Self Defence Strategies for Women: What Karate Champion Syeda Falak Says - Sakshi
Sakshi News home page

Self Defence Strategies: ఆగంతకుడు ఎదురుగా ఉంటే... వెనుక నుంచి వస్తే ఏం చేయాలి?

Published Sat, Apr 30 2022 9:29 AM | Last Updated on Sat, Apr 30 2022 3:13 PM

Self Defence Strategies For Women: What Karate Champion Syeda Falak Says - Sakshi

గాంధీజీ ఆకాంక్ష ఇది. అర్ధరాత్రి స్త్రీ ఒంటరిగా నడిరోడ్డు మీద ధైర్యంగా సంచరించగలిగిన రోజు మనదేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లు... అని ఆకాంక్షించాడు బాపూజీ. అర్ధరాత్రి ఒంటరిగా ప్రయాణం చేయడానికి స్త్రీ ధైర్యం చేస్తోంది. కానీ సంస్కారం లోపిస్తున్నది మగవాళ్లలోనే. అయితే మహిళ ఒకప్పటిలాగా ఉండడం లేదు. ఆకతాయి మగవాళ్లు ఏడిపిస్తారని ముడుచుకు పోవడం లేదు.

ఏడిపించిన వాళ్ల దేహశుద్ధి చేయడానికి కూడా వెనుకాడడం లేదు. ఇందుకు నిదర్శనం ఆంధ్రప్రదేశ్‌లోని గన్నవరం ఎయిర్‌పోర్టు ఉద్యోగి ఉదంతమే. ఆమె డ్యూటీ ముగించుకుని రాత్రి పూట ఇంటికి వెళ్తోంది. ఓ యువకుడు ఆమె బైక్‌ను ఆపాడు. అతడి దుర్మార్గపు ఆలోచనను కని పెట్టింది. అయితే ఆమె భయంతో బిగుసుకుపోలేదు, పారిపోయే ప్రయత్నమూ చేయలేదు.

రోడ్డు పక్కన ఉన్న కర్ర తీసుకుని ఆ యువకుడిని చితక్కొట్టింది. ‘ఆడపిల్ల అంటే ఇలా ఉండాల’ని సమాజం నుంచి ప్రశంసలందుకుంటోంది. ‘ఆడపిల్ల ఒద్దికగా తల వంచుకుని వెళ్లాలి’ అనే కాలదోషం పట్టిన సూక్తిని తిరగరాసింది. ఈ ఆధునిక సమాజంలో మనగలగాలంటే ఆడపిల్ల ఎలా ఉండాలో... చెప్పడానికి తానే రోల్‌మోడల్‌గా నిలిచింది. మగవాడు సాహసం చేస్తే హీరో, మహిళ సాహసం చేస్తే షీరో. 

‘‘ప్రతి ఒక్క బాలిక, మహిళ స్వీయ రక్షణ చిట్కాలను నేర్చుకుని తీరాలి. మార్షల్‌ ఆర్ట్స్‌ ప్రాక్టీస్‌కి చాలా శక్తి కావాలని, ఆడపిల్లలు ఈ ప్రాక్టీస్‌ చేస్తుంటే లాలిత్యాన్ని కోల్పోతారనేది కేవలం అపోహ మాత్రమే. సాధారణంగా ఉండాల్సిన ఫిట్‌నెస్‌ చాలు. ఈ ప్రాక్టీస్‌తో దేహం శక్తిమంతం అవుతూ, ఫ్లెక్సిబుల్‌గానూ ఉంటుంది. నిజానికి ప్రమాదం ఎదురైనప్పుడు స్పందించాల్సింది మెదడు. ఈ ప్రాక్టీస్‌తో మెదడు చురుగ్గా ఉంటుంది.

దాంతో తక్షణమే అప్రమత్తమై మెళకువలతో వేగంగా స్పందిస్తుంది. నైట్‌షిఫ్ట్‌లు, డ్యూటీలో భాగంగా బయట ప్రదేశాలకు వెళ్లాల్సిన వాళ్లు తప్పనిసరిగా స్వీయరక్షణ పద్ధతులు నేర్చుకుని తీరాలి. మనలో ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడే... ఏదైనా సాధించగలమనే ధైర్యం కూడా వస్తుంది.

ఇవి ఒకదానితో మరొకటి అనుసంధానమై ఉంటాయి. ప్రాక్టీస్‌తో తమ మీద తమకు ఆత్మవిశ్వాసం కలుగుతుంది, అది ధైర్యానికి కారణమవుతుంది. ఆ ధైర్యం కెరీర్‌ ఉన్నతికి దోహదం చేస్తుంది. గన్నవరం అమ్మాయిని ప్రతి ఒక్కరూ అభినందించి తీరాలి. ఆమె స్ఫూర్తితో మరికొంత మంది ప్రతికూల పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొన గలుగుతారు’’ అన్నారు కరాటే చాంపియన్‌ సైదా ఫలక్‌. ఆమె తెలంగాణలో స్కూళ్లలో బాలికలకు స్వీయరక్షణ నేర్పిస్తున్నారు.  

పక్షులు, జంతువులు... స్త్రీపురుష భేదం లేకుండా వేటికవి తనను తాను రక్షించుకుంటాయి. మనిషికెందుకు ఈ తేడా? సమాజం విధించిన పరిధిలో కుంచించుకుపోవడం వల్లనే స్త్రీ బాధితురాలిగా మిగులుతోంది. అంతేతప్ప స్త్రీలో తనను తాను రక్షించుకోగలిగిన శక్తి లేక కాదు. దేహదారుఢ్యంలో పురుషుడికి సమానం కాకపోవచ్చు. కానీ తనను తాను పురుషుడికి దీటుగా తీర్చిదిద్దుకోవడంలో మాత్రం వెనుకబాటుతనం ఉండదు.

సమాజం గీసిన అసమానత్వపు గిరిగీతను చెరిపేయడం మొదలుపెట్టింది మహిళ. ఇప్పటికే అనేక స్కూళ్ల నుంచి స్వీయరక్షణలో శిక్షణ పొందిన తరం బయటకు వచ్చింది. ఈ దారిలో మరికొంత మంది నడిచి తీరుతారు. గాంధీజీ కలలు కన్న సంపూర్ణ స్వాతంత్య్రం కోసం మహిళలు నిశ్శబ్దంగా ఉద్యమం మొదలుపెట్టారు. ఆ ఫలాలు సమీప భవిష్యత్తులోనే అందుతాయనడంలో సందేహం లేదు.

ధైర్యం... ఆరోగ్యం! 
నైన్త్‌ క్లాస్‌లో ఉన్నప్పుడు మా స్కూల్‌లో తైక్వాండో క్లాసులు పెట్టారు. అప్పటినుంచి ప్రాక్టీస్‌ చేస్తున్నాను. నాలుగుసార్లు నేషనల్స్‌లో పాల్గొన్నాను. ప్రాక్టీస్‌కి ముందు తర్వాత తేడా నేను స్పష్టంగా చెప్పగలుగుతాను. మా నాన్న లేరు. అక్క, అమ్మ, నేను. బయట పనులు చక్కబెట్టుకుని రాగలిగిన ధైర్యం వచ్చింది.

‘ఆడపిల్ల కాబట్టి’ అని జాగ్రత్తలు నేర్పించే వయసులో మా అమ్మ నాకు తైక్వాండో నేర్చుకునే అవకాశం ఇచ్చింది. అమ్మాయిలకు నేను చెప్పేదేమిటంటే... ఈ ప్రాక్టీస్‌ వల్ల ప్రమాదాల నుంచి మనల్ని మనం రక్షించుకోవడమే కాకుండా ఫిజికల్‌ యాక్టివిటీ తగ్గిన కారణంగా ఎదురవుతున్న అనేక అనారోగ్యాల నుంచి కూడా దూరంగా ఉండగలుగుతాం. – కంభంపాటి లలితాకీర్తన, బీటెక్‌ స్టూడెంట్, కర్నూలు 

నన్ను నేను రక్షించుకోగలను! 
తైక్వాండోలో బ్లాక్‌బెల్ట్, థర్డ్‌ డాన్‌ లెవెల్‌కు చేరాను. రాయలసీమలో ఈ స్థాయిని చేరుకున్న అమ్మాయిని నేను మాత్రమే. ఔరంగాబాద్‌లో జరిగిన నేషనల్స్‌లో మొదటి స్థానం నాది. దీనిని స్పోర్ట్‌గా చూడండి, మార్షల్‌ ఆర్ట్‌గా చూడండి. కానీ ప్రాక్టీస్‌ చేయడం మాత్రం మరువద్దు. ఎందుకంటే ఇప్పుడు సమాజంలో అమ్మాయిలు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండడం సాధ్యం కాదు.

అర్ధరాత్రి డ్యూటీ చేయలేమంటే కుదరదు. అంతేకాదు... విలువలు పతనమవుతున్నాయి కూడా. ఇలాంటప్పుడు ప్రతి ఒక్కరూ స్వీయరక్షణ మెళకువలు నేర్చుకోవాల్సిందే. అప్పుడే ఏ పరిస్థితులనైనా హ్యాండిల్‌ చేయగలననే ఆత్మవిశ్వాసం వస్తుంది. మహిళలు కూడా ఈ వయసులో ఇంకేం నేర్చుకుంటాం అనుకోకూడదు. కనీసంగా కొన్ని టెక్నిక్‌లనైనా ప్రాక్టీస్‌ చేయాలి. అప్పుడే ‘నన్ను నేను రక్షించుకోగలను’ అనే ధైర్యం వస్తుంది. ఆ ధైర్యమే ముందుకు నడిపిస్తుంది. – జి. కెహితీ, కుకివోన్‌ తైక్వాండో నేషనల్‌ చాంపియన్, ఫ్యాషన్‌ డిజైనింగ్‌ స్టూడెంట్‌

నేర్పిస్తూనే ఉన్నాను! 
తైక్వాండో నేర్పించడం నాకు వృత్తి మాత్రమే కాదు, సామాజిక బాధ్యతగా చేపట్టాను. ముప్పై ౖఏళ్లుగా ఐదువేల మందికి శిక్షణనిచ్చాను. ఈ యుద్ధవిద్యల్లో జపాన్‌ వాళ్లది కరాటే, చైనా వాళ్లది కుంగ్‌ఫూ, కొరియా వాళ్లది తైక్వాండో. మా అమ్మాయి పేరు కెహితి కూడా కొరియా పదమే.

మా కొరియన్‌ మాస్టారి పట్ల గౌరవంతో ఆ పేరు పెట్టుకున్నాను. ఆడపిల్లల విషయానికి వస్తే ఈ మూడింటిలో తైక్వాండో అత్యుత్తమ స్వీయరక్షణ కళ.  – జి. శోభన్‌బాబు, కుకివోన్‌ తైక్వాండో బ్లాక్‌బెల్ట్‌ సెవెన్త్‌ డాన్, వైస్‌ ప్రెసిడెంట్, ఆంధ్రప్రదేశ్‌ తైక్వాండో అసోసియేషన్‌

ఆగంతకుడు ఎదురుగా ఉంటే...
1. హేమర్‌ స్ట్రైక్‌... 
చేతిలో ఉన్న వస్తువే ఆయుధం. బండి తాళం అయినా సరే. ఏమీ లేకపోతే చేతులే ఆయుధం. చేతిలో ఉన్న ఆయుధంతో సుత్తితో గోడకు మేకు కొట్టినట్లుగా ఆగంతకుడి ముఖం మీద దాడి చేయాలి. చేతిలో ఏమీ లేకపోతే పిడికిలి బిగించి దాడి చేయాలి.

2. గ్రోయిన్‌ కిక్‌... 
చేతులతో చేసిన దాడి సరిపోకపోతే కాళ్లకు పని చెప్పాలి. మోకాలి దెబ్బ ఆగంతకుడి కాళ్ల మధ్య తగలాలి. ఈ దాడితో చాలావరకు తాత్కాలికంగా దేహభాగం పక్షవాతం సోకినట్లు చచ్చుబడిపోతుంది. అతడు తేరుకునేలోపు పారిపోవచ్చు లేదా పోలీసులకు పట్టించవచ్చు.

 వెనుక నుంచి వస్తే...
1. ఆల్టర్నేటివ్‌ ఎల్బో స్ట్రైక్‌... 
ఇది ఆగంతకుడు వెనుక నుంచి దాడి చేసినప్పుడు ప్రయోగించాల్సిన టెక్నిక్‌. మోచేతిని భుజాల ఎత్తుకు లేపి దేహాన్ని తాడులా మెలితిప్పుతున్నట్లు తిరుగుతూ మోచేతితో ఆగంతకుడి ముఖం మీద దాడి చేయాలి.

అతడు తేరుకునేలోపు వేగంగా మళ్లీ మళ్లీ దాడి చేయాలి. మోచేతితో దాడి చేస్తున్నప్పుడు పాదాన్ని దేహ కదలికకు అనుగుణంగా గాల్లోకి లేపి, దేహం బరువును మునివేళ్ల మీద మోపాలి. అప్పుడే మోచేతి అటాక్‌ సమర్థంగా ఉంటుంది. 

2. ఎస్కేప్‌ ఫ్రమ్‌ ఎ ‘బేర్‌ హగ్‌ అటాక్‌’ ... 
ఆగంతకుడు వెనుక నుంచి నడుము చుట్టూ చేతులు వేసి కౌగిలించుకున్నప్పుడు తప్పించుకునే మార్గం ఇది. రెండు మోచేతులను గాల్లోకి లేపి ఒకదాని తర్వాత మరో మోచేతితో ఆగంతకుడి ముఖం, దవడల మీద దాడి చేయాలి. అప్పుడు అతడి చేతులు వదులవుతాయి.

అప్పుడు ఎదురుగా తిరిగి అరచేతిని చాకులాగ చేసి మెడ మీద కర్రతో కొట్టినట్లు దాడి చేయాలి. వెంటనే పిడికిలి బిగించి మెడ మీద గుద్దుతూ మరో చేతిని మెడ మీద వేసి అతడిని కిందపడేయాలి. దేహం మీద రకరకాలుగా దాడి చేసి శత్రువును నిర్వీర్యం చేయవచ్చు.

నూటికి 81 శాతం మహిళలు జీవితంలో ఒక్కసారైనా లైంగిక వేధింపుల బారిన పడుతున్నట్లు యూఎస్‌లో ఓ సర్వేలో తెలిసింది. మహిళల రక్షణ కోసం యూనివర్సిటీ ఆఫ్‌ ఓరేగాన్‌ సూచించిన కొన్ని స్వీయరక్షణ పద్ధతులివి. 

– వాకా మంజులారెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement