నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం కల్మెడకు చెందిన గడ్డం ధనమ్మ అనే వికలాంగ మహిళ గతంలో పింఛన్ పొందేది. ఆమె పుట్టు కతోనే పోలియో కారణంగా ఒక కాలు చచ్చుబడిపోయింది. సదరం క్యాంపులు రాకముందు సివిల్ సర్జన్లు ఇచ్చిన సర్టిఫికెట్‌లో ఆమె వైకల్యాన్ని 50 శాతానికి పైగా పేర్కొన్నారు. కానీ సదరం క్యాంపులో ఆమె వైకల్య శాతాన్ని 39 శాతంగా పేర్కొనడంతో.. పింఛన్ రద్దయింది. మళ్లీ అదే క్యాంపులో పరీక్ష చేయించుకోగా.. వైకల్య శాతం 38 శాతంగా వచ్చింది. దీంతో అంతకుముందు నెల నెలా పొందిన రూ. 500 పింఛన్‌ను రద్దు చేశారు.
అదే గ్రామానికి చెందిన కత్తుల రాంలింగయ్యదీ ఇదే పరిస్థితి. గతంలో 50 శాతానికి పైగా వైకల్యం ఉందని సర్టిఫికెట్ పొందిన ఆయనకు సదరం క్యాంపులో 39 శాతమే ఉందని నిర్ధారించారు. దీంతో పింఛన్ నిలిపివేశారు.
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని బిలాల్‌నగర్‌లో కుక్కల పాపారావు అనే వికలాంగుడు నివసిస్తున్నాడు. ఆయనకూ గతంలో పింఛన్ వచ్చేది. సదరం క్యాంపులో పరీక్షించుకుంటే ఆయన వైకల్య శాతం 28 శాతంగా వచ్చింది. మళ్లీ వెళితే 39 శాతానికి పెంచినా.. అది పింఛన్ పొందేందుకు అర్హమైన శాతం కాదు.
ఈ పరిస్థితి ఆ ముగ్గురిదే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు లక్షన్నర మంది వికలాంగుల దుస్థితి ఇది. సదరం క్యాంపుల్లో నిర్ధారిత వైకల్యశాతం లేదని గుర్తించినందున వారందరి పింఛన్లను గతంలో నిలిపివేశారు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం వారందరికీ రూ. 500 కాకుండా.. రూ. 200 పింఛన్ ఇవ్వనున్నారు. అంటే వైకల్య శాతం తగ్గింది కనుక పింఛన్‌ను కూడా తగ్గించారనే అర్థమవుతోంది. ప్రభుత్వం చేపట్టిన ఈ చర్య వైకల్య శాతం పేరుతో నిధులు మిగుల్చుకునేందుకేనని స్పష్టమవుతోంది. మొత్తంగా లక్షన్నర మందికి పైగా వికలాంగులకు అన్యాయం చేయడం ద్వారా రూ. 54 కోట్ల మేర మిగిలించుకునేందుకే సర్కారు తాపత్రయపడుతోందని వెల్లడవుతోంది.
39.5 శాతం ఉందని అనర్హులను చేశారు
నిబంధనల ప్రకారం 40 శాతం, ఆపైన వైకల్యం ఉన్న వారిని పింఛన్ పొందేందుకు అర్హులుగా గుర్తిస్తున్నారు. అయితే, అంతకుముందు ఎక్కువ వైకల్యం ఉన్నట్లుగా సర్టిఫికెట్లు పొందినవారిలో.. దాదాపు లక్ష మందికి వైకల్య శాతం 39- 40 మధ్య ఉన్నట్లుగా సదరం క్యాంపుల్లో గుర్తించారు. అసలు మొదట్లో వారందరికీ సర్టిఫికెట్లు ఇచ్చింది కూడా సివిల్ సర్జన్లే. వారంతా గతంలో రూ. 500 పింఛన్ పొందిన వారే. మరి అంతమందికి కేవలం 39-40 శాతం మధ్య వైకల్యశాతం నిర్ధారణ అవడంపై సందేహాలు తలెత్తుతున్నాయి. సెదారన్ క్యాంపుల్లో వైకల్య శాతం నిర్ధారించే తీరుపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ క్యాంపుల్లో అర్హత గల వైద్యులను కాకుండా శిక్షణలో ఉన్న వైద్యులను ఉపయోగించారనే ఆరోపణలున్నాయి. ఇక శబ్ధస్థాయి ఆధారంగా బధిర, మూగ వికలాంగుల వైకల్య శాతాన్ని నిర్ధారించడానికి అనువైన వాతావరణం ఏ ఒక్క జిల్లా కేంద్ర ఆసుపత్రిలో కూడా లేదని వికలాంగ సంఘాలు పేర్కొంటున్నాయి. ఇక రెండు కళ్లు లేనివారిని పూర్ణ అంధులుగా గుర్తించి, పింఛన్ మంజూరు చేస్తున్న ప్రభుత్వం ఒక కన్ను లేని వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఒక కన్నుతో అంతా చూడవచ్చని, అలాంటప్పుడు పింఛన్ ఎందుకని అధికారులు ప్రశ్నిస్తున్నారని సమాచారం.
రూ. 75 నుంచి రూ. 500కు పెంచిన వైఎస్..
చంద్రబాబు హయాంలో వికలాంగ పింఛన్ రూ. 75గా ఉండేది. వైఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2004లో దానిని రూ. 200కు పెంచారు. ఆ తర్వాత 2007లో దానిని రూ. 500కు పెంచారు. అయితే.. 2008 మార్చిలో మందకృష్ణ నేతృత్వంలో వికలాంగ హక్కుల పోరాట సమితి (వీహెచ్‌పీఎస్) నేతలు ఆమరణ దీక్షకు దిగిన సందర్భంగా.. వైకల్య శాతం ఆధారంగా వికలాంగ పింఛన్‌ను మళ్లీ పెంచుతున్నామని 2008 మార్చి 13న అసెంబ్లీలో వైఎస్ ఒక ప్రకటన చేశారు. 41-60 శాతం వరకు వైకల్యం ఉన్న వారికి రూ. 500... 61-80 శాతం ఉన్న వారికి రూ.600.. 81-100 శాతం వైకల్యం ఉన్నవారికి రూ. 700 పింఛన్ ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికలు జరగడం, కొద్ది రోజులకే వైఎస్ హఠాన్మరణం కారణంగా ఆ ప్రకటన అమలుకు నోచుకోలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులుగానీ, అధికారులుగానీ ఈ విషయాన్ని పట్టించుకోలేదు. దీనినే వికలాంగ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. అసెంబ్లీలో ముఖ్యమంత్రి చేసిన ప్రకటనకు అనుగుణంగా పింఛన్ పెంచని ప్రభుత్వానికి... అదే వైకల్య శాతాన్ని బట్టి పింఛన్ తగ్గించే అవకాశం ఎవరిచ్చారని సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. అసలు వైకల్య శాతాన్ని గుర్తించి పింఛన్ పెంచుతామంటూ 2009 డిసెంబర్‌లో సదరం క్యాంపులు ప్రారంభించి, పింఛన్లు పెంచకపోగా... వాటి నివేదికల ఆధారంగా దాదాపు రూ.1.8 లక్షల మంది పింఛన్‌లను తొలగించడం గమనార్హం.
సునీతమ్మ ఏం చేస్తున్నారు?
2008లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేసిన సమయంలో ప్రస్తుత వికలాంగ సంక్షేమ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి కూడా సభలోనే ఉన్నారు. అప్పుడు ఆమె చిన్ననీటిపారుదల మంత్రిగా, వికలాంగ సంక్షేమ శాసనసభా కమిటీ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. ఆ కమిటీ చైర్‌పర్సన్ హోదాలో ఆమె ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో కూడా వైకల్య శాతం ఆధారంగా పింఛన్ పెంచాలని సిఫారసు చేశారని వికలాంగ సంఘాలు పేర్కొంటున్నాయి. అప్పుడు ఆమె చేసిన ప్రతిపాదనలనే మంత్రి హోదాలో అమలుపర్చాల్సింది పోయి, పింఛన్‌లను తగ్గించడం దురదృష్టకరమని వ్యాఖ్యానిస్తున్నాయి.
బడ్జెట్ తగ్గించుకునేందుకు కుట్ర..
‘‘వైకల్య శాతం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇలా లక్షలాది మంది వికలాంగులకు అన్యాయం చేస్తోంది. వైకల్య శాతాన్ని బట్టి పింఛన్ పెంచుతామని అసెంబ్లీలో చెప్పి.. ఇప్పుడు తగ్గించడమేమిటి? గతంలో హామీ ఇచ్చిన విధంగా వికలాంగ పింఛన్‌ను రూ.600, రూ.700 చొప్పున ఇవ్వాలి. లేదా తమిళనాడు, గోవా, పాండిచ్చేరి తరహాలో వికలాంగ పింఛన్‌ను రూ.1500కు పెంచాలి’’
- అందె రాంబాబు, వీహెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు
వీటికి బదులేది?
?అంతకుముందు ప్రభుత్వ సివిల్ సర్జన్లు నిర్ధారించిన వైకల్య శాతాలను సదరం క్యాంపుల్లో బాగా తగ్గించారు. అదే సదరం క్యాంపుల్లో మళ్లీ పరీక్షలు చేయించుకున్న చాలా మందికి వైకల్య శాతంలో పదిశాతానికిపైగా తేడా వచ్చింది. అసలు సదరం క్యాంపుల్లో వైకల్య శాతం నిర్ధారణలో ఉన్న శాస్త్రీయత ఏమిటి.
?వాటి నివేదికల ఆధారంగా ప్రభుత్వం లక్షన్నర మంది వికలాంగులకు ఎందుకు పింఛన్ నిలిపేసింది.
?సదరం క్యాంపుల్లో వైకల్య శాతం తగ్గించిన లక్షన్నర మంది వికలాంగుల్లో.. దాదాపు లక్ష మందికి కనీస పింఛను అర్హత అయిన 40 శాతం వైకల్యం కంటే కేవలం ఒకటి రెండు శాతం మాత్రమే ఎందుకు తగ్గింది.
? వైకల్య శాతం తగినంత లేనప్పుడు అసలు పింఛన్‌కు అనర్హులను చేయకుండా.. మళ్లీ వారికి నెలకు రూ. 200 పింఛన్ ఇవ్వాలని ఎందుకు నిర్ణయించారు.
? ఎక్కువ వైకల్యం ఉన్నవారికి పింఛన్‌ను మరింత పెంచుతామని 2008 మార్చి 13న అసెంబ్లీలో అప్పటి సీఎం వైఎస్సార్ హామీ ఇచ్చారు. తర్వాత కొద్ది కాలానికే ఆయన మరణించారు. మరి ఒక సీఎం ఇచ్చిన హామీని తర్వాత ఎందుకు అమలు చేయడం లేదు.
- సాక్షి, హైదరాబాద్