cm palaniswamy
-
సీఎం పళనిస్వామిపై సీబీఐ విచారణ
చెన్నై: రోడ్డు కాంట్రాక్టు పనుల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామిపై సీబీఐ విచారణకు మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో చేపట్టిన రూ.3,500 కోట్ల విలువైన కాంట్రాక్టు పనులను ముఖ్యమంత్రి పళనిస్వామి తన బంధువులకు, బినామీలకు అప్పగించారని ఆరోపిస్తూ డీఎంకే నేత ఆర్ఎస్ భారతి గతంలో పిటిషన్ వేశారు. ఈ కేసులో డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్(డీవీఏసీ) అందజేసిన నివేదికను పరిశీలించిన జస్టిస్ ఏడీ జగదీశ్ చంద్ర శుక్రవారం ఈ ఆదేశాలిచ్చారు. దర్యాప్తునకు సంబంధించిన అన్ని పత్రాలను వారంలోగా సీబీఐకి అందజేయాలని డీవీఏసీని ఆదేశిస్తూ.. ప్రాథమిక విచారణ నివేదికను మూడు నెలల్లోగా అందజేయాలని సీబీఐని కోరారు. రాష్ట్రంలో చేపట్టిన రోడ్డు కాంట్రాక్టు పనుల్లో అవకతవకలు జరిగాయనీ, వీటిపై డీవీఏసీ విచారణకు ఆదేశించాలని కోరుతూ డీఎంకే నేత భారతి జూన్‌లో హైకోర్టులో పిటిషన్ వేశారు. స్పందించిన న్యాయస్థానం.. ఈ ఆరోపణలపై దర్యాప్తు చేపట్టాలని, రోజువారీ నివేదికను అందజేయాలని డీవీఏసీని సెప్టెంబర్ 12వ తేదీన ఆదేశించింది. అయితే, డీవీఏసీ దర్యాప్తు సీఎం పళనిస్వామికి అనుకూలంగా సాగుతోందని ఈనెల 9న జరిగిన విచారణ సందర్భంగా పిటిషనర్ భారతి అనుమానాలు వ్యక్తం చేయడంతో సీబీఐ విచారణకు ఆదేశిస్తూ హైకోర్టు తాజాగా ఉత్తర్వులిచ్చింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో సీఎం రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. -
స్టెరిలైట్ ప్లాంట్ మూసివేత
సాక్షి ప్రతినిధి, చెన్నై/తూత్తుకుడి: తమిళనాడులోని తూత్తుకుడిలో ఉన్న ‘స్టెరిలైట్’రాగి ప్లాంట్‌ను శాశ్వతంగా మూసేయాలని ఆ రాష్ట్ర సీఎం పళనిస్వామి ఆదేశాలు జారీ చేశారు. కాలుష్యం వెదజల్లుతున్న ‘స్టెరిలైట్’రాగి కర్మాగారాన్ని మూసేయాలని వంద రోజులుగా జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకమవడం, పోలీసు కాల్పుల్లో 13 మంది చనిపోవడం తెల్సిందే. ఈ ఘటనపై అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో జిల్లా కలెక్టర్, ఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేసింది. కాగా, సోమవారం కేబినెట్ భేటీ అనంతరం ఈ ప్లాంట్‌ను మూసేయాల్సిందిగా సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వ జీవో విడుదలైన వెంటనే ట్యుటికోరిన్ జిల్లా అధికారులు స్టెరిలైట్ కాపర్ ప్లాంట్‌కు సీల్ వేశారు. 22 ఏళ్లుగా ఆందోళన వేదాంత లిమిటెడ్‌కు చెందిన ‘స్టెరిలైట్’కంపెనీ తమిళనాడులోని తూత్తుకుడిలో నాలుగు లక్షల టన్నుల వార్షిక సామర్థ్యంతో 1996లో ప్లాంటు స్థాపించి రాగిని ఉత్పత్తి చేస్తోంది. ఇక్కడ మైనింగ్‌తో భూగర్భ జలాలు తగ్గుతాయని, ఉద్గారాలు పర్యావరణాన్ని కలుషితం చేస్తాయని, కేన్సర్ వంటి రోగాలు ప్రబలుతున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్లాంట్ మూసివేతకు అప్పటి సీఎం జయలలిత ఆదేశించారు. ప్లాంటు కాలుష్యంపై తీసుకున్న చర్యలు తెలపాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌ను వెంటనే విచారించలేమని సుప్రీం కోర్టు సోమవారం స్పష్టం చేసింది. -
‘రెండాకులు’ పళని–పన్నీర్లకే
సాక్షి ప్రతినిధి, చెన్నై/న్యూఢిల్లీ: అన్నాడీఎంకే పార్టీ అధికారిక చిహ్నమైన ‘రెండాకుల గుర్తు’ను తమిళనాడు సీఎం ఎడపాటి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి ఓ.పన్నీర్‌సెల్వంల వర్గానికి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) గురువారం నిర్ణయం తీసుకుంది. అన్నాడీఎంకే ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తల్లో అత్యధికులు పళనికే మద్దతు ఇస్తున్నందున ఆ వర్గానికే గుర్తు కేటాయించినట్లు వెల్లడించింది. ప్రస్తుతం తమిళనాడుతోపాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో రెండాకుల గుర్తును పళని వర్గానికి కేటాయిస్తున్నట్లు పేర్కొంది. ఈసీ తాజా నిర్ణయంతో రెండాకుల గుర్తు కోసం తీవ్రంగా పోరాడుతున్న ఆ పార్టీ బహిష్కృత నేత శశికళకు ఎదురుదెబ్బ తగిలినట్లైంది. మరోవైపు ఈసీ నిర్ణయంతో అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొంది. సీఎం పళని, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం, ఇతర మంత్రులు పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకుని పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు. అనంతరం జయలలిత సమాధి వద్దకు వెళ్లి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం పళని స్వామి స్పందిస్తూ.. అన్నాడీఎంకేకు ఈ రోజు అత్యంత ఆనందకరమైనదని అన్నారు. ఈసీ నిర్ణయంతో ఇక అన్నాడీఎంకే పేరును, రెండాకుల చిహ్నాన్ని పళని స్వామి వర్గం వినియోగించుకోవచ్చు. అలాగే పార్టీ ప్రధాన కార్యాలయం కూడా పళనిస్వామి వశం కానుంది. గతేడాది డిసెంబర్లో అప్పటి తమిళనాడు సీఎం జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కే నగర్లో ఉపఎన్నికల సందర్భంగా అన్నాడీఎంకే రెండుగా చీలిపోయిన సంగతి తెలిసిందే. పన్నీర్‌సెల్వం, శశికళల నేతృత్వంలోని రెండు వర్గాలతో పాటు జయ మేనకోడలు దీప కూడా పార్టీ రెండాకుల గుర్తు మాదంటే మాదని వాదించడంతో ఈ గుర్తును ఈసీ అప్పట్లో నిలిపివేసింది. మరోవైపు ఈసీ నిర్ణయాన్ని సుప్రీం కోర్టులో సవాలు చేస్తామని అన్నాడీఎంకే బహిష్కృత నేత టీటీవీ దినకరన్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఒత్తిడితో ఈసీ పక్షపాతంగా వ్యవహరించిందని ఆరోపించారు. ఇది రెండోసారి..! ► నాడు ఎంజీఆర్ మరణంతో నిలిపివేత ► జయ కన్నుమూతతో మార్చిలోనూ నిషేధం అన్నా డీఎంకే పార్టీ ఎన్నికల చిహ్నంగా రెండాకుల గుర్తును ఎన్నికల సంఘం (ఈసీ) పునరుద్ధరించడం ఇది రెండోసారి. ఒక పార్టీ ఎన్నికల చిహ్నాన్ని రెండుసార్లు నిలిపివేసి మళ్లీ కేటాయించడం ఏఐఏడీఎంకే విషయంలోనే జరిగింది. ఎంజీఆర్ చనిపోయాక ఆయన భార్య జానకి, జయలలితల మధ్య... అలాగే జయ మరణం తర్వాత పళనిస్వామి–శశికళ వర్గం, పన్నీర్‌సెల్వం వర్గం మధ్య కూడా పార్టీపై ఆధిపత్యం కోసం పోరు ఒకే పద్దతిన సాగింది. కరుణానిధితో తలెత్తిన భేదాభిప్రాయాలతో ఎంజీఆర్ 1972లో డీఎంకే నుంచి బయటకు వచ్చి అన్నా డీఎంకేను ఏర్పాటుచేసి, రెండాకులను ఎన్నికల చిహ్నంగా చేసుకున్నారు. 1987లో ఆయన మరణించినప్పుడు భార్య జానకీ రామచంద్రన్, నాటి పార్టీ ప్రదానకార్యదర్శి జయలలిత రెండు వర్గాలుగా విడిపోయారు. పార్టీలో, అసెంబ్లీలో తనకే ఆధిక్యం ఉందనీ, ఎన్నికల గుర్తును తమ వర్గానికే కేటాయించాలని జానకి పట్టుపట్టారు. అటు జయలలిత కూడా కార్యకర్తల మద్దతు తనకే ఉందనీ, రెండాకుల గుర్తును తమ వర్గానికి ఇవ్వాలని వాదించారు. దీంతో ఈ గుర్తును ఎవరూ ఉపయోగించకుండా అప్పట్లో ఈసీ నిలిపివేసింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో జానకి ఓడిపోయి రాజకీయాల నుంచి నిష్క్రమించడంతో గుర్తు, పార్టీ జయలలిత వశమయ్యాయి. మళ్లీ గతేడాది జయలలిత చనిపోయినప్పుడు కూడా దాదాపు ఇలానే జరిగింది. జయలలిత ఆసుపత్రిలో ఉండగా ముఖ్యమంత్రిగా నియమితుడైన పన్నీర్‌సెల్వం... ఆమె మరణం తర్వాత కూడా పదవిలో కొనసాగేందుకు ప్రయత్నించారు. అప్పుడే జయలలిత సన్నిహితురాలు శశికళ కూడా ఏకపక్షంగా తనను తానే పార్టీ అధ్యక్షురాలిగా ప్రకటించుకుని, పార్టీని తన అదుపాజ్ఞల్లోకి తెచ్చుకుని, సీఎంగా పన్నీర్‌సెల్వంను తొలగించి పళనిస్వామిని నియమించారు. దీంతో పన్నీర్‌సెల్వం తిరుగుబావుటా ఎగురవేయడంతో పార్టీ మళ్లీ రెండుగా చీలింది. అప్పుడే జయలలిత ప్రాతినిధ్యం వహించిన చెన్నైలోని ఆర్కే నగర్ శాసనసభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఈసీ సిద్ధమైంది. దీంతో రెండాకుల గుర్తును తమకే కేటాయించాలంటూ అటు శశికళ వర్గం, ఇటు పన్నీర్‌సెల్వం వర్గం ఈసీకి విజ్ఞప్తి చేశాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ గుర్తు వాడకంపై ఈ ఏడాది మార్చి 22న తాత్కాలిక నిషేధం విధించింది. ఆ తర్వాత ఇరు వర్గాలు ఓటర్లను తీవ్రంగా ప్రలోభపెట్టడంతో ఈసీ ఎన్నికనే వాయిదా వేసింది. రెండాకుల గుర్తును చేజిక్కించుకునేందుకు దినకరన్ అవినీతికి కూడా పాల్పడినట్లు కూడా రుజువైంది. ఆ తర్వాత పళనిస్వామి, పన్నీర్ సెల్వం ఒక్కటై శశికళను, ఆమె కుటుంబీకులను పార్టీ నుంచి బహిష్కరించడం తెలిసిందే. మళ్లీ ఇప్పుడు రెండాకుల గుర్తును పళని, పన్నీర్లకే కేటాయిస్తూ ఈసీ ఉత్తర్వులిచ్చింది. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
తమిళ రాజకీయాల్లో మళ్లీ ప్రకంపనలు
చెన్నై: తమిళనాడులో అధికార పార్టీ అన్నాడీఎంకేలో చీలిక సంక్షోభం నుంచి బయటపడ్డ పళనిస్వామి ప్రభుత్వానికి ఆర్కే నగర్ ఉప ఎన్నికలు కొత్త సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. పార్టీలోనూ అసంతృప్తి స్వరాలు వినిపిస్తున్నాయి. ఆర్కే నగర్ ఓటర్లకు కోట్లాది రూపాయలు పంచినట్టుగా ఐటీ అధికారుల దాడుల్లో దొరికిపోయిన మంత్రి విజయ్‌భాస్కర్‌పై ముఖ్యమంత్రి పళని స్వామి త్వరలో వేటు వేయనున్నట్టు సమాచారం. విజయ్‌భాస్కర్‌ను మంత్రి వర్గం నుంచి తొలగించాలని పార్టీలో డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీంతో పళనిస్వామి ఆయనపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. విజయ్‌భాస్కర్‌తో పాటు మరో ముగ్గురు మంత్రులపైనా వేటు వేసే యోచనలో పళనిస్వామి ఉన్నట్టు సమాచారం. కాగా కొందరు మంత్రులు అన్నా డీఎంకే అమ్మ డిప్యూటీ జనరల్ సెక్రటరీ దినకరన్ పట్ల అసంతృప్తిగా ఉన్నారంటూ వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. తనపై ఎవరికీ అసంతృప్తి లేదని, కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని దినకరన్ చెప్పారు. ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థి దినకరన్ విజయం కోసం మంత్రి విజయభాస్కర్ నాయకత్వంలో ఓటర్లకు డబ్బు పంచిపెట్టినట్లు ఐటీ అధికారుల దాడుల్లో ఆధారాలు లభించాయి. ఈనెల 7వ తేదీన మంత్రి విజయభాస్కర్, ఆయన అనుచరుల ఇళ్లు, కార్యాలయాలపై, మాజీ ఎంపీ రాజేంద్రన్, వైస్ చాన్స్‌లర్ గీతాలక్ష్మి ఇళ్లపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించి రూ.89 కోట్ల నగదు పంపిణీ జరిగినట్లు ఆధారాలు సేకరించారు. సమత్తువ మక్కల్ కట్చి అధ్యక్షుడు, నటుడు శరత్‌కుమార్, రాడాన్ సంస్థ అధినేత్రి నటి రాధిక కార్యాలయాల్లోనూ ఐటీ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం ఆర్కే నగర్ ఉప ఎన్నికను రద్దు చేసింది.