డిసెంబర్ 31 ఈవెంట్స్ కోసం యూత్ స్పెషల్ ప్లాన్స్
గోవా, గోకర్ణ టూర్లలో టెకీ ఉద్యోగులు బిజీ
లోకల్ వేడుకలపై పోలీసుల నిఘాతో మారిన వైఖరి
శివార్లలోని ఫాంహౌస్‌లలో పార్టీలకు ఏర్పాట్లు
ముందస్తు అనుమతి తప్పనిసరి అంటున్న పోలీసులు
కొత్త సంవత్సరం రాబోతోంది.. దీంతో నగర యువత కొత్త ఉత్సాహంతో పార్టీ ఎందుకుండదు పుష్పా.. ఉంటుంది అంటున్నారు. పబ్‌లు, రిసార్ట్‌లు, ఫామ్ హౌస్‌లు.. ఎక్కడైతేనేం న్యూ ఇయర్‌కు గ్రాండ్ వెల్కమ్ పలికేందుకు యువత, ఐటీ ఉద్యోగులు సిద్ధమైపోయారు. ఈవెంట్ మేనేజర్లు కూడా కొత్త ఏడాదికి వేడుకలను భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. పాపులర్ సింగర్స్, డీజేలు, మ్యూజిక్ డైరెక్టర్లు, సినిమా సెలిబ్రిటీలతో ఈవెంట్లు, విందులు.. వినోదాలు.. సాంస్కృతిక కార్యక్రమాలు వంటి అనేక ఏర్పాట్లతో సెలబ్రేషన్స్ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో దీనిపైనే ఈ కథనం..
ఈసారి డిసెంబర్ 31న ఐటీ నిపుణులు, ఉన్నతోద్యోగులు ఐదారుగురు బృందంగా ఏర్పడి వేడుకలకు ప్లాన్ చేస్తున్నారు. దీంతో పాటు గేటెడ్ కమ్యూనిటీలోని రెండు మూడు ఫ్యామిలీలు కలిసి న్యూ ఇయర్ వేడుకలను సరికొత్తగా ప్లాన్ చేస్తున్నారు. హోటళ్లు, పబ్‌లు, క్లబ్‌లు నిర్వహించే పారీ్టల్లో పాల్గొని తిరుగు ప్రయాణంలో పోలీస్ తనిఖీలతో ఇబ్బందులు పడే బదులు.. శివారు ప్రాంతాల్లోని ఫామ్ హౌస్‌లు, విల్లాలు, వ్యక్తిగత గృహాలను అద్దెకు తీసుకొని పార్టీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి సమస్యలు అసలే ఉండవనేది వారి వాదన. దీంతో పాటు పార్టీ జోష్‌ను మరుసటి రోజు సాయంత్రం వరకూ ఎంజాయ్ చేయొచ్చనే యోచనలో ఉన్నారని సమాచారం.
ఈ వెంట్స్‌కి ఫుల్ డిమాండ్..
షామీర్‌పేట, శంషాబాద్, మెయినాబాద్, మేడ్చల్, కీసర వంటి శివారు ప్రాంతాల్లోని ఫామ్‌హౌస్, రిసార్టులు ఇప్పటికే బుక్ అయ్యాయి. దీంతో మిగిలిన వ్యక్తిగత గృహాలకు సైతం ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఇక ఈవెంట్స్ కూడా భారీగానే ప్లాన్ చేశారని, ఆయా ప్రాంతాల్లోని డిమాండ్ బట్టి పార్టీ వేడుకలకు ఒక్కో టికెట్ కనీసం రూ.5 వేల నుంచి రూ.15 వేల వరకూ ఉండొచ్చని అంచనా. సాధారణ రోజుల్లో ఫామ్‌హౌస్, రిసార్ట్‌లలో రోజుకు ఒక్క గది అద్దె రూ.15 వేల నుంచి రూ.30 వేలు ఉండగా.. న్యూ ఇయర్‌కు మాత్రం రూ.50 వేలపైనే చెబుతున్నారు.
అద్దెకు విల్లాలు, వ్యక్తిగత గృహాలు..
శివరాంపల్లి, శామీర్‌పేట, భువనగిరి, కొల్లూరు వంటి ఔటర్ రింగ్ రోడ్‌కు చేరువలో నిర్మితమైన విల్లాలు, వ్యక్తిగత గృహాలను యజమానులు అద్దెకు ఇస్తున్నారు. ఈ తరహా ట్రెండ్ ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ.. గతేడాతితో పోలిస్తే 20–30 శాతం అద్దె ఎక్కువగా వసూలు చేస్తున్నారని ఓ కస్టమర్ చెబుతున్నాడు. భారీగా అద్దెలు రావడంతో విల్లాలు, వ్యక్తిగత గృహాల నిర్మాణాలూ భారీగానే ఏర్పాటయ్యాయని, అయినా డిమాండ్ ఎక్కువగా ఉండడంతో రోజుకు అద్దె రూ.5 వేలుగా చెబుతున్నారని పేర్కొన్నారు. అదనపు చార్జీలతో మద్యం, ఫుడ్ ఇతరత్రా వాటిని కూడా ఫామ్‌హౌస్ నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు.
పోలీసు నిబంధనలివే..
పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా న్యూ ఇయర్ వేడుకలను చేయకూడదు.
వేడుకలకు హాజరయ్యే వారి గుర్తింపు కార్డులు, వివరాలను నమోదు చేయాలి.
సీటింగ్ సామర్థ్యానికి మించి టికెట్లను విక్రయించకూడదు.
కపుల్స్ కోసం నిర్వహించే పార్టీల్లో మైనర్లను అనుమతించకూడదు.
డీజేలు కాకుండా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిబంధన ప్రకారం 45 డిసెబుల్స్ కంటే తక్కువ సౌండ్స్ ఉన్న పరికరాలును మాత్రమే వినియోగించాలి.
ఎంట్రీ, ఎగ్జిట్ ప్రాంతాలతో పాటు ప్రాంగణం ముందు ఉన్న రహదారిలో 50 అడుగుల దూరాన్ని కవర్ చేసేలా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలి.
అసభ్యకరమైన దుస్తులతో నృత్య ప్రదర్శనలు నిర్వహించకూడదు.
పురుషులతో పాటు మహిళా సెక్యూరిటీ గార్డులను కూడా నియమించాలి.
మైనర్లకు లిక్కర్ సరఫరా చేసినా లేదా మాదక ద్రవ్యాలను వినియోగించినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు.
అనుమతులు తప్పనిసరి..
హోటళ్లు, రెస్టారెంట్లు, పబ్‌లు, ఫామ్‌హౌస్‌లు, రిసార్ట్‌లు, గేటెడ్ కమ్యూనిటీలలో న్యూ ఇయర్ వేడుకలను నిర్వహించే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని ట్రై కమిషనరేట్ పోలీసు ఉన్నతాధికారులు సూచించారు. లిక్కర్ సరఫరా చేస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ ఆబ్కారీ శాఖ అనుమతులు కూడా ఉండాల్సిందేనని, ప్రతి ఒక్కరూ నిబంధనలకు లోబడే ఈవెంటర్స్ నిర్వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment