వేస్తారు గాలం..జర భద్రం | Campaign is ending tomorrow | Sakshi
Sakshi News home page

వేస్తారు గాలం..జర భద్రం

Published Sun, Apr 27 2014 12:24 AM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM

వేస్తారు గాలం..జర భద్రం - Sakshi

వేస్తారు గాలం..జర భద్రం

  •     రేపటి తో ముగియనున్న ప్రచారం
  •      తాయిలాల  పంపిణీకి పక్కా ఏర్పాట్లు
  •      రంగంలోకి మహిళా కార్యకర్తలు
  •      బొట్టు పెట్టి బహుమతులు అందజేత
  •      నాయకులకు నజరానాలు
  •       బస్తీల్లో పారనున్న మద్యం
  •  సాక్షి, సిటీబ్యూరో : ఇప్పటివరకూ హోరాహోరీ ప్రచార పోరులో ఉన్న అభ్యర్థులు.. ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రలోభాలపైనా ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారు. సోమవారం సాయంత్రం 6 గంటలకు ప్రచారానికి తెర పడనుంది. ఇక మిగిలింది రెండు రోజులే.  ఉన్న ఈ కొద్ది సమయాన్ని వీలైనంత ఎక్కువగా వినియోగించుకుంటూనే.. ఓటర్లకు ఎర వేసే కార్యక్రమాలనూ వేగవంతం చేశారు.

    ప్రచారం తర్వాత పోలింగ్‌కు కేవలం ఒక్కరోజు సమయం మాత్రమే ఉండటంతో ఆ లోగానే ఓటర్లను బుట్టలో వేసేందుకు చేయాల్సిన కార్యక్రమాలు, జరగాల్సిన ‘పంపిణీ’లు, తదితర కార్యక్రమాలు సజావుగా పూర్తయ్యేందుకు అవసరమైన ప్రణాళికల్లో మునిగారు.

    ఇప్పటికే ఈ తంతు ఒకటి రెండు దశల్లో పూర్తయినప్పటికీ.. అంతిమ దశలో ఎలాంటి ఆటంకాల్లేకుండా తాయిలాల పంపిణీకి పకడ్బందీ ప్రణాళికలు వేశారు. బస్తీసంఘాలు, స్వయంసహాయక సంఘాలు, కులసంఘాలు, ఆటో యూనియన్లు, వివిధ జేఏసీలు, కాలనీ సంఘాలు, క్లబ్ సభ్యులు, వైరి పార్టీల్లోని అసంతృప్తి నేతలను లక్ష్యంగా చేసుకొని ఈ ప్రణాళికలు అమలు చేస్తున్నారు. వారిని ప్రలోభ పెట్టేందుకు తమ వారిని ఇప్పటికే పురమాయించారు.
     
    నజరానాలతో ఎర
     
    కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే ఒకటి, రెండు దఫాలుగా నగదు పంపిణీ, బహుమతుల పంపిణీ వంటివి జరిగిపోయాయి. అయినప్పటికీ, మిగిలిన సమయం అత్యంత కీలకం కావడంతో ప్రత్యేక శ్రద్ధతో తమ పనులు కానిస్తున్నారు. మద్యాన్ని, నగదును, బహుమతులను విచ్చలవిడిగా పంపిణీ చేస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓ ప్రధాన పార్టీ అభ్యర్థి మహిళలను ఆకట్టుకునేందుకు ఇప్పటికే కుక్కర్లను సరఫరా చేశారు.

    పోలింగ్‌కు ముందురోజు మరికొన్ని బహుమతులు అందజేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఖైరతాబాద్, సికింద్రాబాద్, ఎల్‌బీనగర్ నియోజకవర్గాల్లో స్వయంసహాయక మహిళా బృందాలకు నేరుగా నగదు పంపిణీ జరుగుతున్నట్లు తెలుస్తోంది. రాత్రివేళల్లో నిఘా బృందాలు ఎక్కువగా ఉంటాయ ని భావించి పట్టపగలే ఈ పంపిణీ తతంగాన్ని పూర్తిచేస్తున్నా రు. స్వయం సహాయక  సంఘాల్లోని మహిళలకు రూ. రెండు వేలు, సంఘం అధ్యక్షురాలికి రూ. ఐదు వేలు వంతున పంపిణీ జరుగుతున్నట్లు సమాచారం. బస్తీలు, మురికివాడల ప్రాంతాల్లో మద్యాన్ని ఏరులుగా పారిస్తున్నారు.
     
    ఇదీ లెక్క...
     
    మహిళా ఓటర్లను పట్టుకుంటే చాలు ఓట్ల పంట పండినట్టే అన్నది అభ్యర్థుల లెక్క. ఈ నేపథ్యంలో వీరిని ఆకట్టుకుంటే చాలన్నట్టుంది వారి తీరు. ఉదాహరణకు కంటోన్మెంట్‌లో సుమారు 2.42 లక్షల ఓటర్లలో మహిళా ఓటర్లు లక్షా పదివేల వరకు ఉన్నారు. వీరిలో స్వయంసహాయక సంఘాల సభ్యులదే అతిపెద్ద గ్రూపు. సుమారు 1400 వరకు ఉన్న గ్రూపుల్లో సుమారు 15వేల మంది సభ్యులున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్ధులు వీరి ఓట్ల కోసం గాలం వేస్తున్నారు.

    అమ్మా.. తల్లి.. అక్కా.. చెల్లీ.. అంటూ సంబోధిస్తూ అభ్యర్ధులు ఎన్నికల ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. ప్రచార సమయంలో మహిళలు అభ్యర్ధులను సమీపించి సమస్యలపై నిలదీసినా.. వారి సమస్యలు విన్నవించినా ఓపికగా వింటున్నారు. ముఖ్యంగా మురికివాడల్లో నివసించే మహిళలకు తాయిలాలతో పాటు అనేక వరాలను ఉదారంగా ఇస్తున్నారు. గెలిచిన వెంటనే మీరు అడిగిన పని చేసిపెడుతామంటూ హామీలు, వాగ్దానాలు గుప్పిస్తున్నారు.
     
    సంఘాలకు ప్యాకేజీలు
     
    అభ్యర్థుల పంపిణీ జాబితాలో సంఘాలకే ప్రాధాన్యం. కులసంఘాలు, కాలనీ సంఘాలతో సంప్రదింపులు జరుపుతూ ఓటుకు వేయి నుంచి రెండు వేల వరకు  ఆయా సంఘాల నేతలకు అందజేస్తున్నారు. వివిధ సంఘాలతోపాటు కొన్ని నియోజకవర్గాల్లో రాజకీయ నేతలనూ ప్రలోభపెడుతున్నారు. ఎల్‌బీనగర్ నియోజకవర్గంలో ఇప్పటికే ప్రధాన పార్టీలకు చెందిన నాయకులను తనవైపునకు తిప్పుకున్న ఓ అభ్యర్థి ఆయా స్థాయిల్లోని వివిధ రాజకీయ నాయకులకు భారీ నజరానాలు అందజేస్తున్నట్లు తెలుస్తోంది. ప్యాకేజీలుగా నగదు మొత్తాలు పంపిణీ అవుతున్నాయని ప్రచారం జరుగుతోంది. డివిజన్ల అధ్యక్షులకు రూ. 10 లక్షలు వంతున అందజేస్తున్నట్లు సమాచారం.

    ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ప్రధాన పార్టీ అభ్యర్థి స్వయంసహాయక సంఘాలు, బస్తీసంఘాలను టోకున కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఒక దఫా పంపిణీ జరిగిపోగా, మిగతా రెండు విడ తల్ని మిగిలిన రెండు రోజుల్లో పూర్తిచేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఓటర్లకు రూ. వెయ్యి వంతున ఇంటింటికీ పంపిణీ చేసేందుకు మరికొందరు వ్యూహరచన చేసినట్లు సమాచారం.
     
    సెంటిమెంటుతో ఆయింట్‌మెంట్
     
    మరికొందరు అభ్యర్థులు ప్రచారంలో సెంటిమెంటును ప్రయోగిస్తూ ఓటర్లను ప్రలోభపెట్టడానికి ప్రయత్నిస్తున్నా రు. ఉదయం, సాయంత్రం వేళల్లో కాలనీలు, బస్తీల్లో కలియ దిరుగుతూ ఓటర్లను నేరుగా కలుసుకొని హామీల వర్షం కురిపిస్తున్నారు. ఇదే తరుణంలో కొందరు పాత బంధుత్వాన్ని గుర్తు చేస్తుండగా.. మరికొందరు కుల, మతాల్ని ప్రస్తావిస్తూ ఆకట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు.

    ఇంకొం దరు ‘నేను స్థానికుడిని, మీ వాడినే... కే కేస్తే క్షణాల్లో మీముం దు వాలిపోతా...,  ఏ సమస్య వచ్చినా మీకోసం 24 గంట లూ మా తలుపులు తెరిచే ఉంటాయి. మీకు సేవ చేసే భాగ్యం కల్పించండి’ అంటూ ఎక్కడ లేని ప్రేమ ఒలకబోస్తున్నారు. ఇదే తరుణంలో తమ సతీమణులను కూడా రంగంలోకి దించి మహిళా ఓటర్లను ఆకట్టుకొనేందుకు రకరకాల పాట్లు పడుతున్నారు. వీరంతా ఆయా పార్టీలకు చెందిన కార్యకర్తలను, బంధుగణాన్ని వెంటేసుకొని ఇంటింటికీ వెళ్లి బొట్టు పెట్టి మరీ ఓట్లు అడుగుతున్నారు. బస్తీలు, కాలనీల్లో మహిళలు చేస్తున్న ప్రచారం... పేరంటానికి ఆహ్వానిస్తున్నట్లుగా హడావుడిగా సాగుతోంది. బొట్టు పెడుతున్న క్రమంలోనే కుక్కర్లు, చీరలు, కుంకుమ భరిణలు, బొట్టు బిళ్లలు తదితర కానుకలు, డబ్బు ఎరగా వేస్తున్నారు.

    మీ ఓట్లు తప్పకుండా మా వారికే వేయాలంటూ ఓటర్లును ప్రలోభపెడుతున్నారు. అయితే... ఈ వ్యవహారం ఎవరి కంటా పడకుండా గుట్టుగా నిర్వహిస్తున్నారు. తాయిలాలు ఇచ్చిన వారికి... తీసుకొన్న వారికి తప్ప తమ వెంట ఉన్న కార్యకర్తలకు కూడా కంటపడకుండా జాగ్రత్తలు తీసుకొంటుండటం గమనార్హం. ఇలా వివిధ మార్గాల ద్వారా ఓటర్లను బుట్టలో వేసుకొని ఓట్లు కొల్లగొట్టడంపైనే అభ్యర్థులంతా దృష్టి సారించారు.
     
     డబ్బులు పంపిణీ  చేస్తూ పట్టుబడ్డ టీడీపీ నాయకులు

    బోడుప్పల్, న్యూస్‌లైన్: ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తూ టీడీపీ నాయకులు మేడిపల్లి పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. మేడిపల్లి పీఅండ్‌టీ కాలనీలోని ఓ అపార్టుమెంట్‌లో టీడీపీ నాయకులు కోటిరెడ్డి, అశోక్, సుధాకర్ ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు అక్కడికి వెళ్లి  రూ. 22, 500 స్వాధీనం చేసుకున్నట్టు ఎస్‌ఐ మహేష్‌గౌడ్ చెప్పారు.
     
     కాంగ్రెస్ ప్రలోభాలపై టీడీపీ ఫిర్యాదు
     
    ఎస్‌ఆర్‌నగర్, న్యూస్‌లైన్ : కాంగ్రెస్ నాయకులు మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు అల్లాఉద్దీన్ కోఠిలో హ్యాండ్‌బ్యాగులు పంపిణీ చేస్తున్నారని సనత్‌నగర్ టీడీపీ అభ్యర్థి తలసాని శ్రీనివాస యాదవ్ శనివారం పోలీసులకు ఫిర్యా దు చేశారు. బ్యాగులపై కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుతో పాటు స్థానిక కాంగ్రెస్ అభ్యర్థి మర్రి శశిధర్‌రెడ్డి ఫొటో ఉన్నట్లు ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement