ఆమెకు రెండు చేతులు లేవు అయితేనేం ఆత్మవిశ్వాసం మాత్రం నిండుగా ఉంది. అన్ని అవయవాలు సక్రమంగా ఉండి కూడా సాధించలేని ఉన్నత శిఖరాలను ఆత్మస్థైర్యంతో అధిరోహించింది. ప్రపంచంలోనే చేతులు లేకుండా కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించిన తొలి మహిళగా నిలిచింది. అంతేకాదు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్‌ను సాధించడంతోపాటు విమానాన్ని నడిపిన తొలి పైలట్‌గానూ గిన్నిస్‌బుక్ రికార్డు సృష్టించింది జెస్సికా కాక్స్. ఆ సంగతులేంటో నేటి ‘success story’లో తెలుసుకుందాం...!
మనలో చాలామందికి అసలు లక్ష్యాలు ఉండవు. లక్ష్యాలు ఉన్నవారు కూడా తమ కుటుంబ పరిస్థితులు బాగాలేవని, మా తల్లిదండ్రులు చదువుకొని ఉంటే బాగుండని, మేం డబ్బున్నవాళ్లమైతే అనుకున్న లక్ష్యాలను చేరేవారమని ఇలా నిందించుకుంటూ లక్ష్య సాధనలో వెనకపడుతూ ఉంటారు. నిండైన ఆత్మవిశ్వాసం ఉంటే తమ లక్ష్యసాధనకు ఏదీ అడ్డంకి కాదని ఎందరో నిరూపించి మనకు స్పూర్తిగా నిలుస్తున్నారు. అలాంటి కోవలోకే వస్తారు జెస్సికా కాక్స్. సౌకర్యాలకన్నా నిండైన ఆత్మవిశ్వాసం, పట్టుదల, నిరంతర శ్రమ ద్వారానే ఎలాంటి ఉన్నత శిఖరాలనైనా అధిరోహించవచ్చని నిరూపిస్తోంది జెస్సికా. ఆమె 1983 ఫిబ్రవరి 2న అమెరికాలో జన్మించింది.
అయితే జన్యుపరమైన లోపాల కారణంగా ఆమెకు రెండు చేతులు లేవు. కూతురి పరిస్థితిని చూసిన తల్లిదండ్రులు చాలా బాధపడ్డారు. భవిష్యత్తులో ఆ అమ్మాయి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది కాబట్టి చిన్నతనంలోనే చంపేయాలని ఇరుగుపొరుగు సూచించినా వారు మాత్రం కన్నపేగును కడుపులో దాచుకొని పెంచారు. కొన్నిరోజుల తర్వాత జెస్సికాను పాఠశాలకు పంపండం ప్రారంభించారు. అయితే పాఠశాలలో తోటి విద్యార్థులు జెస్సికాను తీవ్రంగా అవమానించేవారు. వారి మాటలకు జెస్సికా చాలా బాధపడేది. ఇంటికొచ్చి తల్లిదండ్రులకు పాఠశాలకు వెళ్లలేనని చెప్పేది. కానీ, అకస్మాత్తుగా ఒకరోజు జెస్సికా తనకు చేతులు లేకపోయినా కాళ్లు ఉన్నాయి వాటిసాయంతోనే అందరికన్నా ఉన్నత స్థాయిలో ఉండాలని నిశ్చయించుకుంది.
పైలెట్‌గా....
చేతులు లేకపోయినా కాళ్లతోనే రాయడం మొదలుపెట్టింది. అంతేకాదు కాళ్లతోనే టైపింగ్ చేయడం కూడా నేర్చుకుంది. నిమిషంలోనే 25 పదాలు టైప్ చేసే స్థాయికి చేరుకుంది. అందరిలా తాను ఉండాలనుకునే జెస్సికా స్విమ్మింగ్ కూడా నేర్చుకుని బెస్ట్ స్విమ్మర్‌గా మారింది. 14 సంవత్సరాల వయసులోనే మార్షల్ ఆర్ట్స్‌లో బ్లాక్ బెల్ట్ సాధించింది. ఈ ఘనత సాధించిన ప్రపంచంలోనే మొదటి వ్యక్తి జెస్సికా. అంతేకాదు గుర్రపుస్వారీలో కూడా ప్రావీణ్యం సాధించింది. 17 సంవత్సరాల వయసులో కారు డ్రైవింగ్ నేర్చుకుని ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ సాధించింది. చదువులో కూడా జెస్సికా ఎప్పుడు ముందే ఉండేది. సైకాలజీలో డిగ్రీ పట్టా అందుకుంది. ఎప్పుడూ ఉన్నతంగా ఆలోచించే జెస్సికా పైలెట్‌గా మారాలని నిశ్చయించుకుంది. మూడేళ్ల శిక్షణ అనంతరం 2008లో పైలెట్‌గా సర్టిఫికెట్ అందుకుంది. జెస్సికా వివిధ దేశాలు పర్యటిస్తూ అందరికి ప్రేరణ కలిగిస్తోంది. 2014లో జెస్సికా కరాటేలో అరిజోనా చాంపియన్‌గా నిలిచింది. కసి, పట్టుదల, నిండైన ఆత్మవిశ్వాసం ఉన్నత శిఖరాలు మన కాళ్ల దగ్గరకొస్తాయని జెస్సికా నిరూపించింది. జెస్సికా నీవు సాధించిన ఘనతలకు నిజంగా నీకు సెల్యూట్....!
– సాక్షి స్కూల్ ఎడిషన్
Comments
Please login to add a commentAdd a comment