సాక్షి ప్రతినిధి, చెన్నై/న్యూఢిల్లీ: అన్నాడీఎంకే పార్టీ అధికారిక చిహ్నమైన ‘రెండాకుల గుర్తు’ను తమిళనాడు సీఎం ఎడపాటి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి ఓ.పన్నీర్‌సెల్వంల వర్గానికి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) గురువారం నిర్ణయం తీసుకుంది. అన్నాడీఎంకే ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తల్లో అత్యధికులు పళనికే మద్దతు ఇస్తున్నందున ఆ వర్గానికే గుర్తు కేటాయించినట్లు వెల్లడించింది. ప్రస్తుతం తమిళనాడుతోపాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో రెండాకుల గుర్తును పళని వర్గానికి కేటాయిస్తున్నట్లు పేర్కొంది.
ఈసీ తాజా నిర్ణయంతో రెండాకుల గుర్తు కోసం తీవ్రంగా పోరాడుతున్న ఆ పార్టీ బహిష్కృత నేత శశికళకు ఎదురుదెబ్బ తగిలినట్లైంది. మరోవైపు ఈసీ నిర్ణయంతో అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొంది. సీఎం పళని, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం, ఇతర మంత్రులు పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకుని పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు. అనంతరం జయలలిత సమాధి వద్దకు వెళ్లి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం పళని స్వామి స్పందిస్తూ.. అన్నాడీఎంకేకు ఈ రోజు అత్యంత ఆనందకరమైనదని అన్నారు. ఈసీ నిర్ణయంతో ఇక అన్నాడీఎంకే పేరును, రెండాకుల చిహ్నాన్ని పళని స్వామి వర్గం వినియోగించుకోవచ్చు.
అలాగే పార్టీ ప్రధాన కార్యాలయం కూడా పళనిస్వామి వశం కానుంది. గతేడాది డిసెంబర్‌లో అప్పటి తమిళనాడు సీఎం జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కే నగర్‌లో ఉపఎన్నికల సందర్భంగా అన్నాడీఎంకే రెండుగా చీలిపోయిన సంగతి తెలిసిందే. పన్నీర్‌సెల్వం, శశికళల నేతృత్వంలోని రెండు వర్గాలతో పాటు జయ మేనకోడలు దీప కూడా పార్టీ రెండాకుల గుర్తు మాదంటే మాదని వాదించడంతో ఈ గుర్తును ఈసీ అప్పట్లో నిలిపివేసింది. మరోవైపు ఈసీ నిర్ణయాన్ని సుప్రీం కోర్టులో సవాలు చేస్తామని అన్నాడీఎంకే బహిష్కృత నేత టీటీవీ దినకరన్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఒత్తిడితో ఈసీ పక్షపాతంగా వ్యవహరించిందని ఆరోపించారు.
ఇది రెండోసారి..!
► నాడు ఎంజీఆర్ మరణంతో నిలిపివేత
► జయ కన్నుమూతతో మార్చిలోనూ నిషేధం
అన్నా డీఎంకే పార్టీ ఎన్నికల చిహ్నంగా రెండాకుల గుర్తును ఎన్నికల సంఘం (ఈసీ) పునరుద్ధరించడం ఇది రెండోసారి. ఒక పార్టీ ఎన్నికల చిహ్నాన్ని రెండుసార్లు నిలిపివేసి మళ్లీ కేటాయించడం ఏఐఏడీఎంకే విషయంలోనే జరిగింది. ఎంజీఆర్ చనిపోయాక ఆయన భార్య జానకి, జయలలితల మధ్య... అలాగే జయ మరణం తర్వాత పళనిస్వామి–శశికళ వర్గం, పన్నీర్‌సెల్వం వర్గం మధ్య కూడా పార్టీపై ఆధిపత్యం కోసం పోరు ఒకే పద్దతిన సాగింది.
కరుణానిధితో తలెత్తిన భేదాభిప్రాయాలతో ఎంజీఆర్ 1972లో డీఎంకే నుంచి బయటకు వచ్చి అన్నా డీఎంకేను ఏర్పాటుచేసి, రెండాకులను ఎన్నికల చిహ్నంగా చేసుకున్నారు. 1987లో ఆయన మరణించినప్పుడు భార్య జానకీ రామచంద్రన్, నాటి పార్టీ ప్రదానకార్యదర్శి జయలలిత రెండు వర్గాలుగా విడిపోయారు. పార్టీలో, అసెంబ్లీలో తనకే ఆధిక్యం ఉందనీ, ఎన్నికల గుర్తును తమ వర్గానికే కేటాయించాలని జానకి పట్టుపట్టారు. అటు జయలలిత కూడా కార్యకర్తల మద్దతు తనకే ఉందనీ, రెండాకుల గుర్తును తమ వర్గానికి ఇవ్వాలని వాదించారు.
దీంతో ఈ గుర్తును ఎవరూ ఉపయోగించకుండా అప్పట్లో ఈసీ నిలిపివేసింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో జానకి ఓడిపోయి రాజకీయాల నుంచి నిష్క్రమించడంతో గుర్తు, పార్టీ జయలలిత వశమయ్యాయి. మళ్లీ గతేడాది జయలలిత చనిపోయినప్పుడు కూడా దాదాపు ఇలానే జరిగింది. జయలలిత ఆసుపత్రిలో ఉండగా ముఖ్యమంత్రిగా నియమితుడైన పన్నీర్‌సెల్వం... ఆమె మరణం తర్వాత కూడా పదవిలో కొనసాగేందుకు ప్రయత్నించారు.
అప్పుడే జయలలిత సన్నిహితురాలు శశికళ కూడా ఏకపక్షంగా తనను తానే పార్టీ అధ్యక్షురాలిగా ప్రకటించుకుని, పార్టీని తన అదుపాజ్ఞల్లోకి తెచ్చుకుని, సీఎంగా పన్నీర్‌సెల్వంను తొలగించి పళనిస్వామిని నియమించారు. దీంతో పన్నీర్‌సెల్వం తిరుగుబావుటా ఎగురవేయడంతో పార్టీ మళ్లీ రెండుగా చీలింది. అప్పుడే జయలలిత ప్రాతినిధ్యం వహించిన చెన్నైలోని ఆర్కే నగర్ శాసనసభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఈసీ సిద్ధమైంది. దీంతో రెండాకుల గుర్తును తమకే కేటాయించాలంటూ అటు శశికళ వర్గం, ఇటు పన్నీర్‌సెల్వం వర్గం ఈసీకి విజ్ఞప్తి చేశాయి.
ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ గుర్తు వాడకంపై ఈ ఏడాది మార్చి 22న తాత్కాలిక నిషేధం విధించింది. ఆ తర్వాత ఇరు వర్గాలు ఓటర్లను తీవ్రంగా ప్రలోభపెట్టడంతో ఈసీ ఎన్నికనే వాయిదా వేసింది. రెండాకుల గుర్తును చేజిక్కించుకునేందుకు దినకరన్ అవినీతికి కూడా పాల్పడినట్లు కూడా రుజువైంది. ఆ తర్వాత పళనిస్వామి, పన్నీర్ సెల్వం ఒక్కటై శశికళను, ఆమె కుటుంబీకులను పార్టీ నుంచి బహిష్కరించడం తెలిసిందే. మళ్లీ ఇప్పుడు రెండాకుల గుర్తును పళని, పన్నీర్‌లకే కేటాయిస్తూ ఈసీ ఉత్తర్వులిచ్చింది.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment