ఎగిరే మనసు ఆత్మవిశ్వాసమే ఆయుధం | handiacapped woman special story on women empowerment | Sakshi
Sakshi News home page

ఎగిరే మనసు ఆత్మవిశ్వాసమే ఆయుధం

Published Thu, Feb 15 2018 8:07 AM | Last Updated on Thu, Feb 15 2018 8:34 AM

handiacapped woman special story on women empowerment - Sakshi

తన ఈవెంట్లను దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాంకు వివరిస్తున్న వసుంధర(ఫైల్‌)

‘‘స్టీఫెన్‌ హాకిన్స్‌.. అసాధ్యాలను సుసాధ్యం చేసి యావత్‌ ప్రపంచాన్ని అబ్బురపరిచిన ఈ శాస్త్రవేత్త దివ్యాంగుడు. మూడు చక్రాల బండిలో కూర్చొని కదల్లేని స్థితిలోనూ అంతరిక్షాన్ని జయించాడు. కుల వృత్తులు మొదలు.. రాజకీయాలు.. ఉద్యోగాలు.. ఈ రంగంలోనూ తాము తీసిపోమని నిరూపిస్తున్నా ఇప్పటికీ దివ్యాంగులంటే చులకనే. పోటీ ప్రపంచానికి ఎదురొడ్డి రాణిస్తున్నా.. అవకాశాల విషయంలో అవిటితనం అడ్డుపడుతోంది. కాదు.. సాకుగా చూపుతున్నారు. ఈ వివక్ష ఇంకెన్నాళ్లు. ఒక్కసారి ప్రోత్సహించి చూడండి..    వెన్నుతట్టి ముందుకు నడిపించండి. జాలి వద్దు.. ఆటుపోట్లను ఎదుర్కొనే ఆత్మస్థైర్యం ఇవ్వండి.’’ – కొప్పుల వసుంధర

పోలియో మహమ్మారి రెండు కాళ్లను మింగేసింది. పట్టుదలతో చదువులో రాణించింది. జర్నలిజంలో పీజీ పూర్తి చేసింది. ఉద్యోగం వస్తే జీవితంలో స్థిరపడవచ్చని భావిస్తే.. అడుగడుగునా వివక్ష ఎదురయింది. అయ్యో పాపం అనే వాళ్లే కానీ.. అవకాశం కల్పించే మనసు ఏ ఒక్కరికీ లేకపోయింది. ఇంతటితో జీవితం అయిపోయిందని  బాధపడుతూ కూర్చోలేదు. తనకు తాను అవకాశాలను సృష్టించుకుని, ఆకాశమే హద్దుగా సాగిపోతోంది. పది మందికి సాయపడాలనే మంచి మనసు స్ఫూర్తి బాటలో పయనిస్తోంది. జిల్లాలోని మారుమూల ప్రాంతమైన శెట్టూరులో జన్మించిన దివ్యాగురాలు వసుంధర.. మూడు చక్రాల కుర్చీలో నుంచే సొంత ఊరు ఖ్యాతిని జాతీయ స్థాయిలో చాటి భళా అనిపిస్తోంది.

శెట్టూరు: కళ్యాణదుర్గం నియోజకవర్గం శెట్టూరుకు చెందిన ప్రమీలమ్మ, ఆనందరావు దంపతుల కుమార్తె కొప్పుల వసుంధర. చిన్నప్పుడు పోలియో సోకడంతో రెండు కాళ్లు చచ్చుబడ్డాయి. ఆమె జీవితాన్ని వైకల్యం వెక్కిరించింది. అదే సమయంలో ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న తండ్రిని కూడా కోల్పోయింది. నేనున్నానని వెన్నుదన్నుగా నిలిచే మనుషులు కరువయ్యారు. అంతులేని వివక్షను చవిచూసింది. సానుభూతి చూపులు తనకు వద్దనుకున్న వసుంధర ఆత్మవిశ్వాసంతో చదువుల తల్లి ఒడిలో ఎదిగింది. జీవితంలో పైకి చేరుకోవాలంటే చదువు ఒక్కటే మార్గమని భావించిన ఆమె పట్టుదలతో జర్నలిజంలో పీజీ పూర్తి చేసింది.

ముందుకు నడిపిన సంకల్పం
సంకల్పం ఉంటే సాధించలేనిది ఏదీ లేదని వసుంధర నిరూపించారు. తనకంటూ ఓ కెరీర్‌ని ఏర్పాటు చేసుకునే క్రమంలో అంతులేని వివక్షను ఎదుర్కొన్నారు. తల్లి ప్రమీలమ్మ ప్రోత్సాహం ఆమెను ముందుకు నడిపించింది. జీవితంలో ఏది సాధించాలన్నా చదువు ముఖ్యమని చెప్పిన తల్లి మాటలను గుండెల్లో నింపుకొని అక్షరాలతో చేసిన స్నేహం ఒక్కో మెట్టును ఎక్కించింది. తనను ఉన్నత స్థాయిలో చూడాలనుకున్న మాతృమూర్తి ఆకాంక్షను నెరవేర్చే దిశగా సీఏ కోర్సులో చేరింది. ఆ సమయంలోనే ఆమె జీవితం అనుకోని మలుపు తిరిగింది. తనలో దాగున్న రచనా వ్యాసంగాన్ని గుర్తించి జర్నలిజంలో పీజీ చేశారు. ఆ తర్వాత ఉద్యోగాన్వేషణలో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎన్నో పత్రికా సంస్థలను ఆశ్రయించినా.. ఒక్కరూ అవకాశం కల్పించలేకపోవడంతో ఆమెను కలచివేసింది. చివరకు ఓ లోకల్‌ చానల్‌ ఆమెకు అవకాశం కల్పించింది. అలా మొదలైన ప్రస్థానంలో ఆమెను ప్రతిభను గుర్తించి మరికొన్ని సంస్థలు కూడా వెన్నుతట్టి ప్రోత్సహించాయి. మిగిలిన వాళ్లకంటే ఎక్కువగా శ్రమిస్తున్నా.. ‘స్పెషల్‌ కేటగిరీ’ అనే పదం ఆమెను ఆలోచింపజేసింది.

అంధుల కోసం ప్రత్యేకంగా..
మూడేళ్ల తర్వాత 2014లో ‘వీవ్‌’ అనే మీడియా సంస్థను స్థాపించి ఈవెంట్స్‌ చేపట్టారు. ఉపాధి కల్పనలో భాగంగా స్థాపించిన సంస్థ కావడంతో ముందుకు నడిపించేందుకు ఎంతో శ్రమించారు. పుట్టిన రోజులు.. పెళ్లిళ్లు.. శుభకార్యాలు, కార్పొరేట్‌ సంస్థల ప్రారంభోత్సవాల్లో ఈవెంట్‌ మేనేజర్‌గా రాణించేందుకు చాలా శ్రమించాల్సి వచ్చింది. ఆమెను చూసిన తొలి రోజుల్లో ‘ఏం చేయిస్తుందని’ చాలా మంది అవకాశాలు ఇచ్చేందుకు వెనుకంజ వేశారు. అయితే ఆమెలోని పట్టుదలను చూసి ఒక్కో అవకాశం ఆమెకు ఎదురేగి స్వాగతం పలికింది. అతనికాలంలోనే 2014లో అంధ క్రికెటర్ల కోసం ప్రత్యేకంగా వీసీసీఎల్‌ టోర్నీ నిర్వహించారు. మూడు రోజుల పాటు హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో రూ.3 లక్షల సొంత డబ్బుతో టోర్నీని విజయవంతం చేశారు. ఆమెలోని క్రియేటివిటీని గుర్తించి ఈవెంట్లను ఇచ్చి ప్రోత్సహించే వారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘మిస్‌ ఎబిలిటీ–18’ పేరిట వికలాంగుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు హైదరాబాద్‌లో ఓ ఈవెంట్‌ ఏర్పాటు చేశారు. ఆ సేవలకు గుర్తుగా రాష్ట్ర ప్రభుత్వం జాతీయ మహిళా పార్లమెంటరీ సదస్సులో ఘనంగా సన్మానించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement