హు... హ... హు? | special story to karate | Sakshi
Sakshi News home page

హు... హ... హు?

Published Mon, Nov 28 2016 10:31 PM | Last Updated on Mon, Sep 4 2017 9:21 PM

హు...  హ... హు?

హు... హ... హు?

ఈ పిల్లవాడెవరు?
చిందులేస్తాడు..
ఎగురుతాడు..
తంతాడు..
కరాటే నేర్చుకోకపోయినా
బ్లాక్‌బెల్డ్‌లా హు...హ.. హు.. అంటాడు.
పదేళ్ల బిడ్డకు అంత నైపుణ్యం
ఎలా వచ్చింది?
ఎక్కడ నుంచి వచ్చింది?
గత జన్మనుంచా?
హు.. హ.. హు..??  (who)

‘‘అక్కా, అవినాశ్ మూసిన కన్ను తెరవడం లేదు. నాకు భయంగా ఉంది. నువ్వు తొందరగా రా!’’ అంది పద్మ ఫోన్‌లో. పద్మ గొంతులో ఆందోళన గమనించిన అక్క రజిత ‘‘ఏమైందే? నిన్న బాగానే ఉన్నాడు, స్కూల్ కెళ్తున్నాడు అని చెప్పావుగా!’’ అంది ఆదుర్దాగా!‘‘అవన్నీ నువ్వొచ్చాక చెబుతా! రా ముందు’’ ఏడుపు గొంతుతో అంది పద్మ. ‘‘సరే, టెన్షన్ పడకు. వస్తున్నా!’’ అంది రజిత.గంటలో పద్మ ఇంటి ముందుంది రజిత.  లోపల చడీచప్పుడు లేదు. కొంచెం ఆందోళన గానే బెడ్‌రూమ్‌లోకెళ్లింది. పద్మ ఏడుస్తూ బెడ్‌మీద కూర్చుని ఉంది. బెడ్ మీద అవినాశ్ పడుకుని ఉన్నాడు. ఇంట్లో మరిది శ్రీనివాస్ లేనట్టున్నాడు. పద్మకు ఒక్కడే కొడుకు అవినాశ్. ఐదవ తరగతి చదువుతున్నాడు. దగ్గరగా వెళ్లి ‘‘పద్మా! ఏమైందే!’’ అని భుజంపై చెయ్యి వేసి అడిగింది రజిత.

అక్కను చూడగానే ఆమెను పట్టుకొని బావురుమంది పద్మ.‘‘వాడేమైపోతాడోనని భయంగా ఉందే!’’ అని ఏడుస్తూనే ఉంది. అవినాశ్ ఒంటిమీద చెయ్యి వేసి చూసింది రజిత. ఒళ్లు బాగా కాలిపోతోంది. ఒంటి మీద చర్మం కమిలిన గుర్తులు కనిపించాయి. ‘‘ఏమైంది? శ్రీనివాస్ ఎక్కడ?పిల్లవాడికి ఇలాగుంటే ఎక్కడికెళ్లాడు?’’ అందోళనగా అడిగింది రజిత. పద్మ ఏడుస్తూనే ఉదయం జరిగిన విషయం అంతా చెప్పుకొచ్చింది.

రోజూ గొడవలే!
‘‘వీడితో రోజూ ఏదో సమస్య వచ్చి పడుతూనే ఉందక్కా. ఉదయం స్కూల్ నుంచి ఫోన్ రావడంతో నేను మీ మరిది వెళ్లాం. ‘మీ అబ్బాయిని తీసుకెళ్లండి, టీసీ ఇచ్చేస్తాం’ అన్నారు ప్రిన్సిపల్. క్లాస్‌మేట్‌తో గొడవ పడ్డాడట. ఆ పిల్లవాడిని వీడు కొట్టడంతో తలకు దెబ్బతగిలిందట. ఆసుపత్రిలో చేర్చారు. ఎప్పుడు చూసినా క్లాస్‌రూమ్‌లో కరాటే ఫీట్లు చేస్తాడట. ఈ కరాటే పిచ్చి ఎక్కడ పట్టుకుందో, ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు. నీకు తెలుసు కదా! ఇంట్లో ఉన్నప్పుడు కూడా అంతే. వీడు చేసిన పనికి ఆ పిల్లవాడి తల్లితండ్రులు వచ్చి మమ్మల్ని తిట్టారు. దీంతో శ్రీనివాస్ ఆవేశంలో వీడిని చితకబాదాడు. అడ్డు వచ్చిన నన్ను కూడా తోసేశాడు. బిడ్డకు ఒళ్లంతా వాతలు తేలాయి. బాగా భయపడ్డాడు. జ్వరం వచ్చేసింది. కోపంలో పొద్దుననగా వెళ్లిన శ్రీనివాస్ ఇప్పటిదాకా రాలేదు. ఫోన్ చేస్తే.. ‘ఛస్తే.. చావనీ’ అంటూ పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. నాకేం తోచక నీకు ఫోన్ చేశాను’’...ఏడుస్తూనే చెప్పింది పద్మ.

అవినాశ్ విషయం రోజూ రజితకు తెలుస్తూనే ఉంటుంది. మూడేళ్ల వయసు నుంచే ‘హ.. హు....’ అంటూ కరాటే ఫైట్లు చేసేవాడు. అడ్డున్న వస్తువులు వాడి ఫీట్లకు ముక్కలవ్వాల్సిందే! స్కూల్‌కి వెళ్లమంటే మాత్రం చుక్కలు చూపించేవాడు. కరాటే స్కూల్‌లో చేర్పించమంటే శ్రీనివాస్ వినేవాడు కాదు. చదువుపై శ్రద్ధ  ఉండదు వేరే వ్యాపకాలుంటే బుద్ధిగా చదువుకోమని హెచ్చరించేవాడు. అవినాశ్ మొండిగా ప్రవర్తించేవాడు. విసిగినప్పుడల్లా తిడుతూనో, కొడుతూనో వాడిని అదుపులో పెట్టాలనుకునేవాడు శ్రీనివాస్. ఆలోచనల నుంచి తేరుకున్న రజిత ‘ఆసుపత్రికెళ్దాం పద’ అని బయల్దేరదీసింది.

ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకునేసరికి శ్రీనివాస్ వచ్చి ఉన్నాడు. కొడుకు పరిస్థితి చూసిన శ్రీనివాస్‌కు కళ్లనీళ్లు ఆగలేదు. కోపంలో ఎంతగా కొట్టిందీ గుర్తు తెచ్చుకొని మరీ కళ్ల నీళ్లు పెట్టుకున్నాడు.‘‘వీడు ఎందుకిలా చేస్తున్నాడో అర్థం కావడంలేదొదినా! అన్నీ టైమ్‌కి అమర్చి పెడుతున్నా చదువుకోకుండా ఈ పిచ్చిపనులేంటో’’ అన్నాడు శ్రీనివాస్.

‘‘శ్రీనివాస్! నేను చెప్పిన చోటుకి వాడిని తీసుకొస్తే సమస్యేంటో మీకూ, వాడికీ తెలుస్తుంది. అప్పుడీ గొడవలూ, ఏడ్పులూ ఉండవు’’ అంది రజిత. ‘‘అక్కా! ఏదైనా చేయి. ఎక్కడకు రమ్మన్నా వస్తాం. వాడు బాగుపడితే అంతే చాలు!’’ అంది రజిత చేతులు పట్టుకొని పద్మ.

వెలుగు చూపిన ప్రయాణం
అవినాశ్ చుట్టూ ఆసక్తిగా చూస్తున్నాడు. తల్లీ తండ్రి అక్కడ ఉన్న అతనితో తన గురించి చెబుతుంటే మౌనంగా వింటున్నాడు. అన్నీ విన్న కౌన్సెలర్ అవినాశ్‌కు దగ్గరగా వచ్చి అతణ్ణి మెత్తని వాలు కుర్చీలో కూర్చోబెట్టాడు. ‘‘అవినాశ్! ఇక్కడ నీకు నచ్చినట్టే ఉండు. అమ్మా నాన్న ఏమీ అనరు. వాళ్లు ఏమైనా అన్నా మేం ఊరుకోం. మేం చెప్పినట్టు చేస్తావా?’’ అని అడిగాడు.

‘చేస్తాను’ అన్నట్టు తల ఊపాడు అవినాశ్. ‘‘అవినాశ్! కళ్లు మూసుకొని ప్రశాంతంగా పడుకో. ఏ భయాలూ పెట్టుకోకు. నేను అడిగినప్పుడు నీ కళ్ల ముందు ఏమేం కనిపిస్తాయో, అనిపిస్తున్నాయో అవన్నీ చెబుతూ ఉండు..’’ కౌన్సెలర్ చె ప్పాడు.  ఎదురుగా కౌన్సెలర్, అమ్మనాన్న, పెద్దమ్మ.. వారందరినీ చూసి కళ్లు మూసుకొన్నాడు అవినాశ్. పది నిమిషాలు నిశ్చల స్థితిని అనుభవించేంత సమయం ఇచ్చిన కౌన్సెలర్ అవినాశ్‌కు సూచనలివ్వడం ప్రారంభించాడు. అవినాశ్ అంతర్ చేతనలో తను ఎక్కడ ఉన్నది, ఏమేం చేస్తున్నది, దృశ్యంగా కనిపిస్తున్నవి ఏంటి... వరుసగా చెబుతున్నాడు.  పద్మ, రజిత, శ్రీనివాస్‌లు మౌనంగా చూస్తున్నారు.

అవినాశ్ చెబుతున్నాడు.. ‘అమ్మ దగ్గర ఆడుకోవడం, అమ్మమ్మ ఊరికి వెళ్లడం బాగుంది. ఈ స్కూల్ అంటే ఇష్టం లేదు. చదువంటే భయం. నా కంపాస్ బాక్స్ కిశోర్ లాక్కున్నాడు. అడిగితే నన్ను కొట్టాడు. నేను ఒక్క ‘కిక్’ ఇచ్చాను. అంతే, గొడకు కొట్టుకొని దెబ్బ తగిలింది. టీచర్ నన్నే కొట్టింది. నేను ఆ టీచర్‌కీ కిక్ ఇచ్చాను. నాన్న నన్ను కొడుతున్నాడు. నాన్నా... నన్ను కొట్టద్దు నాన్నా! ప్లీజ్ నాన్నా!’ అంటున్న అవినాష్ బుగ్గల మీద ధారాపాతంగా కన్నీళ్లు. అవినాశ్ స్థితిని చూస్తున్న పద్మ, రజిత, శ్రీనివాస్‌లు విలవిలలాడిపోయారు. కౌన్సెలర్ సూచనలు అవినాశ్‌కు ఇంకా అందుతున్నాయి. ‘‘నీకు ఇంకా ఏం ఇష్టం, ఇంకా వెనక్కి వెళ్లగలవు. అది నీ గత జీవితం అవుతుంది. ప్రయత్నించు’’ అని చెప్పాడు. అవినాశ్ కాసేపు మౌనంగా ఉన్నాడు. తర్వాత చెప్పడం మొదలుపెట్టాడు. అంతా విచిత్రంగా చూస్తున్నారు.

‘నా ఊరు చైనాలో ఉంది. నాకు ‘నింజా’ అనే కరాటే స్కూల్ ఉంది. నేను టీచర్‌ని. శిష్యులకు మార్షల్ ఆర్ట్స్ నేర్పుతున్నాను. మార్షల్ ఆర్ట్స్ అంటే నాకు ప్రాణం. నేను ముసలోడినైపోయాను. నా స్కూల్ పాడైపోతోంది, ఎవరూ పట్టించుకోవడంలేదు. నేను అక్కడికే వెళ్లిపోతాను’ ...పలవరిస్తున్నట్టుగా చెబుతున్నాడు అవినాశ్.

అవగాహనతో సాధన
థెరపీ పూర్తయింది. అవినాశ్‌ను విశ్రాంతి తీసుకోమని చెప్పి పద్మ, శ్రీనివాస్‌లను బయటకు తీసుకువచ్చారు కౌన్సెలర్. ‘‘శ్రీనివాస్! మీరూ విన్నారుగా అవినాశ్ అంతర్‌చేతనంలో ఎలాంటి భావాలున్నాయో! అవి ఇప్పటివి కాదు. అతని గత జన్మలోనివి. కరాటే అంటే అతనికి ప్రాణం. అతని కల తీరకుండానే మరణించి, అదే ఊపిరిగా తిరిగి జన్మించాడు. తను ఏం చేయాలనుకొని ఈ భూమ్మీదకు వచ్చాడో ఆ పనికి అడ్డుపడకండి. పెద్దలుగా మీకున్న కలలు మీ బిడ్డ మీద రుద్దకుండా అతడికి ఏమవ్వాలని ఉందో దాంట్లో తర్ఫీదు ఇప్పించండి. మీ బిడ్డ జీవితం మెరుగవుతుంది’’ అన్నారు కౌన్సెలర్.

‘తప్పకుండా’అన్నారు శ్రీనివాస్, పద్మ మనస్ఫూర్తిగా. ఇప్పుడు అవినాశ్‌కి పధ్నాలుగేళ్లు. 8వ తరగతి చదువుతున్నాడు. కౌన్సెలర్ సూచనల ప్రకారం అవినాశ్‌ను కరాటే స్కూల్‌లో చేర్పించాడు శ్రీనివాస్. కరాటేలో రాష్ట్రస్థాయి పోటీల్లో మంచి పేరు సంపాదించుకున్నాడు. చదువు ఇష్టం లేదన్నా, మెల్లగా తన మనసును అక్షరాలపై కుదిరేలా చేసుకున్నాడు. నేషనల్ ఛాంపియన్ అవ్వాలనే ధ్యేయంతో సాధన చేస్తున్నాడు.

 3 వేల మంది పిల్లలపై పరిశోధన
డాక్టర్ అయాన్ స్టీవెన్సన్ అమెరికాలో ప్రముఖ సైకియాట్రిస్ట్. వర్జీనియా విశ్వవిద్యాలయంలో 50 ఏళ్లు పనిచేసిన అనుభవం ఉంది. 40 ఏళ్ల వయసులో ప్రపంచంలోని 3000 మంది పిల్లల నుంచి రిగ్రెషన్ థెరపీ ద్వారా వారి గత జీవితం తాలూకు విశేషాలను రాబట్టారు. దీని బట్టి,  ‘చేతన’ ప్రయాణం ఎప్పటికీ ఆగిపోదని బలంగా చెప్పారు అయాన్.

బాల మేధావులెందరో..!
కొంతమంది పిల్లల్లో అసాధారణ కళ, నైపుణ్యం ఆశ్చర్యపరుస్తుంటుంది. కిందటి జన్మలో ఆ కళ పట్ల వారికి అపారమైన అనుభవం, అభిమానం ఉండి ఉంటాయి. దాన్ని పూర్తి చేసుకో లేక తమ పుట్టుకతో పాటూ ఈ జన్మకూ మోసుకువస్తారు. తమకు నచ్చిన ఆ కళనే సాధన చేస్తుంటారు. అంతః చేతనలో ఉండే ఆ కళను వారు దర్శించగలిగితే సాధనమార్గాలు సులువు అవుతాయి. నైపుణ్యం పెరుగుతుంది. - డాక్టర్ లక్ష్మీ న్యూటన్, పాస్ట్‌లైఫ్ రిగ్రెషన్ థెరపిస్ట్, లైఫ్ రీసెర్చి అకాడమీ, హెదరాబాద్

జ్ఞాపకాల గని
కరోల్ బౌమ్యాన్ పాస్ట్ లైఫ్ థెరపిస్ట్. పరిశోధకురాలు.  పిల్లల గత జీవిత జ్ఞాపకాలను వెలికి తీసి  ‘చిల్డ్రన్ పాస్ట్ లైవ్స్’ (పిల్లల గత జీవితాలు) పేరుతో పుస్తకం రాశారు. ఈ పుస్తకం ప్రపంచంలో 22 భాషల్లో అనువాదమైంది.

మొజార్ట్ కూడా అంతే!
మొజార్ట్ ఆస్ట్రియావాసి. కీబోర్డ్, వయొలిన్ అంటే పిచ్చి. ఎవరూ అతనికి సంగీతనం నేర్పించలేదు. కానీ, సమర్థంగా రాగాలను పలికించేవాడు. 5 ఏళ్ల వయసులోనే యురోపియన్ రాజవంశీయుల ముందు తన సంగీత ప్రతిభను చూపి ప్రశంసలు అందుకున్నాడు. సంగీతంలో ప్రపంచ ప్రసిద్ధుడయ్యాడు.

- నిర్మల చిల్కమర్రి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement