సాక్షి ప్రతినిధి, ఒంగోలు: బేస్తవారిపేటకు చెందిన నక్కా తిరుపతయ్యకు ఇప్పుడు 70 సంవత్సరాల వయస్సు. రేషన్ కార్డులో 35 సంవత్సరాలు అని తప్పుగా నమోదయింది. నిలువెత్తు మనిషే ప్రత్యక్షంగా కనిపిస్తున్నా ... అదంతా మాకు తెలియదు నీవు యువకుడివే ... పింఛన్ కట్ అంతే...పొమ్మన్నారు.
అర్ధవీడు మండలం అయ్యవారిపల్లికి చెందిన పగడాల బుస్సమ్మకు ఎనభై ఏళ్లు. వృద్ధాప్యం మీద పడితే కాదు ... పక్కాగా ఆధారాలుండాలి. నీకు కూడా పింఛన్ గల్లంతేనంటూ ఛీత్కరించుకున్నారు.
75 సంవత్సరాల గాదం వెంకటయ్యకు పక్షవాతం కూడా తోడయింది. ఎటూ కదలలేని పరిస్థితి. బాబూ అని బతిమలాడుకున్నా మా పద్ధతి మారదని కసురుకున్నారు. ఈయనలాగేనే మరో 60 మంది
పేర్లను తొలగించారు.
రాచర్లకు చెందిన మండ్ల వెంకటయ్య. ఈయన వయసు ఎంతో తెలుసా. 90 ఏళ్లు. గత 20 ఏళ్ల నుంచి ఠంఛన్‌గా పింఛన్ తీసుకుంటున్నా సర్వే పేరుతో మంగళం పాడారు.
కాటికి కాళ్లు చాపుకుని ఉన్న వారు తమ పేర్లు పింఛన్ల జాబితాలో నుంచి తొలగించి వేయడంతో ఇక దిక్కెవరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలకు రెండు వందలు వచ్చే పింఛన్‌ను వెయ్యి రూపాయలు చేస్తామని హామీ ఇచ్చిన బాబు సర్కారు గత కొంతకాలంగా కొనసాగుతున్న పింఛన్‌పై వేటేసి నోటికాడ కూడు లేకుండా చేసిందని ఆందోళన చెందుతున్నారు.
అధికార పార్టీ నేతలతో నింపేసిన కమిటీలు నిర్థాక్షిణ్యంగా పక్షపాత ధోరణితో జాబితాలోని పేర్లను తలగించడంతో సర్వత్రా నిరసనలు వెల్లువెత్తాయి. మరోవైపు గ్రామీణ పేదరిక నిర్మూలన కోసం ఏర్పాటు చేసిన సెర్ఫ్ అధికారులు ఆధార్‌లో లోపాలను వెతికి వ్యవసాయ భూమి ఉందన్న పేరుతో ఏకంగా 42 వేల పింఛన్లను నిలిపేశారు. ప్రకాశం జిల్లాలో 3,12,000 పింఛన్లుండగా, గ్రామ కమిటీలు 37 వేల పింఛన్లు తొలగించాయి.
సెర్ప్ (సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పూర్) ఆదేశాలతో మొత్తం 79 వేల మందికి పింఛన్ ఆగిపోయినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. పింఛన్ వచ్చిన వారికి కూడా ఈ నెలలో ఐదో తేదీలోగా అందే పరిస్థితి కనపడటం లేదు. పింఛన్ ఎప్పుడు ఇచ్చేది తాము చెబుతామని, అప్పటి వరకూ ఆపాలంటూ ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. గుడ్లూరు మండలం చేవూరు గ్రామంలో 426 మందికి వికలాంగ, వితంతు, వృద్ధాప్య పింఛన్లు వస్తుండగా అందులో 132 మంది పేర్లను తొలగించారు.
ఇందులో 70 మందికి పూర్తి అర్హత ఉన్నా వినిపించుకునే నాధుడే లేడు. దీంతో ఆగ్రహించిన బాధితులు గ్రామానికి వచ్చిన అధికారులను నిర్బంధించి నిరసన తెలిపారు. 13 సంవత్సరాల నుంచి వికలాంగ పింఛన్ అందుకుంటున్న కోటేశ్వరరావుతోపాటు 80 శాతం అంగవైకల్య సర్టిఫికెట్ ఉన్నవారికి కూడా పింఛన్ తొలగించారు. గిద్దలూరులో సగానికిపైగా పింఛన్లు తొలగించివేశారు. గిద్దలూరు పట్టణంలోని పెద్ద పోస్టాఫీసుకు గతంలో 1,300 పింఛన్లు వస్తుండగా ప్రస్తుత జాబితాలో 672 మందికి మాత్రమే వస్తున్నాయి.
ఆధార్, రేషన్ కార్డులో 70, 80 సంవత్సరాల వయస్సున్న వృద్ధుల పింఛన్లు సైతం తొలగించివేశారు. పోస్టాఫీసుల్లో సంతకాలు, వేలిముద్రలు తీసుకొని ఆన్‌లైన్ ద్వారా పింఛన్లు పొందుతుంటే అవి బోగస్ అని ఎలా చెబుతారని లబ్థిదారులు ప్రశ్నిస్తున్నారు. జీవితకాలం తగ్గుతున్న తరుణంలో పింఛన్ వయోపరిమితిని పెంచడం పట్ల కూడా ఆగ్రహం వ్యక్తమవుతోంది. తమ పేరుతో ఉన్న పొలం కుమారులకు పంచి ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయని వారికి కూడా వేటుపడింది. కొంతమంది పొలం అమ్ముకున్నా అవి ఆధార్ రికార్డులలోకి ఎక్కకపోవడంతో తొలగించారు.
వితంతువులకు కూడా వయస్సును సాకుగా చూపించి తప్పించారు. బేస్తవారి పేటకు చెందిన నక్కా తిరుపతయ్యకు ఇప్పుడు 70 సంవత్సరాల వయస్సు కాగా, రేషన్ కార్డులో 35 సంవత్సరాలు అని తప్పుగా నమోదు కావడమే శాపమయింది. అర్ధవీడు మండలం అయ్యవారి పల్లిలో పగడాల బుస్సమ్మ(80), పక్షవాతం వచ్చిన గాదం వెంకటయ్య(75) తోపాటు 60 మంది పేర్ల తొలగించారు. రాచర్లలో గత 20 ఏళ్ల నుంచి పింఛన్ తీసుకుంటున్న మండ్లా వెంకటయ్య అనే 90 ఏళ్ల వృద్ధుడి పింఛన్ కూడా తొలగించారు.
కోత పడింది
Published Fri, Oct 3 2014 2:21 AM | Last Updated on Sat, Sep 2 2017 2:17 PM
Advertisement