Black Belt
-
రష్యా అధ్యక్షుడికి వరుస షాక్‌లు.. తైక్వాండో బ్లాక్ బెల్ట్ కూడా తొలగింపు
Putin Loses Honorary Black Belt By World Taekwondo: ఉక్రెయిన్‌పై దాడుల నేపథ్యంలో క్రీడారంగానికి సంబంధించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు వరుస షాక్‌లు తగుతున్నాయి. ఇప్పటికే అంతర్జాతీయ జూడో ఫెడరేషన్ అధ్యక్ష పదవిని కోల్పోయిన పుతిన్‌కు తాజాగా వరల్డ్ తైక్వాండో ఫెడరేషన్ షాకిచ్చింది. రష్యా అధ్యక్షుడికి అందించిన గౌరవ తైక్వాండో బ్లాక్ బెల్ట్‌ను తొలగించింది. అలాగే రష్యా, బెలారస్లో ఎటువంటి తైక్వాండో ఈవెంట్లను నిర్వహించబోమని అధికారికంగా వెల్లడించింది. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా ప్రకటిస్తూ.. ఉక్రెయిన్‌పై రష్యా దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొంది. కాగా, 2013 నవంబర్‌లో తైక్వాండో సమాఖ్య పుతిన్‌కు గౌరవ 9వ డాన్ బ్లాక్ బెల్ట్‌ను అందించింది. World Taekwondo strongly condemns the brutal attacks on innocent lives in Ukraine, which go against the World Taekwondo vision of “Peace is More Precious than Triumph” and the World Taekwondo values of respect and tolerance.#PeaceIsMorePreciousThanTriumphhttps://t.co/nVTdxDdl2I — World Taekwondo (@worldtaekwondo) February 28, 2022 ఇదిలా ఉంటే, ప్రముఖ ఫుట్‌బాల్ సంస్థలు ఫిఫా, UEFA రష్యా జాతీయ జట్టుతో పాటు ఆ దేశ క్లబ్‌లను పోటీల నుండి బహిష్కరించిన విషయం తెలిసిందే. దీంతో పాటు సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరగాల్సిన యూరోపియన్ ఫుట్‌బాల్ లీగ్ ఫైనల్‌ను యూరోపియన్ ఫుట్‌బాల్ గవర్నింగ్ బాడీ రద్దు చేసింది. కాగా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం యావత్ ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఉక్రెయిన్‌పై యుద్దం విషయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏమాత్రం తగ్గట్లేదు. ఒక వైపు చర్చలకు సిద్ధమంటూనే.. రష్యా దళాలు భీకర దాడులు జరుపుతున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడుల్లో వందల సంఖ్యలో సామాన్య పౌరులు మరణించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ దాడుల్లో రష్యా కూడా తీవ్రంగా నష్టపోతోంది. ఈ యుద్దంలో ఉక్రెయిన్‌కు యావత్ క్రీడాలోకం మద్దతుగా నిలుస్తోంది. చదవండి: పుతిన్‌కు జూడో ఫెడరేషన్ షాక్! -
కరాటే పరశురాం..
పెద్దశంకరంపేట(మెదక్): ప్రతిభకు పేదరికం అడ్డుకాదని నిరూపిస్తున్నాడు పేట మండలానికి చెందిన యువకుడు పరశురాం. ఓ వైపు ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ, మరో వైపు కష్టపడి కరాటేలో రాణిస్తూ అనేక మంది మన్ననలు పొందుతున్నాడు మండల పరిధిలోని జూకల్ గ్రామానికి చెందిన ఈ యువకుడు. చూడడానికి వెళ్లి.. ఒకసారి మెదక్‌లో జరుగుతున్న కరాటే పోటీలను పరశురాం చూడడానికి వెళ్లాడు. అక్కడే ఉన్న కరాటే మాస్టర్ నగేష్‌ను కలిసి తన అభిమతం చెప్పాడు. అతని సహాయంతో ఆటో నడుపుతూనే కరాటే నేర్చుకున్నాడు. ఇలా ఏడేళ్లుగా కరాటేలో శిక్షణ పొందుతూ పలు రాష్ట్ర, అంతరాష్ట్ర పోటీల్లో పాల్గొని సత్తా చాటుతున్నాడు. గతేడాది బ్లాక్‌బెల్టు సాధించి ప్రముఖ సినీనటుడు సుమన్ చేతుల మీదుగా బెల్టు, ప్రశాంసా పత్రాన్ని అందుకున్నాడు. పట్టుదలే లక్ష్యంగా... జూకల్కు చెందిన పుట్ల బాలయ్య, మాణమ్మల కుమారుడు పరుశురాం. ఆరేళ్ల వయస్సులో తండ్రిని కోల్పోయాడు. మణమ్మ వారికి ఉన్న రెండెకరాల భూమిని సాగు చేసుకుంటూ కుమారుడిని చదివించింది. ప్రస్తుతం పరుశురాం పేటలో డీగ్రీ చదువుతూ ఆటో నడిపిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అనేక పతకాలు పరశురాం సొంతం.. గతేడాది ముంబాయిలో జరిగిన 22వ అంతర్జాతీయ ఏషియన్ ఓపెన్ ఛాంపియన్షిప్ పోటీల్లో 13 దేశాలకు చెందిన వారు పాల్గొనగా అండర్-20 స్పారింగ్ బ్లాక్ బెల్ట్ విభాగంలో పరశురాం కాంస్య పతకం సాధించాడు. వరంగల్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో సైతం పాల్గొని పతకం సాధించాడు. ఉచితంగా శిక్షణ ఇస్తూ ఆదర్శం.. తనకు వచ్చిన కరాటే విద్యను పరుశురాం తన సొంత గ్రామమైన జూకల్‌లో గ్రామస్థులకు, పేటలోని పలువురు విద్యార్థులకు నేర్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు పరశురాం. ఇతని దగ్గర శిక్షణ పొందిన 14 మందిలో ఐదుగురు స్వర్ణపతకాలు సాధించడం విశేషం. దీంతో పాటు పేటలోని పలు ఉన్నత పాఠశాలల్లో విద్యార్థినిలకు సైతం పరశురాం కరాటే శిక్షణ ఇస్తున్నాడు. ఎప్పటికైనా ఒలింపిక్స్‌లో పాల్గొని గ్రామానికి పేరు తేవడమే తన లక్ష్యమని పరుశురాం చెబుతున్నాడు. -
ధీశాలి 'బహుముఖ ప్రజ్ఞాశాలి'
అది 1980 దశకం..అప్పుడప్పుడే కరాటే అంటే యువతలో ఆసక్తి పెరుగుతోంది. ఒంగోలులో డిగ్రీ చదువుతున్న పద్మజ కూడా ఆ యుద్ధ క్రీడంటే మక్కువ చూపి శిక్షణ పొందడం మొదలుపెట్టారు. క్రమంగా మెళకువలు నేర్చుకుంటూ జిల్లాలో మొట్టమొదటి ఉమన్ బ్లాక్‌బెల్ట్ ఫస్ట్ డాన్‌గా నిలిచారు. జాతీయ స్థాయి పోటీల్లోనూ పతకాలు కైవసం చేసుకున్నారు. తాను నేర్చుకున్న ఆత్మరక్షణ విద్యను ఇతరులకు కూడా పంచాలనుకుని ఇప్పటి వరకు కొన్ని వందల మంది బాల బాలికలకు, షీ టీంలకు ఆత్మరక్షణ నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చారు. కరాటే శిక్షకురాలిగానే కాదు..ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయురాలిగా, చిత్రకారిణిగా, ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలిగా ప్రతిభ చాటుతున్న పద్మజపై ‘సాక్షి’ కథనం. ఒంగోలు వన్‌టౌన్: మేదరమెట్ల నుంచి వచ్చి ఉద్యోగరీత్యా ఒంగోలులో స్థిరపడిన చిలకమర్తి గోపాలకషమూర్తి, రమాదేవి దంపతులకు ఒక్కగానొక్క కూతురు పద్మజ. తండ్రి విద్యుత్ శాఖలో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ కావడంతో పద్మజ తన అన్న చంద్రశేఖర్ (మ్యాథ్స్ లెక్చరర్, హైదరాబాద్) తమ్ముడు కష్ణమోహన్ (ఫార్మాసూట్ సైంటిస్ట్, న్యూయార్క్)తో సమానంగా పెరిగింది. ఒంగోలు శర్మా కాలేజీలో ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన పద్మజ 1993లో బీఎస్సీ, బీఈడీ పట్టా తీసుకున్నారు. 1996లో సెకండరీ గ్రేడ్ టీచర్‌గా కొత్తపట్నం మండలం బజ్జిరెడ్డి గమళ్లపాలెం పాఠశాలలో ఉద్యోగినిగా చేరారు. 2009లో స్కూల్ అసిస్టెంట్‌గా ప్రమోషన్ రావడంతో ఇంగ్లిష్ టీచర్‌గా మద్దిపాడు మండలం బసవన్నపాలెం ఉన్నతపాఠశాలలో పనిచేశారు. ప్రస్తుతం చిన్నగంజాం హైస్కూల్ నందు ఇంగ్లిష్ ఉపాధ్యాయినిగా సేవలందిస్తున్నారు. కరాటే పద్మజ 1980 దశకంలో కరాటే శిక్షణ యువతీయువకులను విపరీతంగా ఆకర్షించింది. పద్మజ డిగ్రీ చదివే రోజుల్లో ఒంగోలు మహిళా మండలి వద్ద ప్రతిరోజూ ప్రముఖ కరాటే మాస్టర్ వలిశెట్టి రవి యువకులకు కరాటే శిక్షణ ఇవ్వడం గమనించి, కరాటే నేర్చుకోవాలన్న ఆసక్తిని నేరుగా రవి మాస్టర్‌కి తెలిపింది. అలా యుద్ధ నైపుణ్య విద్యలో తొలి అడుగులు వేసిన పద్మజ 1995లో ప్రకాశం జిల్లాలోనే మొట్టమొదటి ఉమెన్ బ్లాక్ బెల్ట్ ఫస్ట్ డాన్‌గా, 2017 జనవరి 8న ఉమెన్ బ్లాక్ బెల్ట్ ఫోర్త్ డాన్‌గా నిలిచింది. 2015లో కోట్ల విజయభాస్కరరెడ్డి ఇండోర్ స్టేడియం (హైదరాబాదు)లో జరిగిన నేషనల్ బూడోకాన్ ఈవెంట్లో ‘కట’ విభాగంలో గోల్డ్‌మెడల్ సాధించింది. ఉద్యోగరీత్యా ఎంత పని ఒత్తిడి ఉన్నా ఇప్పటికీ స్వార్డ్, స్టిక్, నాన్చక్ ప్రాక్టీస్ కొనసాగిస్తూనే ఉన్నారు. ఇంగ్లిష్ ఉపాధ్యాయినిగా ... ♦ తను పని చేస్తున్న చోట పలువురు విద్యార్థులకు ఉత్తమ శిక్షణ ఇవ్వడం ద్వారా నవోదయ, గురుకుల పాఠశాలలకు అర్హత సాధించడంలో చేయూతనిచ్చారు. ♦ 2009 నుంచి జిల్లా రీసోర్స్ పర్సన్‌గా కొనసాగుతూ విద్యాశాఖ నిర్వహించిన వివిధ శిక్షణా శిబిరాల్లో ఆంగ్ల బాషా శిక్షకురాలిగా వ్యవహరిస్తున్నారు. ♦ 2016లో బెంగళూర్‌లో రీజినల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంగ్లిష్ సౌత్ ఇండియా (ఆర్ఐఇఓస్ఐ) ఆధ్వర్యంలో జరిగిన క్యాంప్‌లో జిల్లా విద్యాశాఖ సహకారంతో సీఈఎల్‌టీ ట్రైనింగ్ తీసుకున్నారు. ♦ 2017 ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి రోజున స్పాట్ వాల్యుయేషన్‌కి వచ్చిన సుమారు 100 మంది సహచర ఇంగ్లిష్ ఉపాధ్యాయులతో ‘ఇంగ్లిష్–ప్రకాశం’ గ్రూప్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం ఈ గ్రూప్‌లో 300 మంది ఉపాధ్యాయులు సభ్యులుగా కొనసాగుతున్నారు. ఈ గ్రూప్ ముఖ్య ఉద్దేశం విద్యార్థులకు ఇంగ్లిష్ బోధనలో వచ్చే సమస్యలకు పరిష్కారాలను సూచిస్తూ సమన్వయపరచడం. ♦ 2017లో ఏపీ హైయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్, బ్రిటీష్ కౌన్సిల్ వారు సంయుక్తంగా నిర్వహించిన ఇంగ్లిష్ ట్రైనింగ్ క్యాంపులో మాస్టర్ ట్రైనర్‌గా శిక్షణ పొందారు. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అంశంపై రాష్ట్రీయ మాధ్యమిక విద్యా మిషన్ (ఆర్‌ఎంఎస్‌ఏ) వారు నిర్వహించిన క్యాంపులో మాస్టర్ ట్రైనర్‌గా శిక్షణ పొందారు. ప్రేమ వివాహం కుటుంబంలో అందరూ ఉన్నత చదువులు చదవడం, పద్మజ తండ్రి వత్తి రీత్యా బయటి ప్రపంచంతో మమేకం కావడంతో సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం అయినప్పటికీ ప్రతి విషయాన్ని అందరూ కలిసి మాట్లాడుకోవటం, కలిసి నిర్ణయం తీసుకోవడం ఆనవాయితీగా మారిన నేపధ్యంలోనే పద్మజ తన సహవిద్యార్థి వై.ఎస్.దిగ్విజయ్‌ను మతాంతర వివాహం చేసేకున్నారు. పెళ్లి జరిగిన తొలి రోజుల్లో ఇద్దరి కుటుంబాల భావ సంఘర్షణ వల్ల ఏర్పడిన అరమరికలు అనతికాలంలోనే సమసిపోయి ఇద్దరి కుటుంబాలు ఆదర్శంగా నిలిచాయి. 80 దశకంలో విప్లవ భావాలు యువతలో మెండుగా ఉన్న రోజులు. ప్రేమంటే భావావేశంతో కలిగేదనిపిస్తున్న నేటి ప్రేమ కథలకు భిన్నంగా, భావసారూప్యతతో జీవిత భాగస్వాములైన పద్మజ, దిగ్విజయ్‌లను చూసి నేటి యువత నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కుటుంబం గురించి ఒంగోలు జక్రయ్య ఆస్పత్రి వీధిలో నివసిస్తోంది పద్మజ కుటుంబం. భర్త వై.ఎస్.దిగ్విజయ్ ఒంగోలు నగరంలోని పేస్ గ్లోబల్ స్కూల్ ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నారు. 25 సంవత్సరాలు బయాలజీ సైన్స్ టీచర్‌గా సేవలందించిన దిగ్విజయ్ ఒక లోకల్ ఛానెల్లో న్యూస్ రీడర్‌గా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. వివేక్ (21) శ్రీకాకుళం డెంటల్ కాలేజీలో డెంటల్ సర్జన్ (బీడీఎస్) చదువుతున్నాడు. విక్రాంత్ (18) విశాఖలోని దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీలో న్యాయశాస్త్రం చదువుతున్నాడు. తల్లి వద్ద కరాటే శిక్షణ పొందిన ఈ ఇద్దరు పిల్లలు గ్రీన్ బెల్ట్ పొందారు. ‘సమాజం కోసం నా వంతుగా ... ప్రభుత్వంగానీ, వలంటరీ ఆర్గనైజేషన్స్గానీ నగరంలో ఏదైనా వేదిక ఏర్పటు చేయగలిగితే ఉదయం ఆత్మరక్షణ యుద్ధ నైపుణ్యం శిక్షణ, సాయంత్రం ఇంగ్లిష్ మాట్లాడటం, బోధనా నైపుణ్యం, బాషా సమస్యలపై ఉచితంగా శిక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా’ అంటున్న పద్మజ ఆశ నెరవేరాలని ఆశిద్దాం. ఉపాధ్యాయినిగా.. ఆత్మరక్షణ నైపుణ్య శిక్షకురాలిగా ♦ 1995–96 లో ఖాశీం మెమోరియల్ బాలికలపాఠశాల (దర్శి) విద్యార్థులకు కరాటే శిక్షణ ఇచ్చారు. ♦ 2006లో ప్రకాశం జిల్లా సర్వశిక్ష అభియాన్ పీడీరఘుకుమార్ ఆధ్వర్యంలో బాలికలకు నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరంలో ఇన్‌స్ట్రక్టర్‌గా వ్యవహరించారు. ♦ 2012 నిర్భయ ఘటన తరువాత ఒంగోలు వాకర్స్‌క్లబ్ లో మాస్టర్ ఎ.రవిశంకర్‌తోపాటు పలువురికిప్రాక్టీస్లో సేవలందిచారు. ♦ 2014 నుంచి స్థానిక జక్రయ్య ఆసుపత్రి ఆవరణలో డా.జాకబ్ జక్రయ్య, డా.సారా జార్జి ల సహకారంతో స్థానికులకు కరాటే శిక్షకురాలిగా నిలిచారు. డా.సారా జార్జి కూడా పద్మజ వద్ద శిక్షణ పొందుతున్నారు. ♦ 2016లో ఒంగోలులో జరిగిన ఎన్టీఆర్ కళాపరిషత్ ఉత్సవాలలో మద్దులూరు (సంతనూతలపాడు) హైస్కూల్ విద్యార్థులతో కలిసి ఆత్మరక్షణ యుద్ధ విన్యాసాలను ప్రదర్శించారు. ♦ 2016లో తన గురువు వలిశెట్టి రవి స్థాపించిన రుద్రమదేవి డిఫెన్స్ అకాడమీ (హైదరాబాదు) సహకారంతో తెలంగాణలో షీ టీం ఆధ్వర్యంలో అనేక మంది ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్స్‌కి శిక్షణ ఇచ్చారు. ♦ 2017 నుంచి చిన్నగంజాం ఏడో తరగతి బాలికలకు శిక్షణ ఇస్తున్నారు. చిత్రకారిణిగా ఏకకాలంలో ఉపాధ్యాయినిగా, యుద్ధనైపుణ్య శిక్షకురాలిగా , చిత్రాకారిణిగా ,భార్యగా, అమ్మగా, విభిన్న పాత్రలను పోషిస్తున్న «ఈ ధీశాలి తన భావాలకు రూపాలనిస్తూ అనేక చిత్రాలకు జీవం పోశారు. ఆమెను కలవడానికి వచ్చే మిత్రులు, సందర్శకులను ఇంటిలో గోడలను అలంకరించిన ఆమె పెయింటింగ్స్ కచ్చితంగా ఆకర్షిస్తాయనడంలో ఎలాంటి సందేహంలేదు. 2005లో మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జన శిక్షణ సంస్థాన్ నిర్వహించిన ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ కోర్సును ఫూర్తి చేశారు. 2009 మార్చిలో ఫెవీక్రిల్ సంస్థ ఇచ్చిన ఎక్స్పర్ట్ టీచర్ ట్రైనింగ్ కోర్సు చేశారు. -
చేతుల్లేకున్నా.. లోకాన్ని అందుకుంది!
ఆమెకు రెండు చేతులు లేవు అయితేనేం ఆత్మవిశ్వాసం మాత్రం నిండుగా ఉంది. అన్ని అవయవాలు సక్రమంగా ఉండి కూడా సాధించలేని ఉన్నత శిఖరాలను ఆత్మస్థైర్యంతో అధిరోహించింది. ప్రపంచంలోనే చేతులు లేకుండా కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించిన తొలి మహిళగా నిలిచింది. అంతేకాదు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్‌ను సాధించడంతోపాటు విమానాన్ని నడిపిన తొలి పైలట్‌గానూ గిన్నిస్‌బుక్ రికార్డు సృష్టించింది జెస్సికా కాక్స్. ఆ సంగతులేంటో నేటి ‘success story’లో తెలుసుకుందాం...! మనలో చాలామందికి అసలు లక్ష్యాలు ఉండవు. లక్ష్యాలు ఉన్నవారు కూడా తమ కుటుంబ పరిస్థితులు బాగాలేవని, మా తల్లిదండ్రులు చదువుకొని ఉంటే బాగుండని, మేం డబ్బున్నవాళ్లమైతే అనుకున్న లక్ష్యాలను చేరేవారమని ఇలా నిందించుకుంటూ లక్ష్య సాధనలో వెనకపడుతూ ఉంటారు. నిండైన ఆత్మవిశ్వాసం ఉంటే తమ లక్ష్యసాధనకు ఏదీ అడ్డంకి కాదని ఎందరో నిరూపించి మనకు స్పూర్తిగా నిలుస్తున్నారు. అలాంటి కోవలోకే వస్తారు జెస్సికా కాక్స్. సౌకర్యాలకన్నా నిండైన ఆత్మవిశ్వాసం, పట్టుదల, నిరంతర శ్రమ ద్వారానే ఎలాంటి ఉన్నత శిఖరాలనైనా అధిరోహించవచ్చని నిరూపిస్తోంది జెస్సికా. ఆమె 1983 ఫిబ్రవరి 2న అమెరికాలో జన్మించింది. అయితే జన్యుపరమైన లోపాల కారణంగా ఆమెకు రెండు చేతులు లేవు. కూతురి పరిస్థితిని చూసిన తల్లిదండ్రులు చాలా బాధపడ్డారు. భవిష్యత్తులో ఆ అమ్మాయి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది కాబట్టి చిన్నతనంలోనే చంపేయాలని ఇరుగుపొరుగు సూచించినా వారు మాత్రం కన్నపేగును కడుపులో దాచుకొని పెంచారు. కొన్నిరోజుల తర్వాత జెస్సికాను పాఠశాలకు పంపండం ప్రారంభించారు. అయితే పాఠశాలలో తోటి విద్యార్థులు జెస్సికాను తీవ్రంగా అవమానించేవారు. వారి మాటలకు జెస్సికా చాలా బాధపడేది. ఇంటికొచ్చి తల్లిదండ్రులకు పాఠశాలకు వెళ్లలేనని చెప్పేది. కానీ, అకస్మాత్తుగా ఒకరోజు జెస్సికా తనకు చేతులు లేకపోయినా కాళ్లు ఉన్నాయి వాటిసాయంతోనే అందరికన్నా ఉన్నత స్థాయిలో ఉండాలని నిశ్చయించుకుంది. పైలెట్‌గా.... చేతులు లేకపోయినా కాళ్లతోనే రాయడం మొదలుపెట్టింది. అంతేకాదు కాళ్లతోనే టైపింగ్ చేయడం కూడా నేర్చుకుంది. నిమిషంలోనే 25 పదాలు టైప్ చేసే స్థాయికి చేరుకుంది. అందరిలా తాను ఉండాలనుకునే జెస్సికా స్విమ్మింగ్ కూడా నేర్చుకుని బెస్ట్ స్విమ్మర్‌గా మారింది. 14 సంవత్సరాల వయసులోనే మార్షల్ ఆర్ట్స్‌లో బ్లాక్ బెల్ట్ సాధించింది. ఈ ఘనత సాధించిన ప్రపంచంలోనే మొదటి వ్యక్తి జెస్సికా. అంతేకాదు గుర్రపుస్వారీలో కూడా ప్రావీణ్యం సాధించింది. 17 సంవత్సరాల వయసులో కారు డ్రైవింగ్ నేర్చుకుని ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ సాధించింది. చదువులో కూడా జెస్సికా ఎప్పుడు ముందే ఉండేది. సైకాలజీలో డిగ్రీ పట్టా అందుకుంది. ఎప్పుడూ ఉన్నతంగా ఆలోచించే జెస్సికా పైలెట్‌గా మారాలని నిశ్చయించుకుంది. మూడేళ్ల శిక్షణ అనంతరం 2008లో పైలెట్‌గా సర్టిఫికెట్ అందుకుంది. జెస్సికా వివిధ దేశాలు పర్యటిస్తూ అందరికి ప్రేరణ కలిగిస్తోంది. 2014లో జెస్సికా కరాటేలో అరిజోనా చాంపియన్‌గా నిలిచింది. కసి, పట్టుదల, నిండైన ఆత్మవిశ్వాసం ఉన్నత శిఖరాలు మన కాళ్ల దగ్గరకొస్తాయని జెస్సికా నిరూపించింది. జెస్సికా నీవు సాధించిన ఘనతలకు నిజంగా నీకు సెల్యూట్....! – సాక్షి స్కూల్ ఎడిషన్ -
రాహుల్‌కు ఐకిడోలో బ్లాక్‌బెల్ట్
-
అయికిడో ప్రాక్టీస్ చేస్తున్న రాహుల్
సాక్షి, న్యూఢిల్లీ : మార్షల్ ఆర్ట్స్‌లో ఒకటైన అయికిడో వచ్చని.. అందులో తనకు బ్లాక్ బెల్ట్ ఉందని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మూడు రోజుల కిందట ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా రాహుల్ గాంధీ అయికిడో ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలను ఆయన అధికార ట్విటర్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో రాహుల్ గాంధీ అయికిడో ప్రాక్టీస్ ఫొటోలు హల్చల్ చేస్తున్నాయి. -
నాకు ‘అయికిడో’ వచ్చు!?
సాక్షి, న్యూఢిల్లీ : మార్షల్ ఆర్ట్స్‌లో ఒకటైన అయికిడో విద్య తనకు వచ్చని.. అందులోతనకు బ్లాక్‌బెల్ట్ ఉందని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. అంతేకాక వ్యాయామం శారీరక దారుఢ్యానికేగాక, మానసిక వికాసానికి కూడా ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. గురువారం పీహెచ్డీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వార్షిక సమావేశంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సమావేశంలోనే రాహుల్ గాంధీ తనకు అయికిడో వచ్చని ప్రకటించారు. అంతేకాక తాను రోజు ఉదయాన్నే గంట సేపు ఈత కొట్టడం, రన్నింగ్ వంటివి చేస్తానని ఆయన తెలిపారు. అయితే ఈ విషయాలను పబ్లిసిటీ కోసం ఎన్నడూ చెప్పుకోలేదని అన్నారు. శారీరక వ్యాయామాలను సోషల్ మీడియాలో పెట్టాలని కొందరు రాహుల్ గాంధీని కోరడంతో.. అందుకు ఆయన అంగీకరించారు. -
ఆ విద్య ఇప్పుడు పనికొస్తుంది: హీరోయిన్
'కంచె' సినిమాతో ప్రేక్షకుల మనసు దోచుకున్న నటి ప్రగ్యా జైస్వాల్ ఆ తర్వాత తెలుగు సినిమాలో మెరిసిందే లేదు. తాజాగా కృష్ణవంశీ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న 'నక్షత్రం' సినిమాలో అతిధి పాత్రలో నటిస్తున్నారామె. పోలీసాఫీసర్ పాత్రలో అలరించనున్న ఆమె దీనిపై మాట్లాడుతూ.. 'నా కెరీర్లో ఇంత త్వరగా పోలీసాఫీసర్ పాత్రలో నటించే అవకాశం వస్తుందని కలలో కూడా అనుకోలేదు. ముఖ్యంగా ఫైట్ సీక్వెన్స్ విషయంలో చాలా ఆత్రుతగా ఉన్నాను. వాటిలో ఒకటి సందీప్‌తో చేసే ఫైట్. ఐదు సంవత్సరాలపాటు కరాటేలో శిక్షణ పొంది బ్లాక్ బెల్ట్ సాధించాను. నేను నేర్చుకున్న ఆ విద్య ఇప్పుడిలా ఉపయోగపడుతుంది. షూటింగ్ త్వరగా మొదలవ్వాలని కోరుకుంటున్నాను. కృష్ణవంశీ సార్‌తో పనిచేయడం కల నిజమవడంలాంటిది' అంటూ తన సంతోషాన్నంతా చెప్పుకొచ్చింది ప్రగ్యా. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఈ సినిమాలో పోలీసాఫీసర్‌గా ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. తేజుకి జంటగా ప్రగ్యా కనిపించనున్నారు. కాగా హీరో సందీప్ సరసన రెజీనా హీరోయిన్గా అలరించనున్నారు. ఇంతమంది స్టార్స్ కనువిందు చేయనున్నారన్న వార్తతో 'నక్షత్రం' సినిమాపై కృష్ణవంశీ అభిమానుల్లో అంచనాలు మొదలయ్యాయి. ప్రస్తుతం చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. -
యువతి సాహసం..
న్యూఢిల్లీ: ప్రాణాలకు తెగించి ఆమె చేసిన సాహసం స్థానికంగా అందరి మన్ననలు అందుకుంది. దొంగను వెంటాడి పట్టుకున్న ఢిల్లీ యువతిని అందరూ మెచ్చుకుంటున్నారు. 18 ఏళ్ల ప్రియాంక పాండవ్ నగర్ లోని తన అమ్మమ్మ ఇంటి ముందు కూర్చుని ఉంది. ఇంతలో ఎదురింటి నుంచి 'దొంగను పట్టుకోండి' అంటూ అరుపులు వినిపించాయి. దొంగ పారిపోవడం చూసిన ప్రియాంక పులిలా ముందుకు ఉరికింది. ఛేజ్ చేసి అతడిని పట్టుకుంది. కరాటేలో బ్లాక్ బెల్ట్ ఆమె ముందు అతడి ఎత్తులు పారలేదు. అతడి మెడను పట్టుకోవడంతో పారిపోవడానికి వీళ్లేకపోవడంతో బ్లేడుతో ఆమెను గాయపరిచాడు. అయినా ఆమె పట్టువదల్లేదు. దొంగను స్థానికులకు అప్పగించింది. తర్వాత అతడిని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనలో ప్రియాంక ఎడమ చేతికి గాయాలయ్యాయి. ఆమె సాహసానికి స్థానికులు అబ్బురపడ్డారు. ఆర్మీ జవాను లేదా పోలీసు కావడమే తన లక్ష్యమని, ఇందుకోసం శ్రమిస్తున్నానని ప్రియాంక చెప్పింది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే కరాటే నేర్చుకున్నానని తెలిపింది. -
ఆరేళ్లకే తైక్వాండోలో బ్లాక్ బెల్ట్
మహబూబ్‌నగర్ : ఓ చిన్నారి ఆరేళ్లకే తైక్వాండోలో బ్లాక్ బెల్ట్ సాధించింది. మహబూబ్‌నగర్ జిల్లాలోని అయోధ్యనగర్ కాలనీకి చెందిన చిన్నారి కోట్ల సాయి సంస్కృతి తైక్వాండోలో బ్లాక్ బెల్ట్ సాధించింది. ఈ సందర్భంగా సోమవారం ఎంపీ జితేందర్‌రెడ్డి తన నివాసంలో చిన్నారిని సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. చిన్న వయస్సులోనే బ్లాక్ బెల్ట్‌ను సాధించడం జిల్లాకే గర్వకారణమన్నారు. భవిష్యత్తులో మరిన్న విజయాలు సాధించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. సాయి సంస్కృతి విజయాన్ని లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో ఎక్కించేందుకు తన వంతుగా ప్రయత్నం చేస్తామన్నారు. -
కరాటే ‘కోవిదుడు’
* చిరుప్రాయంలోనే అత్యంత ప్రతిభ * ఆరేళ్ల వయస్సులోనే బ్లాక్‌బెల్ట్ కైవసం * తండ్రి బాటలో తనయుడు కల్లూరు : వయస్సు ఆరున్నర ఏళ్లు. చదువేది మూడో తరగతే. ఇంత చిరుప్రాయంలో అతడు అత్యంత ప్రతిభను కనబరుస్తున్నాడు. కరాటేలో రాణిస్తూ బ్లాక్‌బెల్ట్ సైతం కైవసం చేసుకున్నాడు. కల్లూరుకు చెందిన గొల్లమందల కోవిద్ పట్టణంలోని సెంచరీ స్కూల్లో మూడో తరగతి చదువుతున్నాడు. తండ్రి సురేష్‌కుమార్ కరాటే మాస్టర్. ఒకవైపు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే ఆసక్తి ఉన్న వారికి కరాటేలో తర్ఫీదు ఇస్తున్నాడు. తండ్రి వద్ద శిక్షణ తీసుకున్న కోవిద్ ఈ విద్యలో దూసుకెళ్తున్నాడు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లు అత్యంత ప్రతిభను చాటుతున్నాడు. గత నెల వరంగల్‌లో వరల్డ్ ఫునకోస్ షోటోకాన్ కరాటే రాష్ట్ర చీఫ్ ఎగ్జామినర్ ఎం.డి.యాకూబ్ నిర్వహించిన బెల్ట్ టెస్టులో రాణించాడు. బ్లాక్‌బెల్ట్ సాధించి శభాష్ అనిపించుకున్నాడు. కోవిద్ సాధించిన విజయాలు * 2013 ఆగస్టు 25న హన్మకొండలో జరిగిన స్టేట్ ఓపెన్ టు ఆల్ స్టైల్స్ కరాటే, కుంగ్‌ఫూ చాంపియన్ షిప్ పోటీల్లో అండర్-10 బాలుర కటా విభాగంలో తృతీయ స్థానం. * 2013 అక్టోబర్ 20న విజయవాడలో జరిగిన ఫస్ట్ ఆలిండియా ఇన్విటేషనల్ కరాటే చాంపియన్ షిప్ పోటీల్లో కటా విభాగంలో ప్రథమ స్థానం. * 2013 నవంబర్ 10న గుంటూరులోని మంగళగిరిలో జరిగిన ఏపీ స్టేట్ ఇన్విటేషనల్ కరాటే చాంపియన్ షిప్ పోటీల్లో కటా విభాగంలో ప్రథమ స్థానం. * 2013 డిసెంబర్ 22న వరంగల్‌లో జరిగిన నేషనల్ వరల్డ్ ఫునకోస్ షోటోకాన్ కరాటే చాంపియన్ షిప్ పోటీలో కటా విభాగంలో ద్వితీయ స్థానం. * ఈ ఏడాది జనవరి 14న ఏపీలోని నిడదవోలులో జరిగిన 14వ ఓపెన్ ఇన్విటేషనల్ స్టేట్ కరాటే చాంపియన్ షిప్ పోటీల్లో ద్వితీయ స్థానం. * ఈ ఏడాది ఫిబ్రవరి 9న ఖమ్మంలో నిర్వహించిన స్టేట్ ఓపెన్ టు ఆల్ స్టైల్స్ కరాటే, కుంగ్‌ఫూ చాంపియన్ షిప్ పోటీల్లో కటా విభాగంలో ద్వితీయ స్థానం సాధించాడు. నిరంతర శిక్షణతోనే.. నిరంతర శిక్షణ ద్వారా కరాటేలో ప్రతిభ చాటొచ్చు. మా అబ్బాయి కోవిద్ అదే చేశాడు. దీంతో ఇంత చిన్నప్రాయంలోనే అతడు రాణించాడు. కరాటేలో కోవిద్ ముందుకు దూసుకెళ్లడం ఒక తండ్రిగానే కాకుండా గురువుగా గర్వపడుతున్నాను. - గొల్లమందల సురేష్ కుమార్, కరాటే మాస్టర్ -
అందంలోనే కాదు...ఆదర్శంలోనూ మోడలే!
ఛాంపియన్ నాలుగు స్వర్ణాలు, ఒక రజతం, నాలుగు కాంస్యపతకాలు... ఈ సుందరాంగి సాధించిన ఈ పతకాలు అందాల పోటీలలో కాదు... కరాటేలో సాధించినవి. ముంబాయిలో పుట్టి పెరిగిన మోడల్ సంధ్యాశెట్టి ఐదడుగుల తొమ్మిదంగుళాల ఎత్తు, చామనఛాయ రంగు, చూడగానే ఆకట్టుకునే కళ్లు, సిల్కీ శిరోజాలతో... గిలిగింతలు పెట్టే సౌష్ఠవంతో ఉంటుంది. విశేషం ఏమిటంటే కరాటేలో బ్లాక్బెల్ట్తోపాటు నేషనల్ ఛాంపియన్ షిప్ కూడా సాధించిందీమె. ఇటీవలే మహారాష్ర్టలో జరిగిన కరాటే అసోసియేషన్ ఛాంపియన్ షిప్ పోటీలలో కాంస్యపత కాన్ని కైవసం చేసుకున్న సంధ్య... తనకొచ్చిన పతకాన్ని ఆడియన్స్‌కు చూపిస్తూ... ‘ఇప్పుడు నేను సాధించింది కాంస్యమే కావచ్చు కానీ, వచ్చేసారికి సువర్ణం సాధించి తీరతాను’ అంటూ ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేసింది. కాలేజీలో చదివేటప్పుడే స్నేహితులామెను ఫెమినా మిస్ ఇండియా ఉమెన్ పెజంట్లో పాల్గొనవలసిందిగా ఒత్తిడి చేసి మరీ ఒప్పించారు. అందాల ప్రపంచంలో అలా పడింది ఆమె తొలి అడుగు. ఆ తర్వాత ఆమె అనేక ర్యాంప్ షోస్, ప్రింట్, మ్యూజిక్ వీడియోలలోనూ పాల్గొంది. పలు బుల్లితెర షోలకు హోస్ట్‌గా వ్యవహరించింది. ‘లెవి’, ‘నల్లి’, ‘షాపర్స్ స్టాప్’, ‘రూపమ్’, ‘డిగ్జామ్’ తదితర బ్రాండ్లకు ప్రచారం నిర్వహించింది. విక్రమ్ ఫాద్నిస్, షైనా ఎన్సీ, కౌషిక్ షిమాంకర్, అనితా డోంగ్రే, స్వప్నిల్ షిండే వంటి డిజైనర్లకోసం ర్యాంప్ వాక్ చేసింది. డిస్కవరీ ఛానెల్లో ‘గో ఇండియా’ కార్యక్రమానికి అతిథేయిగా వ్యవహరించింది. ‘‘మోడలింగ్ అన్నా, నటన అన్నా చాలా ఇష్టం. ఈ రెండు రంగాలలోనూ అవకాశాలను అందిపుచ్చుకుంటూనే, నాకు ఎంతో ప్రీతికరమైన క్రీడలను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు’’ అని చెబుతోంది ఈ అందాల భామ. ‘‘అందరికీ నేను ఒక మోడల్‌గా, నటిగా, టీవీ ప్రెజెంటేటర్గానే తెలుసు. నాకు కరాటేలో బ్లాక్ బెల్ట్ ఉందని, నేను అందులో ఛాంపియన్ షిప్ సాధించానని తెలిసింది అతి కొద్దిమందికి మాత్రమే’’ అంటుంది. ఆంగ్ల సాహిత్యంలో పట్టా పుచ్చుకున్న సంధ్యకు ట్రావెలింగ్ అన్నా, కొత్తవారితో స్నేహం చేయడమన్నా, కొత్తరకాల వంటకాలు తయారు చేయడమన్నా ఎంతో మక్కువ అట. ఖరీదుకంటే సౌకర్యవంతమైన దుస్తులకే ప్రాధాన్యత ఇస్తాననీ, రకరకాల యాక్సెసరీస్ అన్నా, పాదరక్షలన్నా ప్రాణం పెడతాననీ చెప్పే ఈ సుందరాంగి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడం లోనూ, శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడం లోనూ ఏమాత్రం నిర్లక్ష్యం చేయరు. గ్లామర్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడం అంత కష్టం కాకపోయినప్పటికీ, అందులో నిలదొక్కుకోవడమంటే మాటలు కాదనీ, ఆహారం విషయంలోనూ, వ్యాయామాల విషయంలోనూ అప్రమత్తంగా ఉంటూ వ్యవహరిస్తూ క్రమశిక్షణతో వ్యవహరిస్తేగానీ అందులో రాణించలేమంటుంది. రాత్రిళ్లు త్వరగా నిద్రపోతానని, పొద్దున్నే లేచి, వ్యాయామం చేస్తానని, ఆ తర్వాత కాసేపు శరీరం బాగా అలసిపోయేలా ఆటలాడతాననీ చెప్పే సంధ్యాశెట్టి అతివల ఆత్మరక్షణకోసం మార్షల్ ఆర్ట్స్‌లో ఉచిత శిక్షణ కేంద్రాన్ని నిర్వహిస్తోంది. అంతేకాదు, గుర్రపు స్వారీ, ఈత శిక్షణ, వెయిట్ లిఫ్టింగ్లలోనూ ఉచిత శిక్షణ ఇప్పిస్తోందట. నిజంగా మనసున్న మంచి మోడల్ కదా! - డి.శ్రీలేఖ