సమాజం ఎప్పుడు మగవారు చేసే పనికే విలువ ఇస్తుంది. మగవారు అంటేనే శక్తిమంతులు, ఏమైనా చేయగలరు అనే భావనలో ఉంటుంది. స్త్రీ అంటే బలహీనురాలు, ఇంటిని చక్కపెట్టుకోవడం వరకే ఆమెకు చేతనవుతుంది అనే అనుకుంటుంది. కానీ ఇక్కడ మనందరం ఒక విషయాన్ని మరవకూడదు భారత స్వాతంత్ర పోరాటానికి పునాది వేసిందే ఒక మహిళా....నేటి మారుతున్న సమాజంతో పాటు స్త్రీ పాత్ర కూడా మారింది. ప్రస్తుతం భారతీయ మహిళా అంటే కేవలం ఇంటికే పరిమితమయ్యే ఒక అబల కాదు. నేడు ప్రతిరంగంలో వారు దూసుకుపోతున్నారు. తమను బంధించే సనాతన ఆచార సంప్రదాయాలను తెంచుకుని ప్రతిరంగంలో తమదైన ముద్ర వేస్తున్నారు. కేవలం ఇంటిని చక్కబెట్టడం మాత్రమే కాకుండా సామాజిక మార్పు కోసం కృషి చేస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. వారిలో ప్రముఖమైన మహిళా సామాజిక సంఘసంస్కర్తల గురించి తెలుసుకుందాం.....
ఝాన్సీ లక్ష్మీబాయి
భారత స్వాతంత్ర పోరాటంలో తొలి ఘట్టం 1857లో జరిగిన ‘‘సిపాయిల తిరుగుబాటు’’. చరిత్రకేక్కిన ఈ సంఘటనలో పాల్గొన్నది ఒకే ఒక్క మహిళ. కానీ చాలామందికి తెలియని ఆ వీరనారే ఝాన్సీ లక్ష్మీభాయి. భారతీయ స్త్రీ అంటే కేవలం అందానికి మాత్రమే కాదు ధైర్యానికి ప్రతీక అని నిరూపించింది. బ్రిటిష్ వారి కబంధ హస్తాలనుంచి దేశాన్ని విడిపించడం కోసం విరోచితంగా పోరాడి మిగితా వారికి స్ఫూర్తిగా నిలిచింది.
సరోజిని నాయుడు
భారత స్వాతంత్ర పోరాటంలో చిరస్థాయిగా నిలిచిపోయే మరో వనిత సరోజిని నాయుడు. ఆమెకున్న బిరుదు భారత కోకిల. శాసనోల్లంఘన ఉద్యమంతో పాటు ఎన్నో ఉద్యమాలలో కీలక పాత్ర పోషించింది. గొప్ప కవయిత్రి కూడా. స్వతంత్ర భారతదేశంలో గవర్నర్ పదవి నిర్వహించిన తొలి మహిళ. దేశంలో ప్లేగు వ్యాధి వ్యాపించినప్పుడు ఆమే చేసిన సేవలకు మెచ్చి బ్రిటిష్ ప్రభుత్వం ఆమేను కైసెర్-ఐ-హింద్ పతకంతో సత్కరించింది.
అరుణ రాయ్
మన దేశంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో అవినీతి వల్ల బాధపడినవారే. కానీ ఎవ్వరూ ముందుకు వచ్చి దీనిగురించి పోరాడినవారు లేరు అలాంటి సందర్భంలో అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలని, ప్రభుత్వంలో పారదర్శకతను తీసుకురావాలని నిర్ణయించుకుంది ఒక మహిళ. ఆమే అరుణ రాయ్. ఒక టీచర్ గా తన ప్రయాణాన్ని ప్రారంభించి తర్వాత గొప్ప సామాజిక కార్యకర్తగా మారింది. ఆమె 1967 సంవత్సరంలోఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్)పరీక్షలో ఉత్తీర్ణురాలైంది. కార్మికులు మరియు రైతులు మేలు కోసం స్థాపించినన మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్ (ఎమ్‌కేఎస్‌ఎస్)లో చేరి ప్రముఖ నాయకురాలిగా ఎదిగింది. సమాచార హక్కు చట్టం (ఆర్ టి ఐ) రావాడానికి కారణం ఆమే చేసిన కృషే. అవినీతి రహిత సమాజం కోసం ఆమే చేస్తున్న కృషికి గాను ఎన్నో అవార్డులు అందుకుంది.
మేధాపాట్కర్
ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నో ప్రాజేక్టులను తలపెడుతుంది. కానీ దాని వల్ల నిర్వాసితులైన వారి గురించి మాత్రం పట్టించుకోదు. అలాంటివారి తరుపున నిలబడి పోరాడుతున్న మహిళ మేధా పాట్కర్. ఒక ప్రముఖ కార్మిక నాయకుడి ఇంట్లో జన్మించిన పాట్కర్‌కు సమాజసేవ అంటే మక్కువ. కార్మికులు,రైతుల జీవితాలను మెరుగుపర్చడం ఆమే లక్ష్యం. ఆమే చిన్నతనం నుంచే సమాజసేవను ప్రారంభించింది. కానీ నర్మాదా బచావో ఆందోళన ద్వారా అందరికి ఆమే పరిచితురాలయ్యింది.
కిరణ్ బేడి
పరిచయం అవసరంలేని మహిళ. మనదేశంలో పోలీసులంటే అందరికి భయమే, స్త్రీలకయితే మరీనూ. అలాంటి రంగంలో మొట్టమొదటి మహిళా ఐపీఎస్ అధికారి కిరణ్ బేడి. ఆమే ప్రముఖ సామాజిక కార్యకర్త. కిరణ్ బేడి సంకల్పం, అంకితభావం ఉంటే ప్రతి ఒక్కరూ తన లక్ష్యాన్ని సాధించవచ్చనడానికి ఆమె ఒక ఉదాహరణ. పశ్చిమ ఢిల్లీలో ఐపిఎస్ అధికారిగా ఆమె బాధ్యతలు చేపట్టిన తర్వాత మహిళలపై జరిగే నేరాలు తగ్గుముఖం పట్టాయి. తీహార్ జైల్లో ఆమె తీసుకువచ్చిన సంస్కరణలకు గాను ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందింది. 1993లో రామన్ మెగసెసే అవార్డును కూడా అందుకుంది. యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్‌కి మొదటి పోలీస్ సలహాదారుగా కిరణ్ బేడి నియమితురాలయ్యింది.
షాహీన్ మిస్త్రీ
సమాజంలోని అసమానతలకు ప్రధాన కారణం విద్య. మనదేశంలో విద్యాహక్కును ప్రాధమిక హక్కుగా గుర్తించినప్పటికీ నేటికి ఎంతో మందికి అది అందని ద్రాక్షేగానే మిగిలింది.ఇలాంటి పరిస్ధితుల్లో మురికివాడల పిల్లల పరిస్థితి మరీ దారుణం. అలాంటి ముంబై మురికివాడల్లోని పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడం కోసం కృషి చేస్తున్న వ్యక్తి షాహీన్ మిస్త్రీ. ముంబైలో సామాన్య కుటుంబంలో పుట్టినన షాహీన్ మిస్త్రీ సమాజంలో విద్యా సమానత్వం కోసం ముంబయి మురికివాడల పిల్లలకు విద్యా సదుపాయాలు కల్పించడం కోసం చేసిన పోరాటాలు నేడు ఆమేకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చాయి. ముంబాయి మురికివాడల్లోని పిల్లలకు నాణ్యమైన విద్యను అందిచడం కోసం ఆమే ‘‘ఆకాంక్ష ఫౌండేషన్’’ను స్థాపించింది. ఆమే చేసిన సేవలకు గాను ఎన్నో గ్లోబల్ పురస్కారాలను అందుకుంది.
ఇరోమ్ షర్మిల
ఈశాన్య రాష్ట్రాలు ప్రకృతి అందాలకే కాదు, ఎల్లప్పుడు సైనిక పహారాలో ఉండే ప్రాంతాలుగా ప్రాచుర్యం పొందాయి. అక్కడి సాయుధ దళాలకు కేంద్రం ఎన్నో ప్రత్యేక అధికారాలను కల్పించింది. దాంతో వారి విచ్చలవిడితనానికి హద్దులు లేకుండా పోయింది. ఇందుకు నిదర్శనం ‘‘మాల్కం-ఊచకోత’’. ఈ ఘటనలో పదిమంది అమాయకులను కారణం లేకుండా హతమార్చాయి సైనిక దళాలు. ఈ దాడితో చలితురాలై, ఏకధాటిగా 500వారాల పాటు నిరహారదీక్ష చేస్తూ ఉక్కుమహిళాగా గుర్తింపు పొందింది మణిపూర్‌కు చెందిన ఇరోమ్ షర్మిల. కేంద్రం ఏడు ఈశాన్య రాష్ట్రాల్లో అమలు చేస్తున్నసాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం ఉపసంహరణకోసం షర్మిల చేపట్టిన ఈ దీక్ష ప్రపంచంలోనే సుదీర్ఘ నిరాహార దీక్ష.
ప్రమీలా నెసర్గి
ప్రమీలా నెసర్గి వృత్తిరిత్యా న్యాయవాది ప్రవృత్తిరిత్యా మహిళల హక్కుల కోసం పోరాడే ఒక ప్రసిద్ధ సామాజిక కార్యకర్త. స్వతంత్ర న్యాయవాది అయినా ఆమే బాల కార్మికులు,లైంగిక హింస, మహిళల భద్రత, ఖైదీల దుస్థితి వంటి కొన్ని తీవ్రమైన సమస్యలకు వ్యతిరేకంగా పోరాడుతుంది. తన వృత్తిలో భాగంగా పలు వివాదాస్పద సమస్యలను చేపట్టి అనేక విమర్శలు ఎదుర్కొంది.
లక్ష్మి అగర్వాల్
తమ మొహం మీద చిన్న మొటిమ, మచ్చ వస్తేనే ఆడపిల్లలు భరించలేరు, అలాంటిది మొహం మీద యాసిడ్‌దాడి జరిగితే వారి పరిస్థితి వర్ణానాతీతం. నలుగురిలో కలవడం కాదు కదా అసలు సమాజమే వారిని దూరం పెడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో తనకు జరిగిన అన్యాయం మరే ఆడపిల్లకు జరగకూడదని మహిళల పట్ల జరిగే శారీరక, మానసిక హింసకు వ్యతిరేకంగా పోరాడుతుంది లక్ష్మి అగర్వల్ ఓ యాసిడ్ దాడి బాధితురాలు. ఈ ఘటన తర్వాత సుప్రీం కోర్టు యాసిడ్ అమ్మకాలకు కొన్ని నియంత్రణలను రూపొందించింది, యాసిడ్ దాడులకు వ్యతిరేకంగా కొన్ని కఠిన చట్టాలను చేసింది. ప్రస్తుతం లక్ష్మీ అగర్వాల్ భారతదేశంలో యాసిడ్ దాడుల నిరోధానికి నిర్వహిస్తున్న కార్యక్రమానికి ప్రచారకురాలిగా, టీ.వీ. వ్యాఖ్యతగా వ్యవహరిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment