♦ ఆగస్టు 16న భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి మరణించిన అనంతరం ప్రాముఖ్యం సంతరించుకున్న ఆయన జీవిత విశేషాలలో ఆయన దత్తపుత్రిక నమితా భట్టాచార్యకు కూడా సముచిత స్థానం లభించింది. చదువులో చక్కగా రాణించి, ఢిల్లీ శ్రీరామ్ కాలేజీలో కామర్స్ డిగ్రీ చదువుతున్నప్పుడు అదే కళాశాలలో ఎకనమిక్స్‌లో ఆనర్స్ చేస్తున్న రంజన్ భట్టాచార్యను ప్రేమించి, పెళ్లి చేసుకున్న నమిత ఆ తర్వాత రాజకీయాల్లోకి రాకుండా ప్రా«థమిక పాఠశాల ఉపాధ్యాయినిగా స్థిరపడ్డారు.
♦ వరల్డ్ కరాటే చాంపియన్‌షిప్‌లకు పలుమార్లు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ యువతి సయేదా ఫాలక్ ప్రస్తుతం ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో అక్కడి యువతులకు కరాటేలో వర్క్‌షాప్ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని విల్లా మేరీ డిగ్రీ కళాశాల నుంచి పొలిటికల్ సైన్స్‌లో పట్టభద్రురాలైన సయేదా 2016 యు.ఎస్.ఓపెన్ కరాటే చాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ సాధించడంతో కరాటే అథ్లెట్‌గా ప్రపంచ ప్రసిద్ధురాలయ్యారు.
♦ డేటింగ్ యాప్‌లను ఉపయోగిస్తున్న మహిళల్లో 18 ఏళ్ల వయసు వారు ఎక్కువగా ఉండగా, పురుషుల్లో 50 ఏళ్లు పైబడినవారు అధికంగా ఉన్నట్లు యూనివర్సిటీ ఆఫ్ మిషిగాన్ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడయింది. వయసు మీద పడుతున్న కొద్దీ పురుషుల్లో శృంగారేచ్ఛ పెరుగుతుంటే, స్త్రీలు కుటుంబ బాధ్యతల్లో పడి, వయసుకు మించిన వృద్ధాప్యంలోకి మానసికంగా జారిపోవడమే ఇందుకు కారణం అని అధ్యయనానికి నేతృత్వం వహించిన ఎలిజబెత్ బ్రౌచ్ విశ్లేషించారు.
♦ ఆగస్టు 16న 60వ యేటలోకి అడుగు పెట్టిన అమెరికన్ గాయని, గీత రచయిత్రి, నటి, బిజినెస్‌ఉమన్ మడోన్నా.. తన పిల్లలతో కలిసి మొరాకోలో జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. ఆగ్నేయ ఆఫ్రికాలోని దుర్భిక్ష పీడిత దేశమైన మలావీలో అనా«థ పిల్లల సంక్షేమం కోసం పన్నెండేళ్ల క్రితం తను స్థాపించిన ‘రైజింగ్ మలావీ’ సంస్థకు ఉదారంగా విరాళాలు ఇవ్వాలని ఈ సందర్భంగా ఆమె తన అభిమానులకు విజ్ఞప్తి చేశారు.
♦ గర్భస్రావం జరిగి.. ఆ దుఃఖంలో ఉన్న స్త్రీకి, ఆమె భర్తకు మూడు రోజుల సాంత్వన సెలవు ఇచ్చే చట్టాన్ని న్యూజిలాండ్ ప్రభుత్వం త్వరలో అమల్లోకి తేబోతోంది. ఇప్పటి వరకు ఆ దేశంలో కుటుంబ సభ్యులు లేదా కడుపున పుట్టిన వారు మరణించిన సందర్భంలో మాత్రమే ఇలాంటి సాంత్వన సెలవును ఇస్తుండగా.. మహిళా ఎంపీ జిన్నీ ఆండర్సన్ ప్రతిపాదన మేరకు ఇప్పుడు ఆ సెలవు పరిధిలోకి గర్భస్రావాన్ని కూడా చేరుస్తూ ఒక సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారు.
♦ బిడ్డ పుట్టిన తొలి గంటలోనే బిడ్డకు తల్లిపాలు ççపట్టించే నిరంతర కార్యక్రమాన్ని రాజస్థాన్ ప్రభుత్వం ప్రారంభించింది. శిశు మరణాలను తగ్గించడం కోసం చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా అన్ని ప్రధాన ఆసుపత్రులలో బ్రెస్ట్ ఫీడింగ్ క్లినిక్‌లను నెలకొల్పి.. ప్రసవానంతరం తల్లీబిడ్డల్ని తక్షణం ఆ క్లినిక్‌ల లోపలికి తరలించి, తల్లి చేత బిడ్డకు పాలు పట్టించిన తర్వాత మాత్రమే వాళ్లిద్దరినీ కుటుంబ సభ్యుల సందర్శనార్థం ప్రసూతి వార్డుకు అనుమతిస్తారు.
♦ ‘ఆకలి నుంచి, పేదరికం నుంచి, వివక్ష నుంచి, లైంగిక అసమానత్వం నుంచి మనకు విముక్తి లభించాలి’ అంటూ .. ఒక రోజు ఆలస్యంగా ట్విట్టర్‌లో స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు పెట్టిన భారత మహిళా క్రికెట్ జట్టు (వన్‌డే ఇంటర్నేషనల్) కెప్టెన్ మిథాలీ రాజ్‌పై.. ‘ఒక సెలబ్రిటీకి స్వాతంత్య్ర దినోత్సవం అంటే ఉన్న గౌరవం ఇదేనా?’ అని సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురుస్తోంది. అందుకు సమాధానంగా.. ప్రస్తుతం బెంగళూరులో ‘ఇండియా బ్లూ’ జట్టు తరఫున ‘ఉమెన్స్ చాలెంజర్ ట్రోఫీ’లో ఆడుతున్న మిథాలీ రాజ్.. ‘ఫోన్ అందుబాటులో లేని కారణంగానే శుభాకాంక్షలు చెప్పడం ఆలస్యం అయింది తప్ప, గౌరవం లేకపోవడం వల్ల కాదు’ అని వివరణ ఇచ్చారు.
♦ ముంబైలో నేడు జరుగుతుందని అంతా భావిస్తున్న ప్రియాంక–నిక్ జోనాస్‌ల ఎంగేజ్‌మెంట్‌కి షారుక్‌ఖాన్, సల్మాన్‌ఖాన్, ఐశ్వర్య, రణబీర్ కపూర్, కత్రీనా కైఫ్, షాహద్ కపూర్, దీపికా పడుకోన్ వెళ్లకపోవచ్చని తెలుస్తోంది. అందుకు ఎవరి కారణాలు వారికి ఉన్నా.. షారుక్ వెళ్లకపోతే కనుక.. గతంలో ప్రియాంకాకు, షారుక్‌కు మధ్య కొంతకాలం పట్టువిడుపులుగా కొనసాగిన ప్రేమ–ద్వేషం అందుకు కారణం అయి ఉండే అవకాశం ఉందని బాలీవుడ్ ఊహాగాన ప్రియులు తలపోస్తున్నారు.
స్త్రీలోక సంచారం
Published Sat, Aug 18 2018 12:41 AM | Last Updated on Sat, Aug 18 2018 12:45 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment