orphanage home
-
HYD: అనాథాశ్రమంలో బాలికలతో కేర్ టేకర్ అనుచిత ప్రవర్తన!
సాక్షి, రాజేంద్రనగర్: హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. అనాథాశ్రమంలో కేర్ టేకర్‌గా పనిచేస్తున్న ఓ మహిళ.. బాలికల పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేర్ టేకర్ చెప్పిన మాట వినకపోతే దుస్తులు లేకుండా అందులో పనిచేసే ఇద్దరు పురుషుల ఎదుట నిలబెట్టడం సంచలనంగా మారింది.వివరాల ప్రకారం.. అనాథలకు సేవ చేయాలనే లక్ష్యంతో ఓ మహిళ రంగారెడ్డి జిల్లా బండ్లగూడలోని కిస్మత్ పూరలో 15ఏళ్ల క్రితం అనాథాశ్రమాన్ని ప్రారంభించారు.ఈ క్రమంలో సంస్థ వ్యవస్థాపకురాలు తొలుత తన తల్లిని కేర్ టేకర్‌గా నియమించారు. ఆమె వృద్ధురాలు కావడంతో రెండేళ్ల కిందట మరో మహిళ సునీతను ఆమె స్థానంలో కేర్ టేకర్‌గా నియమించారు. ప్రస్తుతం అనాథాశ్రమంలో 45 మంది బాలికలు ఉన్నారు. వారంతా 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్నారు.అయితే, కొత్తగా చేరిన కేర్ టేకర్ సునీత.. బాలికలను చిత్రహింసలకు గురిచేయడంతో వారంతా ఆవేదన చెందారు. సునీత చెప్పిన మాటలు వినకపోతే బాలికలను దుస్తులు లేకుండా అందులో పనిచేసే వారి ఎదుట నిలబెడుతూ అసభ్యకరంగా ప్రవర్తించింది. కాగా, ఈ అనాథాశ్రమానికి చెందిన 25 మంది బాలికలు బుద్వేల్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. సునీత వేధింపులను వారంతా.. ప్రధానోపాధ్యాయురాలు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో చలించిపోయిన ఆమె.. రాజేంద్రనగర్ పోలీసులతో పాటు షీ టీమ్స్‌కి ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన అధికారులు కేసు నమోదు చేసి సునీతను అదుపులోకి తీసుకున్నారు. అలాగే, సంస్థ వ్యవస్థాపకురాలితో అందులో పనిచేసే వారిని విచారిస్తున్నారు.ఇది కూడా చదవండి: జానీ భార్య అయేషా అరెస్ట్‌కు రంగం సిద్ధం! -
నా తల్లివి నువ్వే
దిల్లీలోని ఒక అనాథాశ్రమంలో పెరిగింది శివాని. చా...లా సంవత్సరాల తరువాత భర్త, కూతురుతో కలిసి ఆ అనాథాశ్రమానికి వచ్చింది. ‘నేను శివానిని. గుర్తున్నానా?’ అన్నది గార్డియన్ దగ్గరికి వచ్చి. శివాని చిన్నప్పటి జ్ఞాపకాలు గార్డియన్‌ను చుట్టుముట్టాయి. అంతే....గార్డియన్‌కు ఏడుపు ఆగలేదు. ఆమెను ఓదార్చడానికి ప్రయత్నిస్తూ తాను కూడా ఏడ్చేసింది శివాని. చాలాసేపటి వరకు వారి మధ్య ఏడుపు తప్ప మాటలు లేవు. ఈ వైరల్ వీడియోలోని భావోద్వేగాలు నెటిజనులను కళ్లనీళ్ల పర్యంతం చేశాయి.శివాని గతంలోకి వెళితే...ఆమె తండ్రి మద్యానికి బానిస అయ్యాడు. తల్లిని హింసించేవాడు. ఈ హింస తట్టుకోలేక భర్త నుంచి విడాకులు తీసుకుంది. తల్లి ఒకచోట, తండ్రి ఒకచోట. పిల్లల ఆలనా΄ాలనా చూసేవారు లేరు. చివరికి అనాథలుగా మిగిలారు. వీరి దీనస్థితి చూసి ఒక పుణ్యాత్ముడు అనాథాశ్రమంలో చేర్పించాడు. మూడు సంవత్సరాల తరువాత ఆ పిల్లలను ఒక కుటుంబం దత్తత తీసుకుంది. పెరిగి పెద్దయి జీవితంలో స్థిరపడింది. తన కష్టకాలంలో ఆదుకున్న ఆశ్రమాన్ని, తల్లిలా ఆదరించిన గార్డియన్‌ను చూడడానికి వచ్చింది. అనాథాశ్రమంలో ఉన్నప్పుడు అక్కడి ‘గార్డియన్’ అక్కా, తమ్ముళ్లను సొంతబిడ్డల్లా చూసుకుంది. ‘నా సొంత తల్లి దగ్గరికి వచ్చినట్లు ఉంది’ అని గార్డియన్ గురించి రాసింది శివాని. -
అనాథాశ్రమంలో పెళ్లి బాజా.. యువతికి తాళి కట్టిన ఐటీ ఉద్యోగి
సాక్షి, హుబ్లీ: హుబ్లీ కేశ్వాపురలోని అనాథ శరణాలయంలో గురుసిద్దమ్మ అనే యువతికి అందరూ పెద్దలై పెళ్లి చేశారు. బెంగళూరులో ఆదాయపు పన్ను (ఐటీ) శాఖలో ఉద్యోగం చేస్తున్న హేమంత్‌కుమార్ అనే వరుణ్ని వెతికి వైభవంగా మూడుముళ్ల వేడుక పూర్తి చేశారు.వివరాలు.. కేశ్వపుర సేవా భారతీ ట్రస్ట్‌లో తల్లీతండ్రీ లేని బాలిక గురుసిద్దమ్మను చిన్నప్పుడే ఎవరో చేర్పించారు. ఇటీవలే 18 ఏళ్లు నిండడంతో ఆశ్రమ నిర్వాహకులు పెళ్లి ప్రయత్నాలను ప్రారంభించారు. బెంగళూరులో సరస్వతి–నంజుండరావ్ అనే దంపతుల కుమారుడు హేమంత్‌తో ఖరారు చేశారు. అతడు మంచి ఉద్యోగం చేస్తున్నప్పటికీ గురుసిద్దమ్మ కులగోత్రాలతో హోదాతో సంబంధం లేకుండా పెళ్లికి అంగీకరించడం విశేషం. ఆర్ఎస్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులు, గతంలో పెళ్లయి జీవితంలో స్థిరపడిన అనాథాశ్రమ యువతులు ఎంతో మంది మధ్య ఘనంగా వివాహ వేడుక జరిగింది. చదవండి: (రెండేళ్లుగా సహజీవనం.. వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకుందని..!) -
AP: ఓ బ్రహ్మయ్య.. తండ్రి నీవయ్య!
‘‘నెల్లూరు నగరంలో ఓ అనాథ యువతి ఆశ్రమంలో ఉంటూ బీఎస్సీ నర్సింగ్ కోర్సు చేస్తోంది. ఆమెకు నెలవారీగా వచ్చే స్టైఫండ్ రూ.3 వేలను దాచుకునే నిమిత్తం అకౌంట్ తెరిచేందుకు బ్యాంకుకు వెళ్లింది. కానీ, ఆమె వద్ద అవసరమైన ధ్రువపత్రాల్లేవని బ్యాంకు అధికారులు తిరస్కరించారు. దీంతో ఆశ్రమం నిర్వాహకుల వద్దే ఆమె ఆ మొత్తాన్ని దాచుకుంటోంది’’.. ఇది ఈ ఒక్క యువతి ఇబ్బందే కాదు.. ఇలాంటి ఎంతోమంది అనాథలు రాష్ట్రవ్యాప్తంగా ఎదుర్కొంటున్న కష్టాలు. అమ్మానాన్నలు లేని ఫలితంగా ఎలాంటి ధుృవపత్రాలకు నోచుకోక వీరు పలు ప్రభుత్వ పథకాలకు దూరంగా ఉంటున్నారు. ఇలాంటి కథే నెల్లూరు నగరంలోని ఓ అనాథాశ్రమం విద్యార్థుల వ్యథ. సాక్షి, నెల్లూరు: నెల్లూరు నగరంలోని కొండాయపాళెం రోడ్డు సమీపంలోని రామకృష్ణానగర్‌లో ఉన్న జనహిత–వాత్సల్య సేవా సంస్థలో దాదాపు 117 మంది అనాథ బాలలు ఆశ్రయం పొందుతున్నారు. ఈ సంస్థ కేవలం దాతల దాతృత్వంతో నడిచే సంస్థ. ఈ సంస్థ భారతీయ విద్యా వికాస్ పేరుతో ఇంగ్లిష్ మీడియం పాఠశాలను నిర్వహిస్తోంది. ఇందులో అనాథ బాలలతోపాటు ఇతరులు కూడా విద్యను అభ్యసిస్తున్నారు. జనహిత–వాత్సల్య సేవా సంస్థ ప్రాంగణం ఈ సేవా సంస్థలో ఆశ్రయం పొందిన వారు కొందరు ఉన్నత చదువులు చదువుకున్న వారూ ఉన్నారు. చదువుల అనంతరం వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాల్లో స్థిరపడిన వారు కూడా ఉన్నారు. ఇక్కడి ఆడపిల్లలకు అమ్మానాన్న లేని లోటు తెలీకుండా పెళ్లిళ్లు చేసి అత్తవారింటికి పంపుతున్నారు. కానీ, ఈ అనాథలకు పలు రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దేవుళ్లనే తల్లిదండ్రులుగా భావిస్తూ.. పదో తరగతి చదివే విద్యార్థులు పరీక్ష దరఖాస్తుల్లో తల్లిదండ్రుల పేర్లు రాయాలి. కానీ, వారెవరో తెలియని ఈ అనాథలు దేవుళ్లనే తమ తల్లిదండ్రులుగా భావించి సరస్వతి, లక్ష్మీ, పార్వతి, శివయ్య, బ్రహ్మ, విష్ణుమూర్తి వంటి పేర్లను రాసుకుంటున్నారు. గతంలో టెన్త్ పరీక్షల సందర్భంలో తండ్రి పేరే రాయాల్సి ఉండేది. 2009 సెప్టెంబర్ 14 నుంచి తల్లి పేరు తప్పనిసరి చేశారు. అప్పటివరకు తండ్రి పేరు రాసేందుకు తంటాలు పడిన ఈ అనాథ విద్యార్థులు దీంతో తల్లిదండ్రులుగా దేవుళ్లు, దేవతల పేర్లనే దరఖాస్తులలో పేర్కొంటున్నారు. జనహిత–వాత్సల్య సేవా సంస్థ సంక్షేమానికి దూరంగా.. ప్రభుత్వం విద్యను ప్రొత్సహించేందుకు ప్రవేశపెట్టే పథకాలకూ ఈ అనాథలు దూరంగా ఉండాల్సి వస్తోంది. ఈ పథకాలకు ప్రధానంగా రేషన్‌కార్డు, కులం, ఆదాయం, ఆధార్‌కార్డు తప్పనిసరి. ఇవన్నీ ఎలా వస్తాయో తెలియని ఈ అనాథలు సంక్షేమ పథకాలకు నోచుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో.. ప్రభుత్వాలు వీరిని ప్రత్యేకంగా పరిగణించి ఎస్సీ, ఎస్టీల జాబితాలో చేర్చి అన్ని సదుపాయాలు కల్పిస్తే వీరు సమాజంలో ఉన్నత పౌరులుగా ఎదిగే అవకాశం ఉంటుంది. జనహిత–వాత్సల్య సేవా సంస్థలో భోజనానికి ముందు ప్రార్థన చేస్తున్న బాలలు అమ్మఒడిపై స్పందించిన సర్కార్ ప్రస్తుత ప్రభుత్వం విద్యను ప్రోత్సహించేందుకు ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకం పేద వర్గాలకు ఎంతగానో ఉపయోగపడుతోంది. కేవలం ఆధార్‌కార్డు రానందున ఈ పథకానికి అనాథలు అర్హత సాధించలేకపోతున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ప్రభుత్వం స్పందించి వచ్చే విద్యా సంవత్సరంలోనైనా అమ్మఒడి వర్తించేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలందాయి. స్థానిక అధికారులూ వీరికి న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అనాథలను గుర్తించాలి ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా అనాథ బాలలకు సరైన న్యాయం చేయలేకపోయింది. సమాజంలో వారికి గుర్తింపు లేకుండాపొయింది. ఏ ప్రభుత్వ సంక్షేమ పథకాలకూ వారు నోచుకోలేకపోతున్నారు. అమ్మఒడి పథకం వారికి వర్తింపజేయాలి.– జీవీ సాంబశివరావు, వాత్సల్య అనాథాశ్రమ సంస్థాగత కార్యదర్శి సమాజంలో వారికి గుర్తింపునివ్వాలి అనాథలను ప్రభుత్వాలు అక్కున చేర్చుకోవాలి. గత ప్రభుత్వాలు అనాథల విషయంలో సరైన న్యాయం చేయలేకపోయాయి. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం స్పందించి వారికి అమ్మఒడి పథకం వర్తించేలా కసరత్తు చేయడం హర్షణీయం. అనాథలు అంటే మన పిల్లలే అనే భావన అందరిలో కలగాలి. – సామంతు గోపాల్‌రెడ్డి, వాత్సల్య సేవా సంస్థ గౌరవాధ్యక్షులు -
