► నామినేషన్లు వేసిన అన్నాడీఎంకే,డీఎంకే అభ్యర్థులు
► 5న తుది జాబితా, 19న పోలింగ్
తమిళనాడులో మూడు,పుదుచ్చేరీలో ఒక స్థానానికి మొత్తం నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల కోసం ఈనెల 26వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కాగా, అధికార, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు శుక్రవారం పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు.
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 స్థానాలు ఉండగా, ఈ ఏడాది మేలో ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో 232 స్థానాలకు మాత్రమే పోలింగ్ జరిగింది. ఓటర్లను మభ్యపెట్టేలా నగదు, చీరలు, పంచెలు, మద్యం బాటిళ్లు సరఫరా జరిగినట్లు ఆరోపణలు రావడంతో తంజావూరు, కరూరు జిల్లా అరవకురిచ్చి స్థానాల్లో ఎన్నికలను కోర్టు రద్దు చేసింది. మధురై జిల్లా తిరుప్పరగున్రం నియోజకవర్గ అన్నాడీఎంకే ఎమ్మెల్యే శీనివేల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది రోజుల్లోనే అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో ఈ మూడు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. నవంబర్ 19వ తేదీన పోలింగ్ జరుగనుండగా అన్నాడీఎంకే, డీఎంకే, పీఎంకే, బీజేపీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి.
ఉప ఎన్నికల్లో భాగంగా ఈ మూడు నియోజకవర్గాల్లో అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ ఈనెల 26వ తేదీన ప్రారంభం కాగా నవంబరు 2వ తేదీతో ముగుస్తుంది. ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తున్నారు. ఈనెల 29, 30 శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో నామినేషన్లను స్వీకరించడం లేదు. నవంబరు 3వ తేదీ నామినేషన్ల పరిశీలన, 5వ తేదీ సాయంత్రం 3 గంటల వరకు ఉపసంహరణ, అదే రోజు ఉప ఎన్నికల రంగంలో నిలిచిన అభ్యర్దుల తుది జాబితాను ప్రకటిస్తారు. 19వ తేదీన పోలింగ్, 22వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగనుంది.
నామినేషన్ల సందడి: అరవకురిచ్చిలో... ఇదిలా ఉండగా, అన్నాడీఎంకే, డీఎంకే అభ్యర్థులు నామినేషన్లు వే యడంలో శుక్రవారం పోటీపడ్డారు. అరవకురిచ్చిలో డీఎంకే అభ్యర్థి కేసీ పళనిస్వామి మధ్యాహ్నం 12 గంటలకు నామినేషన్ వేశారు. అన్నాడీఎంకే అభ్యర్థి సెంథిల్ బాలాజీ మధ్యాహ్నం 1.30గంటలకు నామినేషన్ దాఖలు చేశారు. పీఎంకే అభ్యర్థి భాస్కరన్ 1వ తేదీ, బీజేపీ అభ్యర్థి ప్రభు 2వ తేదీన నామినేషన్ వేయనున్నారు.
తంజావూరులో..తంజావూరు నియోజకవర్గంలో అన్నాడీఎంకే అభ్యర్థి రంగస్వామి, డీఎంకే అభ్యర్థి డాక్టర్ అంజగం భూపతి నామినేషన్లు వేశారు. పీఎంకే అభ్యర్థి కుంజితపాదం 1వ తేదీ, బీజేపీ అభ్యర్థి ఎమ్‌ఎస్ రామలింగం 2వ తేదీన నామినేషన్లు వేస్తున్నారు.
తిరుప్పరగున్రంలో..మంత్రులు సెల్లూరు రాజా, ఆర్‌పీ ఉదయకుమార్ వెంటరాగా అన్నాడీఎంకే అభ్యర్థి ఏకే బోస్ మధ్యాహ్నం 2 గంటలకు నామినేషన్‌ను సమర్పించారు. ఈ నియోజకవర్గ డీఎంకే అభ్యర్థి డాక్టర్ శరవణన్, బీజేపీ అభ్యర్థి శ్రీనివాసన్, పీఎంకే అభ్యర్థి సెల్వం 2 వ తేదీన నామినేషన్ వేయనున్నారు.పుదుచ్చేరిలో..పుదుచ్చేరి నెల్లితోపులో అన్నాడీఎంకే అభ్యర్థిగా ఓంశక్తిశేఖర్, పీఎంకే అభ్యర్థి గోపీ నామినేషన్లు వేశారు. కాంగ్రెస్ అభ్యర్థిగా నారాయణస్వామి ఒకటి లేదా 2వ తేదీలో నామినేషన్ వేస్తారు.
పోటాపోటీగా
Published Sat, Oct 29 2016 1:57 AM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM
Advertisement
Advertisement