తేడా వస్తే.. తాట తీస్తారు | karate training for DWCRA women in Jangaon | Sakshi
Sakshi News home page

తేడా వస్తే.. తాట తీస్తారు

Published Thu, Jan 4 2018 2:37 AM | Last Updated on Tue, Aug 14 2018 3:48 PM

karate training for DWCRA women in Jangaon - Sakshi

సాక్షి, జనగామ
రాష్ట్రంలోనే తొలిసారిగా జనగామ జిల్లాలోని డ్వాక్రా మహిళా పొదుపు సంఘాల సభ్యులకు అధికారులు ఆత్మరక్షణపై శిక్షణ అందిస్తున్నారు. ఇంటాబయటా జరుగుతున్న దాడుల నుంచి రక్షణ పొందేందుకు మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంపొందిస్తున్నారు. మెడలోంచి బంగారు ఆభరణాలను లాక్కెళ్లడం, అత్యాచార యత్నం, యాసిడ్, కత్తులతో దాడులు.. వంటి వాటి నుంచి సులువుగా బయటపడటంపై అవగాహన కల్పిస్తున్నారు. 15 రకాల టెక్నిక్‌లను నేర్పిస్తూ.. మహిళల్లో ధైర్యాన్ని నూరిపోస్తున్నారు. గతంలో పాఠశాల, కళాశాల స్థాయి బాలికలకు సెల్ఫ్‌ డిఫెన్స్‌పై మార్షల్‌ ఆర్ట్స్‌ను నేర్పించారు. జనగామ కేంద్రంగా 2017 జనవరి 24న 13,686 మంది విద్యార్థినులతో ‘సంఘటిత సబల’ప్రదర్శనను నిర్వహించి గిన్నీస్‌ బుక్‌ రికార్డును నెలకొల్పారు. ఇప్పుడు అదే తరహాలో డ్వాక్రా సంఘాలకు మార్షల్‌ ఆర్ట్స్‌లో తర్ఫీదు ఇచ్చి మరో భారీ ప్రదర్శనకు సిద్ధమవుతున్నారు.

శిక్షణ సాగుతోందిలా..
తాజాగా బదిలీ అయిన జిల్లా కలెక్టర్‌ అల్లమరాజు దేవసేన, డీఆర్‌డీవో మేకల జయచంద్రారెడ్డి.. డ్వాక్రా మహిళలకు కరాటే శిక్షణపై ఆలోచన చేశారు. డిసెంబర్‌ మొదటివారంలోనే ఈ మేరకు నిర్ణయం తీసుకుని శిక్షణ బాధ్యతలను రాణి రుద్రమదేవి సెల్ఫ్‌డిఫెన్స్‌ అకాడమీకి అప్పగించారు. డీఆర్‌డీఓ, మండల సమాఖ్యల నుంచి ఖర్చులను భరించి ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. తొలి విడతలో గ్రామైక్య సంఘాలు(వీఓ)ల్లోని అధ్యక్ష, కార్యదర్శులకు, చురుగ్గా ఉండే మహిళలను ఎంపిక చేశారు. గత నెల 20 నుంచి 24 వరకు జిల్లాలోని బచ్చన్నపేట, స్టేషన్‌ఘన్‌పూర్, జనగామ, లింగాలఘణపురం, నర్మెట, తరిగొప్పుల, రఘునాథపల్లి, దేవరుప్పుల, కొడకండ్ల, పాలకుర్తి, చిల్పూరు, జఫర్‌గఢ్, గుండాల మండలాల్లో 1,884 మందికి శిక్షణ ఇచ్చారు. మండల కేంద్రాల్లో రెండ్రోజుల పాటు శిక్షణ పొందిన వీఓలు, మహిళలు గ్రామాల్లో మిగిలిన డ్వాక్రా సంఘాల సభ్యులకు శిక్షణ ఇస్తారు. జిల్లాలోని 210 గ్రామ పంచాయతీల పరి«ధిలో ఉన్న మహిళలకు మార్షల్‌ ఆర్ట్స్‌పై శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళిక రచించారు. ఇలా జిల్లా వ్యాప్తంగా ఈ నెలాఖరులో అన్ని గ్రామాల్లో ఒకేసారి 1,25,998 మంది మహిళలకు మార్షల్‌ ఆర్ట్స్‌పై శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆత్మవిశ్వాసం పెరిగింది
ఇంటి నుంచి కాలు బయట పెట్టాలంటే భయపడే రోజులు ఇవి. ఏ వైపు నుంచి ఓ ప్రమాదం వస్తుందో తెలియదు. అన్ని సమయాల్లో అందరు తోడుగా ఉంటారని చెప్పలేం. సెల్ఫ్‌ డిఫెన్స్‌పై శిక్షణ తీసుకున్నాక కొంత ధైర్యం వచ్చింది. మహిళల కోసం ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టడం ఆనందంగా ఉంది.
–గొడిశాల సమత, దేవరుప్పుల

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement