తమిళ రాజకీయాల్లో మళ్లీ ప్రకంపనలు
చెన్నై: తమిళనాడులో అధికార పార్టీ అన్నాడీఎంకేలో చీలిక సంక్షోభం నుంచి బయటపడ్డ పళనిస్వామి ప్రభుత్వానికి ఆర్కే నగర్ ఉప ఎన్నికలు కొత్త సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. పార్టీలోనూ అసంతృప్తి స్వరాలు వినిపిస్తున్నాయి. ఆర్కే నగర్ ఓటర్లకు కోట్లాది రూపాయలు పంచినట్టుగా ఐటీ అధికారుల దాడుల్లో దొరికిపోయిన మంత్రి విజయ్‌భాస్కర్‌పై ముఖ్యమంత్రి పళని స్వామి త్వరలో వేటు వేయనున్నట్టు సమాచారం. విజయ్‌భాస్కర్‌ను మంత్రి వర్గం నుంచి తొలగించాలని పార్టీలో డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీంతో పళనిస్వామి ఆయనపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. విజయ్‌భాస్కర్‌తో పాటు మరో ముగ్గురు మంత్రులపైనా వేటు వేసే యోచనలో పళనిస్వామి ఉన్నట్టు సమాచారం. కాగా కొందరు మంత్రులు అన్నా డీఎంకే అమ్మ డిప్యూటీ జనరల్ సెక్రటరీ దినకరన్ పట్ల అసంతృప్తిగా ఉన్నారంటూ వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. తనపై ఎవరికీ అసంతృప్తి లేదని, కొందరు దుష్ప‍్రచారం చేస్తున్నారని దినకరన్ చెప్పారు.
ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థి దినకరన్ విజయం కోసం మంత్రి విజయభాస్కర్ నాయకత్వంలో ఓటర్లకు డబ్బు పంచిపెట్టినట్లు ఐటీ అధికారుల దాడుల్లో ఆధారాలు లభించాయి. ఈనెల 7వ తేదీన మంత్రి విజయభాస్కర్, ఆయన అనుచరుల ఇళ్లు, కార్యాలయాలపై, మాజీ ఎంపీ రాజేంద్రన్, వైస్ చాన్స్‌లర్ గీతాలక్ష్మి ఇళ్లపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించి రూ.89 కోట్ల నగదు పంపిణీ జరిగినట్లు ఆధారాలు సేకరించారు. సమత్తువ మక్కల్ కట్చి అధ్యక్షుడు, నటుడు శరత్‌కుమార్, రాడాన్ సంస్థ అధినేత్రి నటి రాధిక కార్యాలయాల్లోనూ ఐటీ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం ఆర్కే నగర్ ఉప ఎన్నికను రద్దు చేసింది.