కఠోర దీక్షకు కరెక్ట్ స్పెల్లింగ్ | udaya sri achieved budding award in international spellbee 2013 | Sakshi
Sakshi News home page

కఠోర దీక్షకు కరెక్ట్ స్పెల్లింగ్

Published Sun, Aug 25 2013 10:45 PM | Last Updated on Fri, Sep 1 2017 10:07 PM

కఠోర దీక్షకు కరెక్ట్ స్పెల్లింగ్

కఠోర దీక్షకు కరెక్ట్ స్పెల్లింగ్

అనూరాధ ఒక ఉన్నత ఆశయంతో...
 తన కూతుర్ని పెంచుతున్నారు.
 ఉదయశ్రీ తన తల్లి కోసం...
 ఒక అందమైన కలను కంటోంది!
 తల్లి ఆశయం ఫలిస్తే...
 ‘పుట్టింది ఆడపిల్లా!’ అన్న నోళ్లు మూతపడతాయి.
 కూతురి కల నెరవేరితే...
 ఒబామా మెచ్చుకోలుగా అమ్మవైపు చూస్తారు.
 ఆశయం, కల... ఒకటే అయినట్లు...
 ఈ తల్లీకూతుళ్లు ఒకరి కోసం ఒకరు పట్టినదీక్షలోని కఠోర సాధనే...
 నేటి మన ‘లాలిపాఠం’.

 
 ‘కరాటేలో చిన్నారుల ప్రతిభ’ అనే హెడ్డింగ్‌తో పెద్ద ఫొటోతో వార్తలు ప్రచురితమవుతుంటాయి. తైక్వాండో విజేతలు అంటూ మరో వార్త, అబాకస్ విన్నర్ అంటూ మరోటి... ఇలా ప్రచురితమైన ప్రతి వార్తనీ చదువుతాం, కానీ వార్తల్లో ఒక అమ్మాయి తరచూ కనిపిస్తుంటే... మరికొద్దిరోజుల్లో అదే అమ్మాయి స్పెల్‌బీ పోటీల్లో సర్టిఫికేట్‌తో కనిపిస్తే ఎలా ఉంటుంది? ఒకదానికొకటి పొంతనలేని పోటీల్లో కనిపిస్తుందేమిటి? అనే సందేహం వస్తుంది. ఆ సందేహానికి సమాధానమే ఉదయశ్రీ. ఇన్ని రంగాల్లో ప్రతిభావంతురాలిని చేయడంలో ని తమ అనుభవాలను చెప్పారు ఉదయశ్రీ తల్లి అనూరాధ.
 
 కంటికి రెప్పలాగ...


 ‘‘ఉదయ... మేము అమెరికాలో ఉండగా పుట్టింది. పాప మొదటి పుట్టినరోజుకి కుటుంబ సమేతంగా ఇండియాకి వచ్చాం. ఆ తర్వాత ఏడాదికి మా వారు గోపాలకృష్ణ అమెరికా వెళ్లారు. హైదరాబాద్‌లో నేను పాపకు తల్లీదండ్రీ అయి పెంచుతున్నాను. ఉదయ ఆరోగ్యం నాకు ఎప్పుడూ పెద్ద సవాల్ అనే చెప్పాలి. ఎత్తుకుని భుజం మీద పడుకోబెట్టుకుంటే బుగ్గ కందిపోయి ఎర్రగా ర్యాష్ వచ్చేది, అది అంతటితో ఆగిపోక పుండయ్యేది. డెర్మటాలజిస్టుకి చూపిస్తే మరీ సున్నితమైన చర్మం అని చాలా నియమాలు చెప్పారు. పెర్‌ఫ్యూమ్‌లు కాదు కదా పౌడర్ కూడా వాడకూడదు. సబ్బు కూడా ‘సెన్సిటివ్ స్కిన్’నే వాడాలి.

ఏడాదికి కావల్సిన సబ్బులను అమెరికా నుంచే తెప్పించుకుంటాను. వాతావరణం మారితే ఆస్త్మా ఇబ్బంది పెట్టేది. ఉదయకు అకస్మాత్తుగా జ్వరం వచ్చేది. ఏ క్షణాన జ్వరం వస్తుందోననే భయంతోనే గడిపేదాన్ని. అర్ధరాత్రి హాస్పిటల్‌కి తీసుకెళ్లాల్సి వచ్చేది. వీటికి తోడు ముక్కు నుంచి రక్తం ధారగా కారేది. సర్జరీ చేసిన తర్వాత కూడా పూర్తిగా తగ్గలేదు. సాక్షి స్పెల్ బీ ఇంటర్ స్కూల్ కాంపిటీషన్ జరిగిన రోజు ఉదయం కూడా ఇదే తంతు. ఆ పరిస్థితిలో కాంటెస్ట్‌కి వెళ్లవద్దు అంటే వినలేదు, నాకంటే మొండిది ఉదయ. అలాగే రాసింది. ఇంతకంటే పెద్ద సాహసం తైక్వాండో పోటీలప్పుడు జరిగింది. కోట్ల విజయభాస్కర రెడ్డి స్టేడియంలో పోటీలు జరుగుతున్నాయి. ఉదయకు ఆస్త్మా తీవ్రంగా ఉంది. మాస్టారు ‘ఈ కండిషన్‌లో చేయవద్దు’ అంటే వినక, ఆయాసం తగ్గిన తర్వాత చేసి గెలిచింది’’ అన్నారు అనూరాధ.
 
 పట్టు వదలదు!


 బ్రాంకైల్ ఆస్త్మా, నాజల్ బ్లీడింగ్ సమస్యలు ఉన్న అమ్మాయిని తైక్వాండో వంటి యుద్ధకళలు సాధన చేయించడం అంటే పెద్ద సాహసమే కదా అన్నప్పుడు అనూరాధ ‘‘నిజమే, కానీ ఉదయ మూడేళ్ల వయసు నుంచి టీవీలో తైక్వాండో, కరాటే ప్రోగ్రాములు చూసినప్పుడు ‘నేనూ అలా చేస్తా’ అంటూ గాల్లోకి చేతులు ఊపుతూ అనుకరించేది. తనకి అంత ఇష్టం ఉంది కదా అని నేర్పించాను. కరాటేలో బ్లాక్ బెల్ట్ ఈ ఏడాది వస్తుంది’’ అన్నారామె. అబాకస్, తైక్వాండో, ఒకాబులరీ క్లాసులు ఇన్నింటిని ఎలా సమన్వయం చేసేవారన్నప్పుడు... ‘‘వారంలో ఒక్కొక్కటి రెండు రోజులు ఉండేవి, శని, ఆదివారాల్లో స్పెషల్‌క్లాసులుండేవి. ఇన్నింటినీ చూసుకుంటూనే స్కూల్లో ఏప్లస్ గ్రేడ్‌లోనే ఉంటోంది. ఆరోగ్య సమస్యల మధ్య తనను ఇంతలా ప్రాక్టీస్ చేయించడం ఎందుకని కొన్నింటిని తగ్గిద్దాం అని నేను అనుకున్నా ఉదయ ఒప్పుకోదు.
 
 ఆడపిల్ల... అన్నింటా మిన్న!


 మీ అమ్మాయిని అందరిలో ఒకటిగా కాకుండా కొందరిలో ఒకటిగా తీర్చిదిద్దాలనే కోరిక మీ దంపతుల్లో ఎవరిది అన్నప్పుడు ‘‘నా దృష్టిలో ఆడపిల్ల దేనిలోనూ తక్కువ కాదు. ఆడపిల్ల పుట్టిందని ఆ బిడ్డను వివక్షకు గురిచేసేవాళ్లకు, జాతకం మంచిది కాదని ఒక వ్యక్తిని నిర్లక్ష్యంగా చూసే మనస్తత్వాలకు చెంప పెట్టుగా నా బిడ్డను చూపించాలనుకున్నాను. మహిళ సాధించలేనిదంటూ ఏదీ ఉండదని సమాజానికి చెప్పాలనుకున్నాను. ఆ కసి నాలో మొండితనాన్ని కూడా పెంచింది. అందుకే ఎంత ఖర్చవుతున్నా నా అవసరాలు మానుకుని మరీ తనకి కోచింగ్ ఇప్పిస్తున్నాను. పోయినేడాది దీపావళికి ముందు ఇంటర్నేషనల్ స్పెల్‌బీ నోటిఫికేషన్ వచ్చింది. ఆ కోచింగ్‌కి పన్నెండు వేలు ఖర్చవుతుంది. ఈ ఖర్చుని భరించడం ఇబ్బంది అనిపించి ఇంట్లోనే ప్రాక్టీస్ చేయిద్దామని పుస్తకాల కోసం బుక్‌షాపుల్లో వెతుకుతున్నాను. ఉదయకు కూడా పరిస్థితి అర్థం అయిందనుకుంటా. అప్పుడు నాతో ‘ఈ సారి టపాకాయలు మానేసి ఈ బుక్ కొనుక్కుంటాను’ అని కేంబ్రిడ్జి ఇంగ్లిష్ ప్రనన్సియేషన్ డిక్షనరీ కొనుక్కుంది. దాంతోనే స్పెల్ బీ పోటీలకు ప్రిపేరయింది’’ అన్నారు అనూరాధ.
 
 రోజుకో స్తోత్రం!


 ఉదయలో గ్రహించే శక్తి ఎక్కువని చెప్తూ... ‘‘పాప పుట్టినతర్వాత ప్రశాంతంగా పూజ చేసుకునే తీరిక ఉండేది కాదు. దాంతో పాపను ఆడిస్తూ, ఉయ్యాల ఊపుతూ స్తోత్రాలు పాడేదాన్ని. ఒకసారి తను కూడా తిరిగి పలకసాగింది. అప్పటికి ఇంకా ఉదయకి రెండేళ్లు కూడా నిండలేదు. వచ్చీరాని మాటలతో సహస్రనామాలను పలుకుతుండడంతో రోజుకో స్తోత్రం చొప్పున నేర్పించాను. అలాగే రాత్రి కరెంటు పోతే రామాయణ, భారతాలు చెప్పేదాన్ని. స్పెల్ బీ కాంపిటీషన్‌కి ప్రిపేరయ్యేటప్పుడు నేను పగలు సీడీ విని ఉచ్చారణ నేర్చుకుని, సాయంత్రం పాపతో ప్రాక్టీస్ చేయించేదాన్ని. తనలో స్కిల్ ఉంది. శిక్షణ ఇస్తే రాణిస్తుందని లాయర్‌గా ప్రాక్టీస్ మానేసి నా జీవితాన్ని తనకోసం మలుచుకున్నాను’’ అన్నారు.
 
 తల్లిగా బిడ్డ భవిష్యత్తు ప్రణాళికల గురించి అడిగినప్పుడు అక్కడే ఉన్న ఉదయ ‘‘అమెరికాలో స్పెల్‌బీ కాంపిటీషన్‌లో పార్టిసిపేట్ చేయాలి. అమ్మను అమెరికాకు తీసుకెళ్లాలి. అమ్మ చూస్తుండగా నేను ఒబామా చేతులమీదుగా అవార్డు తీసుకోవాలి’’ అని చెప్పింది. పదకొండేళ్ల అమ్మాయిలో ఇంత పెద్ద కల, అంతకు మించిన ఆత్మవిశ్వాసం పెంపకంలో రావల్సిందేనేమో. ఉదయ కల నెరవేరాలని ఆశిద్దాం.
 
 - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
 
 ఇష్టం అన్న ప్రతిదీ నేర్పిస్తున్నాను!

 ఇప్పుడు అబాకస్ క్లాస్ లేదు. తనకి కొంచెం ఖాళీ వస్తుందనుకుంటే చెస్ నేర్చుకుంటానంది ఉదయ. ఈ మధ్యలో డ్రాయింగ్ క్లాసులకూ వెళ్తోంది. బొమ్మలు చాలా బాగా వేస్తుంది. యూరప్‌లో జరిగే జూనియర్ లెవెల్ పెయింటింగ్ కాంపిటీషన్‌కి పంపించారు డ్రాయింగ్ మాస్టారు. నేను నేర్పించినవన్నీ ఉదయ కావాలని అడిగినవే. నాకు ఇష్టమైన వీణ, నాట్యం నేర్పిద్దాం అనుకున్నాను. కానీ తనకవి ఏ మాత్రం ఇష్టం లేదు. నేను వీణ మీటినప్పుడు వినడానికి కూడా ఇష్టపడదు.
 - అనూరాధ, ఉదయశ్రీ తల్లి
 
 ఉదయశ్రీ విజయాలు  అబాకస్‌లో...
 ఎనిమిది లెవెల్స్‌లో ఫస్ట్ ప్రైజ్
 2012 - స్టేట్ చాంపియన్‌షిప్
 2011- అబాకస్ ట్రోఫీ రన్నర్ అప్
 
 తైక్వాండోలో...
 2010లో రెండు బంగారు పతకాలు
 2011, 2012లో బంగారు పతకాలతో హ్యాట్రిక్
 
 స్పెల్ బీ...
 ఈ ఏడాది ఏప్రిల్‌లో బెంగళూరులో మార్స్ సంస్థ నిర్వహించిన ‘ఇంటర్నేషనల్ స్పెల్ బీ 2013’లో ‘బడ్డింగ్ స్టార్’ అవార్డు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement