కాచిగూడ: నగరానికి చెందిన కరాటే క్రీడాకారిణులు అమృత రెడ్డి, గణ సంతోషిణి రెడ్డి అక్కాచెల్లెళ్లు. వీళ్లిద్దరు ఇప్పటికే పలు కరాటే ఈవెంట్లలో తమ ప్రతిభ చాటుకున్నారు. బర్కత్‌పురకు చెందిన ఈ అక్కాచెల్లెళ్లు ఇప్పుడు ప్రపంచ రికార్డులపై దృష్టి పెట్టారు. ఈ నెల 30న బర్కత్‌పురలోని జీవీఆర్ కరాటే అకాడమీలో లిమ్కా బుక్, ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, విశ్వం వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధుల సమక్షంలో ప్రదర్శన ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో అకాడమీ డైరెక్టర్ డాక్టర్ జీఎస్ గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 1,828 రోజులకుగాను 1,828 మేకులతో ఏర్పాటు చేసిన చెక్కపై పడుకుని, 60 నెలలు... నెలకు ఒక్కటి చొప్పున 60 షాబాదు బండలు ఛాతీపై 5 సంవత్సరాలు అంటే 5 నిమిషాల్లో పగులగొట్టి రికార్డ్స్ సాధించనున్నారని తెలిపారు. ఇప్పటికే ఈ అక్కాచెల్లెళ్లు అంతర్జాతీయ స్థాయి కరాటే పోటీల్లో ఆకట్టుకున్నారని ఆయన చెప్పారు. ఈ రికార్డు ప్రదర్శనను తిలకించడానికి పలువురు నేతలు, అధికారులు హాజరవుతున్నారని గోపాల్ రెడ్డి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment