ఓ కూతురి కిరాతకం
బెంగళూరు బొమ్మనహళ్లిలో దారుణం
బొమ్మనహళ్లి: పెళ్లయి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్న మహిళ పక్క దారి పట్టింది. ఓ యువకునితో అక్రమ సంబంధం ఏర్పరచుకుంది. ఇంట్లో ప్రియునితో కలిసి ఉన్న సమయంలో తల్లికి దొరికిపోయి, తమ రహస్యం బయటపడరాదని ఆమెను మట్టుబెట్టిన కిరాతకురాలి ఉదంతమిది. ఈ సంఘటన బెంగళూరులోని బొమ్మనహళ్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది.
చంపి. ఆస్పత్రికి తీసుకెళ్లి..
బొమ్మనహళ్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 11వ తేదీన సాయంత్రం 4.30 గంటలకు జయలక్ష్మి (62) అనే మహిళ ఇంటిలో చనిపోయింది. తల్లికి రుతుచక్రం సమయంలో తీవ్ర రక్తస్రావమై చనిపోయిందని కూతురు పవిత్ర (34) చెప్పింది. చికిత్స చేయాలంటూ హొంగసంద్రలో ఉన్న ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లింది. వైద్యులు పరిశీలించి ఆమె చనిపోయిందని, ఏదో అనుమానం ఉందంటూ స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి పవిత్రను ప్రశ్నించగా అదే కథ చెప్పింది. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు.
శుక్రవారం పోస్టుమార్టం నివేదికను పరిశీలించిన పోలీసులకు అసలు విషయం అర్థమైంది. ఆమె గొంతు పిసకడం వల్ల చనిపోయిందని, గొంతుపై చిన్న గాయాలు ఉన్నాయని రిపోర్టులో ఉంది. దీంతో సీఐ ప్రీతం అనుమానం పెరిగి పవిత్రను పిలిపించి గట్టిగా ప్రశ్నించారు. మా అమ్మ చనిపోయిన బాధలో మేము ఉంటే, మీరు విచారణ అని అనుమానిస్తారా? అని ఎదురు ప్రశ్నించింది. కానీ పోలీసులు పట్టువీడకుండా విచారణ సాగించడంతో చివరకు నిజం చెప్పింది. తాను, ప్రియుడు లవనీత్‌తో కలిసి ఉండటం చూసి మా అమ్మ చాలాసార్లు మందలించింది, ఓ రోజు ఇద్దరూ బాత్‌రూం నుంచి బయటకు వస్తుండగా చూసి తీవ్రంగా హెచ్చరించింది.
మీ గురించి అందరికీ చెబుతానని బెదిరించింది. లవనీశ్‌ని ఇల్లు ఖాళీ చేయించింది. తమ విషయం బయటకు తెలిస్తే పరువు పోవడంతో పాటు తమ ఆనందానికి అడ్డుగా ఉన్న తల్లిని వదిలించుకోవాలని నిర్ణయించుకున్నట్లు పవిత్ర చెప్పింది. ఆరోజు ఇద్దరూ కలిసి టవల్‌తో ఆమె గొంతుకు చుట్టి హత్య చేశామని తెలిపింది.
కుటుంబం ఛిన్నాభిన్నం
పవిత్ర భర్త సురేష్ సొంత మేనమామే. 10 ఏళ్ల కూతురు, 6 ఏళ్ల కొడుకు ఉన్నారు. ఆయన కష్టపడి పనిచేసి స్థానికంగా 3 భవనాలు కట్టుకున్నాడు. వాటి బాడుగలే నెలకు రూ.3 లక్షల వరకు వస్తాయి. కుటుంబంతో మైకో లేఔట్‌లో ఉండేవారు. అద్దె ఇంటిలో లవనీశ్‌తో పవిత్రకు పరిచయం పెరిగి అక్రమ సంబంధానికి దారితీసినట్లు తెలిపింది. పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేసి జైలుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment