Pension cut
-
టె‘క్కలి కాలం’.. మాఫియా జాలం
సాక్షి, శ్రీకాకుళం: ఎన్నికల్లో వాడు మన పార్టీకి ఓటేయలేదు సార్.. అని ఓ కార్యకర్త చెబితే చాలు! వెంటనే అతని పెన్షన్ రద్దయిపోతుంది. ఈ డీలర్ వైఎస్సార్సీపీ అభిమాని సార్.. అంటే అతని రేషన్‌షాపు లైసెన్స్ కేన్సిల్ అయిపోతుంది. ఈ వీఆర్వో మనకు అనుకూలంగా పని చేయడం లేదంటే ఆయనకు బదిలీ అవుతుంది. అంతేనా? అభివృద్ధి పనులన్నీ అయిన వారికే దక్కుతాయి. మద్యం వ్యాపారులు, రైస్‌మిల్లర్లు సక్రమంగా వ్యాపారం సాగించుకోవాలన్నా, గ్రానైట్ వ్యాపారుల జోలికి అధికారులు వెళ్లకుండా చూడాలన్నా ఆయన అండదండలతోనే సాధ్యమవుతాయి.. ఇవన్నీ శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో మాఫియా నాయకుడిని తలపించేలా సాగిస్తున్న రవాణాశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడి అక్రమాలు, అరాచకాలు..!! ఐదేళ్ల క్రితం 2014లో టెక్కలి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికయ్యారు అచ్చెన్నాయుడు. ఆ ఎన్నికల్లో ఆయన ప్రజలను కాకుండా రిగ్గింగ్నే నమ్ముకుని అతి కష్టమ్మీద వైఎస్సార్సీపీ అభ్యర్థిపై గెలిచారు. ఈ ఐదేళ్లలో అచ్చెన్న అండ్ కో అందినకాడికి దోచుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఓటర్లను లక్ష్యంగా పెట్టుకుని కక్ష సాధింపులకు పాల్పడ్డారు. జన్మభూమి కమిటీలకే సర్వాధికారాలు కట్టబెట్టారు. అభివృద్ధి పను ల కాంట్రాక్టులను సొంత సంస్థకు బదలాయించుకున్నారు. మద్యం వ్యాపారుల నుంచి, రైస్‌మిల్లర్ల నుంచి నెలనెలా మామూళ్లు వచ్చే ఏర్పాటు చేసుకున్నారు. కోట్లు కుమ్మరించే గ్రానైట్ వ్యాపారులకు అండగా నిలిచారు. అచ్చెన్న అండ చూసుకుని ఆయన అనుచరగణం భూఆక్రమణలు, కబ్జాలకు తెగబడ్డారు. కోటబొమ్మాళి కేంద్రంగా అచ్చెన్నాయుడి అనుయాయులు నకిలీ బ్రాండెడ్ మద్యం సీసాల మూతలు, రేపర్ల తయారీని చేపట్టారు. వివిధ మార్గాల నుంచి కమీషన్లను వసూలు చేసే బాధ్యతను మంత్రి సోదరుడు హరిప్రసాద్ చూసుకుంటారని నియోజకవర్గ ప్రజలు కోడై కూస్తున్నారు. ఇంకా నియోజకవర్గంలో కొండలు, గుట్టలు, చెరువులను మంత్రి గారి వందిమాగదులు కబ్జా చేసేశారు. అమ్మో నిమ్మాడ..! నిమ్మాడ.. అచ్చెన్నాయుడి సొంతూరు. ఆ ఊళ్లో దాదాపు 40 వరకు గ్రానైట్ పాలిషింగ్ యూనిట్లున్నాయి. అక్కడ క్వారీల నుంచి యూనిట్లకు గ్రానైట్‌ను అనుమతులకు మించి తరలిస్తుంటారు. ఇలా నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేసి భారీగా జరిమానా విధించాల్సి ఉంటుంది. ఇలా జరిమానాగా వసూలు చేయాల్సిన సొమ్ము రూ.కోట్లలో ఉంటుందని చెబుతా రు. కానీ మైనింగ్ అధికారులు ఆ యూనిట్ల వైపు తొంగిచూసే సాహసమే చేయరు. పైగా ఈ వ్యాపారుల నుంచి నెలనెలా వీరే వసూలు చేసి మంత్రి కిచ్చే బాధ్యతను నెత్తికొత్తుకున్నారని చెబుతారు. సంబంధిత గ్రానైట్ వ్యాపారుల నుంచి భారీగా మామూళ్లు చెల్లిస్తుండడం వల్ల వారిపై ఈగ వాలకుండా చూసుకుంటారు. రిగ్గింగ్‌తో బయటపడి.. 2014 ఎన్నికల్లో అచ్చెన్నాయుడు సంతబొమ్మాళి మండలంలో 15 చోట్ల రిగ్గింగ్‌కు పాల్పడి 8,387 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అప్పట్లో పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలు లేవు. కానీ ఈ సారి ఆ పరిస్థితి లేదు. అచ్చెన్న, ఆయన బృందం అక్రమాలు, అరాచకాలకు విసిగి వేసారిపోయారు టెక్కలి ఓటర్లు. మళ్లీ ఆయన్ను ఎమ్మెల్యేను చేస్తే ఇంకెంతగా దోచుకుంటారోనని భీతిల్లుతున్నారు. అందుకే అచ్చెన్నకు ఓటుతో ఎప్పుడు బుద్ధి చెబుదామా? వైఎస్సార్సీపీ అభ్యర్థి పేరాడ తిలక్‌ను ఎప్పుడు గెలిపిద్దామా? అని ఎదురు చూస్తున్నారు. టెక్కలి నియోజకవర్గంలో ఎక్కడ చూసినా టీడీపీ ప్రభుత్వం, అచ్చెన్నపై వ్యతిరేకత, జగన్ ప్రభంజనమే కనిపిస్తోంది. ఇదే ఇప్పుడు అచ్చెన్నాయుడికి ముచ్చెమటలు పట్టిస్తోంది. అన్యాయాలకు అంతే లేదు.. కోటబొమ్మాళి మండలం యలమంచిలికి చెందిన కెల్లి తవుడుకు గతంలో వృద్ధాప్య పింఛన్ వచ్చేది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక మంత్రి అచ్చెన్నాయుడు అండతో టీడీపీ కార్యకర్తలు అతడి పింఛన్ తొలగించేశారు. మనస్థాపానికి గురైన ఆ వృద్ధుడు మృతి చెందాడు. అదే గ్రామానికి చెందిన కర్రి అప్పారావు అనే వృద్ధుడి పెన్షను కూడా జన్మభూమి కమిటీ సభ్యులు తొలగించారు. పోరాటం చేసి చివరకు మనస్థాపంతో చనిపోయాడు. ఇలా ఈ గ్రామంలో 13 మంది వృద్ధులు మనస్థాపానికి గురై మరణించారు. టెక్కలి మండలం బూరగాంలో గాసయ్య అనే వ్యక్తి రేషన్ డిపో నిర్వహిస్తుండేవాడు. 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చాక జన్మభూమి కమిటీ సభ్యులు అచ్చెన్నాయుడు అండతో గాసయ్య డీలర్‌షిప్‌ను తొలగించేశారు. వైఎస్సార్ సీపీకు అనుకూలంగా ఉన్నాడనే కక్షతో డీలర్‌షిప్‌ను రద్దు చేయించారు. అచ్చెన్న అండ్ కో ఘనతలు.. మచ్చుకు కొన్ని..! ♦ టెక్కలి ఆర్టీసీ కాంప్లెక్స్‌ను మల్టీ కాంప్లెక్స్‌గా అభివృద్ధి చేయడానికి రూ.80 కోట్లు మంజూరయింది. అర్హత లేకపోయినా దాని కాంట్రాక్టు రవాణా శాఖమంత్రి కూడా అయిన అచ్చెన్న బినామీ శ్రీనివాస్‌కే దక్కింది. ♦ నియోజకవర్గ అభివృద్ధి పనులను తొలుత బినామీలు/అనుచరులు దక్కించుకుంటారు. ఆ తర్వాత అచ్చెన్న సోదరుడి కుమారుడు పేరిట ఉన్న సురేష్ కన్స్ట్రక్షన్స్ పరం చేస్తారు. ఆ పనులను సురేష్ పూర్తి చేస్తారు. ♦ నియోజకవర్గ కేంద్రం టెక్కలి రోడ్డు విస్తరణలో 150కి పైగా ఇళ్లను తొలగించారు. 2015 నుంచి పరిహారం ఇవ్వకపోవడంతో చాలామంది పేదలు రోడ్డున పడ్డారు. ♦ రాయివలసలో ఉన్న మెట్కోర్ ఫెర్రో అల్లాయీస్ సంస్థ మూసివేయడంతో 350 మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. వీరికి 60 శాతం వరకు జీతాలొచ్చే ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చి కార్మికమంత్రిగా ఏమీ చేయలేకపోయారు. ♦ పెన్షన్లు, రేషన్ కార్డులు తమ వారికి మంజూరు చేయాలన్నా, వైఎస్సార్సీపీ వారివి రద్దు చేయాలన్నా జన్మభూమి కమిటీలకే సర్వాధికారాలు కట్టబెట్టారు. ♦ ఉదాహరణకు కోటబొమ్మాళి మండలం యలమంచిలిలో వైఎస్సార్సీపీకి చెందిన 80 మంది వృద్ధాప్య పెన్షన్లు తొలగించారు. ఈ అన్యాయంపై గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ల నేతృత్వంలో ఎంపీడీవో కార్యాలయం ఎదుట 40 రోజులపాటు బాధితులు దీక్షలు చేశారు. చివరకు హైకోర్టును ఆశ్రయించడంతో వారికి పెన్షన్లు ఇవ్వాలని ఆదేశించినా అచ్చెన్న సామ్రాజ్యంలో ఇప్పటికీ అమలు కాలేదు. వీరిలో 13 మంది మనోవేదనతో చనిపోయారు. ♦ తాను చదువుకున్న టెక్కలి డిగ్రీ కాలేజీలో విద్యార్థులకు ఇప్పటికీ మరుగుదొడ్లకు ర న్నింగ్ వాటర్ సదుపాయం కల్పించలేకపోవడం అచ్చెన్న అభివృద్ధికి ఓ మచ్చుతునక! అన్యాయంగా పింఛన్ తీసేశారు వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉన్నాననే కక్షతో మా గ్రామ టిడీపీ నేతలు నా పింఛన్‌ను అన్యాయంగా తీసేశారు. పింఛన్ కోసం అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోలేదు. చివరకు హైకోర్టులో మాకు అనుకూలంగా తీర్పు వచ్చినా పింఛన్ ఇవ్వలేదు. –కవిటి కేశవయ్య, బాధిత వృద్ధుడు, యలమంచిలి, టెక్కలి నియోజకవర్గం -
ఓటెయ్యలేదని పింఛన్ ఇవ్వలేదయ్యా!
అనంతపురం రూరల్: ‘టీడీపీకి ఓటు వేయలేదన్న అక్కసుతో మాకు పింఛన్లు అందకుండా చేస్తున్నారు’ అంటూ వైఎస్సార్సీపీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఎదుట పలువురు వృద్ధులు వాపోయారు. కక్కలపల్లి కాలనీ పంచాయతీ పరిధిలోని పిల్లిగుండ్ల కాలనీలో మంగళవారం ఉదయం ‘ప్రకాష్‌తో ప్రతి ఉదయం’ కార్యక్రమాన్ని ప్రకాష్‌రెడ్డి నిర్వహించారు. కాలనీలోని వీధివీధినా తిరుగుతూ స్థానికులతో సమస్యలపై ఆయన ఆరా తీశారు. ఒక్క ఇల్లు కూడా మంజూరు కాలేదు.. కాలనీ ఏర్పడి మూడు దశాబ్దాలు అవుతోందని, ఇళ్లు శిథిలావస్థకు చేరుకున్నాయని, అయినా ఈ నాలుగేళ్లలో ఒక్క ఇంటిని కూడా టీడీపీ ప్రభుత్వం మంజూరు చేయలేదంటూ ప్రకాష్‌రెడ్డితో కాలనీ వాసులు మొరపెట్టుకున్నారు. ఇల్లు మంజూరు చేయాలని పలుమార్లు అర్జీలు ఇచ్చినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. తీరని నీటి ఎద్దడి కాలనీలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని పలువురు ఆరోపించారు. బిందెడు నీటి కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందన్నారు. అందుతున్న అరకొర నీరుతో కనీస అవసరాలు తీరడం లేదన్నారు. సమస్య పరిష్కారానికి అధికారులు, ప్రజా ప్రతినిధులు చొరవ చూపడం లేదని అన్నారు. మరుగుదొడ్లు నిర్మించుకుంటామన్నా.. మంజూరు చేయడం లేదని తెలిపారు. చాలా వీధుల్లో వీధి దీపాలు వెలగడం లేదని తెలిపారు. జగన్ సీఎం అయితే సమస్యలు పరిష్కారం ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ.. కాలనీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అధికారులతో చర్చిస్తానని అన్నారు. మాయ మాటలతో ఓట్లు వేయించుకున్న వారికి తిరిగి అదే ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. పీఏబీఆర్ పైప్‌లైన్ ద్వారా కాలనీ వాసులకు తాగునీటిని అందిస్తామంటూ ఎన్నికలకు ముందు పరిటాల సునీత హామీనిచ్చారని, అయితే నేటికీ నెరవేర్చలేకపోయారని అన్నారు. అయితే వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ట్యాంకర్లు ఏర్పాటు చేసి కాలనీ వాసుల దాహార్తిని తీరుస్తున్నట్లు గుర్తు చేశారు. కక్కలపల్లి కాలనీని కార్పొరేషన్లోకి విలీనం చేస్తే ఈ ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే సమస్యలన్నీ పరిష్కారమవుతాయని అన్నారు. పేదలకు అండగా నిలిచిన తనను ఒక్కసారి ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపిస్తే కాలనీలో ప్రతి ఇంటికీ పీఏబీఆర్ ద్వారా నీటిని అందిస్తామని భరోసానిచ్చారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు రాజశేఖర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు బోయనరేంద్ర( రాజారాం), మండల కన్వీనర్ నాగేశ్వరరెడ్డి, మండల యువజన కన్వీనర్ వరప్రసాదరెడ్డి, వాసుదేవరెడ్డి, శ్రీనివాసులు, యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శులు మాధవరెడ్డి, శ్రీనివాసులువడ్డే, వడ్డుపల్లి గోపాలరెడ్డి అక్కంపల్లి మాధవరెడ్డి, గుగ్గిళ్ల జయకృష్ణారెడ్డి, వడ్డే లింగమయ్య, బండి రవికుమార్, æఆనంధరెడ్డి, నాగభూషణరెడ్డి, చిన్నపరెడ్డి, రామిరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, బిస్కెట్ వెంకటేష్, యువరాజ్, కార్తిక్ రెడ్డి, రామిరెడ్డి సూర్యనారాయణరెడ్డి, రామాంజినేయులు, కేశవరెడ్డి, సిండికేట్ నగర్ ఆంజినేయులు(బండా), రాము, హనుమంతు, ఎద్దులపల్లి నారాయణస్వామి, శివ, రాము పాల్గొన్నారు. -
కోత పడింది
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: బేస్తవారిపేటకు చెందిన నక్కా తిరుపతయ్యకు ఇప్పుడు 70 సంవత్సరాల వయస్సు. రేషన్ కార్డులో 35 సంవత్సరాలు అని తప్పుగా నమోదయింది. నిలువెత్తు మనిషే ప్రత్యక్షంగా కనిపిస్తున్నా ... అదంతా మాకు తెలియదు నీవు యువకుడివే ... పింఛన్ కట్ అంతే...పొమ్మన్నారు. అర్ధవీడు మండలం అయ్యవారిపల్లికి చెందిన పగడాల బుస్సమ్మకు ఎనభై ఏళ్లు. వృద్ధాప్యం మీద పడితే కాదు ... పక్కాగా ఆధారాలుండాలి. నీకు కూడా పింఛన్ గల్లంతేనంటూ ఛీత్కరించుకున్నారు. 75 సంవత్సరాల గాదం వెంకటయ్యకు పక్షవాతం కూడా తోడయింది. ఎటూ కదలలేని పరిస్థితి. బాబూ అని బతిమలాడుకున్నా మా పద్ధతి మారదని కసురుకున్నారు. ఈయనలాగేనే మరో 60 మంది పేర్లను తొలగించారు. రాచర్లకు చెందిన మండ్ల వెంకటయ్య. ఈయన వయసు ఎంతో తెలుసా. 90 ఏళ్లు. గత 20 ఏళ్ల నుంచి ఠంఛన్‌గా పింఛన్ తీసుకుంటున్నా సర్వే పేరుతో మంగళం పాడారు. కాటికి కాళ్లు చాపుకుని ఉన్న వారు తమ పేర్లు పింఛన్ల జాబితాలో నుంచి తొలగించి వేయడంతో ఇక దిక్కెవరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలకు రెండు వందలు వచ్చే పింఛన్‌ను వెయ్యి రూపాయలు చేస్తామని హామీ ఇచ్చిన బాబు సర్కారు గత కొంతకాలంగా కొనసాగుతున్న పింఛన్‌పై వేటేసి నోటికాడ కూడు లేకుండా చేసిందని ఆందోళన చెందుతున్నారు. అధికార పార్టీ నేతలతో నింపేసిన కమిటీలు నిర్థాక్షిణ్యంగా పక్షపాత ధోరణితో జాబితాలోని పేర్లను తలగించడంతో సర్వత్రా నిరసనలు వెల్లువెత్తాయి. మరోవైపు గ్రామీణ పేదరిక నిర్మూలన కోసం ఏర్పాటు చేసిన సెర్ఫ్ అధికారులు ఆధార్‌లో లోపాలను వెతికి వ్యవసాయ భూమి ఉందన్న పేరుతో ఏకంగా 42 వేల పింఛన్లను నిలిపేశారు. ప్రకాశం జిల్లాలో 3,12,000 పింఛన్లుండగా, గ్రామ కమిటీలు 37 వేల పింఛన్లు తొలగించాయి. సెర్ప్ (సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పూర్) ఆదేశాలతో మొత్తం 79 వేల మందికి పింఛన్ ఆగిపోయినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. పింఛన్ వచ్చిన వారికి కూడా ఈ నెలలో ఐదో తేదీలోగా అందే పరిస్థితి కనపడటం లేదు. పింఛన్ ఎప్పుడు ఇచ్చేది తాము చెబుతామని, అప్పటి వరకూ ఆపాలంటూ ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. గుడ్లూరు మండలం చేవూరు గ్రామంలో 426 మందికి వికలాంగ, వితంతు, వృద్ధాప్య పింఛన్లు వస్తుండగా అందులో 132 మంది పేర్లను తొలగించారు. ఇందులో 70 మందికి పూర్తి అర్హత ఉన్నా వినిపించుకునే నాధుడే లేడు. దీంతో ఆగ్రహించిన బాధితులు గ్రామానికి వచ్చిన అధికారులను నిర్బంధించి నిరసన తెలిపారు. 13 సంవత్సరాల నుంచి వికలాంగ పింఛన్ అందుకుంటున్న కోటేశ్వరరావుతోపాటు 80 శాతం అంగవైకల్య సర్టిఫికెట్ ఉన్నవారికి కూడా పింఛన్ తొలగించారు. గిద్దలూరులో సగానికిపైగా పింఛన్లు తొలగించివేశారు. గిద్దలూరు పట్టణంలోని పెద్ద పోస్టాఫీసుకు గతంలో 1,300 పింఛన్లు వస్తుండగా ప్రస్తుత జాబితాలో 672 మందికి మాత్రమే వస్తున్నాయి. ఆధార్, రేషన్ కార్డులో 70, 80 సంవత్సరాల వయస్సున్న వృద్ధుల పింఛన్లు సైతం తొలగించివేశారు. పోస్టాఫీసుల్లో సంతకాలు, వేలిముద్రలు తీసుకొని ఆన్లైన్ ద్వారా పింఛన్లు పొందుతుంటే అవి బోగస్ అని ఎలా చెబుతారని లబ్థిదారులు ప్రశ్నిస్తున్నారు. జీవితకాలం తగ్గుతున్న తరుణంలో పింఛన్ వయోపరిమితిని పెంచడం పట్ల కూడా ఆగ్రహం వ్యక్తమవుతోంది. తమ పేరుతో ఉన్న పొలం కుమారులకు పంచి ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయని వారికి కూడా వేటుపడింది. కొంతమంది పొలం అమ్ముకున్నా అవి ఆధార్ రికార్డులలోకి ఎక్కకపోవడంతో తొలగించారు. వితంతువులకు కూడా వయస్సును సాకుగా చూపించి తప్పించారు. బేస్తవారి పేటకు చెందిన నక్కా తిరుపతయ్యకు ఇప్పుడు 70 సంవత్సరాల వయస్సు కాగా, రేషన్ కార్డులో 35 సంవత్సరాలు అని తప్పుగా నమోదు కావడమే శాపమయింది. అర్ధవీడు మండలం అయ్యవారి పల్లిలో పగడాల బుస్సమ్మ(80), పక్షవాతం వచ్చిన గాదం వెంకటయ్య(75) తోపాటు 60 మంది పేర్ల తొలగించారు. రాచర్లలో గత 20 ఏళ్ల నుంచి పింఛన్ తీసుకుంటున్న మండ్లా వెంకటయ్య అనే 90 ఏళ్ల వృద్ధుడి పింఛన్ కూడా తొలగించారు. -
పిచ్చి లెక్కలతో పింఛన్ కోత
నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం కల్మెడకు చెందిన గడ్డం ధనమ్మ అనే వికలాంగ మహిళ గతంలో పింఛన్ పొందేది. ఆమె పుట్టు కతోనే పోలియో కారణంగా ఒక కాలు చచ్చుబడిపోయింది. సదరం క్యాంపులు రాకముందు సివిల్ సర్జన్లు ఇచ్చిన సర్టిఫికెట్లో ఆమె వైకల్యాన్ని 50 శాతానికి పైగా పేర్కొన్నారు. కానీ సదరం క్యాంపులో ఆమె వైకల్య శాతాన్ని 39 శాతంగా పేర్కొనడంతో.. పింఛన్ రద్దయింది. మళ్లీ అదే క్యాంపులో పరీక్ష చేయించుకోగా.. వైకల్య శాతం 38 శాతంగా వచ్చింది. దీంతో అంతకుముందు నెల నెలా పొందిన రూ. 500 పింఛన్‌ను రద్దు చేశారు. అదే గ్రామానికి చెందిన కత్తుల రాంలింగయ్యదీ ఇదే పరిస్థితి. గతంలో 50 శాతానికి పైగా వైకల్యం ఉందని సర్టిఫికెట్ పొందిన ఆయనకు సదరం క్యాంపులో 39 శాతమే ఉందని నిర్ధారించారు. దీంతో పింఛన్ నిలిపివేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని బిలాల్‌నగర్‌లో కుక్కల పాపారావు అనే వికలాంగుడు నివసిస్తున్నాడు. ఆయనకూ గతంలో పింఛన్ వచ్చేది. సదరం క్యాంపులో పరీక్షించుకుంటే ఆయన వైకల్య శాతం 28 శాతంగా వచ్చింది. మళ్లీ వెళితే 39 శాతానికి పెంచినా.. అది పింఛన్ పొందేందుకు అర్హమైన శాతం కాదు. ఈ పరిస్థితి ఆ ముగ్గురిదే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు లక్షన్నర మంది వికలాంగుల దుస్థితి ఇది. సదరం క్యాంపుల్లో నిర్ధారిత వైకల్యశాతం లేదని గుర్తించినందున వారందరి పింఛన్లను గతంలో నిలిపివేశారు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం వారందరికీ రూ. 500 కాకుండా.. రూ. 200 పింఛన్ ఇవ్వనున్నారు. అంటే వైకల్య శాతం తగ్గింది కనుక పింఛన్‌ను కూడా తగ్గించారనే అర్థమవుతోంది. ప్రభుత్వం చేపట్టిన ఈ చర్య వైకల్య శాతం పేరుతో నిధులు మిగుల్చుకునేందుకేనని స్పష్టమవుతోంది. మొత్తంగా లక్షన్నర మందికి పైగా వికలాంగులకు అన్యాయం చేయడం ద్వారా రూ. 54 కోట్ల మేర మిగిలించుకునేందుకే సర్కారు తాపత్రయపడుతోందని వెల్లడవుతోంది. 39.5 శాతం ఉందని అనర్హులను చేశారు నిబంధనల ప్రకారం 40 శాతం, ఆపైన వైకల్యం ఉన్న వారిని పింఛన్ పొందేందుకు అర్హులుగా గుర్తిస్తున్నారు. అయితే, అంతకుముందు ఎక్కువ వైకల్యం ఉన్నట్లుగా సర్టిఫికెట్లు పొందినవారిలో.. దాదాపు లక్ష మందికి వైకల్య శాతం 39- 40 మధ్య ఉన్నట్లుగా సదరం క్యాంపుల్లో గుర్తించారు. అసలు మొదట్లో వారందరికీ సర్టిఫికెట్లు ఇచ్చింది కూడా సివిల్ సర్జన్లే. వారంతా గతంలో రూ. 500 పింఛన్ పొందిన వారే. మరి అంతమందికి కేవలం 39-40 శాతం మధ్య వైకల్యశాతం నిర్ధారణ అవడంపై సందేహాలు తలెత్తుతున్నాయి. సెదారన్ క్యాంపుల్లో వైకల్య శాతం నిర్ధారించే తీరుపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ క్యాంపుల్లో అర్హత గల వైద్యులను కాకుండా శిక్షణలో ఉన్న వైద్యులను ఉపయోగించారనే ఆరోపణలున్నాయి. ఇక శబ్ధస్థాయి ఆధారంగా బధిర, మూగ వికలాంగుల వైకల్య శాతాన్ని నిర్ధారించడానికి అనువైన వాతావరణం ఏ ఒక్క జిల్లా కేంద్ర ఆసుపత్రిలో కూడా లేదని వికలాంగ సంఘాలు పేర్కొంటున్నాయి. ఇక రెండు కళ్లు లేనివారిని పూర్ణ అంధులుగా గుర్తించి, పింఛన్ మంజూరు చేస్తున్న ప్రభుత్వం ఒక కన్ను లేని వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఒక కన్నుతో అంతా చూడవచ్చని, అలాంటప్పుడు పింఛన్ ఎందుకని అధికారులు ప్రశ్నిస్తున్నారని సమాచారం. రూ. 75 నుంచి రూ. 500కు పెంచిన వైఎస్.. చంద్రబాబు హయాంలో వికలాంగ పింఛన్ రూ. 75గా ఉండేది. వైఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2004లో దానిని రూ. 200కు పెంచారు. ఆ తర్వాత 2007లో దానిని రూ. 500కు పెంచారు. అయితే.. 2008 మార్చిలో మందకృష్ణ నేతృత్వంలో వికలాంగ హక్కుల పోరాట సమితి (వీహెచ్పీఎస్) నేతలు ఆమరణ దీక్షకు దిగిన సందర్భంగా.. వైకల్య శాతం ఆధారంగా వికలాంగ పింఛన్‌ను మళ్లీ పెంచుతున్నామని 2008 మార్చి 13న అసెంబ్లీలో వైఎస్ ఒక ప్రకటన చేశారు. 41-60 శాతం వరకు వైకల్యం ఉన్న వారికి రూ. 500... 61-80 శాతం ఉన్న వారికి రూ.600.. 81-100 శాతం వైకల్యం ఉన్నవారికి రూ. 700 పింఛన్ ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికలు జరగడం, కొద్ది రోజులకే వైఎస్ హఠాన్మరణం కారణంగా ఆ ప్రకటన అమలుకు నోచుకోలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులుగానీ, అధికారులుగానీ ఈ విషయాన్ని పట్టించుకోలేదు. దీనినే వికలాంగ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. అసెంబ్లీలో ముఖ్యమంత్రి చేసిన ప్రకటనకు అనుగుణంగా పింఛన్ పెంచని ప్రభుత్వానికి... అదే వైకల్య శాతాన్ని బట్టి పింఛన్ తగ్గించే అవకాశం ఎవరిచ్చారని సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. అసలు వైకల్య శాతాన్ని గుర్తించి పింఛన్ పెంచుతామంటూ 2009 డిసెంబర్లో సదరం క్యాంపులు ప్రారంభించి, పింఛన్లు పెంచకపోగా... వాటి నివేదికల ఆధారంగా దాదాపు రూ.1.8 లక్షల మంది పింఛన్లను తొలగించడం గమనార్హం. సునీతమ్మ ఏం చేస్తున్నారు? 2008లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేసిన సమయంలో ప్రస్తుత వికలాంగ సంక్షేమ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి కూడా సభలోనే ఉన్నారు. అప్పుడు ఆమె చిన్ననీటిపారుదల మంత్రిగా, వికలాంగ సంక్షేమ శాసనసభా కమిటీ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. ఆ కమిటీ చైర్పర్సన్ హోదాలో ఆమె ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో కూడా వైకల్య శాతం ఆధారంగా పింఛన్ పెంచాలని సిఫారసు చేశారని వికలాంగ సంఘాలు పేర్కొంటున్నాయి. అప్పుడు ఆమె చేసిన ప్రతిపాదనలనే మంత్రి హోదాలో అమలుపర్చాల్సింది పోయి, పింఛన్లను తగ్గించడం దురదృష్టకరమని వ్యాఖ్యానిస్తున్నాయి. బడ్జెట్ తగ్గించుకునేందుకు కుట్ర.. ‘‘వైకల్య శాతం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇలా లక్షలాది మంది వికలాంగులకు అన్యాయం చేస్తోంది. వైకల్య శాతాన్ని బట్టి పింఛన్ పెంచుతామని అసెంబ్లీలో చెప్పి.. ఇప్పుడు తగ్గించడమేమిటి? గతంలో హామీ ఇచ్చిన విధంగా వికలాంగ పింఛన్‌ను రూ.600, రూ.700 చొప్పున ఇవ్వాలి. లేదా తమిళనాడు, గోవా, పాండిచ్చేరి తరహాలో వికలాంగ పింఛన్‌ను రూ.1500కు పెంచాలి’’ - అందె రాంబాబు, వీహెచ్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వీటికి బదులేది? ?అంతకుముందు ప్రభుత్వ సివిల్ సర్జన్లు నిర్ధారించిన వైకల్య శాతాలను సదరం క్యాంపుల్లో బాగా తగ్గించారు. అదే సదరం క్యాంపుల్లో మళ్లీ పరీక్షలు చేయించుకున్న చాలా మందికి వైకల్య శాతంలో పదిశాతానికిపైగా తేడా వచ్చింది. అసలు సదరం క్యాంపుల్లో వైకల్య శాతం నిర్ధారణలో ఉన్న శాస్త్రీయత ఏమిటి. ?వాటి నివేదికల ఆధారంగా ప్రభుత్వం లక్షన్నర మంది వికలాంగులకు ఎందుకు పింఛన్ నిలిపేసింది. ?సదరం క్యాంపుల్లో వైకల్య శాతం తగ్గించిన లక్షన్నర మంది వికలాంగుల్లో.. దాదాపు లక్ష మందికి కనీస పింఛను అర్హత అయిన 40 శాతం వైకల్యం కంటే కేవలం ఒకటి రెండు శాతం మాత్రమే ఎందుకు తగ్గింది. ? వైకల్య శాతం తగినంత లేనప్పుడు అసలు పింఛన్‌కు అనర్హులను చేయకుండా.. మళ్లీ వారికి నెలకు రూ. 200 పింఛన్ ఇవ్వాలని ఎందుకు నిర్ణయించారు. ? ఎక్కువ వైకల్యం ఉన్నవారికి పింఛన్‌ను మరింత పెంచుతామని 2008 మార్చి 13న అసెంబ్లీలో అప్పటి సీఎం వైఎస్సార్ హామీ ఇచ్చారు. తర్వాత కొద్ది కాలానికే ఆయన మరణించారు. మరి ఒక సీఎం ఇచ్చిన హామీని తర్వాత ఎందుకు అమలు చేయడం లేదు. - సాక్షి, హైదరాబాద్