జీవితం..రంగస్థలం | Rangasthalam drama artist vijayakumari special story | Sakshi
Sakshi News home page

జీవితం..రంగస్థలం

Published Sat, Mar 3 2018 10:37 AM | Last Updated on Sat, Mar 3 2018 10:37 AM

Rangasthalam drama artist vijayakumari special story - Sakshi

సినీనటి రాజశ్రీ చేతుల మీదుగా అవార్డునందుకుంటూ..

సొంత ఇల్లే కాదు.. సొంత ఊరు అంటూ లేని దుర్భర బతుకు. తల్లిదండ్రులు పెట్టేబేడా సర్దుకుని ఎక్కడికెళితే అక్కడకు పయనం.  పొట్ట కూటి కోసం రంగస్థలాన్ని నమ్ముకుని జీవిస్తున్న కళాకారుల జీవితం.ఇలాంటి స్థితిగతుల నుంచే వచ్చారు విజయకుమారి. పాశ్చాత్య  సంస్కృతి మోజులో పట్టణ, నగర ప్రాంతాల్లో రంగస్థల నాటకాలకు ఆదరణ తగ్గినా.. పల్లె సీమలు అక్కున చేర్చుకున్నాయి. కళాపోషకులు ఔదార్యం చాటుకుంటూ వచ్చారు. ఒడిదుడుకుల జీవితంలో కాసింత ఊరటనందించారు. అదే విజయకుమారికి కొండంత అండగా నిలిచింది. కష్టాల కడలి నుంచి తీరం వైపుగా కుటుంబ నావను నెట్టుకువచ్చే ప్రయత్నంలో ఆమెచివరికంటా సాగిస్తున్న పోరాటం స్ఫూర్తిదాయకం.     

అనంతపురం కల్చరల్‌: సొంతూరు ఇది అంటూ చెప్పలేను
మా సొంతూరు ఏది అంటే నిర్ధిష్టంగా ఇది అంటూ చెప్పలేను. రంగస్థలంపై ఆధారపడి జీవించే కుటుంబం కావడం వల్ల చాలా ఇబ్బందులుండేవి. ఆ రోజుల్లో కాపురాలన్నీ డేరాల్లోనే జరిగిపోయేవి. నాన్న రామారావు ఒంగోలు వద్ద కోటవరంలో జన్మించారని చెప్పేవారు. అమ్మ భవానమ్మ కూడా ఆ చుట్టుపక్కలే జన్మించినట్లు అనుకుంటున్నాం. మాకైతే కచ్చితంగా తెలీదు. నాన్న తబలా వాయిస్తూండేవారు. అమ్మ నాటకాల్లో వేషాలు వేస్తుండేవారు.  ముఖ్యంగా భారతీయ నాటక రంగాన్ని మలుపు తిప్పిన వారు సురభి నాటక సమాజంలో వారు కళాకారులు. ఆ రోజుల్లో నాటక సమాజాల్లో అందరమూ కలిసున్నా ఎవరి తిండి, ఎవరి బట్టలు వారివే కావడం వల్ల ఆర్థిక ఇబ్బందులు చాలా ఉండేవి. నన్ను ఫ్రీ హాస్టల్‌లో చేర్పించి చదివించారు.

చిన్నవయసులోనే నటప్రస్థానం
సురభి నాటక సమాజంలో     పిల్లలు పుట్టారంటే వారు కూడా రంగస్థల ప్రవేశం చేయాల్సిందే. అలా నా 12వ ఏట  ‘శ్రీ కృష్ణలీలలు’ నాటకంలో బాలకృష్ణుడి పాత్రలో నేను నటించాను. కిరాయికే నాటకాలు ఆడేవాళ్లు. బుధవారం వచ్చిందంటే జీతాలిచ్చేవారు. ఒకటి రెండు పాత్రల తర్వాత నన్ను నెల్లూరులోని వాకాడ హాస్టల్లో చదువుకోమని వదిలిపెట్టారు. అక్కడ చదువుకుంటూనే పీటర్‌ మాస్టర్‌ వద్ద సంగీతం, కృష్ణమాచార్యుల వద్ద భరత నాట్యం నేర్చుకున్నాను.

కుటుంబంపై ప్రభావం
మేము ముగ్గురం అక్కాచెళ్లలం. నేను పెద్దదాన్ని. 1953లో బాసర క్షేత్రంలో నిండు గర్భిణిగా ఉన్న మా అమ్మ రంగస్థలంపై నర్తిస్తున్నప్పుడు అమ్మవారి సన్నిధిలో నేను జన్మించాను.  మా చెల్లెలు మనోహరమ్మ అద్భుతమైన ఆర్టిస్టు. పెళ్లి తర్వాత రంగస్థలానికి ఆమె దూరమయ్యారు. కొన్నాళ్లు హరికథలు కూడా చెప్పేది. మరో చెల్లెలు లీలావతి చిన్నప్పటి నుంచి రంగస్థలానికి దూరంగా ఉండిపోయింది. తమ్ముడు ఆనంద్‌ మేకప్‌ ఆర్టిస్టుగా కొనసాగుతున్నాడు. మరో తమ్ముడు రమేష్‌ కాస్తంత దూరంగానే ఉన్నాడు. ఇక మా ఆయన సెల్వం. ఆయన పుట్టి పెరిగింది తమిళనాడైనా అనంతకొచ్చి స్థి«రపడ్డారు. మా పెళ్లికి ముందు మా పక్కింట్లోనే ఉండేవారు. ఆయన మంచి మేకప్‌ ఆర్టిస్టే. ఆరేళ్ల కిందట ఆయన చనిపోయారు. మా పెద్ద కూతురు   విజయశారదకు పెళ్లయింది. మంచి నటీమణి.  ఇప్పటికీ నాటకాలు వేస్తూ ఉన్నారు. ఇంకొక కూతురు రాజేశ్వరికి నాటక విద్య అబ్బలేదు. కొడుకు కిరణ్‌కుమార్‌ మంచి డాన్సర్‌. వాడు కూడా రంగస్థలాన్నే నమ్ముకున్నాడు. చిత్రమేమంటే పీజీల దాకా వారంతా బాగా చదువుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు రాక రంగస్థలంపైనే ఉండిపోవాల్సి వచ్చింది.

అనంతలో స్థిర నివాసం
సురభి నాటక సమాజంలో ఉంటూ దేశ దిమ్మరులుగా ఉన్న మేము 1972లో అనంతపురం వచ్చి స్థిరపడ్డాం. ఇల్లు గడవాలంటే నాటకాలు వేయడం మినహా మాకు మరో గత్యంతరం లేదు. పెళ్లి తర్వాత నేను ముఖానికి మళ్లీ రంగుపూసుకోవాల్సి వచ్చింది. సినిమాల ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల రంగస్థల నాటకాలను చూసేందుకు వచ్చే వారి సంఖ్య క్రమేణా తగ్గుతూ వచ్చింది. ఆ సమయంలోనే రంగస్థలంపై ఎన్నో ప్రయోగాలు చేస్తూ వచ్చాం. సొంతంగా ఎస్‌ఆర్‌కే నాటక సమాజాన్ని స్థాపించి రాష్ట్రమంతటా వివిధ ప్రదర్శనలు ఇచ్చాం. కొత్త ప్రయోగాలతో కళాభిమానులను అలరించాం. 2002లో జిల్లాలో తొలిసారి మేమే పోటీ నాటకాలను వేయించాం. ప్రఖ్యాత నటులు గుమ్మడి గోపాలకృష్ణ, సినీనటులు సుత్తివేలు వంటి వారిని న్యాయనిర్ణేతలుగా ఏర్పాటు చేశాం. మా స్వీయ దర్శకత్వంలో వచ్చిన ‘సాయిబాబా విజయ లీలలు’ నాటకం అప్పట్లో అనంత వాసులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. అలాగే 2011లో ‘శ్రీనివాస కల్యాణం’ నాటిక సినిమాను చూసిన అనుభూతిని ప్రేక్షకులకు మిగిల్చింది. కళా స్రవంతి సంస్థ ద్వారా మరోసారి అనంతపురంలోని లలితాకళాపరిషత్‌లో పోటీ నాటకాలు ఆడించాం.

ప్రభుత్వ ఆదరణ అంతంతే..
అనకూడదు కానీ ప్రభుత్వం మాకు ఎన్నో చేయొచ్చు. రూ. లక్షలు ఖర్చు పెట్టి నాటకాలు వేస్తే ప్రభుత్వం కేవలం రూ.8 వేలు, మరోసారి రూ.10 వేలు ఇచ్చి చేతులు దులుపుకుంది. న్యాయపరంగా పింఛన్లయినా ఇస్తే అదే పదివేలు. 60 ఏళ్లకే పింఛన్‌ ఇస్తున్నామంటారు. నాకిప్పుడు 66 ఏళ్లు. నాకిప్పటికీ పింఛన్‌ రావడం లేదు. ఈ ఐదేళ్లలో లెక్కకు మించి చాలా సార్లు దరఖాస్తులు అందజేస్తూ వచ్చాను. ఎందుకు పింఛన్‌ ఇవ్వడం లేదో స్పష్టంగా ఎవరూ చెప్పలేకపోతున్నారు. 45 ఏళ్లకే పింఛన్, హెల్త్‌ కార్డులు జారీ చేస్తే కళాకారులకు ఎంతో ఊరటగా ఉంటుంది.

పల్లెలు బతికిస్తున్నాయి
రంగస్థల కళనే వృత్తిగా మార్చుకుని జీవించే కుటుంబాలు ఈ జిల్లాలో చాలా ఉన్నాయి. తెర లేచినప్పటి నుంచి నాటకం అయిపోయే వరకు ఈలలు వేస్తూ సాగే ఉత్సాహం.. ఆసక్తి ఎంతో పల్లెల్లో మేము చూశాం. టికెట్టు కొని బండ్లు కట్టుకుని వచ్చి నాటకాలు చూసేవారు. పల్లెల్లో ఉన్నట్లుగా కళాపోషకులు పట్టణ ప్రాంతాల్లో కరువయ్యారు. పల్లె వాసుల ఔదార్యమే మమ్మల్ని బతికిస్తోంది.

కళాకారుల కాలనీ అద్భుతం
నా 53 సంవత్సరాల రంగస్థల అనుభవంతో చెబుతున్నాను. రాష్ట్రంలో ఎక్కడా లేనట్లుగా అనంతపురంలో కళాకారులు ఐక్యతతో ఓ కాలనీని ఏర్పాటు చేసుకున్నాం. అప్పట్లో అనంతపురం ప్రజా ప్రతినిధులు కళాకారులను ప్రోత్సహించారు.  ప్రస్తుత ప్రజా ప్రతినిధులు  కళాకారుల పట్ల సానుభూతి చూపు తున్నారు. కాలనీలో ఎవరైనా కళాకారులు చనిపోతే దహన సంస్కారాలను అందరూ కలిసి చేసుకుంటాం. ఎంతో ఆదర్శంగా జీవిస్తున్న మా కాలనీలో మౌలిక వసతులు లేవు.

40 ఏళ్లకే రోగాల పుట్ట
రంగు పూసుకుని, చిరునవ్వులు చిందిస్తూ లేని సంతోషాన్ని కనబరచే కళాకారుల జీవితాల్లో అనేక బాధలూ ఉన్నాయి. ప్రకృతికి విరుద్ధంగా తెల్ల ్లవార్లు మేల్కొనడం... సరైన తిండితిప్పలు లేకపోవడంతో 40 ఏళ్లకే దాదాపు అనారోగ్య సమస్యలు చుట్టుముడుతుంటాయి. ఫ్లడ్‌లైట్ల వెలుగుల వల్ల కంటి చూపు దెబ్బ తింటోంది. నిద్ర లేమి వల్ల తలనొప్పి ఎక్కువగా వస్తుంటుంది. ముఖానికి వేస్తున్న రంగుల్లో తేడాలొస్తే చర్మవ్యాధుల బారిన పడాల్సి వస్తుంది. అంతేకాక తరచూ రంగు వేయడం వల్ల ముఖ సౌందర్యం తగ్గి పోతోంది. మైక్‌ సిస్టం సక్రమంగా లేకపోవడ వల్ల స్థాయికి మించి గట్టిగా అరవడం, రాగాలు తీయడం వల్ల గొంతు, గుండెజబ్బులు వచ్చే అవకాశాలెక్కువ.  ఇలాంటి దశలోనే ఒక కిడ్నీ చెడిపోవడంతో చాలా ఇబ్బంది పడ్డాను. నాటకాలు ఆపేస్తే పిల్లల చదువులు, పెళ్లిళ్లు ఎలా చేయాలని మదనపడ్డాను. అలాగే అతి కష్టంపై నాటకాలు ఆడుతూ వచ్చాను. అప్పట్లో ఆరోగ్యశ్రీ నన్ను ఆదుకుంది. విచిత్రమేమంటే మత్తు ఇంజక్షన్‌ కూడా వేయించుకోకుండా కేవలం సంగీతం వింటూ ఆపరేషన్‌ చేయించుకున్నా. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు రెండో కిడ్నీ సమస్య తలెత్తింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement