handicapped woman
-
మానసిక వికలాంగురాలిపై లైంగికదాడి
పాయకాపురం (విజయవాడ రూరల్)/లబ్బీపేట (విజయవాడ తూర్పు)/సాక్షి, అమరావతి: విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో మానసిక వికలాంగురాలిపై ముగ్గురు యువకులు లైంగికదాడికి పాల్పడ్డ ఘటన కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు.. నిందితులు ముగ్గురిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. ఘటన వివరాలు.. విజయవాడ వాంబే కాలనీకి చెందిన ఒక మహిళ.. మానసిక వికలాంగురాలు (23) అయిన తన కూతురు కనిపించడం లేదంటూ ఈ నెల 19న నున్న పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు చిన్న క్లూ ఆధారంగా ప్రభుత్వాస్పత్రిలో చెదల నివారణ కాంట్రాక్టర్ వద్ద పనిచేసే దారా శ్రీకాంత్ శేఖర్‌ను ఫోన్లో విచారించారు. యువతి తన వద్దకు వచ్చిందని.. అయితే ఈ సమయంలో ఎందుకు వచ్చావంటూ ఆటో ఎక్కించి పంపించేశానని శ్రీకాంత్ తొలుత చెప్పాడు. తదుపరి విచారణలో బాధిత యువతి ఆస్పత్రి ఎ–బ్లాక్ రెండో అంతస్తులో చెదల నివారణ సామగ్రి ఉంచే గదిలో ఉన్నట్లు తెలుసుకుని పోలీసులు అక్కడకు వెళ్లారు. ప్రభుత్వాస్పత్రిలో తనకు ఉద్యోగం ఇప్పిస్తానంటూ మాయమాటలు చెప్పి శ్రీకాంత్ లైంగికదాడి చేశాడని యువతి ఆవేదన వ్యక్తం చేసింది. మరుసటి రోజు అదే గదిలో శ్రీకాంత్ వదిలివెళ్లిపోగా మరో వర్కర్ బాబూరావు, అతడి స్నేహితుడు పవన్ కళ్యాణ్ తనపై లైంగికదాడికి పాల్పడ్డారని బోరుమంది. దీంతో పోలీసులు యువతి మిస్సింగ్ కేసును రేప్ కేసుగా మార్చి వైద్య పరీక్షల కోసం ప్రభుత్వాస్పత్రికి పంపారు. తర్వాత దిశ పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాల ద్వారా ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కాగా, లైంగిక దాడికి పాల్పడ్డ ఇద్దరు కార్మికులను తొలగించడంతోపాటు ఘటన జరిగిన ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి.సౌభాగ్యలక్ష్మి కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. కాంట్రాక్టును కూడా రద్దు చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. స్టాఫ్ నర్సుతోపాటు నైట్ డ్యూటీ హెడ్ నర్సుకు మెమోలు ఇవ్వనున్నట్లు తెలిపారు. -
వెక్కి వెక్కి ఏడ్చాను.. కానీ
‘శారీరక వైకల్యం శాపం అనుకుంటారు. నిజానికి.. వికలాంగులను చూసి నానా మాటలూ అనే మానసిక వైకల్యమే అన్నింటి కంటే పెద్ద శాపం’ అంటారు అంతర్జాతీయ మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ మాళవిక అయ్యర్. అంతేకాదు, అలా మాట్లాడేవాళ్లకు తన ప్రసంగాలను లేపనంగా రాస్తున్నారు! తమిళనాడుకు చెందిన మాళవిక. పదమూడేళ్ల వయస్సులోనే అర చేతులు కోల్పోయినప్పటికీ ధైర్యంతో ముందుకు సాగి గొప్ప వక్తగా ఎదిగారు. సామాజిక శాస్త్రంలో డాక్టరేట్ పొంది దివ్యాంగులకు ఆదర్శప్రాయంగా నిలిచారు. ఇటీవల ‘వరల్డ్ డిజెబిలిటీ డే’ సందర్భంగా శారీరక వైకల్యం ఉన్న వారి పట్ల సమాజం అనుసరించాల్సిన తీరు గురించి సోషల్ మీడియాలో హృదయానికి హత్తుకునేలా ప్రసంగించారు. ఆ ప్రసంగంలోని ముఖ్యాంశాలివి. వెక్కి వెక్కి ఏడ్చాను ‘‘ఇది పదిహేడేళ్ల క్రితం నాటి మాట. నా రెండు చేతులు రక్తపు మడుగులో మునిగిపోయినపుడు నేను అంతగా ఏడ్వలేదు. డాక్టర్లు నా చేతుల్లో ఇనుప రాడ్లు వేసినపుడు కూడా ఎక్కువ బాధ పడలేదు. కానీ ఆస్పత్రి బెడ్ మీద ఉన్నపుడు నా పక్కనున్న ఆడవాళ్లు మాట్లాడిన మాటలు విని వెక్కివెక్కి ఏడ్చాను. ‘జనరల్ వార్డులో కొత్త అమ్మాయి చేరిందట. తను నిజంగా శాపగ్రస్తురాలే. ఇక తన జీవితం ముగిసిపోయినట్లే’ అంటూ నా గురించి ఏవేవో మాట్లాడుకుంటున్నారు. అప్పుడే మొదటిసారిగా నా కళ్ల నుంచి ధారాపాతంగా కన్నీళ్లు కారాయి. గ్రెనేడ్ పేలుడులో అర చేతులు కోల్పోయిన నాకు భవిష్యత్తే లేదన్నట్లుగా వారు మాట్లాడారు. ఆ మాటలను అంగీకరించడానికి నా హృదయం అప్పుడు సిద్ధంగానే ఉంది. అయితే నా కుటుంబం, స్నేహితులు ఇచ్చిన ప్రోత్సాహం నాలో కొత్త ఉత్సాహం నింపింది. వారి చొరవతోనే నేనింత వరకు రాగలిగాను. నిజానికి దివ్యాంగుల పట్ల సమాజం స్పందించే తీరు సరిగా లేదు. ప్రతి ఒక్కరికీ అటిట్యూడ్ ప్రాబ్లం ఉంటుంది’’ అని మాళవిక అన్నారు. నిరాశ పరచకూడదు ‘‘నిజానికి మానసిక వైకల్యమే అన్నింటి కంటే పెద్ద శాపం. ఎదుటివారిని ప్రోత్సహించకపోయినా ఫర్వాలేదు కానీ నిరాశ చెందేలా మాట్లాడకూడదు. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో దాదాపు 26.8 కోట్ల మంది దివ్యాంగులు ఉన్నారు. మొత్తం జనాభాలో వీరిది 2.21 శాతం. ఆర్థికాభివృద్ధి, సామాజికాభివృద్ధి వంటి పెద్ద పెద్ద విషయాల గురించి మాట్లాడే ముందు ప్రతీ ఒక్కరు దివ్యాంగుల పట్ల తాము ప్రవర్తిస్తున్న తీరు గురించి ఆలోచించుకోవాలి. వారిని సమాజంలో మమేకం చేసి.. ఉద్యోగ భద్రత కల్పించి తమ కాళ్లపై తాము నిలబడేలా చేయాలి. శారీరక వైకల్యం ఉంటే ఇక జీవితం ముగిసినట్లే అనే మాటలు మానుకోవాలి. దివ్యాంగులనంతా ఒక్కచోట చేర్చడం కాదు.. వారికి ఏమేం అవసరమో గుర్తించి... వాటిని సమకూర్చాలి. అలా చేసినపుడే సమాజంతో వారు కలిసిపోగలుగుతారు. లేదంటే ఆత్మన్యూనతాభావంతో కుంగిపోతారు. అందుకే బాల్యం నుంచే ప్రతి ఒక్కరు వివక్ష లేకుండా పెరిగే వాతావరణం కల్పించాలి’’ అని మాళవిక అన్నారు. ‘చారిటీ’ వస్తువులు కారు ‘‘విద్యావిధానంలోనూ మార్పులు రావాలి. శారీరక వైకల్యం ఉన్న వారిని చారిటీ వస్తువులుగా చూపకుండా... దివ్యాంగులైనప్పటికీ సమాజంలో ఉన్నత స్థితికి చేరిన వారి గురించి పాఠ్యాంశంలో బోధించాలి. ఒకరిపై ఆధారపడకుండా.. సొంతంగా తమ పనులు తాము చేసుకునేలా తీర్చిదిద్దాలి. సాంకేతికతను అందిపుచ్చుకునేలా ప్రోత్సాహం అందించాలి. సానుకూల దృక్పథం నెలకొనేలా సినిమాలు నిర్మించాలి. చేతులు, కాళ్లు లేకుంటే పెళ్లి కాదు. ఇక జీవితమే ఉండదు అనే పిచ్చి నమ్మకాలను తొలగించాలి. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న దివ్యాంగులకు సమాజం పట్ల, తమ సమస్యల పట్ల ఒక అవగాహన ఏర్పడింది. తమ హక్కులకై గళాన్ని గట్టిగా వినిపించగలుగుతున్నారు. అయితే వారికి ప్రజాప్రతినిధుల, రాజకీయ నాయకుల అవసరం ఎంతగానో ఉంది. దివ్యాంగులను సమాజం నిండు మనస్సుతో ఆలింగనం చేసుకోవాలనేదే నా కల. ఆ దిశగా వడివడిగా అడుగులు పడాలి’’ అని మాళవిక ఆకాంక్షించారు. గ్రనేడ్ పేలడంతో..! మాళవిక అయ్యర్ తమిళనాడులోని కుంభకోణంలో క్రిష్ణన్– హేమా క్రిష్ణన్ దంపతులకు జన్మించారు. తండ్రి వాటర్ వర్క్స్‌లో ఇంజనీరుగా పనిచేసిన క్రమంలో ఆమె బాల్యం రాజస్తాన్‌లోని బికనీర్‌లో గడిచింది. అక్కడ ఉన్నపుడే ఓ రోజు తమ గ్యారేజీలో ఆడుకుంటున్న సమయంలో గ్రనేడ్ చేతుల్లో పేలి రెండు అరచేతులు పోయాయి. ఆ తర్వాత ఆమెను చెన్నైలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. స్క్రైబ్ సహాయంతో పరీక్షలు రాస్తూ మాళవిక తన విద్యాభ్యాసం పూర్తిచేశారు. ఈ క్రమంలో రాష్ట్రంలో ప్రథమ ర్యాంకు(ప్రైవేటు పరీక్ష) సంపాదించి అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం ప్రశంసలు పొందారు. అనంతరం ఉన్నత విద్య కోసం ఢిల్లీకి చేరుకున్న మాళవిక... ఎకనమిక్స్ హానర్స్ చదివారు. సోషల్ వర్క్‌లో ï డాక్టరేట్ సంపాదించారు. 2013 నుంచి మోటివేషనల్ స్పీకర్‌గా మారి ఎంతోమందిలో ఆత్మవిశ్వాసం నింపుతున్నారు. వివిధ దేశాల్లో ప్రసంగాలు చేసిన మాళవిక.. సమాజ తీరు, మహిళలు, దివ్యాంగులపై వివక్ష వంటి అంశాలపై ఐరాసలోనూ తన గళాన్ని వినిపించారు. ఆమె సేవలను గుర్తించిన ప్రభుత్వం 2018లో మహిళా దినోత్సవం సందర్భంగా అత్యున్నత మహిళా పురస్కారం నారీ శక్తి పురస్కార్‌తో సత్కరించింది. – సుష్మారెడ్డి యాళ్ల, సాక్షి వెబ్ డెస్క్ -
వైఎస్సార్ సీపీకి ఓటేశారని..
శ్రీకాకుళం, ఆమదాలవలస: బూర్జ మండలంలోని తోటవాడ గ్రామానికి చెందిన దివ్యాంగురాలు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఫ్యాను గుర్తుకు ఓటు వేసిందని తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు శుక్రవారం ఆమెపై దాడికి దిగి చితకబాదారు. స్థానికులు తెలిపిన వివరాలు.. వండాన సరస్వతి, ఆమె అక్క వండాన దుర్గమ్మ (మూగ) ఇద్దరూ మగదిక్కు లేకుండా తోటవాడ గ్రామంలో నివాసముంటున్నారు. ఎన్నికల ముందురోజు ఆ గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త సీపాన ధనుంజయరావు వీరి ఇంటికి వెళ్లి.. టీడీపీకి ఓటు వెయ్యమని ప్రలోభ పెట్టి రూ.1,000 ఇచ్చారు. ఆ డబ్బు వద్దని, తీసుకోమని సరస్వతి వారి మొహం మీద చెప్పినా సరే ఇంట్లో దూరి దేవుడుబల్లపై రెండు రూ.500ల నోట్లు పెట్టేసి వెళ్లిపోయారు. సరస్వతి ఇంటిపక్కనే ఉన్న కొత్తకోట రమణమూర్తి, ఆయన భార్య సీతామహాలక్ష్మి గురువారం సాయంత్రం దుర్గమ్మను ‘నువ్వు, మీ చెల్లి ఏ పార్టీకి ఓటు వేశార’ని ప్రశ్నించగా మూగదైన దుర్గమ్మ ఫ్యాను గుర్తుకు వేశామని సైగ చేసి చెప్పింది. దీంతో ఆ భార్యాభర్తలిద్దరూ టీడీపీ దగ్గర డబ్బులు తీసుకొని ఫ్యాను గుర్తుకు ఓటు వేస్తారా అంటూ ఆ అక్కా చెల్లెళ్ల పైకి దూసుకుపోయి చితకబాదారని స్థానికులు చెబుతున్నారు. తాము ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చిత్రహింసలు పెట్టగా.. ‘ఆ డబ్బు మాకు ధనుంజయరావు ఇచ్చాడని, ఆయనకే ఇస్తాన’ని చెబుతూ సరస్వతి ఆ వెయ్యి రూపాయలు తీసుకెళ్లి ఆయనకు ఇచ్చేసింది. అయితే టీడీపీకి ఓటు వెయ్యవా అంటూ రమణమూర్తి, అతని భార్య కలిసి చితగబాదారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై బూర్జ మండల కేంద్రంలోగల పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించినా వారు కూడా పట్టించుకోవడంలేదని, పోలీసులు స్పందించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని వారు కోరుతున్నారు. -
నా కుటుంబానికి ఆధారం చూపండి
కృష్ణాజిల్లా, చిట్టినగర్: నడిచేందుకు కాళ్లు లేవు... నా బిడ్డకు భర్త లేడు... పైగా నడుముకు ఆపరేషన్ చేయించుకుంది... మనుమడు తెచ్చే సంపాదనతో కుటుంబం నడుస్తోంది...దయచేసి మా కుటుంబానికి సొంత ఇల్లు ఇవ్వాలని వైఎస్సార్ కాలనీకి చెందిన మోతి సుబ్బలక్ష్మీ సర్కిల్–1 జోనల్ కమిషనర్ భవానీప్రసాద్‌ను వేడుకున్నారు. సర్కిల్–1 కార్యాలయంలో శుక్రవారం పిటిషనర్ అదాలత్ నిర్వహించారు. జోనల్ కమిషనర్ భవానీ ప్రసాద్ హాజరై ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. కేఎల్‌రావునగర్ 7వ లైన్లో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని స్థానిక యువకుడు భవానీ ప్రసాద్‌కు వినతిపత్రం అందచేశారు. ఇక చెరువు సెంటర్లోని చిన్న సాయిబాబా గుడి వద్ద డ్రెయిన్ ధ్వంసం కావడంతో మురుగునీరు పారడం లేదని, దుర్వాసన వెదజల్లుతుండటంతో ఇళ్లల్లో ఉండలేకపోతున్నామని సమస్యను వివరించారు. గత వారం కూడా అదాలత్‌లో ఇదే సమస్యను విన్నవించినా అధికారులు పట్టించుకోలేదని వాపోయారు. 36వ డివిజన్ వించిపేట ఇస్మాయిల్ వీధి అభివృద్ధికి గత ఏడాది బడ్జెట్లో నిధులు కేటాయించినా ఇంతవరకు రోడ్డు నిర్మాణం జరగలేదని కార్పొరేటర్ బీ జాన్‌బీ జోనల్ కమిషనర్‌కు వివరించారు. దీనిపై ఈఈ వివరణ ఇవ్వాలని కోరగా... వారం రోజులలో పనులు ప్రారంభమయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. సమస్య పరిష్కారం కాకుంటే స్థానికులు రోడ్డుపై అర్ధనగ్న ప్రదర్శన చేస్తామని చెబుతున్నారని వివరించారు. 39వ డివిజన్లో నివాసం ఉండే వారికి ప్రభుత్వ పథకాలు అమలు కావడం లేదని స్థానికంగా ఉండే కొనకళ్ల రామాంజనేయులు భవానీ ప్రసాద్‌ను ప్రశ్నించారు. తన కంటే వెనుక దరఖాస్తు చేసుకున్న వారికి ప్రభుత్వ గృహాలు మంజూరయ్యాయని, తనకు మాత్రం కేటాయింపు జరగలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజల నుంచి వచ్చిన ఆర్జీలు త్వరగా పరిష్కారం అయ్యేలా చూడాలని ఆయా విభాగాల అధికారులను ఆదేశించారు. అదాలత్‌లో ఇంజినీరింగ్, ప్రజారోగ్య, పట్టణ ప్రణాళిక విభాగానికి చెందిన అధికారులు పాల్గొన్నారు. -
కామాంధుడిగా మారిన టీడీపీ నాయకుడు
చిలకలూరిపేట: ఆమె ఓ విధివంచిత.. పుట్టుకతో మూగ.. పైగా మానసిక వైకల్యంతో బాధపడుతోంది. అలాంటి మహిళపై సాధారణంగా ఎవరైనా సానుభూతి చూపుతారు. కానీ ఓ టీడీపీ నాయకుడు మాత్రం ఆమెపై కన్నేశాడు. తన కామ వాంఛ తీర్చుకునేందుకు అవకాశం కోసం కాసుకూర్చున్నాడు. ఆదివారం అర్ధరాత్రి ఆరుబయట నిద్రిస్తున్న ఆ యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం తూబాడులో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన 30 ఏళ్ల మూగ యువతి మానసిక వైకల్యంతో బాధపడుతోంది. తల్లి చనిపోగా ఆమె తండ్రి వేరే వివాహం చేసుకుని చిలకలూరిపేటలో నివసిస్తున్నాడు. దీంతో వృద్ధురాలైన నాయనమ్మ, అన్న, వదినలతో కలసి గ్రామంలోనే ఉంటోంది. నాలుగు రోజుల కిందట బాధితురాలి అన్న, వదిన కూలి పనుల నిమిత్తం వేరే ఊరు వెళ్లారు. ఈ నేపథ్యంలో కేన్సర్‌తో బాధపడుతున్న నాయనమ్మతో కలసి ఆదివారం రాత్రి ఆ యువతి ఆరుబయట మంచంపై నిద్రించింది. అర్థరాత్రి 12 గంటల సమయంలో టీడీపీ నాయకుడు గోళ్లమూడి లక్ష్మయ్య ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. తనపై జరుగుతున్న అఘాయిత్యాన్ని కేకలు వేసి చెప్పలేని ఆ యువతి.. తన శక్తి మేర ప్రతిఘటించసాగింది. అదే సమయంలో నిద్రలేచి బయటకు వచ్చిన ఎదురింటి మహిళ ఇది గమనించి.. పెద్దగా కేకలు వేస్తూ అందర్నీ నిద్రలేపింది. దీంతో లక్ష్మయ్య అక్కడ్నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై బాధితురాలి బంధువులు సోమవారం నాదెండ్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా, ఎస్ఐ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. మూగ, మానసిక వ్యాధుల వైద్య సిబ్బంది సాయంతో బాధితురాలి వాంగ్మూలం నమోదు చేసుకొని.. ఆ తర్వాతే వైద్య పరీక్షలకు పంపిస్తామని చెప్పారు. నిందితుడు అధికార పార్టీ నాయకుడు కావడంతో బాధితురాలికి న్యాయం చేస్తారో.. లేదోనని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
ఎగిరే మనసు ఆత్మవిశ్వాసమే ఆయుధం
‘‘స్టీఫెన్ హాకిన్స్.. అసాధ్యాలను సుసాధ్యం చేసి యావత్ ప్రపంచాన్ని అబ్బురపరిచిన ఈ శాస్త్రవేత్త దివ్యాంగుడు. మూడు చక్రాల బండిలో కూర్చొని కదల్లేని స్థితిలోనూ అంతరిక్షాన్ని జయించాడు. కుల వృత్తులు మొదలు.. రాజకీయాలు.. ఉద్యోగాలు.. ఈ రంగంలోనూ తాము తీసిపోమని నిరూపిస్తున్నా ఇప్పటికీ దివ్యాంగులంటే చులకనే. పోటీ ప్రపంచానికి ఎదురొడ్డి రాణిస్తున్నా.. అవకాశాల విషయంలో అవిటితనం అడ్డుపడుతోంది. కాదు.. సాకుగా చూపుతున్నారు. ఈ వివక్ష ఇంకెన్నాళ్లు. ఒక్కసారి ప్రోత్సహించి చూడండి.. వెన్నుతట్టి ముందుకు నడిపించండి. జాలి వద్దు.. ఆటుపోట్లను ఎదుర్కొనే ఆత్మస్థైర్యం ఇవ్వండి.’’ – కొప్పుల వసుంధర పోలియో మహమ్మారి రెండు కాళ్లను మింగేసింది. పట్టుదలతో చదువులో రాణించింది. జర్నలిజంలో పీజీ పూర్తి చేసింది. ఉద్యోగం వస్తే జీవితంలో స్థిరపడవచ్చని భావిస్తే.. అడుగడుగునా వివక్ష ఎదురయింది. అయ్యో పాపం అనే వాళ్లే కానీ.. అవకాశం కల్పించే మనసు ఏ ఒక్కరికీ లేకపోయింది. ఇంతటితో జీవితం అయిపోయిందని బాధపడుతూ కూర్చోలేదు. తనకు తాను అవకాశాలను సృష్టించుకుని, ఆకాశమే హద్దుగా సాగిపోతోంది. పది మందికి సాయపడాలనే మంచి మనసు స్ఫూర్తి బాటలో పయనిస్తోంది. జిల్లాలోని మారుమూల ప్రాంతమైన శెట్టూరులో జన్మించిన దివ్యాగురాలు వసుంధర.. మూడు చక్రాల కుర్చీలో నుంచే సొంత ఊరు ఖ్యాతిని జాతీయ స్థాయిలో చాటి భళా అనిపిస్తోంది. శెట్టూరు: కళ్యాణదుర్గం నియోజకవర్గం శెట్టూరుకు చెందిన ప్రమీలమ్మ, ఆనందరావు దంపతుల కుమార్తె కొప్పుల వసుంధర. చిన్నప్పుడు పోలియో సోకడంతో రెండు కాళ్లు చచ్చుబడ్డాయి. ఆమె జీవితాన్ని వైకల్యం వెక్కిరించింది. అదే సమయంలో ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న తండ్రిని కూడా కోల్పోయింది. నేనున్నానని వెన్నుదన్నుగా నిలిచే మనుషులు కరువయ్యారు. అంతులేని వివక్షను చవిచూసింది. సానుభూతి చూపులు తనకు వద్దనుకున్న వసుంధర ఆత్మవిశ్వాసంతో చదువుల తల్లి ఒడిలో ఎదిగింది. జీవితంలో పైకి చేరుకోవాలంటే చదువు ఒక్కటే మార్గమని భావించిన ఆమె పట్టుదలతో జర్నలిజంలో పీజీ పూర్తి చేసింది. ముందుకు నడిపిన సంకల్పం సంకల్పం ఉంటే సాధించలేనిది ఏదీ లేదని వసుంధర నిరూపించారు. తనకంటూ ఓ కెరీర్‌ని ఏర్పాటు చేసుకునే క్రమంలో అంతులేని వివక్షను ఎదుర్కొన్నారు. తల్లి ప్రమీలమ్మ ప్రోత్సాహం ఆమెను ముందుకు నడిపించింది. జీవితంలో