హైదరాబాద్: అనాథ అక్కాచెల్లెళ్లను కలిపిన ‘సైన్స్ ఫేర్’ ఫోటో
సాక్షి, హైదరాబాద్: తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారారు ఆ ముగ్గురు అక్కాచెల్లెళ్లు. వారిలో పెద్దవారు ఇద్దరిని ఓ అనాథ ఆశ్రమంలో చేర్పించారు. చిన్న అమ్మాయి వారి నానమ్మతాతయ్యల దగ్గర ఉంటుంది. కానీ దురదృష్టం కొద్ది వారు కూడా చనిపోవడంతో.. ఆ బాలిక వీధుల వెంబడి భిక్షాటన చేస్తూ కాలం గడపసాగింది. ఈ క్రమంలో తన అక్కలను చేరదీసిన అనాథాశ్రమం వారే ఆ బాలికను కూడా అక్కున చేర్చుకున్నారు. అయితే వేరే బ్రాంచ్‌లో ఆ చిన్నారిని చేర్పించారు. చివరకు సైన్స్ ఫేర్ ఫోటోలో చెల్లెని గుర్తించిన అక్కలు తన గురించి హోమ్ నిర్వహకులకు సమాచారం ఇవ్వడంతో ముగ్గురు అక్కాచెల్లెళ్లును ఒకే చోటకు చేర్చారు. అమ్మానాన్నలను కోల్పోయి అనాథలుగా మారిని ఆ చిన్నారులు.. కనీసం అందరం ఒకే చోట ఉన్నందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాలు.. హైదరాబాద్‌కు చెందిన ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్ల అమ్మ వారి చిన్నతనంలోనే చనిపోగా.. తండ్రి మూడేళ్ల క్రితం చనిపోయాడు. ఈ క్రమంలో పెద్దమ్మాయి(14), మరో అమ్మాయి(12)ని నగరంలోని ఓ అనాథ ఆశ్రమంలో చేర్చారు. ఇక అందరికంటే చిన్నదైన బాలిక తన తాతనానమ్మల దగ్గర ఉండేది. కానీ దురదృష్టం కొద్ది కొన్ని నెలల క్రితం వారు కూడా మృతి చెందారు. అప్పటి నుంచి బాలిక వీధుల్లో భిక్షాటన చేస్తూ జీవించసాగింది. బాలిక గురించి సమాచారం తెలిసిన అనాథాశ్రమం వారు ఆ చిన్నారిని చేరదీశారు. విచిత్రం ఏంటంటే చిన్నారి అక్కలిద్దరూ ఇదే ఆశ్రమంలో ఉంటున్నారు. కాకపోతే వేరే బ్రాంచ్‌లో. ఇక దీని గురించి ఆ అక్కాచెల్లెళ్లలకు ఏమాత్రం సమాచారం తెలీదు. ఈ క్రమంలో ఓ రోజు వేర్వేరు అనాథశ్రమాల్లో నిర్వహించిన సైన్స్ ఫేర్ ఫోటోలను బాలిక అక్కలు చూశారు. ఆ ఫోటోలో ఉన్న తమ చెల్లిని గుర్తించారు. ఇక దీని గురించి ఆశ్రమం అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు.. ముగ్గురు బాలికలకు డీఎన్ఏ టెస్ట్ చేసి.. వారంతా తోబుట్టువులే అని తేల్చారు. అనంతరం ముగ్గురిని ఒకే చోటకు చేర్చారు. తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన ఆ అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్క చోట కలిసి ఉండే అవకాశం లభించడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ జిల్లా సంక్షేమ అధికారి అకేశ్వర్ రావు మాట్లాడుతూ.. ‘‘మన రాష్ట్రంలో ఉన్న పలు అనాథాశ్రమాల్లో అధికారులు, కౌన్సిలర్లు వేర్వేరు కార్యక్రమాలు నిర్వహించి.. పిల్లలు వాటిలో పాల్గొనేలా ప్రోత్సాహిస్తారు. అలానే సైన్స్ ఫేర్ వంటి కార్యక్రమాలను కూడా నిర్వహిస్తాం. ఈ సందర్భంగా తీసిన ఫోటో ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లును ఒక్కచోటకు చేర్చింది’’ అన్నారు. -
సేవా ముసుగులో చీకటి వ్యాపారం
పేరుకు ప్రజాసేవ.. అనాథలకు ఆశ్రయం కల్పించి తరిస్తున్నట్లు బిల్డప్.. ‘అయ్యా..ఎవరూ లేరు. ఆదుకోండి’..అంటూ శరణు కోరి వచ్చిన వారికి ఆశ్రయం కల్పించడం.. ఆ తరువాత ఆ అనాథ చిన్నారులను అమ్మి సొమ్ము చేసుకోవడం వారికి నిత్యకృత్యం. ఇలాంటి దురాగతాలకు పాల్పడుతున్న ఓ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. శరణాలయానికి సీలు వేసి, నలుగురిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ఇద్దరు ప్రధాన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. సాక్షి ప్రతినిధి, చెన్నై: మధురై రిజర్వ్లైన్ నివాస ప్రాంతాల మధ్య ‘ఇదయం జెరియాట్రిక్ కేర్ సెంటర్’ పేరుతో ఓ అనాథ శరణాలయం ఉంది. శివకుమార్, మదార్షా అనే వ్యక్తులు దీన్ని నిర్వహిస్తున్నారు. వృద్ధులు, మానసిక దివ్యాంగులు, అనాథలు అయిన చిన్నారులు, మహిళలు సుమారు 80 మందికిపైగా ఇందులో ఆశ్రయం పొందుతున్నారు. ఇదిలా ఉండగా, మధురై జిల్లా మేలూరు సమీపం సేక్కిపట్టికి చెందిన అజారుద్దీన్ తన గ్రామంలోని అనాథలైన ఐశ్వర్య (22), ఆమె ముగ్గురు పిల్లలను కేర్ సెంటర్లో చేర్పించాడు. ఐశ్వర్య మూడో సంతానమైన మాణిక్యం కరోనా వైరస్‌కు బలైందని, కార్పొరేషన్ సిబ్బంది సహకారంతో శశ్మానంలో ఖననం చేసినట్లు కేర్ సెంటర్ నుంచి అజారుద్దీన్‌కు సమాచారం అందింది. ఈ సమాచారానికి జత చేసిన పత్రాలను అనుమానించిన అజారుద్దీన్ జిల్లా నిర్వాహకులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు తహసీల్దారు, వీఏఓ, శిశు సంక్షేమశాఖాధికారి, పోలీసులు కేర్ సెంటర్లో విచారణ చేపట్టేందుకు వెళ్లగా నిర్వాహకులు శివకుమార్, మదార్షాలు అప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో కేర్ సెంటర్ ముసుగులో గోల్మాల్ జరుగుతోందని దాదాపు నిర్ధారణకు రావడంతో విచారణ బృందం రంగంలోకి దిగింది. కరోనా సోకినందున ఆస్పత్రికి తీసుకెళ్తున్నామని చెప్పి ఈనెల 13వ తేదీన నిర్వాహకులు బిడ్డను తీసుకెళ్లారని ఐశ్వర్య తెలిపింది. కొన్నిరోజుల తరువాత నీ బిడ్డ చనిపోయింది.. ఖననం కూడా పూర్తి చేశాం, అంతిమ సంస్కారాలు చేయాల్సిందిగా శ్మశానంలోని ఒకచోటును చూపెట్టారు. తాను క్రతువు చేస్తుండగా ఫొటోలు తీశారని అధికారులకు ఆమె చెప్పింది. దీంతో ఆశ్చర్యానికి లోనైన విచారణ బృందం..అజారుద్దీన్ వద్ద ఉన్న పత్రాలను పరిశీలించగా నకిలీవని నిర్ధారణ అయింది. వేరే ఒక చిన్నారిని పూడ్చిన చోటునే మాణిక్యంను పూడ్చినట్లుగా చూపి డ్రామా ఆడి నకీలీ పత్రాలు సృష్టించినట్లు స్పష్టమైంది. కేర్ సెంటర్లో ఆశ్రయం పొందుతున్న శ్రీదేవి అనే అనాథ కుమార్తె సహా మొత్తం 16 మంది చిన్నారులను అమ్మి సొమ్ము చేసుకున్నట్లు గుర్తించారు. ప్రభుత్వం నుంచి అనుమతి లేకుండా కేర్ సెంటర్ నిర్వహిస్తున్నట్లు తేలింది. చిన్నారుల తరలింపు వెనుక అవయవాల అమ్మకం వ్యాపారం సాగుతోందా ? లేక సంతానం లేని దంపతులకు విక్రయిస్తున్నారా, నకిలీ పత్రాల జారీలో నిర్వాహకులకు సహకరిస్తున్న అధికారులు ఎవరు అనే కోణంలో లోతుగా విచారణ జరుపుతున్నారు. చిన్నారులను విక్రయించిన తరువాత నకలీ పత్రాలతో అంతిమ సంస్కారాలు జరిపించడం, పలువురు సామాజిక కార్యకర్తలు, పోలీసులు సైతం ఎందరో అనాథలకు ఇక్కడ ఆశ్రయం కల్పించడంతో నిర్వాహకులపై ఎవరికీ అనుమానం రాలేదు. వెయ్యికి పైగా అనాథ శవాలకు అంతిమ సంస్కారాలు పూర్తి చేశానని ప్రచారం చేసుకున్న నిర్వాహకుడు శివకుమార్ గతంలో ప్రభుత్వం నుంచి నగదు బహుమతితో పాటు అవార్డు అందుకోవడం గమనార్హం. చిన్నారుల విక్రయాల బండారం బయటపడడంతో అనాథ శవాల వ్యవహారాన్ని కూడా అనుమానిస్తున్నారు. శివకుమార్, మదార్షా పట్టుబడితేనే ఎంతమంది చిన్నారులను అమ్మారు ? ఎంత ఆర్జించారనే వివరాలు బయటకు వస్తాయని అధికారులు చెబుతున్నారు. శరణాలయం ఇన్చార్జ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న కలైవాణి, అనీషారాణి, సక్కూబాయి–సాధిక్ భార్యాభర్తలను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. శరణాలయంలోని కంప్యూటర్లు, హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకుని శరణాలయానికి సీల్ వేశారు. నిర్వాహకులు శివకుమార్, మదార్షాలను పట్టుకునేందుకు పోలీస్ కమిషనర్ ప్రేమ్ ఆనంద్సిన్హా ఎనిమిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అనాథ శరణాలయం నుంచి అనధికారికంగా చిన్నారులను కొనుగోలు చేసిన నేరంపై గణేశన్, భవానీ, సాధిక్, అనీస్రాణి దంపతులను, శరణాలయం ఉద్యోగి కలైవాణిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. -
కోర్టు శిక్ష: కలెక్టర్‌గారు అనాథాశ్రమంలో ఉండండి
సాక్షి, హైదరాబాద్: కోర్టు ధిక్కరణ కేసులో నల్గొండ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌కు శిక్ష పడింది. ఎవరికీ లేనటువంటి వినూత్న శిక్ష విధిస్తూ తెలంగాణ ఉన్నత న్యాయస్థానం తీర్పు నిచ్చింది. ప్రతివారం రెండు గంటల పాటు నల్గొండ జిల్లాలోని అనథాశ్రమంలోని పిల్లలతో గడపాలని ఆదేశాలు ఇచ్చింది. ఇది ఆరు నెలలపాటు చేయాలని స్పష్టం చేసింది. ఈ ఆదేశాలతో ధిక్కరణ కేసులో కలెక్టర్‌కు విముక్తి లభించింది. కోర్టు ఇలాంటి సామాజిక సేవ తీర్పు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. ఇదే కోర్టు ధిక్కారణ కేసులో మరో అధికారి సంధ్యారాణికి కూడా తెలంగాణ హైకోర్టు శిక్ష విధించింది. ఉగాది, శ్రీరామనవమికి హైదరాబాద్‌లోని అనాథాశ్రయంలోని పిల్లలకు భోజనాలు సమకూర్చాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అయితే వీరికి గతంలో జరిమానా విధించగా ఆ తీర్పుపై అప్పీల్‌కు వెళ్లారు. దీంతో వారిని సామాజిక సేవ చేయాలని న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. -
‘మాట్లాడటానికి ఓ కుటుంబం కావాలి’
అనాథలుగా బతకడం ఎంత కష్టమో చెప్పడానికి మాటలు చాలవు. స్వయంగా అనుభవిస్తే తప్ప ఆ బాధ ఎవరికి అర్థం కాదు. తల్లీతండ్రి ప్రేమకు నోచుకోకుండా.. నా అనే వాళ్లు ఎవరూ లేకుండా బతకడం నరకంతో సమానం. ఈ క్రమంలో ఓ తొమ్మిదేళ్ల అనాథ పిల్లాడి వేదన జనాలను కదిలిస్తోంది. అతడిని దత్తత తీసుకుంటామంటూ ఇప్పటికే 5వేల మంది అప్లై చేశారు. ఈ సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. వివరాలు.. తొమ్మిదేళ్ల జోర్డాన్ తన సోదరుడితో కలిసి గత ఆరేళ్లుగా అనాథాశ్రమంలో ఉంటున్నాడు. కొద్ది రోజుల క్రితం సోదరుడిని ఓ కుటుంబం దత్తత తీసుకుంది. దాంతో మరింత ఒంటరి అయ్యాడు జోర్డాన్. ఈ క్రమంలో కేఎఫ్ఓఆర్ వీక్లీ సిరీస్ ‘ఏ ప్లేస్ టు కాల్ హోమ్’ లైవ్ షోలో తనకంటూ ఓ కుటుంబం ఉంటే ఎంతో సంతోషిస్తానని.. ఓ శాశ్వత కుటుంబం కోసం తాను ఎంత ఆత్రంగా ఎదురు చూస్తున్నాడో తెలియజేశాడు జోర్డాన్. (ఆ ఘటన కలిచివేసింది: దివ్య దేవరాజన్) ఈ షోలో తన మనోవేదనను తెలిపాడు జోర్డాన్. ‘నాకంటూ ఓ కుటుంబం ఉంటే బాగుంటుంది. అమ్మ, నాన్న ఇతర కుటుంబ సభ్యులు. ఇవేం కుదరకపోతే కనీసం అమ్మ, నాన్న ఎవరో ఒకరు ఉన్నా చాలు. నేను మాట్లాడటానికి.. నా మనసులోని భావాలను తెలపడానికి నాకు ఓ కుటుంబం కావాలని బలంగా కోరుకుంటున్నాను. ఈ షో చూస్తున్న వారిలో ఎవరైనా నన్ను దత్తత తీసుకుంటారని ఆశిస్తున్నాను’ అన్నాడు. జోర్డాన్ వేదన పలువురిని కదిలించింది. అతడిని దత్తత తీసుకోవడనానికి ఎందరో ఆసక్తి చూపించారు. ఈ క్రమంలో జోర్డాన్ ఉంటున్న ఆశ్రమానికి అతడిని దత్తత తీసుకుంటామంటూ దాదాపు 5వేల అప్లికేషన్లు వచ్చాయి. ప్రస్తుతం ఆశ్రమ నిర్వహకులు జోర్డాన్‌ను పంపడానికి తగిన వ్యక్తుల కోసం అప్లికేషన్లను పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వహకుడు మాట్లాడుతూ... ‘గతంలో చాలా మంది జోర్డాన్‌ను దత్తత తీసుకెళ్లారు. కానీ అతడు వారి కుటుంబానికి సూట్ కాడని తెలిపి.. తిరిగి ఇక్కడకు తీసుకువచ్చేవారు’ అన్నాడు. -
మాతృదేవతా మన్నించు!
అందరినీ కనే శక్తి అమ్మకే ఉంది.. అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే అన్నాడో సినీ కవి. జన్మనిచ్చిన అమ్మను మించిన గురువు, దైవం మరొకరు లేరంటారు. సృష్టిలో అమ్మకే తొలి ప్రాధాన్యం. కడుపున పుట్టిన ఏడుగురు సంతానం ఆ తల్లిని భారంగా భావించారు. అందరూ ఉండి అనాథాశ్రమంలో చేర్పించారు. 90 ఏళ్ల ముదిమి వయసులో నిరాదరణ, ఒంటరితనాన్ని భరించలేని ఆ అమ్మ ఆత్మహత్యకు పాల్పడింది. చిత్తూరు జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన మానవత్వానికే మాయని మచ్చగా నిలుస్తోంది. సాక్షి, చిత్తూరు: గుడిపాలకు చెందిన పాపమ్మ (90)కు ఇద్దరు కుమారులు, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. పిల్లలందరినీ ఆమె ప్రయోజకులను చేసి పెళ్లిళ్లు చేసింది. వారిలో కొందరు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తుండగా, మరికొందరు ఆర్థికంగా బాగా నే నిలదొక్కుకున్నారు. తల్లికి వయసు పెరగడంతో భారంగా భావించారు. దగ్గరుండి మరీ చిత్తూరు నగరంలోని తపోవనం అనాథాశ్రమంలో చేర్పించారు. అప్పుడ ప్పుడూ కనీసం పలకరించకుండా మొహం చాటేశారు. కాటికి కాళ్లు చాపే ఈ వయసు లో తన బిడ్డలెవరూ దగ్గరలేరనే ఆవేదన చెందింది. చదవండి: ఈ జనానికి ఏమైంది..? ఈనెల 18న బాగా నీరశించడంతో ఆశ్రమ నిర్వాహకులు ఆమెకు గ్లూకోజ్ ద్రావణం ఇచ్చారు. జీవితంపై విరక్తి చెందిన ఆమె మరుగుదొడ్డిలో ఉన్న యాసిడ్‌ను గ్లూకోజ్‌లో కలుపుకుని తాగేసింది. గమనించిన నిర్వాహకులు ఆమెను చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇక్కడ చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచింది. సమాచారం అందుకున్న పోలీసులు వృద్ధురాలి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఏడుగురు సంతానం ఉన్నా ఏ ఒక్కరూ పట్టించుకున్న పాపానపోలేదని స్థానికులు శోకసంద్రంలో మునిగిపోయారు. -
సేవే దైవం
ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు రాఘవా లారెన్స్ నిర్వహిస్తోన్న ఓ అనాథాశ్రమంలోని 18 మంది చిన్నారులకు, ముగ్గురు సిబ్బందికి ఇటీవల కరోనా పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు ఆ చిన్నారులు, ఆ ముగ్గురు సిబ్బంది కరోనా నుంచి కోలుకున్నారని సంతోషం వ్యక్తం చేశారు లారెన్స్. ఈ విషయంపై ఆయన స్పందిస్తూ – ‘‘అందరితో ఓ మంచి విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. నా ట్రస్ట్‌లో ఉంటున్న చిన్నారులు, ముగ్గురు సిబ్బంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. నా సేవే నా పిల్లలను కాపాడిందని భావిస్తున్నాను. పిల్లల కోసం ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. సేవే దైవం’’ అన్నారు లారెన్స్. -
పసిమొగ్గలపై పైశాచికం
న్యూఢిల్లీ: బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఓ అనాథ శరణాలయంలో 34 మంది మైనర్ బాలికలపై నిర్వాహకులు లైంగికదాడికి పాల్పడిన దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ముంబైకి చెందిన టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ సైన్సెస్(టిస్) చేపట్టిన సోషల్ ఆడిట్‌తో ఈ దారుణం బయటపడింది. ముజఫర్‌పూర్‌కు చెందిన బ్రజేష్ ఠాకూర్‌కు చెందిన సంకల్ప్ ఏవం సమితి అనే ఎన్జీవోకు 2013, అక్టోబర్ 21న ఈ అనాధాశ్రమ నిర్వహణకు సాంఘిక సంక్షేమ శాఖ అనుమతి ఇచ్చింది. దీంతో నవంబర్ 1న ఇది పనిచేయడం ప్రారంభించింది. గతేడాది బిహార్ అంతటా ఉన్న 115 ప్రభుత్వ అనాధాశ్రమాల(షెల్టర్ హోమ్స్) స్థితిగతులపై టిస్ తనిఖీలు చేపట్టింది. ఇందుకు సంబంధించిన నివేదికను 2018, ఏప్రిల్‌లో ప్రభుత్వానికి సమర్పించింది. నివేదికలో బ్రజేష్ ఠాకూర్ బాలికలపై లైంగికదాడికి పాల్పడినట్లు తేలడంతో సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ దివేశ్ కుమార్ అతడిపై మే 31న ముజఫర్‌పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన సమయంలో ఈ ఆశ్రమంలో 44 మంది బాలికలు ఉన్నారు. రహస్య మెట్ల దారులు.. అబార్షన్ గది పోలీసులు అనాధాశ్రమంలో తనిఖీలు చేపట్టడంతో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఆశ్రమం నుంచి నిర్వాహకుడు బ్రజేష్ ఇంటికి నేరుగా మూడు మెట్ల మార్గాలు ఉండటాన్ని పోలీసులు కనుగొన్నారు. బాలికలపై అత్యాచారానికి పాల్పడేందుకు వచ్చే దుండగులు ఎవ్వరికీ కన్పించకుండా రహస్యంగా వచ్చేందుకు ఈ ఏర్పాటు చేసుంటారని అనుమానిస్తున్నారు. అలాగే ఇక్కడి బేస్మెంట్లో మత్తుమందుల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దుండుగులు గర్భం దాల్చిన నలుగురు బాలికలకు ఇక్కడే అబార్షన్ చేశారని పోలీస్ ఉన్నతాధాకారి ఒకరు తెలిపారు. వణికిస్తున్న బాధితుల వాంగ్మూలాలు మైనర్ బాలికలు కోర్టుకు ఇచ్చిన వాంగ్మూలాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. బ్రజేష్, అతని స్నేహితులు భోజనంలో మత్తుమందు కలిపి ఇచ్చి తమపై లైంగికదాడికి పాల్పడేవారని ఓ బాలిక(10) తెలిపింది. ఎదురు తిరిగిన అమ్మాయిల్ని తీవ్రంగా కొట్టి, అన్నం పెట్టకుండా, సిగరెట్లతో కాల్చేవారంది. ప్రతీరోజు తమపై ఈ దారుణం కొనసాగేదని, ఇది తట్టుకోలేని మరో బాలిక గాజు ముక్కతో మణికట్టు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిం దని పేర్కొంది. తమను రోజూ నగ్నంగా పడుకోమని ఒత్తిడి చేసేవారనీ, ఒప్పుకోకుంటే తీవ్రంగా కొట్టేవారని ముందు వాపోయింది. ఈ నీచుల దాడిలో ఓ అమ్మాయి చనిపోతే.. మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా రిక్షాలో తీసుకెళ్లి ఎక్కడో పడేసి వచ్చారని చెప్పింది. మరోవైపు 34 మంది బాలికలపై లైంగికదాడి జరిగిందని పరీక్షలు నిర్వహించిన పట్నా వైద్య కళాశాల డాక్టర్లు ధ్రువీకరించారు. -
అనాథల అమ్మ ఇక లేరు
కోటగిరి(బాన్సువాడ) నిజామాబాద్ : కోటగిరి మండల కేంద్రాని కి చెందిన అమ్మ అనాథాశ్రమం వ్యవస్థాపకురాలు పావని(40) అదివారం తెల్లవారుజామున అస్వస్థతతో మృతి చెందారు. పావని కొంతకాలంగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతూ వారంరోజులపాటు హైదరాబాద్‌లో చికిత్స పొంది ఇటీవల స్వగ్రామానికి వచ్చింది. అదివారం కోటగిరిలో పావని అంత్యక్రియలు నిర్వహించారు ఎంపీపీ సులోచన, సర్పంచ్ స్వరూప పలువురు నాయకులు, గ్రామస్తులు హాజరయ్యారు. అనాథ పిల్లలకు అమ్మగా.. తల్లితండ్రులను కోల్పోయి దిక్కులేని అ«నాథలుగా మారిన చిన్నారులను «అక్కున చేర్చుకుని 13 ఏళ్లక్రితం అమ్మ అనాథ ఆశ్రమాన్ని పావని ఏర్పాటు చేశారు. ఇద్దరు పిల్లలతో ఆశ్రమాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం ఇరవై మంది అశ్రమంలో ఉంటున్నారు. సొంత స్థలం లేకున్నా, అధికారుల సహకారంతో ప్రభుత్వ స్థలం సేకరించి, విరాళాలతో అనాథ పిల్లల కోసం శాశ్వత భవనం ఏర్పాటు చేసింది. ఆశ్రమంలో పెరిగిన అనాథ అమ్మాయి భారతికి ఇటీవల వివాహం కూడా చేశారు పావని. పావని మృతి వార్త తెల్సుకున్న పలువురు కంట తడిపెట్టారు. -
ఆమె ఆశ్రయం గొప్పది
అనంతపురం రూరల్ మండలం కాట్నేకాలువ గ్రామంలో ఓ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు దేవి. కృష్ణమ్మ. లక్ష్మిరెడ్డిల దంపతులకు ముగ్గురు సంతానం. కాగా ఆమె రెండవ సంతానం. నిరుపేద కుటుంబం కావడంతో అప్పట్లో ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉండేది. పూట గడవడమే కష్టంగా మారిన ఆ కాలంలో దేవిని పాఠశాలకు కూడా పంపించలేని పరిస్థితి ఆ తల్లిదండ్రులది. బుద్ధి వచ్చేంత వరకూ ఇంటి వద్ద పనులు చేసుకుంటూ.. ఓ వయస్సు వచ్చాక తల్లిదండ్రులకు తోడుగా వ్యవసాయ పనులకు వెళ్లేది. ఇల్లు్ల, పొలం పనులు తప్ప మరేవిషయం తెలీదు. ఆ సంఘటనతో మలుపు అనంతపురం సెంట్రల్: 1992లో మేనమామ అయిన కృష్ణారెడ్డితో దేవికి వివాహమైంది. తొలినాళ్లలో వ్యవసాయ పనులపైనే ఆధారపడి భార్యభర్తలు జీవించారు. ఒక రోజు నగరానికి వచ్చిన కృష్ణారెడ్డి జోరువానకు వనుకుతున్న వృద్ధులను చూసి చలించారు. వారికి సపర్యలు చేసి ఇంటికి వెళ్ళాడు. ఆలస్యంగా వెళ్లడంతో ఎందుకింత ఆలస్యమైందని దేవి అడిగింది. అప్పుడు కృష్ణారెడ్డి జరిగిన విషయాన్ని వివరించారు. వయస్సులో సత్తువ ఉన్నన్నాళ్లు కుటుంబాన్ని పోషించేందుకు కష్టపడిన వృద్ధులు జీవిత చరమాంకానికి వచ్చే సమయానికి రోడ్డు పాలు కావడం బాధాకరమని ఇద్దరూ చర్చించుకున్నారు. అదే వారిని సేవామార్గంలో పయనించడానికి నాంది పలికింది. కొద్దిరోజుల పాటు సేవలందించినా తర్వాత ఏకంగా వృద్ధాశ్రమాన్నే నెలకొల్పి ప్రభుత్వాలు కూడా చేయలేని పనిని ఓ మహిళ చేసి నిరూపిస్తోంది. అనాథ తల్లిదండ్రులకు అమ్మలా మారి సేవచేస్తోంది. కడుపున పుట్టిన పిల్లలు కాదన్న వృద్ధులను అక్కున చేర్చుకొని వారి ఆలనపాలన చూసుకుంటున్నారు. దేవి సేవలను గుర్తించిన పలు సంస్థలు అవార్డులతో సత్కరించాయి. ఒడిదుడుకులతో ప్రారంభం దేవీ దంపతులకు స్వగ్రామంలో ఉండేందుకు చిన్న ఇల్లు్ల మాత్రమే ఉంది. ఎక్కడా ఒక్క సెంటు స్థలం కూడా లేదు. ఈ సమయంలో అనాథాశ్రమం నిర్మించాలని తలంచారు. ఏం చేయాలో తెలియక ఎవరైనా స్థలం ఇస్తారా అని ఆరా తీశారు. అయ్యావారిపల్లి వద్ద ఓ వ్యక్తి స్థలం ఇవ్వడానికి ముందుకు వచ్చారు. రూ. 20 వేలు ఖర్చు పెట్టి పనులు ప్రారంభించారు. అయితే అక్కడ కొంతమంది వ్యతిరేకించడంతో సదరు స్థలం యజమాని అనాథాశ్రమానికి ఇవ్వనని చెప్పేశారు. దీంతో స్వగ్రామంలోనే రక్తసంబంధీకులను ఒప్పించి వృథాగా ఉన్న స్థలంలో అనాథాశ్రమం ప్రారంభించారు. అయితే సదరు స్థలంలో పెద్ద పాడుబడ్డబావి ఉండటంతో దానిని పూడ్చటానికి డబ్బులు ఖర్చు అయ్యాయి. అనంతరం ఇళ్లు నిర్మించడానికి అప్పులయ్యాయి. వీటిని తీర్చడానికి పూర్వీకుల నుంచి వస్తున్న సొంతింటిని సైతం వదులుకోవాల్సి వచ్చింది. అనాథాశ్రమం నిర్మాణం కోసం ఇంటిని కూడా అమ్మకానికి పెట్టారు. ఆ వచ్చిన డబ్బుతో అప్పులు చెల్లించి.. మిగిలిన మొత్తంతో అనాథాశ్రమాన్ని నడపడం మొదలు పెట్టారు. తొలినాళ్లలో ఎవరూ సాయం అందించకపోవడంతో అష్టకష్టాలు పడ్డారు. ఆశ్రమానికి మంచి పేరు రావడంతో ఇప్పుడిప్పుడే సేవలో పాలు పంచుకోవడానికి దాతలు ముందుకొస్తున్నారు. ప్రస్తుతం దాతల సహకారంతోనే అనాథాశ్రమాన్ని నడుపుతున్నారు. ఎగతాళులూ ఎక్కువే దేవితో పాటు ఆయన భర్త చేస్తున్న సేవా కార్యక్రమాన్ని చూసిన వారి బంధువులు ఎగతాళి చేశారు. మీకేమైనా పిచ్చి పట్టిందా? మీ తల్లిదండ్రులైతే పట్టించుకోవాలి. ఊరందరి గురించి మీకేం అవసరం అంటూ ఎగతాళి చేశారు. అయితే వారి వాదనలను దేవి సున్నితంగా తిప్పికొట్టారు. అవసరమైతే మీరంతా మా ఇంటికి రాకున్నా పర్వాలేదు అని ఎదురించారు. సేవలోనే పరమార్థం దాగి ఉందని తెలుసుకున్న ఆమె ఏకంగా వృద్ధాశ్రమాన్నే నెలకొల్పాలని నిర్ణయించుకున్నారు. మొక్కవోని దీక్షతో అనుకున్న సంకల్పాన్ని నెరవేర్చారు. తొలుత ఒకరిద్దరితో ఆరంభమైన అనాథాశ్రమంలో నేడు 35 మంది ఆశ్రయం పొందుతున్నారు. రోజూ వారికి స్నానాల దగ్గర నుంచి అని సపర్యలు దేవీనే చూసుకుంటున్నారు. అన్నీతానై... వృద్ధాశ్రమానికి వస్తున్న వారిలో ఎక్కువశాతం జీవితచరమాంకంలో ఉన్న వారే. మొత్తం 32 మందిలో సగం మంది మంచానికే పరిమితం అయ్యారు. అలాంటి వారికి స్నానం చేయించడం దగ్గర నుంచి స్నానాలు చేయించడం, అన్నం తినిపించడం కూడా చేయాల్సి వస్తోంది. ప్రతిరోజూ 32 మందికి మూడు పూటల భోజనం చేయడం కత్తిమీద సాములా మారింది. అయినప్పటికీ ఏమాత్రం బరువుగా భావించకుండా ప్రతి రోజూ వారికి అన్ని తానై సేవలందిస్తున్నారు. ఎక్కువ మంది రోగాల బారిన పడుతుండటం, మానసికంగా ఇబ్బందులు చెందుతుండటంతో ప్రభుత్వ మానసిక వైద్యులు డాక్టర్ ఎండ్లూరి ప్రభాకర్వద్ద చికిత్సనందిస్తున్నారు. ప్రతి వారం ఆయన ఆశ్రమానికి వెళ్లి వృద్ధులకు ఉచితంగా చికిత్సనందిస్తున్నారు. ఊపిరి ఉన్నంత వరకూ సేవ చేస్తా మలిసంధ్యలో ఏ తోడు లేని వారికి సేవ చేసే భాగ్యం నాకు కలిగింది. ఇది దేవుడిచ్చిన వరంగా భావిస్తాను. తొలుత నా భర్త చేస్తున్న సేవా కార్యక్రమంలో తాను తోడు అందించాలని భావించా. ఇప్పుడు 35 మందికి ఆశ్రయం కల్పిస్తున్నాను. ఏనాడు బరువుగా భావించలేదు. నా ఊపిరి ఉన్నంత వరకూ సేవా చేయాలని అనుకుంటున్నా. నాతో పాటు నాభర్త, నా ఇద్దరు కూమారులు కూడా వీరిని చూసుకోవడానికే ఉన్నాం. – యర్రగుంట్ల దేవి,ఆశ్రయ అనాథాశ్రమం నిర్వాహకురాలు సేవకు సత్కారం వృద్ధులకు సేవలందిస్తూ అందరిచే శభాష్ అనిపించుకుంటున్న దేవీ సేవలకు గుర్తింపు లభించింది. ఆశ్రయ అనాథాశ్రమం గురించి తెలుసుకున్న పలు స్వచ్ఛంధ సంస్థలు ఆమెను సత్కరించాయి. ఇటీవల సాహితీగగన్మహల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనంత ఆణిముత్యాలు పురస్కారం అందజేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో తిరుపతిలో అవార్డు అందించారు. సహిత మహిళా సమాఖ్య, ఇన్నర్‌వీల్ సంస్థలు సంయుక్తంగా దేవీని సత్కరించాయి. బయోడేటా పేరు : యర్రగుంట్ల దేవి స్వగ్రామం : పాలచెర్ల, రాప్తాడు మండలం తల్లిదండ్రులు : కృష్ణమ్మ, లక్షీరెడ్డి కుటుంబ నేపథ్యం: నిరుపేద కుటుంబంలో జన్మించారు విద్యార్హత : పేదరికంతో చదువుకోలేదు వివాహ నేపథ్యం : 1992లో కాట్నే కాలువకు చెందిన మేనమామ కృష్ణారెడ్డితో వివాహం కుమారులు : రాజశేఖరరెడ్డి, మధుసూదన్‌రెడ్డి (మేనరికం పెళ్లి కావడంతో బుద్ధిమాంద్యంతో జన్మించారు. దీంతో చదువు మాన్పించాల్సి వచ్చింది. ప్రసుత్తం వృద్ధులకు సేవలో కుటుంబంఅంతా పాలుపంచుకుంటున్నారు) -
అనాథ పిల్లలతో భిక్షాటన!
హైదరాబాద్: అనాథ పిల్లలతో భిక్షాటన చేయిస్తున్నారనే ఫిర్యాదుతో వనస్థలిపురంలోని గ్రేషియస్ పారడైస్ అనాథ ఆశ్రమంపై అధికారులు దాడులు నిర్వహించారు. పోలీసుల సహకారంతో బాలల సంరక్షణ కమిటీ అధికారులు ఈ దాడులు జరిపారు. ఆశ్రమ నిర్వాహకుడు, మాజీ ఉద్యోగి సత్యానంద్ పరారీలో ఉన్నాడు. కాగా, ఈ ఆశ్రమంలోని18 మంది అనాథ పిల్లలను నింబోలి అడ్డలోని ప్రభుత్వ వసతి గృహానికి తరలించారు. -
అనాథ పిల్లలకు ఆత్మీయ ఫౌండేషన్
బాధిత కుటుంబానికి నిత్యావసర సరుకులు అందచేత చిన్నారిని చదివించేందుకు కృషి చేస్తామని హామీ మనూరు: మండల పరిధిలోని కరస్‌గుత్తి గంగారాం తండాలో గత నెల 19న ఒకేరోజు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిన అయిదుగురు పిలల్ల కుటుంబాన్ని ఆత్మీయ ఫౌండేషన్ హైదరాబాద్‌వారు ఆసరాగా నిలిచారు. ఆదివారం సంస్థ నిర్వహకులు బాధిత కుటుంబానికి నిత్యావసర వస్తువులు, దుస్తులు అందచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనాథలుగా మారిన బాధితులకు తమ సంస్థ అండగా ఉంటుందన్నారు. నలుగురిలో చిన్నదైన లత(8)ను తాము దత్తత తీసుకుని ఉన్నత చదువులు చదివించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఇందుకు సంబంధించి స్థానిక తండావాసులతో వారు చర్చించారు. ఇందుకు తండావాసులు అంగీకరించడంతో చట్టబద్దంగా చిన్నారిని త్వరలోనే తీసుకెళ్తామన్నారు. కార్యక్రమంలో ఫౌండేషన్ సంస్థ ప్రతినిధులు గుమ్మడి కిరణ్, వెన్నెల, ఎం.సువర్ణ, అనిల్, పవన్, నిఖిల్, రాజ్‌మోహన్, మండల బంజారాసేవాలాల్ సంఘం అధ్యక్షుడు రాందాస్‌రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.