టె‘క్కలి కాలం’.. మాఫియా జాలం | Kinjarapu Achennayudu Extremism In Srikakulam | Sakshi
Sakshi News home page

అచ్చెన్న.. ఓ డాన్‌..!

Published Sun, Apr 7 2019 1:47 PM | Last Updated on Sun, Apr 7 2019 1:47 PM

Kinjarapu Achennayudu Extremism In Srikakulam - Sakshi

సాక్షి, శ్రీకాకుళం: ఎన్నికల్లో వాడు మన పార్టీకి ఓటేయలేదు సార్‌.. అని ఓ కార్యకర్త చెబితే చాలు! వెంటనే అతని పెన్షన్‌ రద్దయిపోతుంది. ఈ డీలర్‌ వైఎస్సార్‌సీపీ అభిమాని సార్‌.. అంటే అతని రేషన్‌షాపు లైసెన్స్‌ కేన్సిల్‌ అయిపోతుంది. ఈ వీఆర్‌వో మనకు అనుకూలంగా పని చేయడం లేదంటే ఆయనకు బదిలీ అవుతుంది. అంతేనా? అభివృద్ధి పనులన్నీ అయిన వారికే దక్కుతాయి. మద్యం వ్యాపారులు, రైస్‌మిల్లర్లు సక్రమంగా వ్యాపారం సాగించుకోవాలన్నా, గ్రానైట్‌ వ్యాపారుల జోలికి అధికారులు వెళ్లకుండా చూడాలన్నా ఆయన అండదండలతోనే సాధ్యమవుతాయి.. ఇవన్నీ శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో మాఫియా నాయకుడిని తలపించేలా సాగిస్తున్న రవాణాశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడి అక్రమాలు, అరాచకాలు..!!

ఐదేళ్ల క్రితం 2014లో టెక్కలి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికయ్యారు అచ్చెన్నాయుడు. ఆ ఎన్నికల్లో ఆయన ప్రజలను కాకుండా రిగ్గింగ్‌నే నమ్ముకుని అతి కష్టమ్మీద వైఎస్సార్‌సీపీ అభ్యర్థిపై గెలిచారు. ఈ ఐదేళ్లలో అచ్చెన్న అండ్‌ కో అందినకాడికి దోచుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఓటర్లను లక్ష్యంగా పెట్టుకుని కక్ష సాధింపులకు పాల్పడ్డారు. జన్మభూమి కమిటీలకే సర్వాధికారాలు కట్టబెట్టారు. అభివృద్ధి పను ల కాంట్రాక్టులను సొంత సంస్థకు బదలాయించుకున్నారు.

మద్యం వ్యాపారుల నుంచి, రైస్‌మిల్లర్ల నుంచి నెలనెలా మామూళ్లు వచ్చే ఏర్పాటు చేసుకున్నారు. కోట్లు కుమ్మరించే గ్రానైట్‌ వ్యాపారులకు అండగా నిలిచారు. అచ్చెన్న అండ చూసుకుని ఆయన అనుచరగణం భూఆక్రమణలు, కబ్జాలకు తెగబడ్డారు. కోటబొమ్మాళి కేంద్రంగా అచ్చెన్నాయుడి అనుయాయులు నకిలీ బ్రాండెడ్‌ మద్యం సీసాల మూతలు, రేపర్ల తయారీని చేపట్టారు. వివిధ మార్గాల నుంచి కమీషన్లను వసూలు చేసే బాధ్యతను మంత్రి సోదరుడు హరిప్రసాద్‌ చూసుకుంటారని నియోజకవర్గ ప్రజలు కోడై కూస్తున్నారు. ఇంకా నియోజకవర్గంలో కొండలు, గుట్టలు, చెరువులను మంత్రి గారి వందిమాగదులు కబ్జా చేసేశారు.

అమ్మో నిమ్మాడ..!
నిమ్మాడ.. అచ్చెన్నాయుడి సొంతూరు. ఆ ఊళ్లో దాదాపు 40 వరకు గ్రానైట్‌  పాలిషింగ్‌ యూనిట్లున్నాయి. అక్కడ క్వారీల నుంచి యూనిట్లకు గ్రానైట్‌ను అనుమతులకు మించి తరలిస్తుంటారు. ఇలా నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేసి భారీగా జరిమానా విధించాల్సి ఉంటుంది. ఇలా జరిమానాగా వసూలు చేయాల్సిన సొమ్ము రూ.కోట్లలో ఉంటుందని చెబుతా రు. కానీ మైనింగ్‌ అధికారులు ఆ యూనిట్ల వైపు తొంగిచూసే సాహసమే చేయరు. పైగా ఈ వ్యాపారుల నుంచి నెలనెలా వీరే వసూలు చేసి మంత్రి కిచ్చే బాధ్యతను నెత్తికొత్తుకున్నారని చెబుతారు. సంబంధిత గ్రానైట్‌ వ్యాపారుల నుంచి భారీగా మామూళ్లు చెల్లిస్తుండడం వల్ల వారిపై ఈగ వాలకుండా చూసుకుంటారు.

రిగ్గింగ్‌తో బయటపడి..
2014 ఎన్నికల్లో అచ్చెన్నాయుడు సంతబొమ్మాళి మండలంలో 15 చోట్ల రిగ్గింగ్‌కు పాల్పడి 8,387 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అప్పట్లో పోలింగ్‌ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలు లేవు. కానీ ఈ సారి ఆ పరిస్థితి లేదు. అచ్చెన్న, ఆయన బృందం అక్రమాలు, అరాచకాలకు విసిగి వేసారిపోయారు టెక్కలి ఓటర్లు. మళ్లీ ఆయన్ను ఎమ్మెల్యేను చేస్తే ఇంకెంతగా దోచుకుంటారోనని భీతిల్లుతున్నారు. అందుకే అచ్చెన్నకు ఓటుతో ఎప్పుడు బుద్ధి చెబుదామా? వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పేరాడ తిలక్‌ను ఎప్పుడు గెలిపిద్దామా? అని ఎదురు చూస్తున్నారు. టెక్కలి నియోజకవర్గంలో ఎక్కడ చూసినా టీడీపీ ప్రభుత్వం, అచ్చెన్నపై వ్యతిరేకత, జగన్‌ ప్రభంజనమే కనిపిస్తోంది. ఇదే ఇప్పుడు అచ్చెన్నాయుడికి ముచ్చెమటలు పట్టిస్తోంది.

అన్యాయాలకు అంతే లేదు..
కోటబొమ్మాళి మండలం యలమంచిలికి చెందిన కెల్లి తవుడుకు గతంలో వృద్ధాప్య పింఛన్‌ వచ్చేది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక మంత్రి అచ్చెన్నాయుడు అండతో టీడీపీ కార్యకర్తలు అతడి పింఛన్‌ తొలగించేశారు. మనస్థాపానికి గురైన ఆ వృద్ధుడు మృతి చెందాడు. అదే గ్రామానికి చెందిన కర్రి అప్పారావు అనే వృద్ధుడి పెన్షను కూడా జన్మభూమి కమిటీ సభ్యులు తొలగించారు. పోరాటం చేసి చివరకు మనస్థాపంతో చనిపోయాడు. ఇలా ఈ గ్రామంలో 13 మంది వృద్ధులు మనస్థాపానికి గురై మరణించారు. టెక్కలి మండలం బూరగాంలో గాసయ్య అనే వ్యక్తి రేషన్‌ డిపో నిర్వహిస్తుండేవాడు. 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చాక జన్మభూమి కమిటీ సభ్యులు అచ్చెన్నాయుడు అండతో గాసయ్య డీలర్‌షిప్‌ను తొలగించేశారు. వైఎస్సార్‌ సీపీకు అనుకూలంగా ఉన్నాడనే కక్షతో డీలర్‌షిప్‌ను రద్దు చేయించారు.

అచ్చెన్న అండ్‌ కో ఘనతలు.. మచ్చుకు కొన్ని..!  
టెక్కలి ఆర్టీసీ కాంప్లెక్స్‌ను మల్టీ కాంప్లెక్స్‌గా అభివృద్ధి చేయడానికి రూ.80 కోట్లు మంజూరయింది. అర్హత లేకపోయినా దాని కాంట్రాక్టు రవాణా శాఖమంత్రి కూడా అయిన అచ్చెన్న బినామీ శ్రీనివాస్‌కే దక్కింది. 
నియోజకవర్గ అభివృద్ధి పనులను తొలుత బినామీలు/అనుచరులు దక్కించుకుంటారు. ఆ తర్వాత అచ్చెన్న సోదరుడి కుమారుడు పేరిట ఉన్న సురేష్‌ కన్‌స్ట్రక్షన్స్‌ పరం చేస్తారు. ఆ పనులను సురేష్‌ పూర్తి చేస్తారు. 
నియోజకవర్గ కేంద్రం టెక్కలి రోడ్డు విస్తరణలో 150కి పైగా ఇళ్లను తొలగించారు. 2015 నుంచి పరిహారం ఇవ్వకపోవడంతో చాలామంది పేదలు రోడ్డున పడ్డారు. 
రాయివలసలో ఉన్న మెట్‌కోర్‌ ఫెర్రో అల్లాయీస్‌ సంస్థ మూసివేయడంతో 350 మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. వీరికి 60 శాతం వరకు జీతాలొచ్చే ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చి కార్మికమంత్రిగా ఏమీ చేయలేకపోయారు. 
పెన్షన్లు, రేషన్‌ కార్డులు తమ వారికి మంజూరు చేయాలన్నా, వైఎస్సార్‌సీపీ వారివి రద్దు చేయాలన్నా జన్మభూమి కమిటీలకే సర్వాధికారాలు కట్టబెట్టారు. 
ఉదాహరణకు కోటబొమ్మాళి మండలం యలమంచిలిలో వైఎస్సార్‌సీపీకి చెందిన 80 మంది వృద్ధాప్య పెన్షన్లు తొలగించారు. ఈ అన్యాయంపై గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్‌ల నేతృత్వంలో ఎంపీడీవో కార్యాలయం ఎదుట 40 రోజులపాటు బాధితులు దీక్షలు చేశారు. చివరకు హైకోర్టును ఆశ్రయించడంతో వారికి పెన్షన్లు ఇవ్వాలని ఆదేశించినా అచ్చెన్న సామ్రాజ్యంలో ఇప్పటికీ అమలు కాలేదు. వీరిలో 13 మంది మనోవేదనతో చనిపోయారు. 
తాను చదువుకున్న టెక్కలి డిగ్రీ కాలేజీలో విద్యార్థులకు ఇప్పటికీ మరుగుదొడ్లకు ర న్నింగ్‌ వాటర్‌ సదుపాయం కల్పించలేకపోవడం అచ్చెన్న అభివృద్ధికి ఓ మచ్చుతునక!

అన్యాయంగా పింఛన్‌ తీసేశారు
వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఉన్నాననే కక్షతో మా గ్రామ టిడీపీ నేతలు నా పింఛన్‌ను అన్యాయంగా తీసేశారు. పింఛన్‌ కోసం అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోలేదు. చివరకు హైకోర్టులో మాకు అనుకూలంగా తీర్పు వచ్చినా పింఛన్‌ ఇవ్వలేదు.
–కవిటి కేశవయ్య, బాధిత వృద్ధుడు, యలమంచిలి, టెక్కలి నియోజకవర్గం

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/3

రోడ్డు విస్తరణలో తొలగించిన ఇళ్లు

2
2/3

అచ్చెన్నాయుడి అనుచరుడు కాంట్రాక్టు దక్కించుకున్న ఆర్టీసీ కాంప్లెక్స్‌

3
3/3

నీళ్లు లేక వినియోగంలో లేని టెక్కలి డిగ్రీ కళాశాల బాలికల టాయిలెట్‌

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement