‘ఇదయం జెరియాట్రిక్ కేర్ సెంటర్’కు సీలు వేస్తున్న అధికారులు
పేరుకు ప్రజాసేవ.. అనాథలకు ఆశ్రయం కల్పించి తరిస్తున్నట్లు బిల్డప్.. ‘అయ్యా..ఎవరూ లేరు. ఆదుకోండి’..అంటూ శరణు కోరి వచ్చిన వారికి ఆశ్రయం కల్పించడం.. ఆ తరువాత ఆ అనాథ చిన్నారులను అమ్మి సొమ్ము చేసుకోవడం వారికి నిత్యకృత్యం. ఇలాంటి దురాగతాలకు పాల్పడుతున్న ఓ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. శరణాలయానికి సీలు వేసి, నలుగురిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ఇద్దరు ప్రధాన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.
సాక్షి ప్రతినిధి, చెన్నై: మధురై రిజర్వ్‌లైన్ నివాస ప్రాంతాల మధ్య ‘ఇదయం జెరియాట్రిక్ కేర్ సెంటర్’ పేరుతో ఓ అనాథ శరణాలయం ఉంది. శివకుమార్, మదార్షా అనే వ్యక్తులు దీన్ని నిర్వహిస్తున్నారు. వృద్ధులు, మానసిక దివ్యాంగులు, అనాథలు అయిన చిన్నారులు, మహిళలు సుమారు 80 మందికిపైగా ఇందులో ఆశ్రయం పొందుతున్నారు. ఇదిలా ఉండగా, మధురై జిల్లా మేలూరు సమీపం సేక్కిపట్టికి చెందిన అజారుద్దీన్ తన గ్రామంలోని అనాథలైన ఐశ్వర్య (22), ఆమె ముగ్గురు పిల్లలను కేర్ సెంటర్‌లో చేర్పించాడు. ఐశ్వర్య మూడో సంతానమైన మాణిక్యం కరోనా వైరస్‌కు బలైందని, కార్పొరేషన్ సిబ్బంది సహకారంతో శశ్మానంలో ఖననం చేసినట్లు కేర్ సెంటర్ నుంచి అజారుద్దీన్‌కు సమాచారం అందింది.
ఈ సమాచారానికి జత చేసిన పత్రాలను అనుమానించిన అజారుద్దీన్ జిల్లా నిర్వాహకులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు తహసీల్దారు, వీఏఓ, శిశు సంక్షేమశాఖాధికారి, పోలీసులు కేర్ సెంటర్‌లో విచారణ చేపట్టేందుకు వెళ్లగా నిర్వాహకులు శివకుమార్, మదార్షాలు అప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో కేర్ సెంటర్ ముసుగులో గోల్‌మాల్ జరుగుతోందని దాదాపు నిర్ధారణకు రావడంతో విచారణ బృందం రంగంలోకి దిగింది. కరోనా సోకినందున ఆస్పత్రికి తీసుకెళ్తున్నామని చెప్పి ఈనెల 13వ తేదీన నిర్వాహకులు బిడ్డను తీసుకెళ్లారని ఐశ్వర్య తెలిపింది. కొన్నిరోజుల తరువాత నీ బిడ్డ చనిపోయింది.. ఖననం కూడా పూర్తి చేశాం, అంతిమ సంస్కారాలు చేయాల్సిందిగా శ్మశానంలోని ఒకచోటును చూపెట్టారు. తాను క్రతువు చేస్తుండగా ఫొటోలు తీశారని అధికారులకు ఆమె చెప్పింది. దీంతో ఆశ్చర్యానికి లోనైన విచారణ బృందం..అజారుద్దీన్ వద్ద ఉన్న పత్రాలను పరిశీలించగా నకిలీవని నిర్ధారణ అయింది.
వేరే ఒక చిన్నారిని పూడ్చిన చోటునే మాణిక్యంను పూడ్చినట్లుగా చూపి డ్రామా ఆడి నకీలీ పత్రాలు సృష్టించినట్లు స్పష్టమైంది. కేర్ సెంటర్‌లో ఆశ్రయం పొందుతున్న శ్రీదేవి అనే అనాథ కుమార్తె సహా మొత్తం 16 మంది చిన్నారులను అమ్మి సొమ్ము చేసుకున్నట్లు గుర్తించారు. ప్రభుత్వం నుంచి అనుమతి లేకుండా కేర్ సెంటర్ నిర్వహిస్తున్నట్లు తేలింది. చిన్నారుల తరలింపు వెనుక అవయవాల అమ్మకం వ్యాపారం సాగుతోందా ? లేక సంతానం లేని దంపతులకు విక్రయిస్తున్నారా, నకిలీ పత్రాల జారీలో నిర్వాహకులకు సహకరిస్తున్న అధికారులు ఎవరు అనే కోణంలో లోతుగా విచారణ జరుపుతున్నారు.
చిన్నారులను విక్రయించిన తరువాత నకలీ పత్రాలతో అంతిమ సంస్కారాలు జరిపించడం, పలువురు సామాజిక కార్యకర్తలు, పోలీసులు సైతం ఎందరో అనాథలకు ఇక్కడ ఆశ్రయం కల్పించడంతో నిర్వాహకులపై ఎవరికీ అనుమానం రాలేదు. వెయ్యికి పైగా అనాథ శవాలకు అంతిమ సంస్కారాలు పూర్తి చేశానని ప్రచారం చేసుకున్న నిర్వాహకుడు శివకుమార్ గతంలో ప్రభుత్వం నుంచి నగదు బహుమతితో పాటు అవార్డు అందుకోవడం గమనార్హం. చిన్నారుల విక్రయాల బండారం బయటపడడంతో అనాథ శవాల వ్యవహారాన్ని కూడా అనుమానిస్తున్నారు.
శివకుమార్, మదార్షా పట్టుబడితేనే ఎంతమంది చిన్నారులను అమ్మారు ? ఎంత ఆర్జించారనే వివరాలు బయటకు వస్తాయని అధికారులు చెబుతున్నారు. శరణాలయం ఇన్‌చార్జ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న కలైవాణి, అనీషారాణి, సక్కూబాయి–సాధిక్ భార్యాభర్తలను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. శరణాలయంలోని కంప్యూటర్లు, హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకుని శరణాలయానికి సీల్ వేశారు. నిర్వాహకులు శివకుమార్, మదార్షాలను పట్టుకునేందుకు పోలీస్ కమిషనర్ ప్రేమ్ ఆనంద్‌సిన్హా ఎనిమిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అనాథ శరణాలయం నుంచి అనధికారికంగా చిన్నారులను కొనుగోలు చేసిన నేరంపై గణేశన్, భవానీ, సాధిక్, అనీస్‌రాణి దంపతులను, శరణాలయం ఉద్యోగి కలైవాణిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment