
వాళ్లు మున్సిపల్ పార్కు పచ్చిక బయిళ్లపై హాయిగా కబుర్లు చెప్పుకుంటారు. నవ్వుకుంటారు. చాయ్ తాగుతారు. సైకిళ్లు అద్దెకు తీసుకుని పొద్దున్నే నగరంలో లాంగ్ రైడ్‌కు పోతారు. ఇవన్నీ సరదా కోసం కాదు.. పబ్లిక్ స్పేస్‌పై స్త్రీలకూ సమాన హక్కులున్నాయనే విషయం చాటి చెప్పడానికి. వీళ్లనే ‘లోయిటర్ గాళ్స్’ అంటున్నారు.
‘లోయిటర్’ అంటే – పనితో నిమిత్తం లేకుండా విశ్రాంతపూర్వకంగా నడవటం, తారట్లాడటం అన్నమాట.‘వై లోయిటర్? విమెన్ అండ్ రిస్క్ ఆన్ ముంబయ్ స్ట్రీట్స్’ పుస్తకాన్ని చదివారు పై మహిళలు. ఆ పుస్తకం స్ఫూర్తితోనే నేహాసింగ్, దేవినా కపూర్ కలసి ముంబయిలో వై లోయిటర్ మూమెంట్‌కి శ్రీకారం చుట్టారు. జైపూర్, అలీఘర్, పుణే మహిళలు కూడా ఈ ఉద్యమంలో భాగమయ్యారు.
పుణే గాళ్స్ స్వాగత్ బస్ స్టాండ్‌లో కబుర్లాడుకుంటారు. అలీఘర్ అమ్మాయిలు మెన్స్ కాలేజీలోని కాఫీ హౌస్‌లో కలుసుకుంటారు. పబ్లిక్ స్పేస్‌లో మరింత మంది స్త్రీలు కనబడటమనేది ఒక చక్కటి మార్పుకు దోహదపడుతుందని ‘లోయిటర్ గాళ్స్’ సహా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న కార్యకర్తలు చెబుతున్నారు. ‘గాళ్స్ అట్ దాబాస్’ మూమెంట్ కూడా ఇలాంటిదే. 2015లో కరాచీ యూనివర్సిటీకి చెందిన సారా నిసార్ సహా ముగ్గురు యూనివర్సిటీ విద్యార్థులు ఈ ఉద్యమానికి నాంది పలికారు.