ఆరుగురు కూతుళ్లతో లలితాభాయి (పై వరుసలో ఎడమ నుంచి రెండు)
బిడ్డకు ఏ కష్టం వచ్చినా ‘తల్లి’డిల్లిపోతుంది. తొమ్మిది నెలలు కడుపులో పెంచాను కదా! భారం దిగిపోయింది అనుకోదు. జీవితాంతం కళ్లలో పెట్టుకుని కాపాడుతుంది. కష్టకాలంలో తాను వెన్ను కాసి బిడ్డను కంటికి రెప్పలా సాకుతుంది. ఏ కారణం చేతనైనా ఇంటికి మగదిక్కు దూరమైతే.. తానే కాయకష్టం చేసి కుటుంబానికి పెద్ద దిక్కవుతోంది. అందుకే అమ్మను మించి దైవం లేదు.. అటువంటి అమృతమూర్తుల
కథనమే ఇది.. ఆ వివరాలు వారి మాటల్లోనే..
పాలకొల్లు అర్బన్: ‘నా పేరు కొల్లాపు మేరీ లలితాభాయి. మాది పెనుగొండ మండలం తూర్పు విప్పర్రు. మా వారు కొల్లాపు పాపారావు విశాఖ జిల్లా పలాసలో హాస్టల్ వార్డెన్‌గా పనిచేసేవారు. 2006 సెప్టెంబర్ 25న హఠాన్మరణం చెందారు. మాకు ఆరుగురు ఆడకూతుళ్లు. హఠాత్తుగా ఇంటికి పెద్ద దిక్కు కోల్పోవడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. గుండె దిటవు చేసుకుని ఎలాగైనా ఆరుగురు కూతుళ్లను ప్రయోజకులను చేయాలని నిర్ణయించుకున్నారు. వితంతు పింఛన్ సొమ్ముతో పాటు వారసత్వంగా లభించిన కొద్దిపాటి వ్యవసాయం సాగు చేయడానికి నడుం బిగించాను. నా రెక్కల కష్టంపై పిల్లలకు ఓ దారి చూపించగలిగినందుకు ఈ రోజున ఎంతో సంతోషంగా ఉంది. ప్రస్తుతం పెద్ద కుమార్తె హిమబిందు చదువు పూర్తి చేసుకుని హైదరాబాద్‌లోని ఓ ప్రయివేట్ స్కూల్‌లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ఆమె భర్త నాగార్జున సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. రెండో కుమార్తె లక్ష్మీభాయి బీటెక్‌తో పాటు ఎంబీఏ చదివింది. ఆమె భర్త అర్జునరావు హైదరాబాద్‌లో గ్రూపు–1, గ్రూపు–2 ఉద్యోగార్థులకు శిక్షణ ఇచ్చే కోచింగ్ సెంటర్‌లో ఫ్యాకల్టీ. మూడో కుమార్తె కొల్లాపు ప్రసన్న డిగ్రీ పూర్తి చేసింది.
తండ్రి ఉద్యోగం ప్రసన్నకు లభించింది. ప్రస్తుతం ఈమె పంచాయతీరాజ్ కమిషనరేట్ కార్యాలయం(విజయవాడ)లో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తోంది. నాలుగో కుమార్తె కొల్లాపు శిరీష అగ్రికల్చర్ డిప్లమో పూర్తి చేసి తణుకు మండలంలో ఏఈవోగా పనిచేస్తోంది. ఐదో కుమార్తె కొల్లాపు ప్రియాంక కూడా అగ్రికల్చర్ డిప్లమో చేసి పాలకొల్లు మండలంలో ఏఈవోగా విధులు నిర్వర్తిస్తోంది. ఆరో కుమార్తె కొల్లాపు రేష్మ తణుకులో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. రేష్మను ఉన్నతోద్యోగిగా చూడాలని ఆశపడుతున్నాను. నాకు ఆడబిడ్డలు ఎప్పుడూ భారమనిపించలేదు. క్రమశిక్షణతో పెంచా. ముగ్గురు కూతుళ్లకు ప్రభుత్వ ఉద్యోగాలు లభించాయి. సంతోషంగా ఉంది. ఇప్పుడిప్పుడే కష్టాలన్నీ అధిగమిస్తున్నా.’
చెప్పులు కుడుతూ..కుమార్తెను చదివిస్తూ..
ఆకివీడు: ‘నా పేరు కారుమంచి వెంకటరమణ. మా పుట్టినిల్లు ఆకివీడు. మా తల్లిదండ్రులు ముమ్మిడివరం గంగరాజు, పెద్దింట్లు. మా అత్తవారిల్లు తణుకు మండలం వీరభద్రపాలెం. పెళ్లి ఎప్పుడు అయినదో గుర్తులేదు కానీ, నా భర్త ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత కాపురం సరిగా చేయకపోవడంతో పుట్టింటికి వచ్చేశాను. మెట్టినిల్లు నెట్టివేసినా, పుట్టినిల్లు అక్కున చేర్చుకుంది. నా కుమారుడు నాగ తేజ మాత్రం తండ్రి వద్దే ఉంటున్నాడు. చదువు సంధ్యలబ్బకపోవడంతో చేపల చెరువులపై ఉంటున్నాడు. కుమార్తె శిరీషను నా దగ్గర పెంచుకుంటున్నాను. కుటుంబం పోషణ కోసం తల్లి దండ్రుల వృత్తినే ఎంచుకున్నాను. ఆకివీడులో మా తల్లిదండ్రులు చెప్పులు కుట్టుకుని బతికేవారు. కాయ కష్టంతో నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలను పెంచారు. తల్లిదండ్రులకు పిల్లలు పుట్టకపోవడంతో తిరుపతిలో వేకంటేశ్వరస్వామికి మొక్కుకున్నారు. ఆ తరువాత నేను పుట్టాను. నా తరువాత మిగిలిన నలుగురు పుట్టారు.
అందుకే మా పేర్ల ముందు వెంకట వచ్చే విధంగా నామకరణం చేశారు. మా ఆరాధ్యదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి. ఆయన్ని నమ్ముకుని, తండ్రి కుల వృత్తిని నమ్ముకుని జీవిస్తున్నాను. మా తండ్రి చనిపోయిన తరువాత మా తల్లి అదే వృత్తిని కొనసాగించింది. నా భర్త కాపురానికి సరిగా రాకపోవడంతో నా తల్లి ఈ చెప్పుల కుట్టే వృత్తిని నాకు ఇచ్చేసి ఆదరవు చూపింది. చెప్పులు కుట్టుకునే తన ప్రదేశాన్ని నాకు ఇచ్చి జీవన భృతికి సహకరించింది. ప్రస్తుతం నేను ఉన్న చోటే చెప్పులు కుట్టుకుంటూ వచ్చే ఆదాయంతో పిల్లను చదివిస్తున్నాను. ప్రస్తుతం నా కుమార్తె శిరీష భీమవరంలోని సెంట్‌ఆన్స్‌లో టీచర్ ట్రైయినింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఇటీవల టెట్ పరీక్షలకు హాజరైంది. రెక్కల కష్టంతో చదివిస్తున్న నా కూతురు ఉన్నతస్థితికి చేరుతుందన్న ఆశతోనే నేను జీవిస్తున్నాను. సొంతిల్లు, రుణం కోసం ప్రభుత్వానికి పదేపదే దరఖాస్తు చేసుకున్నా పట్టించుకోలేదు. అట్టడుగు కులంలో పుట్టినా మా పిల్లకు ఫీజు రీయింబర్స్ మెంట్‌గాని, ఉపకార వేతనం గాని అందడం లేదు. ఇప్పటికైనా అధికారులు దయచూపాలి. నలుగురు సోదరులు, సోదరి, భర్త, కుమారుడు ఉన్నప్పటికీ ఏకాకిగానే రెక్కల కష్టంపై దేవుడ్ని నమ్ముకుని బతుకుతున్నాను.’
Comments
Please login to add a commentAdd a comment