దలాల్‌స్ట్రీట్ అమ్మలు.. అదేంటి ఇలా అంటున్నారు. దేశీయ స్టాక్ మార్కెట్లకు వీరు అమ్మలా..? అంటే కాదండోయ్. వీరు కూడా సాధారణ మహిళలే. రోజూ ఉదయాన్నే ఐదు గంటలకు లేవడం, ఇంటి పనులన్నింటిన్నీ చకాచకా పూర్తిచేయడం, పిల్లలను సిద్ధం చేసి, బాక్సులతో స్కూళ్లకి పంపించడం.. ఇలా రోజూవారీ పనులు వీరు చక్కబెట్టాల్సిందే. అయితే కుటుంబానికి, పిల్లల వరకే తమ సమయం, ఆసక్తి పరిమితం కాకూదనుకున్నారు. ఇంట్లో ఉండి కూడా స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా కూడా ఎలా రాణించాలా అని ఆలోచించారు. ఆలోచనతోనే ఆగిపోలేదు.. తమ బుర్రలకు మరింత పదును పెట్టారు. నిరంతరం ట్రేడింగ్.. లాభాలు, నష్టాలు, విశ్లేషణ.. నిరంతరం ఇదే ఆలోచనతో రాటు దేలారు. అంతే..షేర్ మార్కెట్ రాణులుగా కాదు.. కాదు..అమ్మలుగా మారిపోయారు.
అయితే ఇది ఒక రోజులోనో..ఒకనెలలోనో వచ్చి వరించిన విజయం కాదు. ఇంట్రాడేలో తాము చేసిన ట్రేడింగ్‌ను ఎపుడూ సమీక్షించుకునేవారు. కొన్న అమ్మిన షేర్ల వివరాలను రాత్రి పడుకునే ముందు ఒక్కసారి అనాలసిస్ చేసుకోవడం..రివ్యూ చేసుకోవడమనే కార్యక్రమాన్ని ఒక వ్రతంలా చేసేవారు. ఇలా సుదీర్ఘం పయనం తర్వాత తామనుకున్న లక్ష్యాన్ని చేధించగలిగారు. వారిలో ఓ ఇద్దరి గురించి ఇపుడు తెలుసుకుందాం..
అను రాయ్ ప్రమోద్ : అను కంపెనీ సెక్రటరీగా ఉత్తీర్ణురాలయ్యారు. కానీ వివాహ అనంతరం ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. అయినా ఎక్కడా ఒత్తిడికి గురి కాలేదు. కుంగిపోలేదు.. చుట్టూ ఉన్న పరిస్థితులనుంచే ఎదగడం నేర్చుకుంది. తాను చదివిన చదువుకు సార్థకత కోసం స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించింది. ప్రస్తుతం తను ఓ మంచి గృహిణిగానే కాకుండా... ఇన్వెస్టర్‌గా కూడా రాణిస్తోంది. తన పెట్టుబడుల్లో ఎక్కువగా దీర్ఘకాలికమైనవే. అదేవిధంగా రోజువారీ ట్రేడింగ్‌లో పాల్గొంటు కూడా మంచి సంపదను ఆర్జిస్తోంది. ఇంట్లోనే ఉంటూ పలు కంపెనీలతో తాను ఇంటరాక్ట్ అవుతున్నట్టు చాలా గర్వంగా చెబుతారు ఆమె. ఫార్మాస్యూటికల్స్, బ్రెవరీస్, రియల్ ఎస్టేట్, టెలికాం లాంటివి ఆమె ఫేవరేట్ సెక్టార్లు.
పరుల్ భార్గవ శర్మ : కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో తనకు ఎంతో ఇష్టమైన ఎంబీఏ వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆఫీసు వ్యవహారాలన్నింటికీ తానే పెద్ద దిక్కైంది. అదే సమయంలో పరుల్ మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. అసలే మ్యాథ్స్ అంటే అయిష్టం. పైగా గణాంకాలతో కూడుకున్న పని. భయపడుతూనే స్టాక్ మార్కెట్ పెట్టుబడులోకి దూకేసింది. భర్త, తండ్రి ప్రోత్సహంతో స్టాక్‌మార్కెట్‌పై అవగాహన పెంచుకోవడం ప్రారంభించింది. ఒకసారి తన ఐదో పెళ్లి వార్షికోత్సవం రోజున లంచ్‌కు ల్యాప్‌టాప్ కూడా పట్టుకెళ్లాల్సినవసరం వచ్చిందని, ఆ సమయంలో తన చుట్టూ ఉన్న ప్రజలు చేసిన కామెంట్లు ఎప్పటికీ మరిచిపోలేనని చెబుతోంది. అప్పటి నుంచి నా లైఫ్‌ను తిరిగి చూసుకోకుండా... కిచెన్‌లో సైతం పురుష ఆధిపత్యం ఉన్న స్టాక్ మార్కెట్‌లో ఎలా రాణించాలో ఆలోచించే దాన్ని అని చెప్పింది. స్టాక్‌మార్కెట్‌పై తన స్వీయ బోధన ఎంతో ప్రోత్సాహాన్ని కలిగించిందని, తన క్లయింట్స్‌కు నమ్మదగ్గ సలహాదారిగా రాణిస్తున్నట్టు ఎంతో గర్వంగా ఫీలవుతోంది.
ఇలా అవసరానికి ఒకరు.. చదువుకు సార్థకత కోసం మరొకరు స్టాక్‌మార్కెట్లో రాణిస్తున్నారు. ఉద్యోగం మానేయాల్సిన పరిస్థితుల్లో కూడా ఏమాత్రం అధైర్య పడకుండా.. తాము సంపాదించిన మనీని పెట్టుబడులుగా ఎలా అభివృద్ధి చేసుకోవాలో ప్లాన్లు కూడా వేసుకుంటున్నారు. ఇలా దలాల్‌స్ట్రీట్ అమ్మలుగా పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఇది కేవలం దేశీయ గృహిణీల స్టోరీ మాత్రమే కాదు. ప్రపంచ స్టాక్‌మార్కెట్లలో అమ్మల స్టోరీ కూడా. కొద్ది మంది గృహిణీలు ఇలా వినూత్నంగా ఆలోచిస్తూ.. ఇంట్లోనే ఉంటూ స్టాక్‌మార్కెట్ ఇన్వెస్టర్లుగా రాణిస్తున్నారు. వీరి సంఖ్య గణనీయంగా పెరగడం విశేషం. దానికి ఈ కింది గణాంకాలే నిదర్శనం. యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటా ఐపీయూఎంఎస్ క్వీన్స్ కళాశాల సోషియాలజీ విభాగం డేటా విడుదల చేసిన అనాలసిస్‌లో 1980లో వాల్‌స్ట్రీట్ అమ్మలుగా 2,980 మంది ఉంటే, 2011 నాటికి వారు 21,617 మంది అయ్యారు.
- కొటేరు. శ్రావణి
Comments
Please login to add a commentAdd a comment