారెడ్డితో వివాహం
కుమారులు    : రాజశేఖరరెడ్డి, మధుసూదన్‌రెడ్డి (మేనరికం పెళ్లి కావడంతో బుద్ధిమాంద్యంతో జన్మించారు. దీంతో చదువు మాన్పించాల్సి వచ్చింది. ప్రసుత్తం వృద్ధులకు సేవలో కుటుంబంఅంతా పాలుపంచుకుంటున్నారు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement