ధరణీ మాత
శంషాబాద్: ఊరు గాని ఊరికి అమ్మ తోడుగా వచ్చారు. అరణ్యం లాంటి ప్రదేశంలో ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లారు. ఆమే ‘ధరణీ మాత’. తల్లిదండ్రులు పెట్టిన పేరు ధరణీ భాను. కానీ ‘మాత’గానే సుపరిచయం. ప్రభుత్వ పథకాలకు భూమిని విరాళంగా ఇచ్చి ‘ధరణి దాత’య్యారు. ధర్మసాయి నిలయాన్ని పూర్తి చేసేందుకు ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. గిట్టనివాళ్లు ఊరు విడిచి వెళ్లమన్నప్పుడు మనోనిబ్బరాన్ని సడలించకుండా తన సేవా ప్రయాణాన్ని కొనసాగించారు. ప్రస్తుత సమాజంలో మహిళలలు మనో ధైర్యం కోల్పోకుండా బతకాలంటున్నారామె. తన ప్రయాణంలో ఎదురైన పరిస్థితులను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ అనుభవాలు ఆమె మాటల్లోనే..
నేను బెంగళూరు నగరంలో జన్మించాను.. నాన్న సుందరాజ్ అయ్యంగార్, అమ్మ సుందరమ్మకు రెండో సంతానాన్ని. మా అక్క ప్రముఖ గణిత శాస్త్రజ్ఞురాలు శకుంతలాదేవి. చిన్ననాటి నుంచే ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణం ఉండేది. నాన్న సాయిబాబా భక్తుడు నేను ఆయన బాటలోనే ప్రయాణించాను.
ఆలయం కోసం ఇక్కడికి..
1988లో బాబా ఆలయ నిర్మాణం కోసం మా బాబాయిని తోడుగా నా మదిలో మెదిలిన శంషాబాద్ ఊరు చివరలో ఉన్న ఈ కొండ ప్రాంతానికి వచ్చాను. ఇక్కడే ఆలయం నిర్మించాలని స్థలం కొనుగోలు చేశా. అక్కడ మొదలైన కష్టాలు కొన్నేళ్ల పాటు వెంటాడాయి. ఆలయ నిర్మాణం కొందరికి నచ్చలేదు. దాడులు చేసేందుకు ప్రయత్నించారు. కానీ నా ఆశయానికి స్థానికులు కొందరు అండగా నిలబడ్డారు. దుష్ట శక్తుల ప్రయత్నం నాలో మరింత ధైర్యాన్నిచ్చింది. ఇక్కడే శాశ్వతంగా ఉండాలని నిశ్చయించుకుని ఆలయం పూర్తి చేశాను. ఆసరా కోసం వచ్చే అతివలకు అండగా ఉంటున్నాను.
అది మా అదృష్టం..
శంషాబాద్ కరెంటు కష్టాలు తీర్చేందుకు మూడేళ్ల క్రితం అదనపు సబ్‌స్టేషన్ నిర్మించాలని విద్యుత్ శాఖ నిర్ణయించింది. ఆలయాని వచ్చిన అధికారులు స్థలం గురించి అడిగారు. కరెంటు కష్టాలు తగ్గాలనే ఉద్దేశంలో వెంటనే వేయి గజాల స్థలాన్ని విద్యుత్ శాఖకు ఇచ్చాను. మిషన్ భగీరథ ప్రాజెక్టులో భాగంగా ఇటీవల జలమండలి భారీ రిజర్వాయర్ కోసం ఎంతో విలువైన 1200 గజాల స్థలాన్ని ఇచ్చాను. ఇవన్నీ గ్రామ ప్రజలకు మేలు చేసేవే. ఇది మాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నా.
మహిళల ఆలోచనలో మార్పు రావాలి
సమాజంలో ఆడవాళ్లకు ఆడవారే శత్రువులుగా ఉండడం బాధ కలిగిస్తుంది. బాలికల పెంపకం నుంచి మొదలవుతున్న వివక్ష అలాగే కొనసాగుతోంది. మహిళలు తమను తాము తక్కువగా అంచనా వేసుకోవడంతోనే ఇంకా సాధికారత కోసం పోరాటాలు చేయాల్సి వస్తోంది. ఈ పరిస్థితి పూర్తిగా మారాలి.. తాము పడ్డ కష్టాలు సాటి ఆడబిడ్డ పడకూడదని భావించాలి. ధైర్యంగా ముందడుగు వేయాలి.
Comments
Please login to add a commentAdd a comment