ఏది సాధించాలన్నా చదువు ముఖ్యమని చెప్పిన తల్లి మాటలను గుండెల్లో నింపుకొని అక్షరాలతో చేసిన స్నేహం ఒక్కో మెట్టును ఎక్కించింది. తనను ఉన్నత స్థాయిలో చూడాలనుకున్న మాతృమూర్తి ఆకాంక్షను నెరవేర్చే దిశగా సీఏ కోర్సులో చేరింది. ఆ సమయంలోనే ఆమె జీవితం అనుకోని మలుపు తిరిగింది. తనలో దాగున్న రచనా వ్యాసంగాన్ని గుర్తించి జర్నలిజంలో పీజీ చేశారు. ఆ తర్వాత ఉద్యోగాన్వేషణలో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎన్నో పత్రికా సంస్థలను ఆశ్రయించినా.. ఒక్కరూ అవకాశం కల్పించలేకపోవడంతో ఆమెను కలచివేసింది. చివరకు ఓ లోకల్ చానల్ ఆమెకు అవకాశం కల్పించింది. అలా మొదలైన ప్రస్థానంలో ఆమెను ప్రతిభను గుర్తించి మరికొన్ని సంస్థలు కూడా వెన్నుతట్టి ప్రోత్సహించాయి. మిగిలిన వాళ్లకంటే ఎక్కువగా శ్రమిస్తున్నా.. ‘స్పెషల్ కేటగిరీ’ అనే పదం ఆమెను ఆలోచింపజేసింది. అంధుల కోసం ప్రత్యేకంగా.. మూడేళ్ల తర్వాత 2014లో ‘వీవ్’ అనే మీడియా సంస్థను స్థాపించి ఈవెంట్స్ చేపట్టారు. ఉపాధి కల్పనలో భాగంగా స్థాపించిన సంస్థ కావడంతో ముందుకు నడిపించేందుకు ఎంతో శ్రమించారు. పుట్టిన రోజులు.. పెళ్లిళ్లు.. శుభకార్యాలు, కార్పొరేట్ సంస్థల ప్రారంభోత్సవాల్లో ఈవెంట్ మేనేజర్‌గా రాణించేందుకు చాలా శ్రమించాల్సి వచ్చింది. ఆమెను చూసిన తొలి రోజుల్లో ‘ఏం చేయిస్తుందని’ చాలా మంది అవకాశాలు ఇచ్చేందుకు వెనుకంజ వేశారు. అయితే ఆమెలోని పట్టుదలను చూసి ఒక్కో అవకాశం ఆమెకు ఎదురేగి స్వాగతం పలికింది. అతనికాలంలోనే 2014లో అంధ క్రికెటర్ల కోసం ప్రత్యేకంగా వీసీసీఎల్ టోర్నీ నిర్వహించారు. మూడు రోజుల పాటు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో రూ.3 లక్షల సొంత డబ్బుతో టోర్నీని విజయవంతం చేశారు. ఆమెలోని క్రియేటివిటీని గుర్తించి ఈవెంట్లను ఇచ్చి ప్రోత్సహించే వారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘మిస్ ఎబిలిటీ–18’ పేరిట వికలాంగుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు హైదరాబాద్‌లో ఓ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఆ సేవలకు గుర్తుగా రాష్ట్ర ప్రభుత్వం జాతీయ మహిళా పార్లమెంటరీ సదస్సులో ఘనంగా సన్మానించింది. -
పిచ్చి లెక్కలతో పింఛన్ కోత
నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం కల్మెడకు చెందిన గడ్డం ధనమ్మ అనే వికలాంగ మహిళ గతంలో పింఛన్ పొందేది. ఆమె పుట్టు కతోనే పోలియో కారణంగా ఒక కాలు చచ్చుబడిపోయింది. సదరం క్యాంపులు రాకముందు సివిల్ సర్జన్లు ఇచ్చిన సర్టిఫికెట్లో ఆమె వైకల్యాన్ని 50 శాతానికి పైగా పేర్కొన్నారు. కానీ సదరం క్యాంపులో ఆమె వైకల్య శాతాన్ని 39 శాతంగా పేర్కొనడంతో.. పింఛన్ రద్దయింది. మళ్లీ అదే క్యాంపులో పరీక్ష చేయించుకోగా.. వైకల్య శాతం 38 శాతంగా వచ్చింది. దీంతో అంతకుముందు నెల నెలా పొందిన రూ. 500 పింఛన్‌ను రద్దు చేశారు. అదే గ్రామానికి చెందిన కత్తుల రాంలింగయ్యదీ ఇదే పరిస్థితి. గతంలో 50 శాతానికి పైగా వైకల్యం ఉందని సర్టిఫికెట్ పొందిన ఆయనకు సదరం క్యాంపులో 39 శాతమే ఉందని నిర్ధారించారు. దీంతో పింఛన్ నిలిపివేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని బిలాల్‌నగర్‌లో కుక్కల పాపారావు అనే వికలాంగుడు నివసిస్తున్నాడు. ఆయనకూ గతంలో పింఛన్ వచ్చేది. సదరం క్యాంపులో పరీక్షించుకుంటే ఆయన వైకల్య శాతం 28 శాతంగా వచ్చింది. మళ్లీ వెళితే 39 శాతానికి పెంచినా.. అది పింఛన్ పొందేందుకు అర్హమైన శాతం కాదు. ఈ పరిస్థితి ఆ ముగ్గురిదే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు లక్షన్నర మంది వికలాంగుల దుస్థితి ఇది. సదరం క్యాంపుల్లో నిర్ధారిత వైకల్యశాతం లేదని గుర్తించినందున వారందరి పింఛన్లను గతంలో నిలిపివేశారు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం వారందరికీ రూ. 500 కాకుండా.. రూ. 200 పింఛన్ ఇవ్వనున్నారు. అంటే వైకల్య శాతం తగ్గింది కనుక పింఛన్‌ను కూడా తగ్గించారనే అర్థమవుతోంది. ప్రభుత్వం చేపట్టిన ఈ చర్య వైకల్య శాతం పేరుతో నిధులు మిగుల్చుకునేందుకేనని స్పష్టమవుతోంది. మొత్తంగా లక్షన్నర మందికి పైగా వికలాంగులకు అన్యాయం చేయడం ద్వారా రూ. 54 కోట్ల మేర మిగిలించుకునేందుకే సర్కారు తాపత్రయపడుతోందని వెల్లడవుతోంది. 39.5 శాతం ఉందని అనర్హులను చేశారు నిబంధనల ప్రకారం 40 శాతం, ఆపైన వైకల్యం ఉన్న వారిని పింఛన్ పొందేందుకు అర్హులుగా గుర్తిస్తున్నారు. అయితే, అంతకుముందు ఎక్కువ వైకల్యం ఉన్నట్లుగా సర్టిఫికెట్లు పొందినవారిలో.. దాదాపు లక్ష మందికి వైకల్య శాతం 39- 40 మధ్య ఉన్నట్లుగా సదరం క్యాంపుల్లో గుర్తించారు. అసలు మొదట్లో వారందరికీ సర్టిఫికెట్లు ఇచ్చింది కూడా సివిల్ సర్జన్లే. వారంతా గతంలో రూ. 500 పింఛన్ పొందిన వారే. మరి అంతమందికి కేవలం 39-40 శాతం మధ్య వైకల్యశాతం నిర్ధారణ అవడంపై సందేహాలు తలెత్తుతున్నాయి. సెదారన్ క్యాంపుల్లో వైకల్య శాతం నిర్ధారించే తీరుపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ క్యాంపుల్లో అర్హత గల వైద్యులను కాకుండా శిక్షణలో ఉన్న వైద్యులను ఉపయోగించారనే ఆరోపణలున్నాయి. ఇక శబ్ధస్థాయి ఆధారంగా బధిర, మూగ వికలాంగుల వైకల్య శాతాన్ని నిర్ధారించడానికి అనువైన వాతావరణం ఏ ఒక్క జిల్లా కేంద్ర ఆసుపత్రిలో కూడా లేదని వికలాంగ సంఘాలు పేర్కొంటున్నాయి. ఇక రెండు కళ్లు లేనివారిని పూర్ణ అంధులుగా గుర్తించి, పింఛన్ మంజూరు చేస్తున్న ప్రభుత్వం ఒక కన్ను లేని వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఒక కన్నుతో అంతా చూడవచ్చని, అలాంటప్పుడు పింఛన్ ఎందుకని అధికారులు ప్రశ్నిస్తున్నారని సమాచారం. రూ. 75 నుంచి రూ. 500కు పెంచిన వైఎస్.. చంద్రబాబు హయాంలో వికలాంగ పింఛన్ రూ. 75గా ఉండేది. వైఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2004లో దానిని రూ. 200కు పెంచారు. ఆ తర్వాత 2007లో దానిని రూ. 500కు పెంచారు. అయితే.. 2008 మార్చిలో మందకృష్ణ నేతృత్వంలో వికలాంగ హక్కుల పోరాట సమితి (వీహెచ్పీఎస్) నేతలు ఆమరణ దీక్షకు దిగిన సందర్భంగా.. వైకల్య శాతం ఆధారంగా వికలాంగ పింఛన్‌ను మళ్లీ పెంచుతున్నామని 2008 మార్చి 13న అసెంబ్లీలో వైఎస్ ఒక ప్రకటన చేశారు. 41-60 శాతం వరకు వైకల్యం ఉన్న వారికి రూ. 500... 61-80 శాతం ఉన్న వారికి రూ.600.. 81-100 శాతం వైకల్యం ఉన్నవారికి రూ. 700 పింఛన్ ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికలు జరగడం, కొద్ది రోజులకే వైఎస్ హఠాన్మరణం కారణంగా ఆ ప్రకటన అమలుకు నోచుకోలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులుగానీ, అధికారులుగానీ ఈ విషయాన్ని పట్టించుకోలేదు. దీనినే వికలాంగ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. అసెంబ్లీలో ముఖ్యమంత్రి చేసిన ప్రకటనకు అనుగుణంగా పింఛన్ పెంచని ప్రభుత్వానికి... అదే వైకల్య శాతాన్ని బట్టి పింఛన్ తగ్గించే అవకాశం ఎవరిచ్చారని సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. అసలు వైకల్య శాతాన్ని గుర్తించి పింఛన్ పెంచుతామంటూ 2009 డిసెంబర్లో సదరం క్యాంపులు ప్రారంభించి, పింఛన్లు పెంచకపోగా... వాటి నివేదికల ఆధారంగా దాదాపు రూ.1.8 లక్షల మంది పింఛన్లను తొలగించడం గమనార్హం. సునీతమ్మ ఏం చేస్తున్నారు? 2008లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేసిన సమయంలో ప్రస్తుత వికలాంగ సంక్షేమ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి కూడా సభలోనే ఉన్నారు. అప్పుడు ఆమె చిన్ననీటిపారుదల మంత్రిగా, వికలాంగ సంక్షేమ శాసనసభా కమిటీ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. ఆ కమిటీ చైర్పర్సన్ హోదాలో ఆమె ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో కూడా వైకల్య శాతం ఆధారంగా పింఛన్ పెంచాలని సిఫారసు చేశారని వికలాంగ సంఘాలు పేర్కొంటున్నాయి. అప్పుడు ఆమె చేసిన ప్రతిపాదనలనే మంత్రి హోదాలో అమలుపర్చాల్సింది పోయి, పింఛన్లను తగ్గించడం దురదృష్టకరమని వ్యాఖ్యానిస్తున్నాయి. బడ్జెట్ తగ్గించుకునేందుకు కుట్ర.. ‘‘వైకల్య శాతం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇలా లక్షలాది మంది వికలాంగులకు అన్యాయం చేస్తోంది. వైకల్య శాతాన్ని బట్టి పింఛన్ పెంచుతామని అసెంబ్లీలో చెప్పి.. ఇప్పుడు తగ్గించడమేమిటి? గతంలో హామీ ఇచ్చిన విధంగా వికలాంగ పింఛన్‌ను రూ.600, రూ.700 చొప్పున ఇవ్వాలి. లేదా తమిళనాడు, గోవా, పాండిచ్చేరి తరహాలో వికలాంగ పింఛన్‌ను రూ.1500కు పెంచాలి’’ - అందె రాంబాబు, వీహెచ్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వీటికి బదులేది? ?అంతకుముందు ప్రభుత్వ సివిల్ సర్జన్లు నిర్ధారించిన వైకల్య శాతాలను సదరం క్యాంపుల్లో బాగా తగ్గించారు. అదే సదరం క్యాంపుల్లో మళ్లీ పరీక్షలు చేయించుకున్న చాలా మందికి వైకల్య శాతంలో పదిశాతానికిపైగా తేడా వచ్చింది. అసలు సదరం క్యాంపుల్లో వైకల్య శాతం నిర్ధారణలో ఉన్న శాస్త్రీయత ఏమిటి. ?వాటి నివేదికల ఆధారంగా ప్రభుత్వం లక్షన్నర మంది వికలాంగులకు ఎందుకు పింఛన్ నిలిపేసింది. ?సదరం క్యాంపుల్లో వైకల్య శాతం తగ్గించిన లక్షన్నర మంది వికలాంగుల్లో.. దాదాపు లక్ష మందికి కనీస పింఛను అర్హత అయిన 40 శాతం వైకల్యం కంటే కేవలం ఒకటి రెండు శాతం మాత్రమే ఎందుకు తగ్గింది. ? వైకల్య శాతం తగినంత లేనప్పుడు అసలు పింఛన్‌కు అనర్హులను చేయకుండా.. మళ్లీ వారికి నెలకు రూ. 200 పింఛన్ ఇవ్వాలని ఎందుకు నిర్ణయించారు. ? ఎక్కువ వైకల్యం ఉన్నవారికి పింఛన్‌ను మరింత పెంచుతామని 2008 మార్చి 13న అసెంబ్లీలో అప్పటి సీఎం వైఎస్సార్ హామీ ఇచ్చారు. తర్వాత కొద్ది కాలానికే ఆయన మరణించారు. మరి ఒక సీఎం ఇచ్చిన హామీని తర్వాత ఎందుకు అమలు చేయడం లేదు. - సాక్షి, హైదరాబాద్